ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఏదీ అంతర్గత ప్రజాస్వామ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేతి బీరకాయలలో నేయి ఎంత ఉంటుందో రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కూడా అంతే ఉంటుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాదిరిగానే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యంపై ఊకదంపుడు ఉపన్యాసాలు చాలా ఇచ్చారు, ఇంకా ఇస్తూనే ఉన్నారు. నరేంద్ర మోదీ మాదిరిగానే ఆయన కూడా పార్టీలో అంతర్గత ప్రజ్వామ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని వేదికలు ఎక్కి చెప్పటం ఒక అలవాటు తప్ప ఆచరణకు పనికిరాని విధానం అనేది రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి దొడ్డిదారిన ఎన్నిక కావటం ద్వారా మరోసారి రుజువు చేయనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయి నాయకులను ఎన్నుకునేందుకు రాజకీయ పక్షాలు సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుంటాయి. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను పూర్తి చేసేందుకు మాత్రమే ఈ సంస్థాగత ఎన్నికల నిర్వహణ తంతు జరుగుతుంది. కాంగ్రెస్, బి.జె.పి, వామపక్షాలతోపాటు ఆయా రాష్ట్రాల్లో రాజకీయం చేస్తున్న ప్రాంతీయ పార్టీలు నిర్వహించే సంస్థాగత ఎన్నికలు ఒక ఫార్సుగా తయారయ్యాయి. రాజకీయ పార్టీల సంస్థాగత ఎన్నికలు ఒక నాటకంలా జరుగుతాయి తప్ప నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో జరగటం లేదు.
తాజాగా కాంగ్రెస్‌లో ఐదారు నెలల నుండి కొనసాగుతున్న సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా ఒక ఫార్స్‌గా జరుగుతోంది తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో జరగటం లేదు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, ఎ.ఐ.సి.సి సభ్యులు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి, అయితే ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా ప్రజాస్వామ్యం పేరుపై అప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహారాన్ని నడుపుతున్నారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏ రాష్ట్రంలో కూడా పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించలేదు. ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులు అధినాయకుల ఆదేశం మేరకు వారు సూచించిన వారిని ఆయా పదవులకు ఎంపిక చేసి వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఇదే తంతు కొనసాగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను ఎంపిక చేసే బాధ్యతను అధినాయకత్వానికి వదిలివేస్తూ ఆయా రాష్ట్రాలు ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించి పంపించాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎంపిక విషయంలో కూడా ఇదే జరిగింది. రాహుల్ గాంధీని కాంగ్రెస జాతీయ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ అన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసి కాంగ్రెస్ అధినాయకత్వానికి పంపించాయి. వారసత్వ రాజకీయాలకు నిలయమైన కాంగ్రెస్‌లో ఇంతకు మించి ఆశించటం అవివేకమే అవుతుంది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ పి.సి.సిలు తీర్మానాలు చేసి పంపించిన తరువాత కూడా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నారంటే అది ఎంత ఫార్సు ఎన్నిక అనేది సులభంగానే ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ డిసెంబర్ ఒకటో తేదీ జారీ అవుతుంది. నాలుగో తేదీలోగా నామినేషన్ల దాఖలు చేయాలి. అవసరమైతే 16 ఎన్నికల నిర్వహించి 19 తేదీ ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ అన్ని పి.సి.సిలు తీర్మానాలు చేసి పంపించిన తరువాత ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించటం వృధా కాదా? అనే అనుమానం వ్యక్తం కావచ్చు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పి.సి.సిలు తీర్మానించటంలో ఉన్న రహస్యం ఏమిటంటే యావత్ కాంగ్రెస్ ఆయన వెనక ఉన్నారనే భావన కల్పించటం. అన్ని పి.సి.సిలు ఏకగ్రీవంగా తీర్మానించినా రాహుల్ గాంధీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిగా ఎన్నుకున్నామనే అభిప్రాయం సగటు మనిషికి కల్పించటంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం నియమ, నిబంధనలను అమలు చేశామని చెప్పటం రెండో లక్ష్యం. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అనేది ఒక పెద్ద ఫార్సు అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలుసు, అయినా నియమనిబంధనల మేరకు మొత్తం ఎన్నికల ప్రక్రియ జరిగినట్లు పత్రాలపై చూపించటం వలన దీనికి అమోదముద్ర వేయకతప్పటం లేదు.
ఏదో ఒక రాజకీయ పార్టీ సంస్థాగత ఎన్నికలను ఫార్స్ పద్ధతిలో నిర్వహిస్తే కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోచ్చు కానీ అన్ని రాజకీయ పార్టీలు ఇదే విధంగా వ్యవహరించటం వలన కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయంలో చేతులు ముడుచుకుని కూర్చోక తప్పటం లేదు. అధికారంలో ఉన్న పార్టీ కూడా తమ సంస్థాగత ఎన్నికలను ప్రజాస్వామ్యం పేరుతో అప్రజాస్వామికంగా నిర్వహిస్తోంది. అధికార పార్టీపై చర్యలు తీసుకోలేని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలపై ఎలా చర్యలు తీసుకోగలుగుతుంది? కేంద్ర ఎన్నికల సంఘం తలచుకుంటే అన్ని రాజకీయ పార్టీల గుర్తింపులను రద్దు చేయవచ్చు. ఆయా పార్టీల సంస్థాగత ఎన్నికలు జరిగిన తీరుతెన్నులను మామూలుగా పరిశీలించినా అవి అన్ని స్థాయిలలో తప్పుల తడక అనేది తెలిసిపోతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ పరిశీలన ఆధారంగా అన్ని రాజకీయ పార్టీల గుర్తింపును సునాయాసంగా రద్దు చేయవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు వారసత్వ రాజకీయాలకు నిలయంగా మారాయి. కొన్ని పార్టీలు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మారిపోయాయి. కుటుంబ సభ్యుల ఆధిపత్యంలో పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ మొదటి నుండి ‘గాంధీ’ కుటుంబం ఆధారంగా పనిచేస్తున్న పార్టీ. బి.జె.పి కూడా వ్యక్తులు కేంద్రంగా పనిచేసే పార్టీగా మారిపోతోంది. నిజంగా ప్రజాస్వామ్య పద్దతిలో పార్టీ కార్యకర్తల ద్వారా ఎన్నుకోబడే నాయకుల మూలంగా పనిచేసే రాజకీయ పార్టీ అనేది మన దేశంలో ఒక్కటి కూడాలేదంటే అతిశయోక్తి కాదు. జాతీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉన్నది. ప్రాంతీయ పార్టీల్లో సంస్థాగత ఎన్నికలు కూడా అధినాయకత్వ కనుసన్నల్లో జరుగుతాయి. అందుకే అధినాయకుల కొడుకులు, కోడళ్లు, అల్లుళ్లు, మేనమామలు, మేనత్తలు కీలక పదవులు చేపట్టి బాధ్యత లేని అధికారాన్ని అనుభవిస్తున్నారు. రాజకీయ పార్టీలో సామాన్య కార్యకర్తలకు విలువ లేకుండాపోయింది.
రాహుల్ గాంధీ కూడా మొదట్లో వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు. అయితే కాలక్రమంలో ఆయన కూడా వారసత్వ కుటుంబ రాజకీయాలకు తలవంచక తప్పలేదు. అందుకే రాహుల్ గాంధీ ఇప్పుడు దొడ్డిదారి విధానం ద్వారా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టవలసి వస్తోంది. కాంగ్రెస్‌లో గాంధీ కుటుంబ సభ్యులు మినహా మరొకరు పార్టీ అధ్యక్ష పదవి, లోకసభలో మెజారిటీ ఉంటే ప్రధానమంత్రి పదవి చేపట్టాలన్నది అలిఖిత శిలాశాసనం. ఈ అలిఖిత శిలాశాసనం ఆధారంగానే రాహుల్‌గాంధీ ఉపాధ్యక్ష పదవి నుండి అధ్యక్ష పదవికి ప్రమోషన్ పొందుతున్నారు. సోనియాగాంధీ గత పదహారు సంవత్సరాల నుండి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. డిసెంబర్ 19 తేదీనాడు కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టే రాహుల్ గాంధీ రానున్న ఇరవై సంవత్సరాల పాటు పార్టీ అధినాయకుడిగా కొనసాగుతారు. ఇక మీదట పార్టీ సంస్థాగత ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికవుతూ ఉంటారు. ఇది అంతర్గత ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కూడా పద్ధతి ప్రకారం ఎన్నిక జరిపి ఎన్నుకోవలసి ఉన్నా వారిని కూడా నామినేషన్ పద్ధతిలో నియమిస్తున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో సంస్థాగత ఎన్నికల తతంగం నిర్వహిస్తూ తమకు ఇష్టమైన వారిని అన్ని పదవులకు నామినేట్ చేసుకోవటం ఎంతవరకు సమంజసం? ఇది అంతర్గత ప్రజాస్వామ్యం ఎంతమాత్రం కాదు, ఇది ప్రజాస్వామ్యం పేరుతో జరిగే నియంతృత్వం. ఎన్.డి.ఏ ప్రధానమంత్రి, బి.జె.పి ఆధ్యక్షుడు ఒకే రాష్ట్రం వారు కావటం ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కొనసాగుతున్న సంస్థాగత రాజకీయ నియంతృత్వం, నిరంకుశత్వానికి నిదర్శనం కాదా? ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ అంతర్గత ప్రజాస్వామ్యంపై దృష్టి పెట్టాలని హితవు చెప్పటం హిపాక్రసీ కాదా? డైనాస్టి రాజకీయాలు తనకు గిట్టవని గొప్పగా ప్రకటించిన రాహుల్‌గాంధీ చివరకు డైనాస్టిక్ రాజకీయాల ఆధారంగానే పార్టీ అధ్యక్షుడుగా ఎన్నిక కావటం మన రాజకీయ నాయకుల భావ దారిద్య్రానికి అద్దం పడుతోంది. రాజకీయ పార్టీల అధినాయకులు రాజకీయ స్వేచ్చకు సంకెళ్లు వేసి అంతర్గత ప్రజాస్వామ్యం అనేది లేకుండా చేయటం సిగ్గుచేటు.

కె కైలాష్