ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అసమర్థులు ఇంటికే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ఆలోచనా విధానానికి అనుగుణంగా నడుచుకోకపోతే సన్నిహిత మంత్రులకు సైతం నూకలు చెల్లుతాయనేది ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గం విస్తరణతో స్పష్టం చేశారు. బి.జె.పి విధానాలతోపాటు తన విధానాల లక్ష్య సాధనకు పని చేయకపోతే సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రి పదవులు ఊడుతాయి, శాఖలు మారిపోతాయనేది మోదీ చెప్పకనే చెప్పారు. అయిన దానికి, కాని దానికి నోరు పారేసుకున్నా పదవిలో ఉండటం కష్టమని చెప్పేందుకు మోదీ ఎంత మాత్రం వెనకాడలేదు.
మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత జరిపిన రెండవ మంత్రివర్గం విస్తరణలో ఐదుగురు సహాయ మంత్రులను తొలగించి దాదాపు రెండు డజన్ల మంది మంత్రుల శాఖలను మార్చివేశారు. తన విధానాలకు అనుగుణంగా నడుచుకోని క్యాబినెట్ మంత్రుల శాఖలు సైతం ఆయన మార్చివేశారు. మానవ వనరుల శాఖ మంత్రిగా ఒక వెలుగు వెలిగిన స్మృతి ఇరానీని జౌళి శాఖకు పంపించటం ద్వారా మోదీ బాధ్యతారహిత వ్యవహారం, మాటలను సహించేది లేదనేది సుస్పష్టం చేశారు. స్మృతి ఇరానీ అత్యంత సమర్థురాలనటంలో ఎవ్వరికి ఎలాంటి సం దేహం ఉండనక్కర లేదు. ఆమె మంచి మాట కారి కూడా. అవసరమైతే పరుషపదజాలాన్ని కత్తిలా ఉపయోగించుకోవటం స్మృతి ఇరానీకి వెన్నతోపెట్టిన విద్య. అయితే ఆమె ఈ విద్యను సహేతుకంగా ఉపయోగించుకోలేదు.
హైదరాబాదు విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్య వ్యవహారం, పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్ నియామకం నేపథ్యంలో విద్యార్థులు చేసిన ఉద్యమం విషయంలో స్మృతి ఇరానీ వ్యవహరించిన తీరు మోదీకి ఎంత మాత్రం నచ్చలేదు. స్మృతి ఇరానీ తన విద్యార్హతల విషయంలో కూడా అతిగా వ్యవహరించిందనే అభిప్రాయం బి.జె.పి అధినాయకత్వానికి ఉన్నది. ఆమె విద్యార్హతలపై కోర్టులో ప్రతికూల తీర్పు వస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుంది. సదానంద గౌడను న్యాయశాఖ నుండి గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖకు మార్చేందుకు అసమర్థతే కారణం. మొదట ఆయనకు రైల్వే శాఖను కేటాయించటం తెలిసిందే. ఆశించిన స్థాయిలో పని చేయటం లేదనే అతన్ని రైల్వే నుండి న్యాయ శాఖకు మార్చారు. ఇక్కడ కూడా ఆయన మోదీ లక్ష్యాలను సాధించలేకపోయారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలను అమలు చేయటంలో సదానందగౌడ ఘోరంగా విఫలమయ్యారు. న్యాయమూర్తుల ఎంపికపై కేంద్రానికి, న్యాయ వ్యవస్థకు మధ్య కొనసాగుతున్న వివాదాన్ని ఇరుపక్షాలకు ఆమోదయోగ్య పద్ధతిలో పరిష్కరించలేకపోయారు. కొలీజియం స్థానంలో జాతీయ న్యాయాధికారుల నియామక కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం కోర్టు దెబ్బ తీసింది. దీని మూలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకు మధ్య తలెత్తిన వివాదం మూలంగా న్యాయమూర్తుల ఖాళీలు పెరిగిపోవటంతోపాటు కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం వివిధ కోర్టులో దాదాపు నాలుగు వందల న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉంటే దాదాపు నలభై లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సదానంద గౌడ సమర్థంగా పని చేసి ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కాదు.
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ నుండి సమాచార శాఖ ను తొలగించడానికి కూడా అసమర్థతే కారణం. కేంద్ర ప్రభుత్వానికి సమచార శాఖ అత్యంత ముఖ్యమైంది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకుపోవటంలో కేంద్ర సమాచార శాఖ అత్యంత కీలక బాధ్యతను నిర్వహిస్తుంది. సమాచార శాఖను సమర్థంగా ఉపయోగించుకోవటం ద్వారా ప్రజల దృష్టిలో ప్రభుత్వ ప్రతిష్ఠను పెంచవచ్చు. ప్రభుత్వ కార్యకలాపాలు, పథకాలను ప్రజలకు వివరించవచ్చు. అయితే జైట్లీ ఈ లక్ష్యాలను సాధించటంలో విఫలమయ్యారు. అందుకే సమాచార శాఖ బాధ్యతలను సీనియర్ మంత్రి ఎం.వెంకయ్యనాయుడుకు అప్పగించారు. వెంకయ్యనాయుడును పార్లమెంటరీ వ్యవహారాల నుండి సమాచార శాఖకు బదిలీ చేయటం నరేంద్ర మోదీ తీసుకున్న అత్యంత తెలివైన పనుల్లో ఒకటని చెప్పకతప్పదు. అత్యంత సమర్థుడైన వెంకయ్యనాయుడు పార్లమెంటరీ వ్యవహారాల కంటే సమాచార శాఖలో అత్యధికంగా రాణిస్తారనేది మోదీ ముందే గ్రహించి ఉండాల్సింది.
వెంకయ్యనాయుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉంటూ ఉభయ సభల్లో ప్రతిపక్షంతో యుద్ధానికి దిగేవారు. ప్రభుత్వంపై ప్రతిపక్షం నుండి చిన్న విమర్శ వచ్చినా వెంకయ్యనాయుడు వెంటనే స్పందించి ఎదురుదెబ్బ తీసేవారు. ఉభయ సభల్లో ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్నప్పుడు రాజీ కుదర్చడంలో కీలక పాత్ర నిర్వహించే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఇలా ఉభయ సభల్లో చీటికిమాటికి లేచి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించకూడదు. అయితే వెంకయ్యనాయుడు ప్రభుత్వం, పార్టీపై విమర్శ వస్తే వౌనం వహించలేకపోయేవారు. ఈ విధానామే ఆయన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు దూరం చేసింది. సమాచార శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఇక మీదట పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షంపై విరుచుకుపడేందుకు మార్గం సుగమం అయ్యిందని చెప్పకతప్పదు.
ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గం విస్తరణ తరువాత కూడ మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయం జరగలేదు. ప్రధాన మంత్రిని కలుపుకుని మొత్తం మంత్రుల సంఖ్య 78. ఇందులో ఓ.బి.సిలు 13, షెడ్యూల్డు కులాల వారు 8, షెడ్యూల్డు తెగల వారు ఐదుగురు మంత్రులుంటే ఉన్నత వర్గాలకు చెందిన వారు 47 మంది మంత్రులున్నారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది ఉన్న ఓ.బి.సిలకు మంత్రి వర్గంలో సముచిత ప్రాధాన్యత లభించలేదు. శాఖల కేటాయింపులో కూడా ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. నరేంద్ర మోదీ ఈ లోపాలను సవరించి ఉండాల్సింది.