ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ పుట్టి ముంచుతున్న రాహుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అనుభవ రాహిత్య రాజకీయాల మూలంగా కుప్పకూలుతోంది. ఆయన వ్యవహారశైలితో విసిగిపోతున్న సీనియర్ నాయకులు, వర్కింగ్ కమిటీ సభ్యులు పార్టీపై ఆశలు వదులుకుంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు ఏమిటనే అంశంపై కాంగ్రెస్‌లో ఇపుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనారోగ్యం మూలంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పక్కకు తప్పుకుని తన పుత్రరత్నం రాహుల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తే గనుక- ఆ మరు క్షణం సీనియర్ నాయకులు పార్టీకి దూరమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో రాహుల్ సాగిస్తున్న ఏకపక్ష విధానాలతో విసిగివేసారిపోతున్న నాయకులు రాజకీయంగా తమ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని బెంబేలు పడుతున్నారు. దీంతో ఎంతో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో ప్రస్తుతం రాజకీయ నైరాశ్యం నెలకొంటోంది.
రాహుల్ నాయకత్వంలో పని చేసేందుకు మెజారిటీ నాయకులు అంగీకరించటం లేదీంటూ ఇటీవలే బిజెపిలో చేరిన ఉత్తరప్రదేశ్ పిసిసి మాజీ అధ్యక్షురాలు రీటా బహుగుణ చేసిన ఆరోపణ పచ్చి నిజం. అనారోగ్యం కారణంగా పార్టీ విషయాలను సోనియా పెద్దగా పట్టించుకోవటం లేదు. అత్యంత ముఖ్యమైన విదేశీ నాయకులను మాత్రమే తప్పనిసరి పరిస్థితిలో ఆమె కలుసుకుంటున్నారు. గత రెండు నెలలుగా పార్టీ సీనియర్ నాయకులను సోనియా కలుసుకోలే పరిస్థితి లేకపోగా, అవకాశం ఉండి కూడా రాహుల్ మాత్రం పార్టీ నాయకులతో భేటీ అయ్యేందుకు ప్రయత్నించడం లేదన్న వాదనలున్నాయి. మాజీ బ్యూరోక్రాట్లు, ఒకరిద్దరు నాయకులను మాత్రమే ఆయన కలుసుకుంటున్నారు. పార్టీ విషయాల గురించి చర్చించేందుకు ఆయన అంతగా ఇష్టపడటం లేదు. అనుభవజ్ఞులైన సీనియర్ నేతలతో కలిసి పని చేసేందుకు కూడా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో పార్టీలోని సీనియర్లు, జూనియర్ల మధ్య పెద్ద అగాధం ఏర్పడింది.
పార్టీ పనులన్నీ ఇప్పుడు ‘అవుట్ సోర్సింగ్’ ద్వారా జరుగుతున్నాయి. సోనియా అనారోగ్యం మూలంగా పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాలు మాత్రం రాహుల్ ద్వారా జరుగుతున్నాయి. మాజీ బ్యూరోక్రాట్లు, రాజకీయాలను తమ స్వార్థం కోసం వాడుకోవటంలో ఆరితేరిన నాయకుల సూచనలు, మేనేజ్‌మెంట్ నిపుణుల సూచనలు, సలహాల మేరకు నడుచుకునే రాహుల్ పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు అంకితమవుతున్న నాయకులను దూరంగా ఉంచుతున్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుత అంతర్గత సంక్షోభానికి ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి అద్దం పడుతోంది. యుపి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని అన్ని విధాలా సిద్ధం చేయవలసిన బాధ్యతను ప్రశాంత్ కిశోర్ లాంటి ‘అవుట్ సోర్సింగ్ నిపుణుడి’కి అప్పగించటం వంటి నిర్ణయాలతో కాంగ్రెస్ నావ దిశానిర్దేశం లేకుండా వెళుతోంది. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సాధించి పెట్టే బాధ్యతను రాహుల్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు అప్పగించారు. యుపిలోని కొన్ని జిల్లాల్లో పర్యటించిన అనంతరం ప్రశాంత్ ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇలాంటి వ్యూహాన్ని రచించే బాధ్యతను ఏఐసిసి ప్రముఖులు లేదా యుపి పిసిసి నాయకత్వం నిర్వహిస్తే బాగుండేది. కానీ, ఈ కీలక బాధ్యతను ప్రశాంత్ కిశోర్‌కు పార్టీ యువనేత అప్పగించారు. యుపిలో ప్రస్తుతం కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని ప్రశాంత్ కిశోర్ కనుసన్నల్లో అమలు చేస్తున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పుడు ప్రశాంత్ చెప్పిందే వేదం. యుపి పిసిసి అధ్యక్షుడు రాజ్ బబ్బర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ సైతం ప్రశాంత్ ఆదేశాల మేరకు నడుచుకోవాల్సిందే.
ప్రశాంత్ సలహా మేరకే దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను యుపిలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాహుల్ ప్రకటించారు. ఆయన సలహా మేరకే యుపిలో కిసాన్ ర్యాలీలు నిర్వహించి, ఎంపిక చేసిన ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్రలు జరుపుతున్నారు. రాహుల్ చేస్తున్న ఎన్నికల ప్రచారం, బహిరంగ సభలు, ఇతర కార్యక్రమాల్లో పిసిసి, ఏఐసిసి నాయకులకు ఎలాంటి పాత్ర లేకుండాపోయింది. ప్రశాంత్ కిశోర్ సర్వం తానై అన్ని పనులు చేస్తూండటంతో పార్టీ ముఖ్యనేతలు సైతం తెరమరుగైపోతున్నారు. యుపి సీనియర్ నాయకులు తమంత తాముగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనటం మానివేశారు. అధికారికంగా పిలిస్తే తప్ప వారు హాజరు కావటం లేదు. షీలాదీక్షిత్‌ను సిఎం అభ్యర్థిగా ప్రకటించినందుకు నిరసనగా రీతా బహుగుణ బిజెపిలో చేరాక ఇపుడు మరికొందరు నాయకులు అధినాయకత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ కిశోర్‌ను పార్టీకి దూరం చేస్తే తప్ప తాము ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేమని బహిరంగంగా చెబుతున్నారు. పార్టీకి ప్రశాంత్ కావాలా? తాము కావాలా ? అంటూ వారు రాహుల్‌ను ప్రశ్నించే పరిస్థితి నెలకొంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని ప్రశాంత్ కిశోర్‌తో కలిసి తాము పని చేయలేమని తెగేసి చెబుతున్నారు. దీంతో యుపిలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న పంజాబ్, ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బయటి నుంచి వచ్చిన ‘నిపుణుల’ కింద తాము పని చేయలేమని ఆ రెండు రాష్ట్రాల నాయకులు స్పష్టం చేశారు. రాహుల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంత్ కిశోర్ సూచనలు, సలహాల మేరకే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమతో మాట్లాడేందుకు సైతం రాహుల్ సుముఖంగా లేనపుడు తాము పార్టీలో ఎలా కొనసాగుతామని పలువురు సీనియర్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఐఎఎస్ అధికారులు, పబ్లిసిటీ నిపుణులు, ప్రచార సంస్థలకు లభిస్తున్న గౌరవం తమకు లభించటం లేదని యుపికి చెందిన ఎఐసిసి నాయకులు వాపోతున్నారు. పార్టీ వ్యవహారాలను సోనియా పట్టించుకునే పరిస్థితి లేదు. యువనేత రాహుల్ వైఖరి పార్టీకి నష్టం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. *

కె కైలాష్