ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అరుదైన తీర్పులు.. అమలు ఎలా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుప్రీం కోర్టు గత వారం రెండు చరిత్రాత్మక తీర్పులు ఇచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కేహార్ తన పదవీ కాలం ముగుస్తున్న వేళ వెలువడిన ఈ రెండు తీర్పులు సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తాయనేది నిర్వివాదాంశం. ‘ట్రిపుల్ తలాక్’ను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగులు నింపేదైతే, ‘వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు’ అనే తీర్పు సగటు మనిషికి వ్యక్తిగత స్థాయిలో భద్రతకు పునాది వేసింది. అయితే, ఈ రెండు తీర్పులను అమలు చేయటం మామూలు విషయం కాదు. సమాజంలోని ప్రతి వ్యక్తితో ముడిపడి ఉన్న ఈ రెండు తీర్పులను సక్రమంగా, సమర్థంగా, సంతృప్తికరంగా అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పని చేయాల్సి ఉంది.
‘ట్రిపుల్ తలాక్’పై తీర్పు ముస్లిం వర్గంలో తీవ్ర అలజడి సృష్టించింది. ‘ట్రిపుల్ తలాక్’పై న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన ముస్లిం మహిళల జీవితాలు మరింత దుర్భరం అవుతాయి. వారిని సమాజ బహిష్కరణకు గురి చేస్తూ కొందరు అమానుషంగా ప్రవర్తిస్తుంటే, కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయం చేయటం సిగ్గుచేటు. ‘ట్రిపుల్ తలాక్’ రద్దు అనేది సగం విజయం మాత్రమేనని చెప్పకతప్పదు. ఈ విషయమై కోర్టు ఇచ్చిన తీర్పు ఆచరణలో అమలైనప్పుడే ముస్లిం మహిళలకు న్యాయం జరుగుతుంది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాలంటూ శాయరాబానో, ఇశ్రత్ జహాన్, ఆఫ్రీన్ రెహమాన్, గుల్షన్ పర్వీన్, అతియా సబ్రీ కోర్టును ఆశ్రయించటం గొప్ప వి షయం. తమపై ఉన్న వత్తిళ్లను భరిస్తూ కోర్టును ఆశ్రయించేందుకు వీరు ప్రదర్శించిన ధైర్యసాహసాలను కొనియాడక తప్పదు. ముస్లిం మహిళల జీవితాలను అత్యంత దుర్భరంగా మార్చిన ట్రిపుల్ తలాక్ అంశంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ముందే స్పందించి తగు చర్యలు తీసుకుని ఉంటే ఈ అంశం కోర్టు వరకు వెళ్లేది కాదు. కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో ముస్లిం పర్సనల్ లాబోర్డు తప్పించుకునే పద్ధతిలో వ్యవహరించింది. ట్రిపుల్ తలాక్ మూలంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న అమానుష కష్టాలను తొలగించేందుకు ‘పర్సనల్ లా బోర్డు’ ప్రయత్నించి ఉండాల్సింది. అలా జరగలేదు కాబట్టే ఇశ్రత్ జహాన్ తదితర ముస్లిం మహిళలు కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన తరువాత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, ఇతర ముస్లిం మతపెద్దలు ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తం చేయటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.
కోర్టుకు వెళ్లిన మహిళలపై వత్తిడి తీసుకురావటం, సామాజిక బహిష్కరణకు గురి చేయటం అమానుషం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టి సారించి, కోర్టు తీర్పు సమర్థవంతంగా అమలు జరిగేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ముస్లిం పర్సనల్ లా బోర్డు, ముస్లిం మతపెద్దలు కూడా ముందుకు వచ్చి ట్రిపుల్ తలాక్‌పై తీర్పును అమలు చేసేందుకు కృషి చేయాలి. ట్రిపుల్ తలాక్‌ను ఇస్లాం మతానికి చెందిన వారందరూ సమర్థించారని చెప్పలేము. చాలా మంది దీనిని వ్యతిరేకించినా వివిధ కారణాల మూలంగా ఎదిరించలేకపోయారు. ఇప్పుడు వీరంతా ఏకం కావాలి. కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చినట్లు తాము కోరుకున్నది సుప్రీం కోర్టు చేసింది కాబట్టి తీర్పు అమలు జరిపి మహిళలకు ఇక మీదట అన్యాయం కలుగకుండా చూసుకోవాలి. మహిళలపై పరిమితి లేని ఆధిపత్యానికి అలవాటు పడిన మగవారిని అదుపు చేసేందుకు ఇదే సరైన సమయం అని ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా గ్రహించటం మంచిది. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయటం ద్వారా తమ మత వ్యవహారాల్లో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుందంటూ కొందరు ముస్లిం పెద్దలు చేస్తున్న ఆరోపణ సమర్థనీయం కాదు. ట్రిపుల్ తలాక్‌కు మంగళం పాడిన నేపథ్యంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’కి కూడా స్వాగతం చెప్పవలసిన బాధ్యత ముస్లిం మతపెద్దలపై ఉన్నది. దేశంలోని ముస్లింలు అన్ని రకాల ప్రయోజనాలను పొందగలుగుతున్నారు. ముస్లింలు మన దేశంలో ఉన్నంత భద్రంగా మరే ఇతర దేశంలో లేరనేది పచ్చి నిజం. ఈ వాస్తవాన్ని ముస్లిం మత పెద్దలు సైతం అంగీకరిస్తున్నారు. చివరకు పాకిస్తాన్, సౌదీ అరేబియాలో కూడా ముస్లింలు ఇక్కడ ఉన్నంత భద్రంగా లేరు. ట్రిపుల్ తలాక్ రద్దును సమర్థంగా అమలు చేయడంతో పాటు ఉమ్మడి పౌరస్మృతి పరిధిలోకి రావటం ద్వారా ఈ భద్రతను పెంచుకోవటం మంచిది. ట్రిపుల్ తలాక్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పును ఖాతరు చేయకూడదంటూ పశ్చిమ బెంగాల్ మంత్రి సాధిఖుల్లా చౌదరీ ఇచ్చిన పిలుపును ఎంత మాత్రం పట్టించుకోకుండా సంస్కరణల వైపు దృష్టి సారించటం మంచిది.
ఇక, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అనేది సుప్రీం కోర్టు ఇచ్చిన రెండో చారిత్రాత్మక తీర్పు. వ్యక్తిగత గోప్యతను గుర్తించటం అంటే వ్యక్తి యొక్క స్వయం ప్రతిపత్తిని గుర్తించినట్లే. వ్యక్తి తన ఇష్టానుసారం జీవించేందుకు వీలు కల్పించటంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం ఈ అంశాల్లో జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేయటం. అసంతృప్తిని వ్యక్తం చేసే హక్కును పరిరక్షించటంతోపాటు సహనాన్ని పాటించవలసిన అవసరాన్ని కూడా ఈ తీర్పు నొక్కి చెప్పటం గమనార్హం. అయితే, వ్యక్తిగత గోప్యతను అమలు చేయటం అత్యంత క్లిష్టమైన విషయం. వ్యక్తిగత గోప్యతకు, ప్రభుత్వ విధుల నిర్వహణకు మధ్య ఘర్షణ జరిగితే దుష్పలితాలు ఎదురవుతాయనేది పచ్చి నిజం. వ్యక్తిగత గోప్యతకు ప్రభుత్వ వ్యవస్థ, సమాజం సమష్టి ప్రయోజనాల మధ్య సమన్వయం సాధించాలి. దేశం, సమాజం సమష్టి ప్రయోజనాల పరిరక్షణ కోసం వ్యక్తిగత గోప్యతతో రాజీపడవలసి వస్తుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశం, సమాజం సమష్టి ప్రయోజనాల పేరుతో వ్యక్తిగత గోప్యతను దెబ్బతీసేందుకు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదు. వ్యక్తిగత గోప్యత, సమాజం సమష్టి ప్రయోజనాల మధ్య సమన్వయం సాధించటం ద్వారా రెండు వ్యవస్థలు పరిఢవిల్లేందుకు చిత్తశుద్దితో కృషి జరగాలి.
వ్యక్తిగత గోప్యతపై సుప్రీం తీర్పు నేపథ్యంలో పలు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ‘ఆధార్’ అమలును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు కావచ్చు. అదే విధంగా ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషుల మధ్య ఇష్టపూర్వకంగా లైంగిక సంబంధాలను నేరంగా పరిగణించే భారత శిక్షాస్మృతి (ఐపిసి)లోని 377 సెక్షన్‌ను సవాల్ చేసే పిటిషన్లు దాఖలు కావచ్చు. ‘ఆధార్’ను తప్పనిసరి చేయటంతో వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం ముంచుకు వస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. అన్నింటికీ ‘ఆధార్’ను అమలు చేయకూడదన్నది వారి వాదన. కొందరు వ్యక్తులు, కొన్ని ఎన్.జి.ఓలు ప్రభుత్వ తనిఖీ నుండి తప్పించుకునేందుకే ‘ఆధార్’ను వ్యక్తిరేకించడం చూ స్తున్నాం. కొందరు తమ సమాజవ్యతిరేక కార్యకలాపాలు వెలుగులోకి రాకుండా చూసుకునేందుకే ఆధార్‌ను వ్యతిరేకిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆధార్ వ్యవస్థను దెబ్బ తీసేందుకు కొన్ని ఎన్.జి.ఓలు పని కట్టుకుని కోర్టులకు వెళుతున్నాయి. అయితే, ఆధార్‌ను వ్యక్తిగత గోప్యతతో ముడిపెట్టటం సమర్థనీయం కాదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వేలాది సంక్షేమ పథకాలు అవినీతి మూలంగా నీరుకారిపోకుండా ఉండాలంటే ఆధార్ ఎంతో అవసరం. ఆధార్ మూలంగానే వివిధ పథకాల ప్రయోజనం నిజమైన లబ్దిదారులకు చేరుతోంది. నకిలీ లబ్దిదారులను గుర్తించి సమర్థంగా అడ్డుకోవటం ఆధార్ మూలంగానే సాధ్యమవుతోంది. ఆధార్ మూలంగా మొత్తం వ్యవస్థ సులభతరం కావటంతోపాటు గుర్తింపు పత్రాలకు సంబంధించిన సమస్యలు దాదాపుగా తొలగిపోతున్నాయి. దేశంలోని ప్రతి పౌరుడికి ఏదోఒక గుర్తింపు పత్రం ఉండటం అనేది అత్యంత అవసరం. ఆధార్ మూలంగా సగటు మనిషి వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరటం, ప్రభుత్వం ఈ సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉన్నదనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఆధార్ మూలంగానే పౌరుల వ్యక్తిగత సమాచారం బైటికి వెళుతోందా? చైనా తదితర దేశాల నుండి వస్తున్న స్మార్ట్ఫోన్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు, గూగుల్ తదితర వ్యవస్థల ద్వారా పౌరుల వ్యక్తిగత సమాచారం ఎప్పటి నుండో బైటికి వెళుతోంది. వ్యక్తిగత గోప్యతను కాపాడుకుంటూనే సమాజ ప్రయోజనాలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలి.
*

కె కైలాష్