ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాహుల్ గాంధీ రాణిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకాలం అనధికార అధ్యక్షుడుగా కొనసాగిన రాహుల్ గాంధీ ఈనెలాఖరు నుండి అధికారికంగా అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవిలో రాణించగలుగుతారా? లేదా? అనే అంశం కాంగ్రెస్ లోపల, బైటా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ చరిత్రలో మొదటిసారి అధ్యక్ష పదవి చేపడుతున్న గాంధీ కుటుంబ సభ్యుడి నాయకత్వ పటిమపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా విఫలమైన వ్యక్తి అధ్యక్షుడిగా రాణించగలుగుతారా? లేక బి.జె.పి ప్రచారం చేస్తున్న విధంగా కాంగ్రెస్ విముక్త భారత దేశానికి నాంది పలుకుతారా? లేక కాంగ్రెస్‌కు పూర్వ వైభవాన్ని పునః ప్రతిష్ఠింపజేయగలుగుతారా? కేంద్ర ఎన్నికల సంఘం అల్టిమేటం మేరకు డిసెంబర్ నెల నాటికి పూర్తి చేయవలసిన కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యం మూలంగా పార్టీ బాధ్యతలు నిర్వహించటం కష్టం కావటంతో రాహుల్ గాంధీకి అధ్యక్ష పదవి బదిలీకి రంగం సిద్ధమైంది. దాదాపు ఐదు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు చాలాకాలం క్రితమే సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తాను సిద్ధమేనంటూ ఆయన ఇప్పటికి ఐదారు సార్లు ప్రకటించుకున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల సీనియర్ నాయకులతోపాటు సోనియాగాంధీకి కూడా విశ్వాసం కలగకపోవటంతో ఆయనను అధ్యక్షుడిగా నియమించటం ఆలస్యమవతూ వచ్చింది. ఆయన వ్యవహారాల శైలి పట్ల చాలామంది సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కూడా సీనియర్ నాయకులను ఇంటికి పంపించి యువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకోవటం కూడా ఆయన పదోన్నతికి అడ్డంకులు ఏర్పడటంతో పాటు ఒక దశలో వ్యతిరేకత, ఎదిరింపులు కూడా నెలకొన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అనేది నెహ్రు, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ కుటుంబం వ్యక్తిగత ఆస్తి కావటం మూలంగా ఆ కుటుంబానికి చెందిన వారు తప్ప మరొకరు పార్టీ పగ్గాలు చేపట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు వారసత్వ రాజకీయమే కారణం తప్ప మరొకటి కాదు. రాహుల్ గాంధీ సామర్థ్యం మూలంగా ఈ పదవికి ఎంపిక అవుతున్నారనే భ్రమలో ఎవ్వరూ లేరు. రాహుల్ గాంధీ గట్టిగా వ్యతిరేకించిన, అసహ్యించుకున్న వారసత్వ రాజకీయాల ఆధారంగానే ఆయన ఇప్పుడు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించబోతున్నారు. రాహుల్ గాంధీ మొదట్లో వారసత్వ రాజకీయాలను గట్టిగా వ్యతిరేకించినా కాల క్రమంలో ఆయన కూడా వారసత్వ రాజకీయాలకే ఓటు వేయకతప్పటం లేదు. వారసత్వ రాజకీయాల మూలంగా సామర్థ్యం ఉన్నా లేకున్నా నాయకత్వం ఎదురొచ్చి వరమాల వేసి ఎన్నుకుంటుంది. ఆ తరువాత పార్టీలో ఎదురనేది ఉండదు. నాయకుడు చెప్పిందే వేదం కాబట్టి ఆయన కనుసన్నల్లో పార్టీ ముందుకు సాగుతుంది. పేరుకే ప్రజాస్వామ్యమైనా జరిగేదంతా వారసత్వ రాజకీయాల ఆధారంగానే అనేది జగమెరిగిన సత్యం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టేందుకు మొదట వ్యతిరేకించిన సీనియర్ నాయకులు సైతం వారసత్వ రాజకీయాలకు తలవంచక తప్పలేదు. రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవంటూ సీనియర్లు చేసిన విమర్శలను సోనియా గాంధీ కొట్టి వేశారు. సీనియర్ నాయకులతో సయోధ్య కుదుర్చటం ద్వారా ఆమె రాహుల్ గాంధీ పట్ట్భాషేకానికి అనువైన పరిస్థితులను కల్పించారు.
వారసత్వ రాజకీయాల ఆధారంగా అధ్యక్ష పదవి చేపడుతున్న రాహుల్ గాంధీ ఏ మేరకు విజయం సాధిస్తారు? కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయగలుగుతారా? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలాంటి పటిష్టమైన నాయకుడికి ఎదురొడ్డి నిలచి కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురాగలుగుతారా? అనేది ప్రశ్న. రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల జాతీయ నాయకులకు పెద్దగా విశ్వాసం లేదు, జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర నిర్వహించలేకపోతున్నారు. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయటం ద్వారా ఇతర ప్రతిపక్ష పార్టీలను ఒక తాటిపైకి తీసుకురాలేకపోతున్నారు. ఆయన నాయకత్వం పట్ల విశ్వాసం కలుగనందుకే ఇతర పార్టీలు ఆయన నాయకత్వంలో బి.జె.పిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావటం లేదు. రాహుల్ గాంధీకి బదులు సోనియా గాంధీ ఉంటేనే మేలని పలువురు ప్రతిపక్షం నాయకులు బాహాటంగానే చెప్పారు. సోనియా గాంధీ అందరిని కలుపుకునే వైఖరిని అవలంబించారు. రాహుల్ గాంధీది ఒంటెద్దు పోకడన్నది వారి అభిప్రాయం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే తమ పంట పడినట్లేనని బి.జె.పి నాయకులు భావిస్తున్నారు. నరేంద్ర మోదీకి రాహుల్ గాంధీ ఏ మాత్రం సరితూగడు కాబట్టి 2019 లోకసభ ఎన్నికలు బి.జె.పికి ఏక పక్షం అవుతాయని ఆ పార్టీ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారు.
బి.జె.పి, ఇతర ప్రతిపక్షాలతోపాటు కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు కూడా రాహుల్ గాంధీ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రకటించలేకపోతున్నారు. రాహుల్ గాంధీ ఏమీ చేయలేడు, ఉపాధ్యక్ష పదవి చేపట్టి ఏడు సంతవ్సరాలు కావస్తున్నా ఇంత వరకు ఏమీ చేయలేకపోయాడన్నది వారి వాదన. బాధ్యతారహితమైన ప్రకటనలు చేయటం, అవకాశం లభిస్తే చెప్పాపెట్టక విదేశాలకు వెళ్లటం, పార్లమెంటులో అత్యంత కీలకమైన ప్రతిపక్ష సమావేశం జరుగుతున్నా హాజరు కాకపోటం తదితర సంఘటనలను వారు ఉదహరిస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం విషయంలో వీరు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో కొందరు ఏకీభవించని వారు కూడా ఉన్నారు. మణిశంకర్ అయ్యర్ లాంటి సీనియర్ నాయకుడైతే రాహుల్ గాంధీ నాయకత్వం గురించి అందరు భావిస్తున్నది పూర్తిగా తప్పు, అతను కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయటంతోపాటు అధికారంలోకి తీసుకురాగలుగుతాడని గంటాపథంగా చెబుతున్నారు. గాంధీ కుటుంబం వారెవ్వరు కూడా జన్మతహ నాయకులు కాదు, మొదట్లో ఎందుకు పనికిరానివారుగా కనిపించినా పదవి చేపట్టిన తరువాత వాటిని పట్టుకోవటం ఎవ్వరి తరం కాదని మణిశంకర్ అయ్యార్ వాదిస్తున్నారు. దేశం మొదటి ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రు విదేశాల్లో చదివి వచ్చిన అనంతరం దాదాపు ఏడు సంవత్సరాల పాటు ఇష్టానుసారం తిరిగి ఆ తరువాత కాంగ్రెస్‌లోకి వచ్చిన తరువాత తిరుగులేని నాయకుడయ్యారని ఆయన చెబుతున్నారు. నెహ్రు కుమార్తె ఇందిరాగాంధీని మాటలు రాని బొమ్మ అని ముద్ర వేసిన జనసంఘ్, బి.జె.పి నాయకులే ఆ తరువాత ఆమెను దుర్గామాత అంటూ ప్రశంసలు కురిపించటం విస్మరించరాదని మణిశంకర్ అయ్యార్ హెచ్చరిస్తున్నారు.
ఇందిరా గాంధీ మరణాంతరం మొదట పార్టీ పగ్గాలు, ఆ తరువాత ప్రధాన మంత్రి పదవి చేపట్టిన రాజీవ్ గాందీ కూడా మొదట్లో రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించకపోవటాన్ని ఎలా మరిచిపోతామన్నది ఆయన ప్రశ్న. రాహుల్ గాంధీ మాదిరిగానే ఇష్టం లేకున్నా గత్యంతరం లేని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చిన రాజీవ్ గాంధీ ఆ తరువాత ఎంతో సమర్థంగా పని చేశారని మణిశంకర్ అయ్యార్ వాదిస్తున్నారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన నేపథ్యంలో పి.వి. నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టేందుకు అంగీకరించి రాజకీయాలకు దూరంగా ఉండిపోయిన సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత కాంగ్రెస్‌కు పది సంవత్సరాల పాటు అధికారం కల్పించలేదా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా అయిష్టంగానే రాజకీయాల్లోకి వచ్చారు. వారసత్వ రాజకీయాలను గట్టిగా వ్యతిరేకించటంతోపాటు అవినీతి, అక్రమాలకు తావివ్వకూడదంటూ ఆర్.జె.పి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్‌తోపాటు అప్పటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను బాహాటంగా విమర్శించిన రాహుల్ గాంధీ అసలు సత్తా ఎవ్వరికీ తెలియదని మణిశంకర్ అయ్యార్ వాదిస్తున్నారు. నవ్విన నాపచేనే పండదా? అన్నట్లు రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తెస్తారని ఆయన కలలు కంటున్నారు. రాహుల్ గాంధీకి వాక్‌చాతుర్యం లేదు. ఆయన పలు సంధర్భాల్లో హాస్యాస్పదంగా మాట్లాడి ‘పప్పు’ అనే ముద్ర వేయించుకున్నారు. స్వంత ప్రధాన మంత్రిని బాహాటంగా అవమానించిన వ్యక్తి, వారసత్వాన్ని వ్యతిరేకించి ఆ తరువాత దాని ఆధారంగానే రాజకీయాలు నడుపుతున్న రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో రాజకీయంగా ఎదిగేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన 2019 లోకసభ ఎన్నికల్లో బి.జె.పి ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కొనవలసి ఉంటుంది. ఆయనకు ఇది పరీక్షాసమయం, జీవన్మరణ సమస్య. రాహుల్ గాంధీ ఏ మాత్రం వెనకబడి పోయినా కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షం అనేది నామరూపాలు లేకుండాపోతుంది. రాజకీయ వారసత్వంలో పదవి రావచ్చు కానీ తెలివి, సామర్థ్యం లభించవు. మణిశంకర్ అయ్యర్ ఆశిస్తున్నట్లు పండిత్ నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీల మాదిరిగా పదవిలోకి వచ్చిన తరువాత ప్రతిభను కనపరుస్తారా?

కె కైలాష్