ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

భద్రతలో ఎందుకీ వైఫల్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక, సామాజిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం సీమాంతర ఉగ్రవాదం, నక్సలైట్ల ఆగడాలను అరికట్టటంలో ఎందుకు విఫలమవుతోంది? పెద్దనోట్ల రద్దు ద్వారా సీమాంతర ఉగ్రవాదం, నక్సలిజం నడ్డి విరిచామని ప్రకటించుకున్న బిజెపి ప్రభుత్వం అసలు లక్ష్యాన్ని సాధించలేకపోవటం ఆశ్చర్యకరం. నోట్ల రద్దు తర్వాత దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం తగ్గడానికి బదులు మరింత పేట్రేగిపోతున్నాయి. ఇవి ఇలా విపరీత స్థాయికి చేరడం- ‘దీపం ఆరిపోయే ముందు బాగా వెలగడమా?’ లేక నిజంగానే ఇవి పెరిగిపోతున్నాయా?.
పాకిస్తాన్ ప్రేరిత ఇస్లామిక్ ఉగ్రవాదులు కాశ్మీర్‌లోని ఐదు జిల్లాల్లో మారణ హోమం సృష్టిస్తుంటే, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో మావోయిస్టులు చెలరేగిపోతున్నారు. గత వారం కాశ్మీర్‌లోని కుప్వారాలో ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదులు సైనిక శిబిరంపై చేసిన దాడి, చత్తీస్‌గఢ్‌లోని సు కుమాలో సిఆర్‌పిఎఫ్ దళాలపై మావోలు జరిపిన నరమేధం ఘటనలు కేంద్ర ప్రభుత్వ అలసత్వ ధోరణికి అద్దం పడుతున్నాయి. దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదులు, చత్తీస్‌గఢ్, ఆంధ్ర, ఒడిశా తదితర రా ష్ట్రాల్లో మావోయిస్టులు బీభత్సం కొనసాగిస్తున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు కు ప్వారా సైనిక శిబిరం వద్ద ఇనుప కంచెను కత్తిరించి లోపలికి ప్రవేశించటం చూస్తుంటే మన భద్రత ఎంత బలహీనంగా ఉన్నదనేది మరో సారి వెలుగులోకి వచ్చింది. సైనిక శిబిరం గేటు వద్ద ఓ సైనికుడు అప్రమత్తంగా ఉంటూ మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నాడు కాబట్టే భద్రతాదళానికి భారీగా నష్టం జరగలేదు. గేటు వద్ద పహారాలో ఉన్న సైనికుడు ఏ మాత్రం అలసత్వం చూపించినా నష్టం చాలా జరిగేది. ముగ్గురు ఇస్లామిక్ ముష్కరులు సైనిక స్థావరం లోపలికి చొచ్చుకు వచ్చి ఉంటే ఏం జరిగేదనేది ఊహించేందుకు కూడా భయం వేస్తుంది.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోకి చొచ్చుకుపోయిన విధంగానే కుప్వారా సైనిక శిబిరంలోకి చొచ్చుకుపోయేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. మన పాలకులు ముఖ్యంగా రక్షణ, హోం శాఖ మంత్రులు, అధికారులు పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి ఘటన నుండి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్న దాఖలాలు కనిపించటం లేదు. ఐసిస్ సహా పాకిస్తాన్ నుండి పనిచేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు తమ వ్యూహాలు, విధానాలు మార్చుకుంటూ కాశ్మీర్‌లో దాడులు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాద ముష్కరులతో దాడులు చేయిస్తూ, వారిని ఎదుర్కొనేందుకు వెళుతున్న భద్రతాదళాలపై మహిళలు, విద్యార్థులతో రాళ్లదాడులు చేయిస్తున్నారు. ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు ఏకంగా మహిళలు, విద్యార్థినులతో సైనికులపై రాళ్లు వేయించే స్థాయికి చేరుకున్నాయి. పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాద సంస్థల అధినాయకులు, పాకిస్తాన్ సైనికులు, ఐఎస్‌ఐ వ్యూహకర్తలు గత ఐదారు నెలల్లో కాశ్మీర్‌ను పూర్తిగా స్తంభింపజేయగలిగారు. కాశ్మీర్‌లోయ ముఖ్యంగా శ్రీనగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి రోజూ విధ్వంసం సృష్టించటంలో వీరు విజయం సాధించారు. విద్యార్థులు, మహిళలు భద్రతాదళాలతో తలపడే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా విధ్వంసకారులు, రాళ్లు రువ్వుతున్న వారిని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక మహిళా సిఆర్‌పిఎఫ్ దళాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. యువకులు, మహిళలు భద్రతాదళాల సిబ్బందిపై చేయి చేసుకుంటూ అవమానాలకు గురి చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన స్థాయిలో స్పందించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
శ్రీనగర్‌తో పాటు మరో నాలుగు జిల్లాలోనే ఇస్లామిక్ తీవ్రవాదం పేట్రేగిపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను ఆనుకుని ఉన్న లోయలోనే ఇస్లామిక్ తీవ్రవాదం అదుపులేకుండా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మొత్తం ఇరవై రెండు జిల్లాలుంటే జమ్ము ప్రాంతంలో పది, కాశ్మీర్‌లోయలో పది, లద్దాక్ డివిజన్‌లో రెండు జిల్లాలున్నాయి. జమ్ము, లద్దాక్ ప్రాంతాల్లో ఇస్లామిక్ తీవ్రవాదం అతి స్వల్పంగా ఉంటే కాశ్మీర్‌లో ఇది అదుపు తప్పే స్థాయికి చేరుకున్నది. కాశ్మీర్ లోయలో మొత్తం పది జిల్లాలుంటే- ఐదు జిల్లాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం అత్యధికంగా ఉన్నది. పాకిస్తాన్ సరిహద్దులను ఆనుకున్న ఈ జిల్లాల్లోకి ఉగ్రవాదులు ఇష్టానుసారం వచ్చి పోతున్నారని చెప్పకతప్పదు. కాశ్మీర్‌లోయలో కొనసాగుతున్న విధ్వంసానికి ప్రతి రోజూ ఒకరిద్దరు సైనికులు మరణిస్తున్నారు.
ఇక, కొన్ని రాష్ట్రాల్లో నక్సలైట్లు తరచూ దాడులు చేస్తూ సైనికులను పొట్టన పెట్టుకుంటున్నారు. నక్సలైట్ల దాడి జరిగిన ప్రతిసారీ ఇక మీదట భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టంగా ఉంటాయని హోం శాఖ ప్రకటించటం ఆనవాయితీగా మారింది. సుకుమాలో దాదాపు మూడు వందల మంది నక్సలైట్లు రోడ్డు నిర్మాణం పనులకు భద్రత కల్పిస్తున్న జవాన్లపై ఆకస్మికంగా దాడి చేయటం చూస్తుంటే వారెంత పకడ్బందీగా వ్యూహం పన్నారనేది అర్థమవుతోంది. ఒకేసారి మూడు వందల మంది, అందులో ఎక్కువ మంది మహిళా నక్సలైట్లు మారణాయుధాలతో దాడికి దిగటం అనేది మామూలు విషయం కాదు. మావోయిస్టుల దాడులను పసిగట్టలేకపోవడం హోం శాఖ వ్యూహకర్తల వైఫల్యానికి అద్దం పడుతోంది. మావోయిస్టులు గ తంలో పలుమార్లు ఇలాంటి దాడులు చేసినా ప్రభుత్వ విధానంలో ఎలాంటి మార్పు రాకపోవటం శోచనీయం. కఠిన చర్యలు తప్పవంటున్న కేంద్ర హోం మంత్రి మాటలు కార్యరూపం ధరించడం లేదు. సుకుమా ఘటనలో నక్సలైట్లు పోలీసులకు చెందిన అత్యాధునిక ఆయుధాలను ఎత్తుకుపోయారు. ఈ ఆధునిక అయుధాలతో ఆతి త్వరలోనే మరోసారి భద్రతా దళాలపై వారు దాడి చేసినా ఆశ్చర్యపడకూడదు.
ఇస్లామిక్ ఉగ్రవాదులు, నక్సలైట్లు ఇలా యథేచ్ఛగా దాడులు కొనసాగిస్తుంటే ప్రభుత్వం వీటిని ఎందుకు నిలువరించ లేకపోతోంది ? ఉగ్రవాదులతో పోరాడుతున్న సైనికులు, భద్రతాదళాలపై రాళ్లు రువ్వుతూ దాడికి ఉపక్రమిస్తున్న మహిళలు, యువకులపై కఠిన చర్యలను మోదీ ప్రభుత్వం ఎందుకు తీసుకోవటం లేదనేది అంతుపట్టటం లేదు. ఉగ్రవాదులు, మావోయిస్టులు జరుపుతున్న దాడుల వెనక ఉమ్మడి కుట్ర ఏదైనా ఉన్నదా? అనే అనుమానం కలుగుతోంది. వీరిని అదుపుచేయటంలో ప్రభుత్వం విఫలం కావటంతో దేశప్రజల్లో ఆగ్రహం, అసహనం పెరిగిపోతున్నాయి. ‘ప్రధాని మోదీ ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైన పక్షంలో నా కుమారుడి మరణానికి నేనే తగిన ప్రతీకారం తీర్చుకుంటాన’ని కుప్వారా ఉగ్రదాడిలో మరణించిన కెప్టెన్ ఆయుష్ యాదవ్ తల్లి హెచ్చరించడం ప్రజాగ్రహానికి ప్రతీక.
*

కె. కైలాష్