ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షం గొంతులో ‘ఇవిఎం’ వెలక్కాయ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఇవిఎం)ను అనుమానిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యం పరువుప్రతిష్టలను మంటగలిపాయి. ఎన్నికల్లో తాము గెలిచినపుడు ఇవిఎంలు ఎంతో మంచివనడం, ఓటమి చెందితే వాటిని ‘టాంపరింగ్’ చేశారని ఆరోపించడంతో ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలు బహిర్గతమవుతున్నాయి. దిల్లీలో కొద్దిరోజుల క్రితం ఏర్పాటు చేసిన జాతీయ, ప్రాంతీయ పార్టీల సమావేశంలో ఇవిఎంలను ట్యాంపర్ చేయటం అసాధ్యమని ఎన్నికల సంఘం (ఇసి) మరోసారి స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఇవిఎంలను ట్యాంపర్ చేసి చూపించాలని ప్రతిపక్షాలను ఇ.సి సవాల్ చేసింది. దీని కోసం త్వరలో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించటం ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాం టిది. దేశవ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో ఇసి వినియోగిస్తున్న ఇవిఎంలను ట్యాంపర్ చేయటం సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. అయినా, ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణల పర్వానికి తెర దించడం లేదు.
ఎన్నికల్లో ప్రజల తిరస్కారానికి గురైన విపక్షాలు తమ అక్కసును ఇవిఎంలపై చూపించడం విడ్డూరంగా ఉంది. తమను ఇంటికి పంపించిన ప్రజలను దూషిస్తే పుట్టగతులుండవు కాబట్టే ఇవిఎంలను ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. గతంలో తెలుగుదేశం, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వంటి విపక్షాలు, కొన్ని సంస్థలకు చెందిన వారు ఇవిఎంలను ట్యాంపర్ చేయవచ్చునని ప్రకటించారు. 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా తాము పరాభవం చెందడంతో ఇవిఎంల టాంపరింగ్ వల్లే కాంగ్రెస్ గెలిచిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించడం తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఇవిఎంలను తప్పుపట్టడమే కాదు, ఆ పార్టీ సానుభూతిపరుడైన ఒక పారిశ్రామికవేత్త ఇవిఎంను ట్యాంపర్ చేసి చూపించారు. ఈ ట్యాంపరింగ్ తతంగాన్ని దేశ రాజధాని దిల్లీలో టిడిపి పెద్దఎత్తున నిర్వహించి, బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించే విధానాన్ని మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేసింది.
అయితే, చంద్రబాబు ఆ తరువాత ఎందుకోగాని ఇవిఎంల ట్యాంపరింగ్ వ్యవహారాన్ని వదులుకున్నారు. ఇప్పుడు దిల్లీ అసెంబ్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన మాయావతి నాయకత్వంలోని బహుజన సమాజ్ పార్టీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీతోపాటు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం ఇవిఎంల ట్యాంపరింగ్‌పై నిరసనలు తెలుపుతున్నారు. యుపి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించాక, ప్రతిపక్ష పార్టీలు ఇవిఎంల ట్యాంపరింగ్‌ను జాతీయ సమస్యగా చిత్రీకరించాయి. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. పాతపద్ధతిలో ఎన్నికలను నిర్వహించటం ఎంత ఖర్చుతో కూడుకున్నదనేది వారికి తెలియక కాదు. బ్యాలెట్ పత్రాల తయారీకి ఏ మేరకు చెట్లు నరకాలో, ఫలితంగా పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందనేది ప్రతిపక్షాలకు తెలుసు. అయినా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇవిఎంలను తప్పుపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక శాసనసభ్యుడు దిల్లీ శాసనసభలో తాజాగా ఇవిఎంల ట్యాంపరింగ్ దృశ్యాలను ప్రదర్శించారు. గతంలో ఇదే నాటకాన్ని టిడిపి ప్రదర్శించింది. ఇసికి సంబంధం లేని ఓ ఓటింగ్ యంత్రాన్ని తెచ్చి ఆప్ ఎమ్మెల్యే ట్యాంపరింగ్ చేసే విధానాన్ని వివరించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఇవిఎంను తెచ్చి, సాంకేతిక నిపుణులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ట్యాంపర్ చేసి చూపించగలగాలి. అప్పుడే ఇవిఎంల విశ్వసనీయతను ప్రశ్నించేందుకు వీలు కలుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలకు త్వరలోనే కలిగించబోతోంది. ఇవిఎంలను ట్యాంపర్ చేయవచ్చునంటూ కోడై కూస్తున్న వారంతా ఏకమై కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నిర్వహించే ‘హ్యాకథాన్’లో ఇవిఎంలను ట్యాంపర్ చేసి చూపించాలి లేదా ప్రతిపక్షాలన్నీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి ఉంటుంది. తామే తయారు చేసి, తామే ప్రోగ్రాం చేసిన ఇవిఎంను ట్యాంపర్ చేయటం గొప్ప కాదు, కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఇచ్చే ఓటింగ్ యంత్రాలను ప్రతిపక్షాలు ట్యాంపర్ చేయగలుగుతాయా?
ఇవిఎంల విశ్వసనీయతను ప్రశ్నించే అధికారం ప్రతిపక్షాలకు నూటికి నూరు శాతం ఉన్నది. అలా ప్రశ్నించటం అంటే కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతను సైతం ప్రశ్నించినట్లే. కేంద్ర ఎన్నికల సంఘాన్ని అవమానించటం మామూలు విషయం కాదు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి నసీం జైదీ చెప్పినట్లు ఇసి ఏ ఒక్క పార్టీ పట్ల పక్షపాతంతో వ్యవహరించదు. అల్పసంఖ్యాక వర్గానికి చెందిన జైదీ భాజపాకు విజయం సాధించిపెట్టేందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసేలా సహకరించారని ఆరోపించటం హస్యాస్పదం కాదా? ఇటీవల ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భాజపా ఘన విజయం సాధించగా, పంజాబ్‌లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీని సాధించింది. గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఏకైక పెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. కేవలం ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మాత్రమే ఇవిఎంలు ట్యాంపర్ అయ్యాయని ఆరోపించటం అర్థరహితం కాదా? గోవా, మణిపూర్‌లో తమ అసమర్థత మూలంగానే కాంగ్రెస్ అధికారంలోకి రాలేక ఇవిఎంలను అనుమానించటం రాజకీయ దివాలాకోరుతనం కాదా? ప్రతిపక్షాలు తమను తాము అవమానించుకోవటంతోపాటు కోట్లాది మంది ఓటర్లను అవమానించి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నీరు కార్చాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే పంజాబ్, గోవా, మణిపూర్‌లో ఇవిఎం ట్యాంపరింగ్ ఎందుకు చేయలేక పోయారు? పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే అక్కడ ఇవిఎంలు ట్యాంపర్ కానట్లేకదా? ప్రతిపక్షాలకు ఈ విషయం తెలియనిది కాదు. రాజకీయ దురుద్దేశంతోనే అవి నిందలు వేస్తున్నాయి. ప్రజల తిరస్కారాన్ని దాచేందుకు ఇలా ఆరోపిస్తున్నాయి. ప్రజలు తమకు గుణపాఠం చెప్పారన్న నిజాన్ని ప్రతిపక్షాలు ఇప్పటికైనా గ్రహించటం మంచిది. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసే హ్యాకథాన్‌లో ఇవిఎంలను ట్యాంపర్ చేయలేకపోతే- విపక్ష నేతలకు ముఖం ఎత్తుకునే పరిస్థితి ఉండదేమో!
*

కె. కైలాష్