ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

దాదాగిరీని చైనా మానుకుంటుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. సిక్కిం సెక్టార్‌లో 72 రోజుల పాటు కొనసాగిన డోక్లామ్ ఉద్రిక్తతతకు యుద్ధ ప్రాతిపదికపై తెర దించటంతోపాటు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషె మహమ్మద్, లష్కరే తయ్యబాలను బ్రిక్స్ తీర్మానంలో ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించింది. అంతటితో ఆగకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలను బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఆమోదించిన తీర్మానంలో తీవ్రంగా దుయ్యబట్టటం ద్వారా తన మిత్రదేశమైన పాకిస్తాన్‌ను తప్పుపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ప్రతి విషయంలో పాకిస్తాన్‌ను వెనకేసుకు వచ్చిన చైనా వైఖరి అకస్మాత్తుగా ఎందుకు మారిందనేది అర్థం చేసుకోవలసి అవసరం చాలా ఉన్నది. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను తప్పుపట్టటంతో ఆగకుండా చైనా మరో అడుగు ముందుకు వేసి పంచశీల ఒప్పందం మేరకు భారత - చైనాల మధ్య స్నేహం పెరగాలని ప్రతిపాదించటం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచింది. డోక్లామ్ నేపథ్యంలో రెండు దేశాలు ముందు చూపుతో ముందుకు వెళ్లాలి తప్ప గతాన్ని తవ్వుకోకూడదని చైనా అభిప్రాయపడుతోంది. చైనాలో పెను మార్పు ఎలా వచ్చిందనేది ప్రశ్న. భూటాన్‌కు చెందిన డోక్లామ్ ప్రాంతాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తువేసిన చైనా రోడ్డు నిర్మాణం ద్వారా తన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించింది. ఈ ప్రయత్నాన్ని భారతదేశం అత్యంత సమర్థంగా ఎదుర్కొనటంతో చైనా దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయిందని భావించవలసి ఉంటుంది. భారత దేశం ఈ స్థాయిలో తమను ఎదిరిస్తుందని చైనా అంచనా వేయలేకపోయింది. డోక్లామ్ మూలంగా అంతర్జాతీయ స్థాయిలో చైనా ఏకాకిగా మారే ప్రమాదం నెలకొన్నది. చైనాకు ఎదురొడ్డి నిలిచిన భారత్‌కు మద్దతు ఇచ్చేందుకు జపాన్, ఆస్ట్రేలియాతోపాటు మరికొన్ని ఆసియా దేశాలు ముందుకు వచ్చాయి. భారత దేశంతో యుద్ధానికి దిగితే వ్యాపారం, వాణిజ్యపరంగా భారీ నష్టం కలుగుతుందనే ఆలోచన కూడా చైనా నాయకులను పునరాలోచనలో పడవేసింది. వీటన్నింటికంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బ్రిక్స్ సమావేశం డోక్లామ్ ఉద్రిక్తత మూలంగా దెబ్బతినే ప్రమాదం నెలకొనటం చైనా నాయకులను ఆలోచనలో పడవేసిందని చెప్పకతప్పదు. డోక్లామ్ ఉద్రిక్తత యథాతథంగా కొనసాగితే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కావటం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ చైనా విదేశీ వ్యవహారాల శాఖకు స్పష్టం చేసింది. భారతదేశం అంతకు ముందు చైనా అట్టహాసంగా నిర్వహించిన ఒక బెల్ట్ ఒక రోడ్డు అంతర్జాతీయ సదస్సును నిర్మొహమాటంగా బహిష్కరించటం తెలిసిందే. దేశాన్ని పది సంవత్సరాల పాటు పాలించిన యు.పి.ఎ సంకీర్ణ ప్రభుత్వం అవలంబించిన మెతక వైఖరికి బదులుగా నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్.డి.ఏ సంకీర్ణ ప్రభుత్వం అత్యంత గట్టి వైఖరిని అవలంబించటం చైనా పాలకులను ఆలోచనలో పడవేసింది. డోక్లామ్ ఉద్రిక్తత కొనసాగిన 72 రోజుల నుండి దాదాపు 70 రోజులపాటు చైనా పత్రికలు, విదేశీ వ్యవహారాల శాఖ, చైనా సైన్యాధికారులు, ఇతరులు యుద్ధం తప్పదంటూ గంతులు వేశారు. భారత దేశానికి 1962 మాదిరి గుణ పాఠం నేర్పిస్తామంటూ రంకెలు వేశారు. 1962 యుద్ధం నుండి గుణ పాఠం నేర్చుకోలేదా? అంటూ మానసికంగా దెబ్బ తీసేందుకు అనునిత్యం ప్రయత్నించారు. టిబెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దఎత్తున సైన్యాన్ని మోహరించటంతో పాటు సైనిక విన్యాసాలకు దిగి యుద్ధానికి ఏర్పాట్లు చేస్తున్నామంటూ బెదిరించారు. మొదట అపరిమిత యుద్ధం గురించి మాట్లాడిన చైనా పాలకులు ఆ తరువాత పరిమిత యుద్ధం తప్పదన్నారు. వచ్చే వారం యుద్ధం తప్పదంటూ చైనా పత్రికలు బెదిరింపులకు దిగాయి. అయినా భారతదేశం తన సంయమనాన్ని కోల్పోకుండా దౌత్య ప్రయత్నాలకు కట్టుబడి ఉండటం ప్రపంచం దృష్టిలో చైనాకు చెడ్డ పేరు తెచ్చింది. బెదిరింపులు, భయపెట్టటం ద్వారా భారత దేశాన్ని మానసికంగా కుంగదీయాలనుకున్న చైనా పాలకుల పాచిక పారలేదు. దీనితో జియామెన్‌లోఏర్పాటు చేసిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని కాపాడుకునేందుకు చైనా తన వైఖరిని మార్చుకొనక తప్పలేదు. చైనా ఎంత అకస్మాత్తుగా డోక్లామ్ ఉద్రిక్తతను తెర మీదికి తెచ్చిందో అంతే అకస్మాత్తుగా దానికి తెర దించింది. భారత సైన్యం బేషరతుగా ఉపసంహరించుకోవలసిందేనని పట్టుపట్టిన చైనా గత ఆగస్టు 27 తేదీనాడు అకస్మాత్తుగా డోక్లామ్ ఉద్రిక్తతను పరిష్కరించేందుకు ముందుకు వచ్చింది. హాంకాంగ్‌లో ఉన్న చైనాలో భారత రాయబారి విజయ్ గోక్లేకు ఫోన్ చేసి ఎంత త్వరగా కలుసుకోగలుగుతారంటూ చైనా విదేశీ వ్యవహారాల శాఖ వాకబు చేయటంతో డోక్లామ్ గొడవకు తెర పడటం ప్రారంభమైంది. విజయ్ గోక్లే తెల్లవారుజామున రెండు గంటలకు బీజింగ్ చేరిన వెంటనే చైనా విదేశీ వ్యవహారాల అధికారులు చర్చలు ప్రారంభించారు. అర్థరాత్రి దాదాపు మూడు గంటల పాటు జరిగిన చర్చల్లో రెండు పక్షాల మధ్య ఒక అవగాహన కుదిరింది. రెండు దేశాల సైనికులను ఉపసంహరించుకోవటం ద్వారా డోక్లామ్ గొడవకు తెరదించేందుకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. భారత సైన్యం బేషరతుగా ఉపసంహరించుకుంటే తప్ప చర్చలు జరిగేందుకు వీలు లేదని ఖరాఖండీగా చెప్పిన చైనా అకస్మాత్తుగా చర్చల ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రధాన కారణం బ్రిక్స్ సమావేశం పరిరక్షణేనా? బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాన్ని కాపాడుకునేందుకే చైనా దిగి వచ్చిందా? లేక దీని వెనక మరేదైనా అంతుపట్టని వ్యూహం ఉన్నదా? అనేది తెలుసుకోవటం ఎంతో ముఖ్యం. హిందూ, చీనీ భాయ్ భాయ్ అంటూ పంచశీల ఒప్పందం కుదుర్చుకున్న చైనా ఆ తరువాత 1962లో మన దేశంపై ఏకపక్షంగా యుద్ధం చేసి ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని కబళించటం ఎలా మరిచిపోతాము. చైనా పాలకులు ఆక్సాయిచిన్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం గొడవపై 1962లో మనతో యుద్ధానికి దిగి నెల రోజుల తరువాత ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని కైవసం చేసుకున్న తరువాత యుద్ధాన్ని విరమించుకున్నారు. దేశం మొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు అనాలోచిత విధానాలు, అప్పటి రక్షణ శాఖ మంత్రి కృష్ణ మీనన్ తప్పుడు విధానాల మూలంగా చైనాతో ఓటమిని చవి చూడవలసి వచ్చింది. 1962 యద్ధంలో చైనా తన ఇష్టానుసారం వ్యవహరించింది. ఇప్పుడు కూడా చైనా పొరుగుదేశాలను పట్టించుకోకుండా డోక్లామ్‌లో రోడ్డు నిర్మాణం చేపట్టి గొడవకు దిగింది. భూటాన్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు చైనా చేసిన ప్రయత్నం ఈసారి ఫలించలేదు. 72 రోజుల పాటు కొనసాగిన డోక్లామ్ ఉద్రిక్తతలో భారతదేశం చైనాకు ధీటుగా నిలబడటంతోపాటు పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధపడటం సిద్ధమైంది. చైనా నిజంగానే యుద్ధానికి దిగితే ఏం జరిగేది, ఏ మేరకు ఎదుర్కొనగలిగే వారము, ఫలితాలు ఎలా ఉండేవనేది అటుంచితే గట్టిగా వ్యవహరించటం ద్వారా చైనాను దారికి తీసుకురాగలిగాము. ఒక రకంగా చెప్పాలంటే డోక్లామ్ ఉద్రిక్తతలో భారతదేశం విజయం సాధించిందని చెప్పక తప్పదు. 1962 యుద్ధంలో జరిగిన అవమానానికి డోక్లామ్‌లో కొంతైనా ప్రతీకారం తీర్చుకోగలిగాము. 1962 అక్టోబర్ 20 నుండి నవంబర్ 21 తేదీ వరకు నెల రోజుల పాటు ఇండోచైనా యుద్ధం జరిగినప్పుడు అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా దేశాలు అప్పట్లో క్యూబా మిస్సైల్స్ గొడవలో మునిగి ఉన్నాయి. అందుకే ఆ రెండు దేశాలు భారత దేశానికి సహాయం చేయలేకపోయాయి. ఇప్పుడు డోక్లామ్ గొడవలో జపాన్, ఆస్ట్రేలియా దేశాలు భారత్‌కు అండగా నిలబడగా పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధానికి దిగకూడదని అమెరికా, రష్యాలు పరోక్షంగా చైనాను హెచ్చరించటం గమనార్హం. చైనా అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్య, రాజకీయ వత్తిళ్లకులోనై డోక్లామ్ సమస్యను తానంత తానే పరిష్కరించుకుందా? లేక ముందు, ముందు భారత్‌కు తెలివిగా బుద్ధి చెప్పేందుకు ఇప్పుడు వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనకకు వేసిందా? పాకిస్తాన్, చైనాలతో మనకు ఏదో ఒక రోజు యుద్ధం తప్పదంటూ సైన్యాధ్యక్షుడు బిపిన్ రావత్ డోక్లామ్ ఉద్రిక్తతకు తెర పడిన అనంతరం చేసిన హెచ్చరికను కొట్టివేయకూడదు. 1962 యుద్ధం తరువాత భారత, చైనా సైనికుల మధ్య ఒక్క తూటా కూడా పేలకపోయినా సరిహద్దుల్లో చైనా సైనికులు ఎప్పటికప్పుడు ఉద్రిక్తతలు సృష్టిస్తూనే ఉన్నారు. చైనా అంగుళం, అంగుళం ఆక్రమణ విధానం కొనసాగుతూనే ఉన్నది కాబట్టి చైనాతో అప్రమత్తంగా ఉండక తప్పదు.

కె కైలాష్