ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కొండను తవ్వి.. ఎలుకను పట్టి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తాజాగా కేంద్ర మంత్రిమండలి విస్తరణ ద్వారా కొం డను తవ్వి ఎలుకను పట్టినట్టు వ్యవహరించారు. మంత్రివర్గాన్ని విస్తృత స్థాయిలో పునర్ వ్యవస్థీకరించాలనుకున్న మోదీ చివరకు విస్తరణతో సరిపెట్టుకున్నారు. ఈ విస్తరణ ద్వారా ఆయన ఏం సాధించాలనుకున్నారనేది రాజకీయ విశే్లషకులకు సైతం అర్థం కావటం లేదు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సమాయత్తం అయ్యేందుకు మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలని ఈ విస్తరణ చేశారా? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక తదితర శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ చేపట్టారా? దేశ ప్రజలకు అత్యంత సమర్థవంతమైన పాలనను అందజేసేందుకు విస్తరణ జరిపారా? ఇవన్నీ సమాధానాలు లేని ప్రశ్నలే! విస్తరణ ద్వారా నిజానికి మోదీ ఏం సాధించారనేది చెప్పటం చాలా కష్టం. సమర్థవంతంగా పని చేసే వారికి ప్రమోషన్ ఇచ్చి, సరిగా పనిచేయని వారిని ఇంటికి పంపించేందుకు చేసిన ప్రయత్నం కూడా పూర్తిగా విజయవంతం అయిన సూచనలు కనిపించటం లేదు.
నలుగురు సహాయ మంత్రులకు పదోన్నతి ఇచ్చారు. పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, నిర్మలా సీతారామన్ నిజంగానే తమ తమ శాఖల్లో ఇన్నాళ్లూ ప్రశంసనీయంగానే పనిచేశారు. అయితే, ఈ నలుగురిలో మొదటి ముగ్గురూ ప్రజా నాయకులు. వారి వలన పార్టీకి రాజకీయంగా ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఇక, నిర్మలా సీతారామన్ దక్షత ఉన్న పరిపాలకురాలే. అయితే ఆమె వలన తమిళనాడులో భాజపాకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. రక్షణ శాఖను కేటాయించటం ద్వారా ఆమె స్థాయిని ప్రధాని మోదీ ఎంతో పెంచేశారు. నిర్మలా సీతారామన్‌కు లభించిన ఈ ప్రాధాన్యత పార్టీలోని సీనియర్ నాయకులకు సైతం అర్థం కావటం లేదు. ఏం చేసిందని ఆమెకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న వారి ప్రశ్నకు సమాధానం చెప్పటం కష్టం. పార్టీ కోసం పని చేసే వారిని పక్కన పెట్టి, ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం నేతల్లో వ్యక్తమవుతోంది. తొమ్మిది మంది కొత్త వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించటం అర్థం పర్థం లేని పనిగా కొందరికి కనిపిస్తోంది. తొమ్మిది మందిలో నలుగురు సివిల్ సర్వీస్‌కు చెందిన మాజీ అధికారులు. వీరిలో ఇద్దరికి పార్లమెంటు సభ్యత్వం లేదు. కాబట్టి వీరిని ఏదోఒక రాష్ట్రం నుండి రాజ్యసభకు తీసుకురావలసి ఉన్నది. నలుగురు సివిల్ సర్వీస్ మాజీ అధికారులను క్యాబినెట్‌లో చేర్చుకోవటం ద్వారా నరేంద్ర మోదీ ఏం సాధించాలనుకున్నారో అనుమానంగానే ఉంది.
సమర్థవంతమైన పరిపాలనను అందజేసేందుకే సివిల్ సర్వీస్ మాజీ అధికారులను మంత్రివర్గంలో చేర్చుకున్నారని వాదిస్తే పప్పులో కాలు వేసినట్లే. వీరు అంతటి సమర్థులైతే పదవిలో కొనసాగినప్పుడు ఎంత మంచి ఫలితాలు సాధించరనేది పరిశీలిస్తే వీరి సామర్థ్యం ఏమిటనేది వెలుగులోకి వస్తుంది. దౌత్యవేత్తగా పని చేసిన హర్దీప్‌సింగ్ పురిని విదేశీ వ్యవహారాల శాఖలో నియమిస్తే బాగుండేది. సివిల్ సర్వీస్ అధికారులను మంత్రివర్గంలో చేర్చుకోవటం అంటే బి.జె.పిలో సమర్థులైన నాయకులు లేరనే అర్థం వస్తోంది. దీనివలన పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటోందనే వాస్తవాన్ని అధినాయకత్వం గ్రహించటం మంచిది. మాజీ బ్యూరోక్రాట్లు మంత్రులుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. రాజకీయ నాయకులకు తెలిసినంతగా ప్రజల నాడి వీరికి తెలియదు. ఎన్నికల్లో రాజకీయ నాయకులే ప్రజల వద్దకు వెళ్లగలుగుతారు తప్ప వీరు కాదు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారుల ద్వారా ప్రభుత్వాన్ని నడిపించారు. ఆయనిప్పుడు ప్రధాన మంత్రిగా ‘గుజరాత్ మోడల్’ను కేంద్రంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్‌లో పనిచేసిన విధానం కేంద్రంలో పని చేస్తుందని, సత్ఫలితాలను ఇస్తుందని ఆశించటం తప్పు అవుతుంది. మంత్రివర్గంలో సివిల్ సర్వీస్ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వటం వలన 340 మంది భాజపా ఎంపీలలో సమర్థులు లేరనే తప్పుడు సందేశం ప్రజలు వెళుతోంది.
మంత్రివర్గ విస్తరణలో కులాలు, ప్రాంతాల వారీగా సమీకరణలు ఆశించిన స్థాయిలో జరగలేదనే అభిప్రాయం కలుగుతోంది. దేశంలోని అన్ని కులాలు, ప్రాంతాలకు కేంద్ర మంత్రివర్గంలో సరైన ప్రాధాన్యత ఇచ్చిన సూచనలు కనిపించటం లేదు. తొమ్మిది మంది కొత్త వారిలో ఒక సిక్కు, ఒక క్రైస్తవుడు ఉన్నారు. మిగతా వారంతా ఉన్నత వర్గాలకు చెందిన వారే. కులాలు,ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం లభించకపోతే తప్పుడు సంకేతాలు వెళతాయనేది బి.జె.పి అధినాయకత్వానికి తెలియదా? సీనియర్ మంత్రి ఉమాభారతిని జలవనరుల శాఖ నుండి తప్పించి తాగునీరు, పారిశుద్ద్యం శాఖ కేటాయించటం ద్వారా అవమానించారని చెప్పకతప్పదు. మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు నిరాకరించినందుకే ఆమెకు ఈ అవమానం జరిగిందనే మాట వినిపిస్తోంది. మోదీకి అత్యంత ఇష్టమైన ‘గంగానదిని పరిశుభ్రపరిచే బాధ్యతల’ను సమర్థవంతంగా నిర్వహించలేదన్న సాకుతో ఆమెను మంత్రివర్గం నుండి తొలగించాలనుకున్నారు. అయితే- ఆమె ఎదురు తిరిగి ‘నేనెందుకు రాజీనామా చేయాలి? ఏం తప్పుచేశానని రాజీనామా చేయాలం’టూ ఆగ్రహం ప్రకటించటంతో కంగుతిన్న బి.జె.పి అధినాయకత్వం ఆమెను అవమానించే స్థాయికి పడిపోయింది. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం సీనియర్ నాయకులను అవమానిస్తున్నందుకే బి.జె.పి మార్గదర్శక మండలి సభ్యులు లాల్‌కృష్ణ అద్వానీ, మురళీమనోహర్ జోషి లాంటి సీనియర్ నాయకులు ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణకు హాజరు కాకపోవటం గమనార్హం.
ఇక తెలంగాణ నుండి ఎన్నికైన ఏకైక బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయను సమర్థంగా పనిచేయటం లేదనే ఆరోపణతో మంత్రివర్గం నుండి తొలగించటం ఏ విధంగా సమర్థనీయం? దత్తాత్రేయ తొలగింపుతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేకుండాపోయింది. ఆంధ్రప్రదేశ్ భాజపా శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నారని మొదట వార్తలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీకి చేరుకున్న తరువాత అంతా తలకిందులైంది. 2019లో జరిగే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ జెండా ఎగుర వేయాలనుకుంటున్న బి.జె.పి ఇలా వ్యవహరిస్తే ఆశించిన రాజకీయ ఫలితాలను ఎలా సాధిస్తుంది? నిర్మలా సీతారామన్‌ను క్యాబినెట్ మంత్రిగా నియమించినంత మాత్రాన తమిళనాడు, అల్ఫోన్స్‌ను సహాయ మంత్రిగా ఎంపిక చేయటం వలన కేరళలో బి.జె.పి పుంజుకుంటుందా? ఈ ఇద్దరు మంత్రులను వారి వారి రాష్ట్రాల్లో ఎవరైనా గుర్తిస్తారా?
మంత్రివర్గ విస్తరణ విషయంలో మిత్ర పక్షాలతో భాజపా వ్యవహరించిన విధా నం కూడా సమర్థనీయం కాదు. చిరకాల మిత్రపక్షమైన శివసేన నాయకులతో క్యాబినెట్ విస్తరణ గురించి మాట వరుసకు కూడా చర్చించకపోవటం ఏ విధంగా సమర్థనీయం? చర్చిస్తే గొంతెమ్మ కోరికలు ముందుకు వస్తాయనేది అందరికీ తెలిసిందే. చర్చించినంత మాత్రాన పదవులు ఇవ్వాలని లేదు కాబట్టి బి.జె.పి అధినాయకత్వం శివసేనతో మాట్లాడి ఉండవలసింది. శివసేనను విస్తరణ కార్యక్రమానికి కూడా ఆహ్వానించకపోవటం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? ఎన్.డి.ఏలో కొత్తగా చేరిన జెడియును మంత్రివర్గంలో చేర్చుకుని రెండు పదవులు ఇస్తారనే వార్తలు వచ్చాయి. జెడియును మంత్రివర్గంలో చేర్చుకోవాలా? వద్దా? అనేది నిర్ణయించుకునే అధికారం నరేంద్ర మోదీకి ఉంది. అయితే విస్తరణ గురించి మాటమాత్రంగా కూడా జెడియు నాయకులతో చర్చించకపోవటం ఏమిటి? బి.జె.పి అధినాయకత్వం వ్యవహరించిన తీరు మూలంగా జెడియు అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ పరిస్థితి ఇరకాటంలో పడింది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటికి నితీష్‌కుమార్ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అవుతుందంటూ ఆర్.జె.డి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చేబుతున్న మాట చివరకు నిజమైనా ఆశ్చర్యపోకూడదు. నరేంద్ర మోదీ, అమిత్ షాలు ప్రతిపక్షంతోపాటు మిత్ర పక్షాలనేవి లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఆరోగ్యకరమైన రాజకీయం కాదు. మంత్రిమండలి విస్తరణ పట్ల ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలో కూడా సంతృప్తి లేదు. ప్రతిపక్షంలోని నిరసనలను పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ స్వపక్షం అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే ఈరోజు కాకపోతే భవిష్యత్తులోనైనా దీని ప్రభావం కనిపిస్తుంది. ‘దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకునే’ విధంగా అధికారం ఉన్నప్పుడే చెలాయించాలని నరేంద్ర మోదీ భావిస్తే ఎవరు ఏమీ చేయలేరు. తాజా మంత్రివర్గ విస్తరణ మోదీ ఆలోచనలకు అద్దం పడుతోంది తప్ప బి.జె.పి విలువలు, సిద్ధాంతాలకు మాత్రం ప్రతీకగా నిలవటం లేదు. *

కె కైలాష్