ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
దిక్కుతోచని దీనస్థితిలో పాక్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కశ్మీర్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇపుడు అంతర్జాతీయ వేదికలపై ఏకాకిగా మారింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణాన్ని మోదీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని వివాదాస్పదం చేయాలని పాక్ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు. పాక్‌కు బాసటగా నిలిచేందుకు ఏ ఒక్క దేశం కూడా ముందుకురాలేదు. చివరికి ఉగ్రవాద సంస్థ ‘తాలిబన్’ సైతం పర్సపర చర్చల ద్వారానే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించటంతో పాకిస్తాన్ కంగుతింది. పాక్‌కు మిత్రదేశమైన చైనా సైతం ‘ఆర్టికల్ 370 రద్దు’ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు విముఖత చూపింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నది. తాలిబన్ అధికార ప్రతినిధి ఇచ్చిన సలహా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, సైన్యాధ్యక్షుడు జనరల్ బవేజా, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి కనువిప్పు కావాలి. హింసకు మారుపేరైన తాలిబన్ సంస్థ అధికార ప్రతినిధి జబిబుల్లా ముజాహిద్ కశ్మీర్‌పై స్పందిస్తూ- ‘యుద్ధం, సంఘర్షణల ద్వారా అత్యంత చేదు అనుభవాలను చవిచూసిన మేము శాంతి, హేతుబద్ధ పద్ధతులతో ప్రాంతీయ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాం..’ అని హితవు పలకడం విశేషం. అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా సైనికులు వైదొలగగానే అక్కడ పోరాడుతున్న ఇస్లామిక్ పోరాటయోధులను తాలిబన్ సంస్థ కశ్మీర్‌కు పంపే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జబీబుల్లా ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. కశ్మీర్‌లో పరిస్థితిని మరింత దిగజార్చేలా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆయన పాకిస్తాన్‌కు సూచించారు. కశ్మీర్ సమస్యను అఫ్ఘానిస్తాన్‌తో పోల్చడం సరికాదని కూడా అన్నారు. కశ్మీర్ ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తాము ఎంత దూరమైనా వెళ్తామంటూ ఇమ్రాన్ ఖాన్, జనరల్ బవేజా ఆవేశంతో ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో- ఇలా అన్ని విధాలుగా పాక్ ఏకాకి కావడం భారత ప్రధాని నరేంద్ర మోదీ దౌత్య విజయానికి అద్దం పడుతోంది.
పుల్వామా దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉగ్రవాదుల శిబిరాలపై వైమానిక దాడులు చేసినప్పుడు అవలంబించిన దౌత్యనీతినే మోదీ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఆమలు జరిపింది. కశ్మీర్ ప్రజలను జాతీయ స్రవంతిలో కలిపేందుకే ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నామని, అక్కడి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పాక్‌కు ఎలాంటి అవకాశం లేకుండా చేసేందుకు తాము చారిత్రక నిర్ణయం తీసుకున్నామంటూ మోదీ ప్రభుత్వం చేసిన వాదనతో దాదాపు అన్ని దేశాలు అంగీకరించాయి. ఏ దేశం నుంచి కూడా మద్దతు లభించనందున పాకిస్తాన్ ఇకనైనా దారికి రావడం మంచిది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతమాత్రం బాగా లేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ సౌదీ అరేబియా అందజేస్తున్న ఆర్థిక సహాయంతో కాలం గడుపుతోంది. కశ్మీర్ సమస్యపై భారత్‌తో యుద్ధం చేసేందుకు పాక్ బరితెగిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయం. ఈ సంగతి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు సైతం బాగా తెలుసు. పాక్ పాలకులు తమ శక్తియుక్తులను కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేందుకు ఉపయోగించే బదులు తమ దేశంలో అభివృద్ధి కార్యకలాపాలపై వినియోగించటం మంచిది. కశ్మీర్ ప్రజలను భారత ప్రధాన స్రవంతిలో కలిపేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకునే బదులు పాకిస్తాన్ తన ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఎంతో అవసరం. ఏడు దశాబ్దాల కాలంలో కశ్మీర్‌ను ఏమీ చేయలేకపోయిన పాక్ పాలకులు ఇక మీదట కూడా ఏమీ సాధించలేరు.
కశ్మీర్ పేరుతో రాజకీయం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే వాస్తవాన్ని ఇమ్రాన్ ఖాన్ ఎంతత్వరగా గ్రహిస్తే అంత మంచిది. పాక్‌కు కశ్మీర్ వివాదం భస్మాసుర హస్తం లాంటిది. ఇది ఏదోఒక రోజున పాకిస్తాన్‌ను భస్మీపటలం చేస్తుంది. భారత్‌లో ఇంతకాలం అధికారంలో ఉన్న పార్టీలు, నాయకులు వేరు. ఇప్పుడు అధికారంలో ఉన్నది తిరుగులేని నేత నరేంద్ర మోదీ అని పాక్ పాలకులు గుర్తించడం అవసరం. డోక్లాంలో చైనాను నిలువరించిన మోదీకి పాకిస్తాన్ ఒక లెక్క కాదు. మోదీకి ‘ముస్లిం ఓటు బ్యాంకు’ పేరిట రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ముస్లింలను జాతీయ స్రవంతిలోకి తీసుకురావటం ద్వారా భాజపా హిందూ మెజారిటీ ఓట్లను మరింత పదిలం చేసుకోవడంలో విజయం సాధించింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన తప్పులను సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టిన మోదీని ఎదుర్కొనటం- ఆర్థికంగా, సామాజికంగా చిక్కిశల్యమవుతున్న పాక్ పాలకులకు ఎంతమాత్రం సాధ్యం కాదు. కశ్మీర్ పేరుతో ఎంతకాలం మత రాజకీయం చేస్తే అంతకాలం పాకిస్తాన్ అన్ని విధాలుగా దిగజారిపోవటం ఖాయం.
‘ముమ్మారు తలాక్’ చెల్లదంటూ చట్టాన్ని చేసిన వెంటనే కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370వ అధికరణాన్ని నిర్వీర్యం చేసిన మోదీ ఎలాంటి నాయకుడనేది భారత్‌లోని ముస్లింలకు కూడా ఇప్పుడు బాగా అర్థమవుతోంది. మతం కార్డును ప్రయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదనే వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్న మైనారిటీలు జాతీయ స్రవంతిలో కలిసిపోతూ, తమ అభివృద్ధి పట్ల దృష్టి సారించే రోజులు వస్తున్నాయి. భారత్‌లోని మెజారిటీ ప్రజలు నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయాలను సమర్థిస్తున్నారు. దీని ప్రభావం త్వరలోనే జరుగనున్న మహారాష్ట్ర, హర్యానా, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ముస్లిం మహిళలు కూడా మోదీకి మద్దతు ఇచ్చే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున భాజపా అభ్యర్థులకు ఓట్లు వేశారు. కేంద్రంలో చాలాకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు అవలంబించిన ‘మైనారిటీల బుజ్జగింపురాజకీయాల’తో మెజారిటీ ప్రజలు విసిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలతో మైనారిటీలకు కూడా ఎలాంటి ప్రయోజనం కలగలేదనేది వాస్తవం. మైనారిటీ వర్గాలకు చెందిన కొందరు నాయకుల ప్రయోజనాలను కాంగ్రెస్ కాపాడింది తప్ప, సగటు ముస్లిం ప్రజానీకం అభివృద్ధికి అంతగా కృషి చేయలేదు.
మోదీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా పనిచేస్తూ మైనారిటీ ప్రజలకు మేలు కలిగే చర్యలు తీసుకుంటోంది. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం తమ నిర్ణయాలను మరింత చిత్తశుద్ధితో అమలు చేస్తే భారత్‌లోని మైనారిటీలు పాకిస్తాన్, సౌదీ అరేబియాల వైపు చూడటం మానేస్తారు. ఆ సమయం ఆసన్నమైనపుడు ఈ దేశంలోని ముస్లింలు జాతీయ స్రవంతిలో కలిసినట్టే అని భావించాలి.
*