ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
పరువు తీసిన ‘దురుసు సేన’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సజావుగా సాగుతున్నాయని అంతా భావిస్తున్న తరుణంలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల పరువును ‘శివసేన’ సభ్యులు బజారున పడేశారు. ‘ఇండియన్ ఎయిర్‌లైన్స్’కు చెందిన ఒక అధికారిని ఇరవై నాలుగుసార్లు చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్‌కు మద్దతుగా ఆ పార్టీ సభ్యులు లోక్‌సభలో కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజుపై దాడికి యత్నించడంతో పార్లమెంటు పరువు పోయింది. శివసేనకు చెందిన కేంద్రమంత్రి అనంత్ గీతే నేతృత్వంలో ఈ దారుణ సంఘటన జరగడం అందరినీ నివ్వెర పరచింది. ఇంత దారుణం జరిగినా గీతేపై చర్య తీసుకునే నాథుడు కనిపించటం లేదు. పార్లమెంటు ఉభయసభల్లో సభ్యులు, మంత్రులు ఎలాంటి దురాగతాలకు పాల్పడినా శిక్షించేందుకు అవకాశం లేదు. పార్లమెంటు నాలుగు గోడల మధ్య ఏం జరిగినా దానిని ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు. లోక్‌సభలో టిడిపికి చెందిన అశోక్‌గజపతి రాజును బిజెపి మిత్రపక్షమైన శివసేనకు చెందిన కేంద్రమంత్రి గీతే బాహాటంగా తిట్టినా ఎవరూ పట్టించుకోలేదు. అత్యున్నతమైన లోక్‌సభలో ఒక క్యాబినెట్ మంత్రిపైకి మరో క్యాబినెట్ మంత్రి దూసుకుపోయి దాడికి యత్నించడం, బూతుల తిట్టడం తమ కళ్లెదుటే జరిగినా ఎలాంటి చర్యలూ లేవు.
విమానంలో ప్రయాణించిన సందర్భంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ సీనియర్ అధికారిని తాను చెప్పుతో కొట్టానని శివసేన ఎంపీ గైక్వాడ్ స్వయంగా ప్రకటించారు. దీంతో గైక్వాడ్‌ను అన్ని ప్రముఖ విమానయాన సంస్థలు బహిష్కరించాయి. అతనిపై హత్యానేరం మోపుతూ కేసు నమోదు చేశారు. ‘మా ఎంపీపై కేసులు పెడతారా? విమానాలు ఎక్కకుండా బహిష్కరిస్తారా? ముంబయి నుంచి ఒక్క విమానం కూడా ఎగరకుండా చేస్తాం’ అంటూ శివసేన సభ్యులు లోక్‌సభలో నానా గొడవ చేశారు. దీనికి మంత్రి అశోక్‌గజపతి సమాధానం ఇస్తూ, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, ఎంపీ అయినా ఇంకెవరైనా విమానాల్లో సాధారణ ప్రయాణీకులేనని చెప్పడం శివసేన సభ్యులకు ఆగ్రహం తెప్పించింది. సమాధానం ఇవ్వటంలో లౌక్యాన్ని చూపించకుండా ముఖంపై కొట్టినట్లు ఆయన మాట్లాడడంతో శివసేన ఎంపీలు రెచ్చిపోయి దాడికి యత్నించారు. సహచర ఎంపీలు అడ్డుకోకుంటే అశోక్‌గజపతిపై అనంత్ గీతే చేయి చేసుకునేవాడే. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు రక్షణ కవచంలా నిలిచి అశోక్‌ను కాపాడగలిగారు. అప్పటికే శివసేన ఎంపీలు తిట్ల దండకం అందుకున్నారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్ గీతేను నిలువరించారు. లేకుంటే ఆయన అశోక్‌పై భౌతికదాడికి దిగేవాడు. దాదాపు పదిమంది శివసేన ఎంపీలు అశోక్‌గజపతిని చుట్టుముట్టి మీదిమీదికి పోయి దూషించడమే కాదు, ‘నీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. ‘ముంబయి నుంచి ఒక్క విమానం కూడా ఎగరదు’ అంటూ రాజ్‌నాథ్ సింగ్‌తో గీతే అనడాన్ని మంత్రులు, ఎంపీలతో పాటు విజిటర్స్ గ్యాలరీలో ఉన్న సందర్శకులు, మీడియా ప్రతినిధులు విన్నారు. లోక్‌సభలోని రాజ్యసభ గ్యాలరీలో కూర్చున్న శివసేన ఎంపీ ‘డైరెక్షన్’లోనే ఈ దాడి జరిగిందన్న వార్తలు వినిపించాయి.
బిజెపిని దెబ్బతీసేందుకు శివసేన అధినాయకుడు ఇచ్చిన ఆదేశం మేరకే ఆ పార్టీ సభ్యులు అశోక్‌గజపతిరాజుపై విరుచుపడ్డారు.
లోక్‌సభలో ఒక క్యాబినెట్ మంత్రిపై మరో క్యాబినెట్ మంత్రి దాడి చేయటం, దూషించటం భారత పార్లమెంటు చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంటులో ప్రతిపక్షం ఎన్నోసార్లు గొడవకు దిగి గందరగోళం చేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు సంబంధించిన మహిళా బిల్లును ప్రతిపాదించేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు ప్రతిపక్ష సభ్యులు సదరు మంత్రి నుండి ముసాయిదా బిల్లు కాపీని లాగేశారు తప్ప అతనిపై దాడికి దిగలేరు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంపై ఓటింగ్ జరిగిన సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒకరిద్దరు కాంగ్రెస్ సభ్యులు సభలో అలజడి సృష్టించారు. అంతేతప్ప సదరు మంత్రిపై దాడి చేయలేదు. విచిత్రం ఏమిటంటే లోక్‌సభలో జరిగిన ఈ తాజా సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఇతర మంత్రులు ఏ విధంగానూ స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ సంఘటనపై సీరియస్‌గా స్పందించకపోవటం ఆశ్చర్యకరం. అశోక్‌గజపతిరాజును అనంతగీతే దూషించటం, శివసేన ఎంపీలు దుర్భాషలాడటాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్‌తోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ తీవ్రంగా ఖండించాల్సి ఉంది. వీరంతా ఇందుకు భిన్నంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటన్నది అర్థం కాదు. ప్రతిపక్షం సైతం బాధ్యతారహితంగా వ్యవహరించింది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మాత్రం ‘బిజెపి, దాని మిత్రపక్షాలు సర్దుకుపోవటం ఏమిటి?’ అని ప్రశ్నించారే తప్ప ఒక క్యాబినెట్ మంత్రి మరో క్యాబినెట్ మంత్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించటాన్ని ఖండించకపోవటం సిగ్గు చేటు. రాష్టప్రతి ఎన్నికల నేపథ్యంలోనే శివసేన ఎంపీల దురాగతాన్ని బిజెపి దిగమింగుకుందని చెప్పక తప్పదు. రాష్టప్రతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బిజెపికి ‘ఎలక్టరన్ కాలేజీ’లో మరో ఇరవై వేల ఓట్లు అవసరం అవుతాయి. శివసేన వద్ద దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల బలం ఉన్నది. ఈ కారణంగానే బిజెపి అధినాయకత్వం లోక్‌సభలో జరిగిన దుర్ఘటనను తొక్కిపెట్టగా తెలుగుదేశం అధినాయకత్వం దీనికి వంతపాడింది. చట్టానికి కట్డుబడి పని చేస్తామని చెప్పుకునే బిజెపి ప్రభుత్వం లోక్‌సభలో తీవ్ర అవమానానికి గురైన అశోక్‌గజపతి రాజు గురించి పట్టించుకోకుండా ఇండియన్ ఎయిర్‌లైన్స్ అధికారిని చెప్పుతో కొట్టిన శివసేన ఎంపీ గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని తొలగించి తన గొప్ప మనసును చాటుకుంది.