ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

గాడి తప్పిన పార్టీకి ‘గాంధీ’లే దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత్యంతరం లేని పరిస్థితిలో సోనియా గాంధీ మరోసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టవలసి వచ్చింది. రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వం ఫలితంగా క్లిష్టదశకు చేరుకున్న కాంగ్రెస్‌ను- అనారోగ్యంతో బాధపడుతున్న సోనియా కాపాడగలుగుతారా? రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ దాదాపునిర్వీర్యమైపోయిన దీనస్థితిలో- అధ్యక్షుడే లేకుండా ఒకటిన్నర నెలలు స్తబ్దత కొనసాగడం ఆ పార్టీ నాయకులను మరింతగా నీరసపరచింది. పల్లె నుంచి ఢిల్లీ స్థాయి వరకూ కాంగ్రెస్ నాయకులు తమ మనుగడ కోసం ఇతర పార్టీల వైపు- ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ వైపు చూడటం ప్రారంభించారు. వివిధ స్థాయిల్లో నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఇతర పార్టీలలో చేరటం ఒక ఎత్తయితే, రాజ్యసభలో పార్టీ చీఫ్ విప్ భువనేష్ కలీతా లాంటి సీనియర్ నాయకులు తమ నేత అయిన గులాం నబీ ఆజాద్‌కు మాటవరసకైనా చెప్పకుండా పదవులకు రాజీనామా చేసి భాజపా గూటికి చేరారు.
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసేందుకు సంబంధించిన బిల్లును హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రతిపాదించే రోజునే భువనేష్ కలీతా కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ అధ్యక్షుడు, ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు సభలో భువనేష్ కలీతా రాజీనామా గురించి ప్రకటిస్తుంటే ఆశ్చర్యపోవటం గులాం నబీ ఆజాద్ వంతయ్యింది. గులాం నబీ వెంటనే పార్టీ సీనియర్ నాయకురాలు అంబికా సోనీ వైపు చూసి- ‘చీఫ్ విప్ భువనేష్ కలీతా రాజీనామా చేశారా?’ అని వాకబు చేయటం చూస్తుంటే కాంగ్రెస్ ఎలాంటి దుస్థితికి చేరిందో అవగతమవుతుంది. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా, ప్రత్యామ్నాయంగా ఒక నేతను ఎంపిక చేసి అతను నిలదొక్కుకునేంత వరకు ఓపికతో వ్యవహరించి ఉంటే బాగుండేది. నెల రోజుల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని షరతు విధించటం రాహుల్ అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. దశాబ్దాల పాటు ‘గాంధీ కుటుంబ’ పాలనకు దాసానుదాసులైన కాంగ్రెస్ నాయకులు కేవలం నెల రోజుల వ్యవధిలో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకుంటారనుకోవటం కుర్రతనం కాదా?
కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోతున్న దశలో సోనియా మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ పరిణామం వెనుక ఎంతో నాటకీయత దాగి ఉంది. తమ కుటుంబానికి చెందినవారిని కాకుండా, మరో వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని రాహుల్ స్పష్టం చేయడంతో మరింత గందరగోళం కొనసాగింది. దీంతో సీనియర్ నాయకులు ఒక పథకం ప్రకారం సోనియాకు మరోసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. గాంధీ కుటుంబానికి చెందనివారు అధ్యక్ష పదవిని చేపట్టిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీ ముక్కలు కాకతప్పదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే సోనియా గతిలేని పరిస్థితుల్లో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు సుముఖత చూపక తప్పలేదు. రాహుల్ ఆలోచనకు భిన్నంగా ఉన్నప్పటికీ, సోనియాకు పార్టీ ప గ్గాలు అప్పగించారు. తాను గానీ, సోనియా గానీ, ప్రి యాంక గానీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టే ప్రసక్తే లేదని రాహుల్ చెప్పిన మాటలను కాంగ్రెస్ నేతలే వమ్ము చేశారు. సోనియాను ఒప్పించడంలో సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఆనంద శర్మ, మోతీలాల్ వోరా తదితరులు విజ యం సాధించారని చెప్పకతప్పదు. అనారోగ్యంతో బాధ పడుతున్న సోనియాకు పార్టీ అధ్యక్ష పదవిని బలవంతంగా కట్టబెట్టటం ఎంతమాత్రం మంచిది కాదంటూ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎంతగా వాదించినా ఇతర నాయకులు ఆయన వాదనను నెగ్గనివ్వలేదు. సోనియాను మళ్లీ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేయటం ద్వారా సీనియర్ నాయకులు గాంధీ కుటుంబంలో చిచ్చుపెట్టారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ కాంగ్రెస్‌లో జవసత్వాలు నింపగలుగుతారా? అనేది పార్టీ శ్రేణులను వేధిస్తున్న ప్రశ్న.
అధ్యక్ష పదవిలో సోనియా కొనసాగడం వల్ల కాంగ్రెస్ వెంటనే విచ్ఛిన్నం కాకపోవచ్చు. సోనియా గాంధీ పట్ల ప్రేమాభిమానాలు ఉన్న నాయకులు వెంటనే పార్టీని వీడకపోవచ్చు. అయితే, ఈ పరిణామం కాంగ్రెస్‌ను నిజంగానే బతికించగలుగుతుందా? పార్టీకి రాహుల్ చేసిన నష్టాన్ని పూడ్చటంతోపాటు జవసత్వాలు నింపాలంటే సోనియా వెంటనే పటిష్టమైన కార్యాచరణను అమలు చేయాల్సి ఉంది. పల్లె నుంచి ఢిల్లీ స్థాయి వరకూ పార్టీని ప్రక్షాళన చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఆమె ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. జిల్లా కాంగ్రెస్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు కొత్త అధ్యక్షులను నియమించటంతోపాటు నూతన కార్యవర్గాలను నియమించటం మంచిది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని సైతం వీలైనంత త్వరగా పునర్ వ్యవస్థీకరించడం ఉత్తమం. పార్టీ కోసం నిజంగా పనిచేస్తున్న వారిని సంస్థాగత పదవుల్లో నియమించటం ద్వారా కార్యకర్తల్లో విశ్వాసం నింపగలగాలి. రాహుల్ నాయకత్వం ఫలితంగా ఇన్నాళ్లూ గ్రామస్థాయి కార్యకర్తలకు పార్టీ నాయకత్వం పట్ల విశ్వాసం లేకుండాపోయింది. క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇతర పార్టీలో చేరిపోయారు. వీరంతా తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలంటే నాయకత్వం పట్ల వారికి విశ్వాసం కలగాలి. సోనియా ఈ దిశగా అర్థవంతమైన అడుగులు వేస్తేనే ఆశించిన ఫలితాలు లభిస్తాయి.
ఉత్తర ప్రదేశ్ లాంటి అతి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడ కోల్పోవటం అందరికీ తెలిసిందే. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చాలా రాష్ట్రా ల్లో నెలకొన్నది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి తెలంగాణలో సైతం కాంగ్రెస్ మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ మూడవ, నాల్గవ స్థాయి పార్టీగా మారిపోయింది. ఈ పరిస్థితి మా రాలంటే పార్టీ అధినాయకత్వం పట్ల క్షేత్రస్థాయి కార్యకర్తకు విశ్వాసం కలగాలి. ఈ పని సోనియా చేయగలుగుతారా? రాహుల్ కలిగించిన నష్టాన్ని తొలగించగలుగుతారా? వివిధ స్థాయిల్లో కొత్త నాయకత్వాన్ని ముఖ్యంగా యువ నాయకత్వాన్ని తయా రు చేసుకోవలసి ఉంటుంది. కొత్త నాయకత్వం ఏర్పడితే తప్ప కాంగ్రెస్ ముందుకు సాగలేదు. సోనియా ఎక్కువ కాలం అధ్యక్ష పదవిలో కొనసాగలేరు. అనారోగ్యం కారణంగా ఆమె అన్ని రాష్ట్రాల్లో పర్యటించలేరు. సోనియా కేవలం ఢిల్లీకి పరిమితమైతే, పార్టీలో జవసత్వాలు నింపాలనే లక్ష్యాన్ని సాధించలేరు. రానున్న రెండు,మూడు నెలల కాలంలో ఆమె కనీసం అయిదారు రాష్ట్రాలలోనైనా పర్యటించి పార్టీ నాయకులు, కార్యకర్తలకు విశ్వాసం కలిగించాలి. తద్వారా పార్టీని పటిష్టం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఒకవైపు పార్టీ శ్రేణుల్లో మనోధైర్యాన్ని పెంచుతూనే మరోవైపు సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్టం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను అమలు చేయాలి. ఈ రెండంచెల విధానం ద్వారా ఐదారు నెలల్లో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. అయితే సోనియా ఇదంతా చేయగలుగుతారా? అన్నది అసలు ప్రశ్న. కాగా, సోనియా కేవలం అయిదారు నెలల కోసమే పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారనే మాట వినిపిస్తోంది. ఐదారు నెలల్లో కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలన్నది ఆమె ఆదేశమని సీనియర్ నాయకులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాక, తాను అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటానని సోనియా కొంతమంది సీనియర్ నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో సగానికి పైగా రాజ్యసభ సీట్లను ఆ పార్టీ గెలుచుకుంటుంది. సోనియా అధ్యక్ష స్థానంలో లేకపోతే ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమకు ఇష్టమైన వారిని రాజ్యసభకు పంపించుకుంటారన్నది సీనియర్ నాయకుల భయం. సోనియా వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు అధ్యక్ష పదవిలో కొనసాగితే పార్టీ కోసం పనిచేసే వారిని రాజ్యసభకు ఎంపిక చేసుకోవటం ద్వారా తమ పరిస్థితిని కొంత వరకు పటిష్టం చేసుకోవచ్చన్నది గులాం నబీ ఆజాద్ ఆలోచన. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయం కోసం అధ్యక్ష పదవిలో సోనియా కొనసాగాలని కోరుకోవడం.
*

-కె.కైలాష్ 98115 73262