ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఒక దెబ్బతో పాక్ దారికి రాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసినంత మాత్రాన పాకిస్తాన్ దారికి వస్తుందనుకుంటే పప్పులో కాలేసినట్లే. సైన్యం అధీనంలో ఉన్న పాకిస్తాన్ అంత సులభంగా దారికి రాదన్న విషయాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. దెబ్బకు పది దెబ్బలు కొడితే తప్ప పాకిస్తాన్ సైన్యానికి, గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)కు బుద్ధి రాదు. గత 70 ఏళ్లుగా అవలంబించిన సంయమనం, ఓపికకు ఫలితం లేకుండా పోయింది కాబట్టి ఇక మీదట దెబ్బకు పది దెబ్బలు కొడితే తప్ప పాకిస్తాన్ తీరు మారదు. మన ఓపికను బలహీనతగా భావిస్తున్న పాకిస్తాన్ పట్ల ఇక మీదట ఎలాంటి ఉదార వైఖరిని అవసరం లేదు. ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మరణించిన వీర జవాన్ల భార్యలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లు లష్కరే తోయిబా అధినేత హఫీజ్ సరుూద్‌ను హతం చేసేంతవరకూ సర్జికల్ దాడులు ఆపకూడదు. ఉగ్రవాదులు సరిహద్దులతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే సర్జికల్ దాడులు కాదు- ఏకంగా అటో,ఇటో తేలిపోయేలా యుద్ధం చేయకతప్పదు. మన పాలకులు ఇక మెతక వైఖరిని వదలి పెట్టాలి.
పాకిస్తాన్ పాలకులు, ముఖ్యంగా ఆ దేశ సైన్యం, ఐఎస్‌ఐ మొండిగా తయారు కావటానికి భారత దేశమే కారణమంటే ఆశ్చర్యపడకూడదు. మన పాలకులు ప్రదర్శించిన మెతక వైఖరి, అధైర్యం మూలంగానే పాక్ సైన్యం ఉగ్రవాదుల ద్వారా దాడుల పరంపర కొనసాగిస్తోంది. భారత్ రెండుగా విడిపోయినప్పటి నుండి పాకిస్తాన్ పాలకులు ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. బ్రిటిష్ పాలన ముగిసి, దేశం మతం ఆధారంగా రెండుగా చీలిపోయాక పాక్ పాలకులు, సైన్యం దుందుడుకుగా వ్యవహరిస్తుంటే మన పాలకులు మాత్రం నిగ్రహం పేరుతో ఇన్నాళ్లూ ఓటు బ్యాంకు రాజకీయం చేశారు. అధైర్యానికి మారుపేరుగా మారారు. జమ్ము-కాశ్మీర్ కోసం పాకిస్తాన్ మన దేశంపై ఐదుసార్లు యుద్ధానికి దిగింది. ఇందులో నాలుగు ప్రకటిత యుద్ధాలైతే, ఒకటి అప్రకటిత యుద్ధం. ప్రతి యుద్ధంలో మనమే గెలిచినా, పనిని అసంపూర్ణగా వదిలివేయటం వలన సమస్య యథాతథంగా ఉండిపోయింది. పాకిస్తాన్ పాలకులు 1947లో గిరిజనుల ముసుగులో ముష్కరులను జమ్ము-కాశ్మీర్‌పైకి ఉసిగొల్పినప్పుడే గట్టిగా గుణపాఠం చెప్పి ఉండాల్సింది. కాశ్మీర్‌ను ఆక్రమించుకునేందుకు పాకిస్తాన్ చేసిన కుట్రను అప్పుడే భగ్నం చేసి చావుదెబ్బ కొట్టి ఉంటే- కాశ్మీర్ సమస్య అనేదే ఉండేది కాదు.
1947లో జరిగిన మొదటి కాశ్మీర్ యుద్ధంలో స్పష్టమైన ఫలితాన్ని సాధించకపోవటం వల్లనే కాశ్మీర్ ఈరోజుకు కూడా రావణకాష్టంలా కాలుతూనే ఉన్నది. పాకిస్తాన్ సైనికులు, వజీరిస్తాన్ ముష్కరులు కలిసి స్వాధీనం చేసుకున్న శ్రీనగర్ లోయ, జమ్ము, లద్దాక్ ప్రాంతాలను విడిపించుకోవటంలో విజయం సాధించిన భారత సైన్యం అలాగే ముందుకు సాగి, మిగతా కాశ్మీర్‌ను విడిపించి ఉంటే ఈరోజు పరిస్థితి మరో రకంగా ఉండేది. ప్రతి యుద్ధాన్ని తనంత తాను ప్రారంభించిన పాకిస్తాన్ ప్రతిసారి ఒటమిని చవి చూసినా తన వైఖరిని మార్చుకోలేదు, ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. దీనికి ప్రధాన కారణం భారత దేశం ప్రతి యుద్ధంలో విజయం సాధించినా ఆఖరు క్షణంలో సర్దుబాటు విధానాన్ని అవలంబించడం. దీంతో పాకిస్తాన్ మొండిగా తయారైంది. మన పాలకులు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించారు తప్ప పాకిస్తాన్‌ను దారికి తీసుకువచ్చే విధంగా వ్యవహరించలేదు. 1947 నుండి ఒక సంవత్సరం వరకు కొనసాగిన మొదటి కాశ్మీర్ యుద్ధంలో విజయం సాధించి, మూడు వంతుల జమ్ముకాశ్మీర్‌ను తరిగి గెలుచుకుని ఐక్యరాజ్య సమితికి వెళ్లటం ద్వారా నాలుగో వంతు కాశ్మీర్‌ను వదులుకున్నాము. ఐక్యరాజ్యసమితికి వెళ్లకుండా యు ద్ధాన్ని అలాగే కొనసాగించి ఉంటే ఆక్రమిత కాశ్మీర్ అనేదే ఉండేది కాదు. ఇస్లామిక్ ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేసినప్పుడు కూడా మన పాలకులు స్వీయ రక్షణ పద్ధతిని అవలంబించారే తప్ప- తప్పు చేసిన పాకిస్తాన్‌ను దండించాలనే ఆలోచనతో ముందుకు సాగలేదు. కార్గిల్ దురాక్రమణ జరిగినప్పుడు అధికారంలో ఉన్న బిజెపి అమెరికా వత్తిడికి లొంగిపోయింది తప్ప పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పించలేకపోయింది. అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి సైన్యాన్ని సరిహద్దులకు తరలించినా యుద్ధానికి దిగలేకపోయారు. పాకిస్తాన్ పాలకులు, సైన్యం, ఉగ్రవాదులు ఎన్ని దురాగతాలు చేసినా మనం భరించి ఉరుకున్నాము. ‘మేం ఏం చేసినా భారత్ ఏమీ చేయలేదు, ఎదురుదాడికి దిగే ధైర్యం, సత్తా భారత పాలకులకు లేదు..’- అనే అభిప్రాయం పాకిస్తాన్ పాలకులు, ఆ దేశ సైన్యం, ఉగ్రవాద సంస్థలకు కలిగింది ఇప్పుడు మోదీ ప్రభుత్వం మొదటిసారి వాస్తవాధీన రేఖను దాటి అక్రమిత కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసింది. దేశ చరిత్రలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పి ప్రజలకు ధైర్యం ఇచ్చింది. ఇక మీదట పాకిస్తాన్ ఎప్పుడు తోక జాడిచ్చినా చెంప చెళ్ళుమనిమించాలి. ‘దాయదీ దేశం’ కాళ్ల బేరానికి వచ్చేంత వరకూ సర్జికల్ దాడులు కొనసాగాలి. *