ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
కళతప్పిన విపక్షం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించినప్పటి నుండి పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీల్లో నీరసం ఆవహించింది. గతంలో ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ప్రతిపక్షాలు ఇప్పుడు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల్లో గతంలో కనిపించిన ఉత్సాహం, సమైక్యత, ఆత్మవిశ్వాసం ఇటీవల బాగా లోపించాయి. బడ్జెట్ రెండో విడత సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో అద్భుత విజయం సాధించటంతోపాటు మణిపూర్, గోవాల్లోనూ ‘కాషాయ దళం’ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పంజాబ్‌లో కాంగ్రెస్ విజయం సాధించినా దాని ప్రభావం ప్రతిపక్షాలపై కనిపించటం లేదు. ఐదింట నాలుగు రాష్ట్రాలు గెలుచుకున్న భాజపా పార్లమెంటులో అత్యుత్సాహంతో పని చేస్తోంది. యుపిలో భాజపా సాధించిన ఘన విజయం ప్రభావం కాంగ్రెస్, వామపక్షాలు మినహా ఇతర ప్రతిపక్షాలపై విశేష ప్రభావం చూపిస్తోంది. కాంగ్రెస్,వామపక్షేతర పార్టీలు మోదీ ప్రభుత్వాన్ని, విధానాలను సమర్ధవంతంగా ఎదుర్కొనడం లేదు.
పార్లమెంటులో అయినదానికి, కాని దానికి విభేదించి ప్రభుత్వంతో తామెందుకు గొడవ పడాలనే పద్ధతిలో ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. యుపిలో దారుణ ఓటమిని చవిచూసిన సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని పెద్దగా వ్యతిరేకించటం లేదు. సమాజ్‌వాదీ పార్టీకి లోకసభలో పెద్దగా సభ్యులు లేకపోయినా రాజ్యసభలో వారికి మంచి సంఖ్యాబలం ఉన్నా దూకుడుగా వ్యవహరించడం లేదు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు వేదికపై ములాయం సింగ్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోదీతో కొద్దిసేపు గుసగుసలాడటం తెలిసిందే. ములాయం చిన్న కొడుకు, చిన్న కోడలు ముఖ్యమంత్రి యోగి నివాసానికి వెళ్లటం, ఆ తరువాత వారి గోశాలకు యోగి వెళ్లటం గమనార్హం. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపిలు ఉభయ సభల్లో ప్రభుత్వం పట్ల మెతకవైఖరిని అవలంబిస్తున్నారు. శరద్ యాదవ్ నాయకత్వంలోని జెడియు పార్టీ కూడా ప్రభుత్వం పట్ల గతంలో మాదిరిగా వ్యవహరించటం లేదు. ఇక- కాంగ్రెస్, వామపక్షాలు అవకాశం లభించిన ప్రతిసారీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసేందుకు ప్రయత్నిస్తున్నా ఈ పార్టీల దాడిలో గతంలో ఉన్నంత తీవ్రత లేదు. ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులు అప్పుడప్పుడు పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్నా అది నామమాత్రంగానే ఉంటోంది తప్ప పార్లమెంటును స్తంభింపజేయాలనే లక్ష్యంతో జరగటం లేదు. రాజ్యసభలో బిసి,ఎస్‌సి,ఎస్‌టి, మైనారిటీ కమిషన్లలో నియామకాలు, మహిళలపై అత్యాచారాలు వంటి అంశాలపై కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు గొడవ చేసినా అది కేవలం రికార్డు కోసం అనేట్లుగా ఉండటం గమనార్హం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటి నుండి కాంగ్రెస్ ఎంపిల్లో నిరాశానిస్పృహలు చోటుచేసుకున్నాయి. తాము పార్లమెంటులో గొడవ చేసినా ప్రభుత్వం దృష్టిలో చెడు కావటం తప్ప తమకు వచ్చే లాభమేమిటని కాంగ్రెస్ ఎంపిలు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు ఆ పార్టీ నాయకులు, ఎంపిలను పూర్తి నిరుత్సాహానికి గురి చేసింది. రాహుల్ పట్ల వారిలో విశ్వాసం తగ్గిపోతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం అధినాయకత్వంపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. నాయకత్వం లోపం వల్లనే ఇలా జరుగుతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. బిసి,ఎస్‌సి,ఎస్‌టి, మైనారిటీ కమిషన్లకు కార్యవర్గాలను నియమించనందుకు నిరసనగా ప్రతిపక్షాలు రెండు రోజుల పాటు రాజ్యసభలో గొడవ చేశాయి. విపక్షం సరైన పద్ధతిలో ఉభయ సభల్లో పోరాటం చేయటం చేసినట్లయితే ప్రజలకు మేలు చేసేందుకు అవకాశం ఉండేది. బిసి కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించటం అత్యంత కీలక అంశం. అయితే కేంద్రం బిసి కమిషన్‌కు కొత్త నిర్వచనం ఇస్తోంది.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్ పేరుతో కొత్త కమిషన్‌ను ఏర్పాటుతో కోట్లాది మంది బిసిలకు అన్యాయం జరుగుతోందన్న భావన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సామాజిక వెనుకబాటుతనంతోపాటు అర్థికంగా వెనుకబడిన వారు అనే కొత్త నిర్వచనంతో మరికొన్ని వర్గాలను బిసి కమిషన్ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందనే అనుమానం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్, వామపక్షాలు ఈ అంశంపై సహేతుక పద్ధతిలో వాదించలేకపోయాయి. కొత్త బిసి కమిషన్ ప్రాతిపదిక, తదితర అంశాలపై ప్రభుత్వం నుండి సమాచారాన్ని ప్రధాన ప్రతిపక్షం రాబట్టలేకపోయింది. రాజ్యసభలో రెండు రోజుల పాటు విపక్షాలు గొడవ చేసినా- అది నినాదాలు, విమర్శలతో సరిపోయింది తప్ప రాజ్యాంగ హోదాతో కూడిన బిసి కమిషన్ వివరాలను రాబట్టలేకపోయాయి. రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉన్నాసరే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేకపోయాయి. కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఆర్థిక బిల్లుకు ఐదు సవరణలు ప్రతిపాదించటం ద్వారా తన ప్రతిష్ఠను పెంచుకునేందుకు యత్నించారు. అయితే, రాజ్యసభ ఆమోదించిన ఈ ఐదు సవరణలను లోక్‌సభ కొట్టివేసింది. ఒకరిద్దరు మం త్రులు ప్రధాన మంత్రి మెప్పుకోసం ఉభయ సభల్లో కొంత అతిగా వ్యవహరించి, ప్రతిపక్షాలు గొడవ చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మంత్రులు అత్యుత్సాహం చూపించకపోతే ఉభయ సభల్లో గొడవ చేసే అవకాశం ప్రతిపక్షాలకు లభించేది కాదు. *