ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

రాహుల్ వ్యూహం ఫలిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రతిష్ఠను నిలబెట్టకపోతే రాహుల్ గాంధీ నాయకత్వం ప్రశ్నార్థకం అవుతుంది. డిసెంబర్ 9, 14 తేదీల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే రాహుల్ గాంధీ కాంగ్రెస్‌తోపాటు జాతీయ స్థాయి నాయకుడిగా నిలిచిపోతారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురాలేకపోయినా యాభై కంటే ఎక్కువ సీట్లు సంపాదించగలిగితే రాహుల్ గాంధీకి పార్టీ నాయకుడుగా ఆమోదముద్ర పడుతుంది. ఇది జరగని పక్షంలో అతడితో పాటు కాంగ్రెస్ నిలదొక్కుకోవటం కష్టమైపోతుంది. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్షం ప్రతిష్ఠ నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ కృషి చేస్తున్నా అందులో సీరియస్‌నెస్ కనిపించటం లేదు. వాస్తవానికి రాహుల్ గాంధీ రాజకీయంగా ఎదుగుతున్నట్లు కనిపించటం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని అనునిత్యం విమర్శించటం, సూటిపోటి మాటలతో విమర్శలు గుప్పించటం వలన రాహుల్ గాంధీ జాతీయ స్థాయి నాయకుడుగా ఎదగలేడు. స్టార్డ్ అప్ ఇండియాను ఒప్పుకుంటాము కానీ షడ్ అప్ ఇండియా అంటే ఒప్పుకోము, ఇది జి.ఎస్.టి కాదు గబ్బర్ సింగ్ టాక్స్, సూటు-బూటు ప్రధాన మంత్రి అంటూ రాహుల్ గాంధీ చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలు ఆ క్షణానికి పేలవచ్చు, ప్రతిస్పందన తీసుకురావచ్చు. కానీ సత్తాగల జాతీయ నాయకుడుగా ఎదగడానికి అలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడవు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జయరాం రమేష్ లాంటి కొందరు తెరవెనక నుండి పనిచేసే మేధావులు రాసి ఇచ్చే ప్రసంగాలు, వ్యంగ్య వ్యాఖ్యలు చేయటం వలన రాహుల్ గాంధీ సీరియస్ నాయకుడు కాలేడు. రాహుల్ గాంధీ తన వ్యంగ్య వ్యాఖ్యలతో వ్యవస్థను పరిహాసం చేస్తున్నారు. దీనివలన రాహుల్ గాంధీకి రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. రాహుల్ గాంధీ చేసే వ్యంగ్య ట్వీట్లను ఇతరులు రీట్వీట్ చేయటం బాగానే ఉండవచ్చు. కానీ ఇవన్నీ ఆయన రాజకీయ స్థాయిని పెంచవు. నరేంద్ర మోదీని విమర్శించటమే పనిగా పెట్టుకోవటం వలన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఎలాంటి దుస్థితిలో పడిపోయాడనేది రాహుల్ గాంధీ మరిచిపోరాదు. అరవింద్ కేజ్రివాల్ నుండి రాహుల్ గాంధీ నేర్చుకోవలసినది ఎంతో ఉన్నది. నరేంద్ర మోదీని విమర్శించటం, అతనిపై ఆరోపణలు చేయటం తప్ప మరో పని చేయకపోవటం వలన అరవింద్ కేజ్రివాల్ రాజకీయంగా ఎంతో నష్టపోయారు. ఢిల్లీ ప్రజలు అతన్ని అసహ్యించుకునే పరిస్థితులు నెలకొన్న సమయంలో అరవింద్ కేజ్రివాల్ మేల్కొన్నారు.
కేజ్రివాల్‌కు జానోదయం కలిగినప్పటి నుండి నరేంద్ర మోదీని అనవసరంగా విమర్శించటం మానివేశారు. ఆయన మోదీని విమర్శించటం మానివేసి ముఖ్యమంత్రిగా ఢిల్లీ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించినప్పటి నుండి రాష్ట్ర ప్రజల్లో అతని పట్ల విశ్వాసం పెరిగింది. అందుకే ఈ సంవత్సరం ఆగస్టులో భవానా శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో బి.జె.పి, కాంగ్రెస్‌ను ఓడించి తన సీటును నిలబెట్టుకోగలిగింది. అంతకు ముందు జరిగిన రెండు ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బి.జె.పి ఒక్కొక్క సీటును గెలుచుకున్నాయి. అరవింద్ కేజ్రివాల్ 2015లో ఢిల్లీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి నరేంద్ర మోదీపై అవసరం ఉన్నా లేకున్నా వ్యంగ్య విమర్శలు గుప్పించే వారు. అయితే అయినదానికి కాని దానికి నరేంద్ర మోదీని విమర్శించటం మంచిది కాదనేది అర్థం చేసుకునేందుకు కేజ్రివాల్‌కు రెండు సంవత్సరాలు పట్టింది. పంజాబ్ ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా కేజ్రివాల్‌కు మంచి గుణపాఠం అయ్యాయి. అందుకే ఆయన భవానా విజయం తరువాత మోదీని అనవసరంగా విమర్శించటం మానివేశారు. ప్రభుత్వం నిజంగా తప్పు చేసినప్పుడు మాత్రమే ఆయన నోరు విప్పుతున్నారు. కేజ్రివాల్ అనుభవాల నుండి రాహుల్ గాంధీ నేర్చుకోవలసింది ఎంతో ఉన్నది. రాహుల్ గాంధీ అనునిత్యం నరేంద్ర మోదీపై దుమ్మెత్తిపోసే బదులు గుజరాత్ అభివృద్ధికి తాను అనుసరించాలనుకుంటున్న వ్యూహాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించటం మంచిది. రాష్ట్రంలో ఇరవై రెండు సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న బి.జె.పి ప్రభుత్వం చేసిన నిజమైన తప్పులు ప్రజల ముందు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందనేది గుజరాత్ ప్రజలకు వివరించటం మంచిది. మిగతా రాష్ట్రాల ప్రజలతో పోలిస్తే గుజరాతీలు ఆర్థిక విషయాల్లో ఎంతో దిట్టలు. వారు ఏం చేసినా ఆ వ్యవహారం డబ్బుతో ముడిపడి ఉంటుంది. నరేంద్ర మోదీతోపాటు రాష్ట్ర బి.జె.పి ప్రభుత్వంపై అనాలోచిత ఆరోపణలు చేసినంత మాత్రాన గుజరాతీలు ఓటు వేయరు. రాష్ట్ర ప్రజల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? అనే కార్యచరణ పథకాన్ని ప్రజల ముందు పెట్టాలి. గుజరాత్ ప్రజలు గత ఇరవై రెండు సంవత్సరాల నుండి బి.జె.పిని అనాలోచితంగా గెలిపిస్తున్నారని రాహుల్ గాంధీ భావించకూడదు. రాహుల్ గాంధీ మొదట గుజరాత్ ప్రజలు, వారి ఆలోచనా విధానం, వారు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోవటం మంచిది. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్లు అర్థంపర్థం లేని హామీలు ఇస్తే గుజరాతీలు ఆమోదించరనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి మూంలగా తమకు ఆర్థికంగా బాగా నష్టం కలిగిందనేది గుజరాతీల ఆగ్రహం. రాహుల్ గాంధీ ఈ ఆగ్రహాన్ని తొలగించే దిశగా తమ పార్టీ వ్యూహాన్ని ప్రజలకు వివరించగలగాలి. జి.ఎస్.టి మూలంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాలనుకుంటున్న చర్యలను వివరించాలి. అప్పుడే రాష్ట్ర ప్రజల ఓట్లు పడతాయి. బి.జె.పి ప్రభుత్వం గత ఇరవై రెండు సంవత్సరాల్లో రాష్ట్భ్రావృద్ధికి ఎంతో చేసింది. దీనికి అదనంగా కాంగ్రెస్ ఏం చేస్తుందనేది రాహుల్ గాంధీ చెప్పగలగాలి. ఇదేదీ చేయకుండా కుల రాజకీయం, మత రాజకీయం, ప్రాంతీయ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తే ఓటమి కాంగ్రెస్ తలుపుతట్టటం ఖాయ. పటేల్ వర్గం నాయకుడు హార్దిక్ పటేల్, బి.సి నాయకుడు అల్పేష్, ఎస్.టి వర్గం నాయకుడు జగ్నేష్ మెవానీలను కలుపుకోగలిగితే గెలుస్తామని భావించటం రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాన్ని ప్రదర్శిస్తుంది. ఆర్థికంగా ఎంతో అభివృద్ధిని సాధించిన పటేల్ వర్గాన్ని బి.సిల్లో చేర్చాలన్నది హార్దిక్ పటేల్ డిమాండ్. ఈ డిమాండ్‌ను రాహుల్ గాంధీ ఏ విధంగా చూసినా ఆమోదించకూడదు. సౌరాష్టల్రో మెజారిటీలో ఉన్న పటేల్ వర్గానికి బి.సి రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరిస్తే రాష్ట్రంలోని మిగతా వర్గాలు కాంగ్రెస్‌కు దూరం అవుతాయి. 1980లో మాధవ్‌సింగ్ సోలంకీ చేసిన ‘ఖామ్’ సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు చేస్తే ఆశించిన రాజకీయ ఫలితాలు రాకపోవచ్చు. మాధవ్ సింగ్ సోలంకి రాష్ట్రంలోని క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీ, ముస్లింలను ఒక వేదికపైకి తీసుకురావటం ద్వారా 182 నుండి 145 సీట్లు గెలిచి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చినా పటేల్ వర్గాన్ని శాశ్వతంగా దూరం చేసుకున్నారు. ఇప్పుడు పటేల్ వర్గానికి బి.సి రిజర్వేషన్లు కల్పిస్తే ఇతర వర్గాలను శాశ్వతంగా దూరం చేసుకోవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ పటేల్ వర్గం విషయంలో జాతీయ స్థాయిలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా ముస్లింల విషయంల కూడా ఇదే విధంగా వ్యవహరించటం మంచిది. రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు, కాంగ్రెస్ జాతీయ స్థాయి పార్టీ కాబట్టి ఆయన వ్యవహారం కూడా జాతీయ స్థాయికి అనుగుణంగా ఉండాలి. నరేంద్ర మోదీపై అనునిత్యం వ్యంగ్య విమర్శలు చేయటం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలనుకోవటం రాజకీయ మూర్ఖత్వం అవుతుంది. దీనికి బదులు తన ఆలోచనా విధానం, సిద్ధాంతాలు, పార్టీ విధానాలకు ప్రజలు ఆమోదం సంపాదించటం ద్వారా ఎన్నికల్లో సాధించే విజయమే నిజమైన విజయం. ఇలాంటి విజయాలే పార్టీని బలోపేతం చేస్తాయి, నాలుగు కాలాల పాటు పార్టీకి ఊతంగా నిలుస్తాయి. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవటం ఖాయమనేది అందరికి తెలిసిందే. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్‌పై పెద్దగా ప్రభావం పడదు. కానీ గుజరాత్‌లో అధికారంలోకి రాకున్నా ఆశించిన స్థాయిలో సీట్లు గెలుచుకోవటం రాహుల్ గాంధీకి ఎంతో అససరం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి 116 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ అరవై సీట్లు దక్కించుకోవటం తెలిసిందే. డిసెంబర్‌లో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి రాగలిగితే కాంగ్రెస్ పునరుజ్జీవనానికి నాంది పలకటంతోపాటు లోకసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచేందుకు పునాదులు పడతాయి. లేని పక్షంలో రాహుల్ గాంధీ రాజకీయ జీవితం ప్రశ్నార్థకం అవుతుంది.

కె కైలాష్