ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షం మనుగడ ప్రశ్నార్థకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఘన విజయంతోపాటు మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాక జాతీయ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. మోదీ రథ చక్రాలు ఇలాగే సాగితే కాంగ్రెస్ ముక్త భారత్, విపక్ష ముక్త భారత్ ఏర్పడుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలతో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయం కొత్తరూపాన్ని సంతరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జూన్, జూలై మాసాల్లో జరిగే రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో మోదీ తాను ప్రతిపాదించే అభ్యర్థులను గెలిపించుకోవడం దాదాపుగా ఖాయం. ప్రస్తుత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడే కాకుండా ఏళ్ల తరబడి కేంద్రంలో కీలక పదవులను నిర్వహించిన రాజకీయ కోవిదుడు. జూలై తరువాత ప్రణబ్ స్థానంలో మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ ఎంపిక చేసే వ్యక్తి రాష్టప్రతి భవన్‌లో అడుగు పెడతాడు. రాజ్యసభను నిర్వహించే ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ పదవీ కాలం కూడా ముగుస్తోంది. అన్సారీ మూలంగా రాజ్యసభలో కాంగ్రెస్ తన మాట కొంతైనా నెగ్గించుకోగలుగుతోంది. బిజెపికి చెందిన నాయకుడు ఉప రాష్టప్రతిగా ఎన్నికైన తరువాత రాజ్యసభలో ప్రతిపక్షం మరింత ఇరకాటంలో పడిపోతుంది. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ కాంగ్రెస్‌కు దూరమైనా రాజ్యసభ అధ్యక్షుడు, ఉప రాష్టప్రతి అన్సారీ మాత్రం ప్రతిపక్షం పట్ల సానుభూతితో వ్యవహరిస్తున్నారు.
రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికలు ముగిశాక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్,త్రిపుర, మిజోరం, కర్నాటక, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో జరిగినట్లే గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఓటర్లు మోదీకి బ్రహ్మరథం పడితే ఈ ఆరు రాష్ట్రాల్లో బిజెపి సులభంగా అధికారంలోకి వస్తుంది. మోదీ జనాకర్షణకు ప్రతిపక్షం నిస్సహాయత తోడైతే ఈ ఆరు రాష్ట్రాల్లో ‘కమలం’ వికసిస్తుంది. గుజరాత్‌లో చాలా కాలంగా బిజెపి అధికారంలో ఉన్నా, మోదీ మంత్రంతో అక్కడ ఈసారి కూడా ఆ పార్టీ గెలిచితీరుతుందనే వాదనలున్నాయి. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలపై ఉన్న ప్రజా వ్యతిరేకత కారణంగా బిజెపికి అధికారం దక్కే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికే అసోం, మణిపూర్‌ల్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న బిజెపి వచ్చే సంవత్సరం అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటుకునేందుకు ఇప్పటి నుండే వ్యూహరచన చేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో ఎదురైన ఒటమి మూలంగా నిరాశా నిస్పృహల్లో ఉ న్న వామపక్షాలు, వ రుస పరాజయాలతో నైతిక స్థైరాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలు ఈశాన్య రా ష్ట్రాల్లో బిజెపిని ఎదుర్కొనగలుగుతాయా? అనే అనుమానం కలుగుతోంది. మతపరమైన కారణాలతో ఈశాన్య రాష్ట్రాల్లో ఏ విధంగానైనా అధికారంలోకి రావాలనుకుంటున్న బిజెపిని నిలువరించటం కాంగ్రెస్, వామపక్షాలకు సాధ్యం కాకపోవచ్చు.
2019లో లోక్‌సభతో పాటు తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగవలసి ఉన్నది. చత్తీస్‌గఢ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, హర్యానా,మహారాష్ట్ర, ఒడిశా శాసనసభలకు 2019లో జరిగే ఎన్నికలు బిజెపికి మరో అగ్నిపరీక్ష కానున్నాయి. ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రభావం గుజరాత్, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లపై కచ్చితంగా ఉంటుంది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైనే 2019 సార్వత్రిక ఎన్నికల ముఖచిత్రం రూపుదిద్దుకుంటుంది. యుపి, ఉత్తరాఖండ్‌లో మాదిరి మోదీ హవా రాబోయే ఎన్నికల్లోనూ కొనసాగితే కాంగ్రెస్, ఇతర విపక్షాల మనుగడ ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తప్పదు. లోక్‌సభ సభ్యుడు, హిందూత్వవాది ఆధిత్యనాథ్ యోగిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం ద్వారా మోదీ తన భవిష్యత్ ఎజెండాను ప్రకటించారు. ఆక్రమిత కాశ్మీర్‌లో మెరుపుదాడులు, పెద్దనోట్లను రద్దు చేయటం తర్వాత మోదీ తా జాగా ఆధిత్యనాథ్‌ను యుపి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి మరో సంచలనానికి తెర తీశారు. ప్రధాని ఇకముందు కూడా కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆయన ఆకర్షణను అడ్డుకునే శక్తియుక్తులు ప్రస్తుతానికైతే విపక్షానికి లేవు. మోదీ దూకుడు, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల్లో ఉన్న వ్యవస్థాపరమైన శక్తి ప్రతిపక్షంలోని ఏ ఒక్క పార్టీకీ లేవు.
పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అది కెప్టెన్ అమరీందర్ సింగ్ విజయంగానే ముద్ర పడింది తప్ప ఆ పార్టీ గొప్పతనం కాదు. తాజాగా నాలుగు రాష్ట్రాల్లో బిజెపికి అధికారం తెచ్చిపెట్టిన వ్యక్తి నరేంద్ర మోదీ. అంటే- కొందరు వ్యక్తుల మూలంగా పార్టీలు మనుగడ సాగిస్తున్నాయి తప్ప వాటి సిద్ధాంతాల వల్ల కాదు. వ్యక్తులు తప్పుకుంటే పార్టీల విజయం కూడా మాయమవుతుంది. రాజకీయ పార్టీల విధానాలు, సిద్ధాంతాల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడితే బాగుంటుంది తప్ప వ్యక్తులు, వారి ఆలోచనల పునాదులపై ప్రభుత్వాలు ఏర్పడటం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అనంతరం ఏకాభిప్రాయ సాధన ద్వారా పరిపాలన కొనసాగించటం ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేస్తుంది. ప్రధాని మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తమకు ఇక ఎదురులేదని భావిస్తూ ఇతర పార్టీలను చిన్నచూపుచూసే బదులు రాష్ట్రాల అభివృద్ధిలో విపక్షాలకు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించాలి. తద్వారా దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ శోభిల్లుతుంది. ఒక పార్టీ లేదా ఒక వ్యక్తికి భారీ మెజారిటీ లభించటం కొన్ని సందర్భాల్లో హానికరమైన రాజకీయాలకు దారి తీసే ప్రమాదం ఉంది.
రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ముంబయిలో ఇటీవల ఒక సదస్సులో మాట్లాడుతూ, ఒకే పార్టీకి భారీ మెజారిటీ లభించటం హానికరమంటూ చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం. ప్రతిపక్షాలు ఎందుకూ కొరగాకుండా పోతున్న నేపథ్యంలో మోదీ, అమిత్ షా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన భారీ మెజారిటీని ప్రజాశ్రేయస్సుకు మాత్రమే ఉపయోగించుకోవడం ఉత్తమం.
*

కె. కైలాష్