ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

హామీల మూటలు.. పసలేని మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకుల అబద్ధాలకు అంతులేకుండా పోతోంది. ఆచరణయోగ్యం కాని అర్థంపర్థం లేని హామీలు ఇవ్వడం, పథకాలు అమలు చేస్తామని చెప్పటం, ప్రత్యర్థులపై ఇష్టం వచ్చినట్లు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టి మాయ చేసి ఓట్లు దండుకునేందుకు ప్రయత్నించటం మామూలైపోయింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. గుజరాత్‌లో మధ్యనిషేధం అమలులో ఉన్నా తెరవెనుక మద్యం పంపిణీ జరిగిపోతోంది. నరేంద్రమోదీ, రాహుల్ గాంధీ ఓటర్లను ఆకర్షించేందుకు గుళ్లు, గోపురాలు, మసీదులను కూడా వదిలిపెట్టటం లేదు. ప్రజలతోపాటు దేవుళ్లకు కూడా దండాలు పెడుతూ ఓట్ల కోసం ఎక్కిన గడప మళ్లీ ఎక్కకుండా తిరుగుతున్నారు. ఒకరి విధానాలను మరొకరు తూర్పార పడుతూ తాము చేప్పేదే నిజమంటూ ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే చంద్రుడిని తెచ్చి చేతిలో పెడతామంటున్నారు తప్ప వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు పెట్టటం లేదు. మాయమాటలకు బదులు బాధ్యతతో వ్యవహరించాలని వారు భావించటం లేదు. ఇరవై రెండు సంవత్సరాల నుండి అధికారంలో ఉంటూ గుజరాత్‌ను స్వర్గంగా మార్చివేశామని చెప్పుకుంటున్న బి.జె.పి నాయకులు ఈసారి గెలుపు విషయంలో ఎలాంటి ఆందోళనకు గురి కాకూడదు. కానీ వారి వ్యవహారం అందుకు భిన్నంగా ఉన్నది. నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజలకు హామీలపై హామీలు ఇవ్వటంతోపాటు ప్రధాన మంత్రిగా తాను అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరిస్తున్నారు. గుజరాతీ ప్రధాన మంత్రిగా ఉన్నందుకు రాష్ట్రంలో మరోసారి బి.జె.పిని గెలిపించాలని మోదీ సూచిస్తున్నారు. రాహుల్ గాంధీ రెండు వైపుల నుండి నరుక్కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ ఘోరంగా విఫలమైందని, ఇదే విధంగా కేంద్రంలో కూడా ఆయన విఫలమవుతున్నారంటూ తిట్ల పురాణం విప్పుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనేది ఆయన చెప్పలేకపోతున్నారు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ వారికి తగిన స్థాయిలో ఎన్నికల ప్రచారం చేయకపోవటం దురదృష్టకరం.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ ప్రధానంగా బి.జె.పి, కాంగ్రెస్ పార్టీల మధ్యే. ఈ రెండు రాష్ట్రాల్లో బి.జె.పి, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. కొన్ని ఇతర పార్టీలు రంగంలో ఉన్నా అవి ఈ రెండింటిలో నుండి ఏదో ఒక పార్టీతో కలిసి పోటీ చేస్తున్నాయి. బి.జె.పి తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ తరపున ప్రధానంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రెండు రాష్ట్రాల్లో కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యం కారణంగా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లేదు. సోనియాగాంధీ రాజకీయ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ తదితర సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అందువల్లే కాంగ్రెస్‌కు సంబంధించినంతవరకు స్టార్ ప్రచారకర్త రాహుల్ గాంధీ.
నరేంద్ర మోదీ జనాకర్షణను తిప్పికొట్టటం ద్వారా కాంగ్రెస్‌ను గెలిపించేందుకు రాహుల్ గాంధీ పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. నరేంద్రమోదీని వ్యక్తిగతంగా విమర్శించటంతోపాటు ఆయన కేంద్రం, గుజరాత్‌లో అవలంబిస్తున్న విధానాలను తూర్పార పట్టటం ద్వారా ప్రజల సానుభూతి సంపాదించేందుకు రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జి.ఎస్.టిని గబ్బర్ సింగ్ టాక్స్ అంటూ వ్యంగ్య విమర్శలు చేయటంతోపాటు పెద్ద నోట్ల రద్దు ఒక పెద్ద బూటకమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. నరేంద్ర మోదీ అవలంబించిన గుజరాత్ మోడల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ఆరోపించటంతోపాటు ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత ఆయన దేశం మొత్తాన్ని గబ్బుపట్టిస్తున్నారంటూ వ్యంగ్య బాణాలు విసురుతున్నారు.
రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రాహుల్ గాంధీ చివరకు చిన్న పిల్లలకు సెల్ఫీలు కూడా ఇస్తున్నారు. రాహుల్ గాంధీ ఒక రోడ్ షో సందర్భంగా చిన్న బాలికను తన వ్యాన్ పైకి ఎక్కించుకుని సెల్ఫీ దిగటం చర్చనీయాంశంగా మారింది. మామాలుగా అయితే తమ కష్టాలను చెప్పుకునేందుకు వచ్చే వారిని రాహుల్ తమ ఇంటి గేటుకు ఆమడ దూరంలో నిలబెడతారు. ఎన్నికల సమయం కాబట్టి ప్రజలు వారికిప్పుడు దేవుళ్లు. ఎన్నికల ముగిసిన తరువాత ప్రజలను మరోసారి ఇంటి గేటుకు ఆమడ దూరంలో నిలబెట్టటం మామూలే. రాష్ట్రంలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ కుల రాజకీయం చేస్తోంది. పటీదార్లను బి.సిల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించేందుకు సిద్ధపడినా ఈ విషయాన్ని బాహాటంగా ప్రకటించటం లేదు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పటేల్ వర్గాన్ని బి.సిల జాబితాలో చేర్చేందుకు అంగీకరించినందుకే హార్దిక్ పటేల్ ఇప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారు. బి.సిల ఓట్ల కోసం అల్పేష్ రాథోడ్‌తో ఒప్పందం చేసుకుంటే ఆదివాసీల ఓట్ల కోసం జగ్నేష్ మెవానీతో సీట్ల సర్దుబాటు చేసుకున్నది. రాష్ట్రంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుండి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నది.
నరేంద్రమోదీ, అమిత్ షా నాయకత్వంలోని బి.జె.పి కూడా ఆమలు చేయలేని హామీలతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. గత ఇరవై రెండు సంవత్సరాల నుండి అధికారంలో ఉంటూ రాష్ట్రాన్ని ఆకాశానికి ఎత్తామని చెప్పుకుంటున్నారు తప్ప దొర్లిన తప్పుల గురించి మాటమాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. గత ఇరవై రెండు సంవత్సరాల నుండి బి.జె.పి రాష్ట్రాన్ని ఏం చేసిందనేది ప్రజలకు బాగా తెలుసు. బి.జె.పి సమర్థంగా పని చేసిందని భావిస్తే ప్రజలు ఆరోసారి కూడా అదే పార్టీని గెలిపిస్తారు. బి.జె.పి సమర్థంగా పని చేయలేదని భావిస్తే కాంగ్రెస్‌కు పట్టం కడతారు. ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలకు వదిలివేసి తామింత కాలం ఏం చేశాము, ఇక మీదట ఏం చేస్తామనేది నిజాయితీతో చెప్పటం భావ్యం. కానీ అలా జరగటం లేదు. నరేంద్రమోదీ, అమిత్ షాతోపాటు సీనియర్ మంత్రులు సైతం ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీని ఆపహాస్యం చేస్తున్నారు. గుజరాత్ రాష్ట్రం, ప్రజల పట్ల కాంగ్రెస్‌కు ఎంతమాత్రం ప్రేమ లేదంటూ ద్వేషం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ మొదటి ఉపప్రధాని సర్దార్ పటేల్‌ను సైతం తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. కాంగ్రెస్ ఏనాడు సర్దార్ పటేల్‌ను గౌరవించలేదు, తద్వారా గుజరాత్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందంటూ రాష్ట్రంలో దాదాపు ఇరవై శాతం ఉన్న పటేల్ వర్గం ఓట్లు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. గుజరాతీల ఆత్మాభిమానాన్ని రెచ్చగొట్టేందుకు పెద్దఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు కూడా అకస్మాత్తుగా సర్దార్ పటేల్‌పై ప్రేమ పుట్టుకు వచ్చింది. మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ అక్టోబర్ 31 తేదీనాడు సిక్కు గార్డుల తూటాలకు బలైతే అదే రోజు సర్దార్ పటేల్ జన్మదినోత్సవం. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో 31 అక్టోబర్ నాడు ఇందిరాగాంధీ జయంతిని పెద్దఎత్తున నిర్వహించే వారు తప్ప సర్దార్ పటేల్ గురించి పట్టించుకునే వారే కాదు. బి.జె.పి అధికారంలోకి రాగానే ఇందిరాగాంధీ జయంతిని పక్కనపెట్టి సర్దార్ పటేల్ జన్మ దినోత్సవాన్ని పెద్దఎత్తున జరపటం ప్రారంభించింది. ఈసారి కాంగ్రెస్ ఇందిరాగాంధీ జయంతితో పాటు సర్దార్ పటేల్ జన్మదినోత్సవం కూడా నిర్వహించి రికార్డు సృష్టించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసమే కాంగ్రెస్ ఈ విధంగా చేసిందనేది చెప్పనవసరం లేదు.
రాజకీయ పార్టీలు, నాయకులు ఎన్నికల సమయంలో చేసే ఆమలు చేయలేని హామీల వరదను అరికట్టాలంటే ఓటర్లు, కేంద్ర ఎన్నికల సంఘం నడుం బిగించాల్సిందే. నాయకుల తప్పుడు హామీలను బాహాటంగా తిరస్కరించటంతోపాటు నోట్లకు ఓట్లను అమ్ముకునే అలవాటును ఓటర్లు వదులు కోవాలి. తప్పుడు హామీలు ఇచ్చే నాయకులను విద్యావంతులైన ఓటర్లు ధైర్యంగా నిలదీయాలి. అప్పుడే రాజకీయ నాయకులు దారికి వస్తారు. ప్రజలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా తన వంతు బాధ్యతను నిర్వహించాలి. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత ఏమాత్రం అమలు చేశారనేది కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమీక్షించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయని పార్టీలపై చర్యలు తీసుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేయకపోవటం అంటే ప్రజలను మోసం చేసినట్లే. ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేసే పార్టీలపై కూడా చర్యలు తీసుకునేందుకు వీలుగా చట్టాన్ని సవరించాలి.

కె కైలాష్