ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘గైరుహాజరు’ మన ఎంపీల జన్మహక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పార్లమెంటు సమావేశాలు నానాటికీ మొక్కుబడి వ్యవహారంలా మారుతున్నాయనడానికి వర్షాకాల సమావేశాలే ప్రబల నిదర్శనం. అధికార,ప్రతిపక్షాలు ఎప్పటి మాదిరిగానే పార్టీ రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యలను చర్చించడానికి ఏ మాత్రం దృష్టి సారించడం లేదు. ఇటీవలి కాలంలో మరోసారి ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై కాగితాలను చించి విసిరేయడంతో పాటు, ఆమె పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేసి ఆ తరువాత క్షమాపణలు చెప్పుకున్నారు. స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఐదు రోజుల పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక, రాజ్యసభలో అధికార పక్షం సభ్యులు సభా కార్యక్రమాలకు అంతరాయం సృష్టించి ప్రసిద్ధికెక్కారు. సభా కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు కృషి చేయవలసిన అధికార పక్షం సభ్యులే గొడవకు దిగటం, సభకు గైర్హాజరు కావటం వర్షాకాల సమావేశాల ప్రత్యేకత. కొత్త రాష్టప్రతి, ఉప రాష్టప్రతిని ఎన్నుకునేందుకే ఈ సమావేశాలు జరిగాయా? అనే అభిప్రాయం కలుగుతోంది. జూలై 17 తేదీన కొత్త రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఎన్నిక ప్రక్రియ పూర్తికాగా, ఉప రాష్టప్రతి ఎన్నిక ఆగస్టు5 తేదీన నిర్వహించారు. రాజ్యసభ ఆఖరి రోజు సమావేశం సందర్భంగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు పదకొండో తేదీన సభాధ్యక్ష బాధ్యతలను చేపట్టారు.
‘క్విట్ ఇండియా’ పిలుపు ఇచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉభయ సభల్లో చర్చను సైతం రాజకీయం చేయటం సిగ్గు చేటు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో దేశ తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. దీనికి ప్రతిగా లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్ స్వాతంత్య్ర పోరాటంలో బి.జె.పి పాత్ర శూన్యం అంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పదవీ కాలం ముగిసిన ఉప రాష్టప్రతి, రాజ్యసభ అధ్యక్షుడు హమీద్ అన్సారీ వీడ్కోలు సందర్భం కూడా వివాదాస్పదమైంది. గత పది సంవత్సరాల పాటు ఉప రాష్టప్రతి పదవిని, రాజ్యసభ అధ్యక్ష పదవిని నిర్వహించిన హమీద్ అన్సారీ రాజ్యసభలో వీడ్కోలు సందర్భంగా, అదే రోజు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘దేశంలోని మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారం’టూ వ్యాఖ్యానించి వివాదానికి గురయ్యారు. హమీద్ అన్సారీ తన పదవీ కాలం ముగుస్తున్న రోజున మైనారిటీల అభద్రతాభావం గురించి ఆందోళన వ్యక్తం చేసి తన మనసులోని మతతత్త్వ భావాలను చాటుకోవటం గర్హనీయం. నరేంద్ర మోదీ వీడ్కోలు ప్రసంగంలో హమీద్ అన్సారీ మతతత్వాన్ని పరోక్షంగా ఎత్తిపొడిచారు. ‘మీరు దౌత్యాధికారిగానూ, ఆ తరువాత అలీగడ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా ఒక వర్గం ప్రజల కోసమే పని చేశారు, పదవీ విరమణ అనంతరం మీరు పూర్తి కాలాన్ని ఇదే పనికి వెచ్చించవచ్చం’టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు మైనారిటీల పేరుతో రాజకీయం చేస్తున్నారంటూ పదవీ విరమణ చేస్తున్న ఉప రాష్టప్రతిని కొత్త ఉప రాష్టప్రతి వెంకయ్య దుయ్యబట్టటం భారత పార్లమెంటరీ, రాజకీయ చరిత్రలో మొదటిసారి కావచ్చు.
అధికార, ప్రతిపక్ష సభ్యులు క్విట్ ఇండియా 75వ దినోత్సవాన్ని కూడా రాజకీయం చేయటం దురదృష్టకరం. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు ఎప్పటి మాదిరిగానే ప్రతికూల విధానాన్ని అవలంబించాయి. ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఈ పని చేశాయి. ప్రభుత్వాన్ని ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ఉభయ సభల్లో ప్రయత్నించాయి. రాజ్యాంగ హోదాతో కూడిన బి.సి జాతీయ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లు, గుజరాత్ రాజ్యసభ ఎన్నికలు, కర్నాటక మంత్రి శివకుమార్ నివాసంపై ఆదాయం పన్ను శాఖ అధికారుల దాడి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో మైనారిటీలు, బలహీన వర్గాలపై జరిగిన దాడులు తదితర సంఘటనలను ప్రతిపక్షాలు రాజకీయం చేయటం ద్వారా పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. విపక్షాలు ఉభయ సభలను అడ్డుకునేందుకు ఇచ్చినంత ప్రాధాన్యతను సమస్యలపై చర్చకు ఇవ్వలేదు. ఉభయ సభల్లో గొడవ చేయటం, పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వటం, ప్రధానమంత్రిని విమర్శిస్తూ ప్లకార్డులు ప్రదర్శించటం అనేది పరిపాటిగా మారింది.
గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులకు నిరసనగా లోక్‌సభ, రాజ్యసభను ప్రతిపక్షం స్తంభింపజేసిందే తప్ప ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరపలేకపోయింది. మొదట గొడవ చేయటం, ఆ తరువాత ఏదైనా చర్చ జరిగితే అంటీముట్టనట్లు చర్చను ముగించటం ప్రతిపక్షానికి అలవాటుగా మారింది. గోసంరక్షణ పేరుతో జరిగిన దాడులపై ప్రతిపక్షం లోతుగా చర్చ జరిపి ఉండాల్సింది. దేశంలోని వివిధ ప్రాంతాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంరక్షణ పేరుతో మైనారిటీలు, దళితులపై జరిగిన దాడులపై అర్థవంతమైన చర్చ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తే ప్రతిపక్షానికి మంచి పేరు వచ్చేది. కానీ అలా జరగలేదు. గోసంరక్షణ పేరిట జరిగిన దాడుల వెనక స్థానిక రాజకీయం, వ్యాపారుల గుత్త్ధాపత్యం తదితర అంశాలున్నాయనేది ఆందరికీ తెలిసిందే. కొన్ని సందర్భాల్లో సామాజిక కారణాలు కూడా గోసంరక్షణ దాడులకు దారి తీశాయి. అధికార, ప్రతిపక్షాలు వీటన్నింటిపై విశే్లషణతో కూడిన చర్చ జరిపి ఉంటే మంచి ఫలితాలు లభించేవి. గోసంరక్షణ దాడులను విమర్శించే పేరుతో ప్రతిపక్షాలు మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బ తీయటంతోపాటు, మైనారిటీలను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఇది దేశానికి ఎంత మాత్రం మంచిది కాదు. గోసంరక్షణ పేరుతో దాడులు చేయటాన్ని ఎవ్వరూ సమర్థించలేరు. అయితే ప్రతి సంఘటనకు ‘గోసంరక్షణ’ దాడి అనే ముద్ర వేయటం ద్వారా కొందరు మెజారిటీ, మైనారిటీల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. గోసంరక్షణ, దళితులపై దాడుల సంఘటనలకు ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాలు జరిగే సమయంలోనే ప్రాధాన్యత ఇస్తాయి. పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో ఇలాంటి అంశాలకు ప్రతిపక్షాలు ఆశించిన స్థాయిలో స్పందించకపోవటం దురదృష్టకరం. పార్లమెంటు సమావేశాలు ముగియగానే ప్రతిపక్షాలు ఈ సంఘటనలను మరిచిపోతున్నాయి.
దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ ప్రతిపత్తితో కూడిన జాతీయ బి.సి కమిషన్ ఏర్పాటు వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు గర్హనీయం. రాజ్యాంగ ప్రతిపత్తితో కూడిన బి.సి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించి రాజ్యసభకు పంపించటం తెలిసిందే. లోక్‌సభ ఆమోదించిన బి.సి జాతీయ కమిషన్ బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించటం కూడా విదితమే. సెలెక్ట్ కమిటీలో బి.సి జాతీయ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై లోతుగా చర్చించిన అనంతరం రాజ్యసభకు పంపించారు. రాజ్యసభ సెలెక్ట్ కమిటీలోని అధికార,ప్రతిపక్షాలు కూడా బిల్లుపై ఏకాభిప్రాయానికి వచ్చిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం దీనిని రాజ్యసభ ఆమోదం కోసం ప్రతిపాదించింది. ప్రభుత్వం బి.సి జాతీయ కమిషన్‌లో ముగ్గురు సభ్యులను ప్రతిపాదిస్తే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ఐదుగురు సభ్యులుండాలంటూ సవరణ ప్రతిపాదించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన ముగ్గురు సభ్యులకు అదనంగా ఒక మహిళ, ఒక మైనారిటీ ప్రతినిధిని సభ్యులుగా నియమించాలన్నది దిగ్విజయ్ సింగ్ ప్రతిపాదించారు. సభ్యుల నియామకాన్ని- నియమాల రూపకల్పన సమయంలో నిర్ధారిస్తామని ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్.సి, ఎస్.టి జాతీయ కమిషన్లను ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇదే విధానాన్ని పాటించినట్టు ఆయన వాదించారు.
రాజ్యసభలో ప్రతిపక్షాలకు మెజారిటీ ఉండటం అందరికి తెలిసిందే. దీనికితోడు బి.సి జాతీయ కమిషన్ బిల్లు చర్చకు వచ్చినప్పుడు రాజ్యసభలో అధికారపక్ష సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండింది. దీనిని గ్రహించిన దిగ్విజయ్ సింగ్ తన సవరణపై ఓటింగ్ జరపాలని డిమాండ్ చేయటంతో బి.సి జాతీయ కమిషన్ బిల్లు వీగిపోయింది. బి.జె.పి ఎంపీలు రాజ్యసభకు గైర్హాజరు కావటం వల్లనే బి.సి బిల్లు వీగిపోయింది. ప్రతిపక్ష సభ్యులు సభకు రాకుంటే నష్టం ఉండదు కానీ అధికార పక్షం సభ్యులు ఉభయ సభలకు సక్రమంగా హాజరు కాకపోతే ప్రభుత్వానికే నష్టం కలుగుతుందనేందుకు బి.సి జాతీయ కమిషన్ బిల్లు మంచి ఉదాహరణ. దిగ్విజయ్ సింగ్ దెబ్బకు విలవిల లాడిపోయిన అధికార పక్షం ఇప్పుడు బి.సి జాతీయ కమిషన్ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రతిపాదించి ఉభయ సభల ఆమోదం తీసుకోవాలనుకుంటోంది. పార్లమెంటు సమావేశాలను సజావుగా నడిపించుకోవలసిన అధికార పక్షం సభ్యులే ఉభయ సభలకు సక్రమంగా హాజరు కావటం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా ఎన్నిసార్లు హెచ్చరించినా బి.జె.పి ఎంపీలు మాత్రం ఖాతరు చేయటం లేదు. ‘ఉభయ సభలకు మీరిలాగే గైర్ హాజరైతే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లభించద’ని అమిత్ షా హెచ్చరించారంటే బి.జె.పి ఎంపీలు ఏ స్థాయిలో పార్లమెంటుకు డుమ్మా కొడుతున్నారనేది అర్థం అవుతుంది. *

కె కైలాష్