ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఫలవంత సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. లోకసభ, శాసనసభల వంటి చట్ట సభల్లో అధికార పక్షంతోపాటు ప్రతిపక్షం కూడా బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వం అదుపులో ఉండటంతోపాటు జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించకుండా ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కుంటు పడటంతో పాటు ప్రభుత్వం లోక్‌సభ లేదా శాసనసభల్లో ఆశించిన స్థాయిలో శాసన నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించలేదు. 2014లో బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏ మంచి మెజారిటీతో అధికారంలోకి రావటం తెలిసిందే. బి.జె.పికి లోక్‌సభలో మంచి మెజారిటీ ఉన్నా రాజ్యసభలో మెజారిటీ లేకపోవటం వలన పలు బిల్లులు చట్ట రూపం ధరించలేదు. లోక్‌సభలో ప్రతిపక్షం ప్రతిదానికి అడ్డుపడుతూ అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టటం వలన సభా కార్యక్రమాలు గందరగోళంలో కొట్టుకుపోయేవి. ప్రతిపక్షం సభ్యులు మాట, మాటకు పోడియం వద్దకు రావటం వలన లోక్‌సభ తరచు స్తంభించిపోగా రాజ్యసభలో అధికార పక్షానికి మెజారిటీ లేకపోవటంతో శాసన నిర్మాణం దాదాపుగా ఆగిపోయింది.
బి.జె.పి 2019 లోకసభ ఎన్నికల్లో తనంత తాను 303 సీట్లు గెలుచుకోవటం, ఎన్.డి.ఏ కు 351 సీట్లు రావటంతో లోకసభలో అధికార పక్షం అజేయమయ్యింది. కాంగ్రెస్ పార్టీ 2014తో పోలిస్తే ఐదు సీట్లు అధికంగా గెలుచుకున్నా రాహుల్ గాంధీ రాజీనామా, సీనియర్ల ఓటమి మూలంగా లోక్‌సభలో ఆ పార్టీ ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతోంది. లోకసభలో అధికార పక్షానికి మాట, మాటకు అడ్డుపడి ఎదుర్కొనే సత్తాను కాంగ్రెస్ కోల్పోయింది. టి.ఎం.సి బలం తగ్గటం, డి.ఎం.కె మంచి మెజారిటీలో లోక్‌సభలో అడుగు పట్టినా ప్రతిపక్షం సంయుక్త బలం తగ్గటంతో ఎన్.డి.ఏకు లోక్‌సభలో ఎదురు లేకుండా పోయింది. పదిహేడవ లోక్‌సభ మొదటి విడత సమావేశాలు అత్యంత ఫలవంతంగా ముందుకు దూసుకుపోతున్నాయి. లోక్‌సభ మొదటి విడత సమావేశాలు గత ఇరవై సంవత్సరాల్లో సాధించనంత ఉత్పాదకతను సాధించి చరిత్రను సృష్టించాయి. జూన్ 17న ప్రారంభమై జూలై 26న ముగియవలసిన సమావేశాలు ఆగస్టు తొమ్మిదో తేదీవరకు పొడిగించబడ్డాయి. జూన్ 17 నుండి జూలై 26 మధ్య కాలంలో లోక్‌సభ నూటా ఇరవై శాతం ఉత్పాదకతను సాధించి పార్లమెంటరీ చరిత్రలో ఒక మైలు రాయిగా మిగిలిపోయాయి. లోక్‌సభ మొదటి విడత సమావేశాలు పలుమార్లు అర్ధరాత్రి పనె్నండు గంటల వరకు కొనసాగాయి. స్పీకర్ ఓం బిర్లా మధ్యరాత్రి వరకు పని చేస్తున్న ఎం.పిల కోసం రాత్రి భోజనంతోపాటు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతిపక్షం గందరగోళం సృష్టించటం, పోడియం వద్దకు వచ్చి నినాదాలు ఇస్తూ గొడవ చేయటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నా వాటిని వేళ్లపై లెక్కించవచ్చు. గతంలో ఇలాంటి సంఘటనలు దాదాపుగా ప్రతిరోజు జరిగేవి కానీ ఇప్పుడవి చాలా అరుదు. స్పీకర్ ఓం బిర్లా నాయకత్వంలో లోక్‌సభ మధ్యాహ్నం భోజన విరామం కూడా తీసుకోకుండా పని చేయటం వలన పలు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరిపి ఆమోదం పొందుతున్నాయి. మొదటి విడత సమావేశాల్లో ఇంత వరకు పదిహేను బిల్లులను లోక్‌సభ ఆమోదించటం గమనార్హం. ట్రిపుల్ తలాక్ బిల్లు, చట్టవ్యతిరేక కార్యకలాల నిరోధక చట్టం సవరణ బిల్లు, జాతీయ దర్యాప్తు సంస్థ సవరణ బిల్లు, సమాచార చట్టం సవరణ బిల్లు తదితర మొత్తం పదిహేను బిల్లును లోక్‌సభ పూర్తి స్థాయి చర్చ జరిపిన అనంతరం ఆమోదించింది. లోక్‌సభలో తమకున్న భారీ మెజారిటీని మోదీ ప్రభుత్వం బిల్లుల ఆమోదానికి విజయవంతంగా ఉపయోగించుకుంటోంది. లోక్‌సభ నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేందుకు పెద్ద పీట వేస్తున్న స్పీకర్ ఓం బిర్లా బిల్లులకు సభ ఆమోదం తీసుకోవటంలో ఒక రకమైన ‘మిషన్ మోడ్’లో పని చేస్తున్నారు. పదిహేడవ లోక్‌సభ మొదటి విడత సమావేశాలు కాబట్టి ప్రతిపక్షం ప్రతిదానికి అడ్డుతగలటం లేదు. మొదటి విడత సమావేశాల్లోనే అడ్డుపడటం ప్రారంభిస్తే దేశ ప్రజలు సమ్మతించకపోవచ్చుననే భయం ప్రతిపక్షంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వం, స్పీకర్ ఓం బిర్లా దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రతిపక్షం భయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పెద్ద మొత్తంలో బిల్లులకు సభ ఆమోదం తీసుకోగలుగుతున్నారు. ప్రతిపక్షం బలహీనతను సద్వినియోగం చేసుకుంటున్న మోడీ ప్రభుత్వం లోక్‌సభ సమావేశాలను మరో పది రోజుల పాటు పొడిగించి మరిని బిల్లుల ఆమోదానికి రంగం సిద్దం చేసింది. మామూలుగా అయితే సభ సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది, దీనికి భిన్నంగా మోదీ ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలను పొడిగించటంతో ప్రతిపక్షం పరిస్థితి కుక్కిన పేను మాదిరిగా తయారైంది.
రాజ్యసభ ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగింది. లోక్‌సభ ఆమోదించి పంపించిన పలు బిల్లులకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యసభ ఉత్పాదకత 98 శాతం వరకు పెరిగింది. పదహారవ లోక్‌సభ కాలంలో రాజ్యసభ పని చేసిన తీరుతో పోలిస్తే ప్రస్తుత రాజ్యసభ సమావేశాల ఉత్పాదకత ఎంతో అధికం. రాజ్యసభ గత సమావేశాల్లో కేవలం ఏడు శాతం ఉత్పాదకతను సాధించటం అందరికీ తెలిసిందే. లోక్‌సభలో భారీ మెజారిటీని అనుభవిస్తున్న మోదీ ప్రభుత్వం ప్రతిపక్షాలను కుప్పకూల్చటం ద్వారా రాజ్యసభలో కూడా మెజారిటీని సాధించే స్థాయికి చేరుకున్నది. పదిహేడవ లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటం వలన ప్రతిపక్షంపై పడిన ప్రభావం రాజ్యసభలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజ్యసభలో మెజారిటీలో ఉన్న ప్రతిపక్షాలు ముక్కలవుతున్నాయి. దీనికితోడు రాహుల్ గాంధీ రాజీనామా మూలంగా కాంగ్రెస్‌లో నెలకొన్న రాజకీయ విషాదం రాజ్యసభలో కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేసింది. కాంగ్రెస్ నాయకులు, సభ్యులు ప్రభుత్వంపై తమ దాడిని తగ్గించటంతో ఇతర ప్రతిపక్షాలు జవసత్వాలను కోల్పోయాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు సభ్యులు బి.జె.పిలో చేరిపోయారు. హర్యానాకు చెందిన ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా బి.జె.పి తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో నలుగురు సభ్యులు బి.జె.పికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వివిధ కారణాల మూలంగా టి.ఆర్.ఎస్, వై.సి.పి, బి.జె.డి పార్టీలు అధికార పక్షానికి ఎప్పటికప్పుడు మద్దతు పలుకుతున్నాయి. డి.ఎం.కె ఎలాగూ బి.జె.పి మిత్రపక్షం కావటంతో అధికార పక్షానికి ఇప్పుడు రాజ్యసభలో అనధికార మెజారిటీ వచ్చేసింది. లోక్‌సభ ఆమోదించి పంపించిన సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును రాజ్యసభ ఆమోదించిన తీరు ఇందుకు నిదర్శనం. రాజ్యసభలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉండటం అందరికీ తెలిసిందే. ఆందుకే ప్రభుత్వం రాజ్యసభలో ప్రతిపక్షం ఆంగీకారం లేకుండా ఇంత వరకు ఏ ఒక్క బిల్లును పాస్ చేయించుకోలేదు. అయితే ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బి.జె.పి నాయకత్వంలోని ఎన్.డి.ఏకు టి.ఆర్.ఎస్, వై.సి.పి, బి.జె.డితోపాటు తెలుగుదేశం మిగతా ఇద్దరు సభ్యులు కూడా మద్దతు ఇవ్వటంతో సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ప్రతిపక్షం డిమాండ్‌ను రాజ్యసభ తోసిపుచ్చింది. సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానానికి అనుకూలంగా 95 మంది మద్దతు లభిస్తే ప్రతికూలంగా 117 ఓట్లు లభించటం గమనార్హం. ఇది జరిగిన అనంతరం సమాచార హక్కు చట్టం సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో అంగీకరించింది. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలనే తీర్మానం 117 వర్సెస్ 95 ఓట్లతో వీగిపోవటంతో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షం ఆ తరువాత సవరణ బిల్లుపై ఓటింగ్ అడగలేక సభ నుండి వాకౌట్ చేసింది. లోకసభ ఆమోదించిన త్రిపుల్ తలాక్ బిల్లు, ఇతర వివాదాస్పద బిల్లులకు వచ్చే వారం రాజ్యసభ ఆమోదం లభించటం దాదాపుగా ఖాయమని చెప్పాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం సవరణ బిల్లుకు ఆమోదం తీసుకున్నట్లే త్రిపుల్ తలాక్ బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదం తీసుకోగలుగుతుంది. గతంలో త్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభ రెండుసార్లు ఆమోదించి రాజ్యసభకు పంపించటం, రాజ్యసభ దానిని తిరస్కరించటం అందరికీ తెలిసిందే. రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం త్రిపుల్ తలాక్ బిల్లుకు ఈసారి రాజ్యసభ ఆమోద ముద్ర వేయించుకునేందుకు రంగాన్ని సిద్ధం చేస్తోంది. బి.జె.పి పెద్దల సభలో కూడా మెజారిటీ సాధించుకోవటం వలన రాజ్యసభ ఉత్పాదకత కూడా గణనీయంగా పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం 98 శాతంతో పని చేస్తున్న రాజ్యసభ బి.జె.పికి అధికారికంగా మెజారిటీ లభించిన తరువాత నూటికి నూరు శాతం ఉత్పాదకతను సాధించవచ్చు. మోదీ ప్రభుత్వం తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు రాజ్యసభలో అడ్డదారులు తొక్కటం దురదృష్టకరం.

- కె. కైలాష్, 9811573262