ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పాక్‌ను శత్రుదేశంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శత్రువుకు శత్రువు మన మిత్రుడు. అదే విధంగా శత్రువుకు మిత్రుడు మన శత్రువు అవుతాడు. అందుకే భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో మరణించిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనిని తమ మిత్రుడుగా ప్రకటించిన పాకిస్తాన్ మనకు శత్రువు అవుతుంది. బుర్హాన్ వనిని అమరవీరుడుగా ప్రకటించి అతని సంస్మరణార్థం జూలై 19 తేదీ నాడు బ్లాక్ డే నిర్వహిస్తున్న పాకిస్తాన్‌ను మన శత్రుదేశంగా ప్రకటించాలి. పాకిస్తాన్‌ను శత్రు దేశంగా ప్రకటించటంతోపాటు ఉగ్రవాదుల దాడులను యుద్ధంగా పరిగణించి తగు విధంగా బుద్ధి చెప్పాలి. మన దేశంపై దాడులు చేస్తున్న పాకిస్తాన్‌కు నీతి బోధలు చేయటం ఇకనైనా మానుకోవాలి.
మన ఉదారత్వాన్ని బలహీనతగా భావిస్తూ ఎప్పటికప్పుడు ఉగ్రవాదులతో దాడులు చేయిస్తున్న పాకిస్తాన్ పట్ల ఇకనైనా దృఢమైన విధానాన్ని అవలంభించకపోతే భావి తరాలు పాలకులను క్షమించవు. పాకిస్తాన్ పాలకులు, ముఖ్యంగా పాక్ సైన్యాన్ని దారికి తీసుకురావాలంటే యుద్ధ నీతిని అవలంభించాలి తప్ప నీతి వాచకాన్ని కాదు. ఇంత కాలం ఉగ్రవాదులను ‘నో స్టేట్’ జనమంటూ తప్పించుకు తిరిగిన పాకిస్తాన్ ఇప్పుడు బాహాటంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది. బుర్హాన్ వనిని అమర వీరుడుగా ప్రకటించటం ద్వారా పాకిస్తాన్ మనతో ప్రత్యక్ష ఉగ్రవాద పోరాటానికి తెర లేపింది. మారణ హోమం, నర మేధం నిర్వహించటం ద్వారా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్‌లలో జాతి ప్రక్షాళన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఆరోపించటం మామూలు విషయం కాదు. నవాజ్ షరీఫ్ నుండి ఇలాంటి ఆరోపణలు వచ్చిన తరువాత కూడా పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కొనసాగించటం గర్హనీయమే అవుతుంది.
పాకిస్తాన్‌తో స్నేహం చేయాలనే ఆలోచనను భారత ప్రభుత్వం ఇకనైనా వదులుకోవటం మంచిది. శత్రువును శత్రువుగానే పరిగణించాలి తప్ప మిత్రుడుగా భావించటం మన అవివేకం అవతుందనేది పాలకులు అర్థం చేసుకోవాలి. పంచశీల్ ఒప్పందం తరువాత చైనాను స్నేహితుడుగా భావించి 1962 యుద్ధంలో ఘోర పరాజయాన్ని చవి చూసిన మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ చేసిన తప్పును ప్రస్తుత పాలకులు చేయకూడదు. పాకిస్తాన్ ఇప్పటికి మనపై రెండు సార్లు యుద్ధం చేసి చావు దెబ్బతిన్నది. అంతకు ముందు గిరిజనుల దాడి పేరుతో సగం కాశ్మీర్‌ను కబళించింది. భారత దేశాన్ని ప్రత్యక్ష యుద్ధంలో ఓడించలేమన్న వాస్తవాన్ని గ్రహించిన పాకస్తాన్ పాలకులు, సైన్యం ఉగ్రవాదుల ద్వారా పరోక్ష యుద్ధం చేస్తున్నారు. ఈ పరోక్ష యుద్ధంలో పాకిస్తాన్‌కు వచ్చే నష్టం తక్కువ మనకు కలిగే నష్టం ఎక్కువ. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ను శత్రు దేశంగా ప్రకటించటం ఒక్కటే ఉత్తమమైన దారి.
మహత్మా గాంధీ చెప్పినట్లు ఒక చెంపపై కొడితే మరో చెంపను చూపించే సిద్ధాంతం పాకిస్తాన్‌తో పని చేయదనే వాస్తవాన్ని మన పాలకులు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? అతి మంచి తనం ఎంత మాత్రం మంచిది కాదనే వాస్తవాన్ని గ్రహించకుండా పాకిస్తాన్ ఏం చేసినా భరించటం, సహించటం దేశ ప్రయోజనాలకు మంచిది కాదు. బుర్హాన్ వని అమరవీరుడని నవాజ్ షరీఫ్ స్వయంగా ప్రకటించిన తరువాత కూడా పాకిస్తాన్‌ను శత్రు దేశంగా పరిగణించకపోతే అది మన పాలకుల బలహీనతే అవుతుంది తప్ప గొప్పతనం ఎంత మాత్రం కాదు. పాకిస్తాన్ మంత్రివర్గం అత్యవసర సమవేశం జరిపి బుర్హాన్ వని మరణం పట్ల సంతాపం తెలియజేయటం శత్రు చర్యే అవుతుంది తప్ప మరొకటి కాదు. తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్రమైన హెచ్చరిక జారీ చేసినంత మాత్రాన పాకిస్తాన్ పాలకులు దారికి వస్తారని ఆశించటం మన మూర్ఖత్వం అవుతుంది.
ఇస్లామిక్ ఉగ్రవాదానికి పాకిస్తాన్ అంతర్జాతీయ కేంద్రంగా మారి చాలా కాలమైంది. భారత దేశంపై ఇస్లామిక్ ఉగ్రవాదం పేరుతో యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఉగ్రవాద చర్యలకు దన్నుగా నిలుస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని పలు ఉగ్రవాద సంస్థలను పోషిస్తున్న పాకిస్తాన్ అఫ్గానిస్తాన్, ఇరాన్, సిరియా, టర్కీ,సుడాన్ తదితర ఇస్లామిక్ దేశాల్లోని ఉగ్రవాద సంస్థలకు ఆయుధాల సరఫరా చేస్తోంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు, స్మగ్లర్లు, ఇతర అంతర్జాతీయ నేరస్తులకు తమ దేశంలో ఆశ్రయం కల్పిస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌ను శిక్షించటం లేదు. ఆమెరికాతో సహా పలు పాశ్చాత్య దేశాలు తమ వ్యాపార, ఇతర ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను దండించేందుకు సిద్ధపడటం లేదు. ఈ నేపథ్యంలో భారత దేశం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా ఎదురు దాడులకు సిద్ధం కావాలి తప్ప నీతి బోధతో పాకిస్తాన్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించకూడదు.
బుర్హాన్ వణిని అమరవీరుడుగా ప్రకటించి కాశ్మీర్‌లోని ఇస్లామిక్ ఉగ్రవాదులకు బాహాటంగా మద్దతు ప్రకటించటం పాకిస్తాన్ పాలకుల తెగింపునకు అద్దం పడుతోంది. పాకిస్తాన్ పాలకులు ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ ఇస్లామిక్ యుద్ధం కోసం భారత దేశంలోని ముస్లింలు ముఖ్యంగా ముస్లిం యువతను పెద్ద ఎత్తున రెచ్చగొడుతోంది. ఈ లక్ష్య సాధన కోసం జకీర్ నాయక్ లాంటి ఇస్లామిక్ ప్రచార కర్తలను ఉపయోగించుకుంటోంది. మన దేశంలోని ముస్లిం యువతను మత ఛాందసులుగా మార్చటంలో ఉగ్రవాద సంస్థలు విజయం సాధిస్తున్నారనేందుకు ఇటీవల హైదరాబాదులో జాతీయ దర్యాప్తు సంస్థ చేసిన ఆరెస్టులే మంచి ఉదాహరణ. భారత దేశాన్ని వెయ్యి కోత (జుల్ఫికర్ అలీ భుట్టో థౌసండ్ కట్స్ వ్యూహం) లతో నిర్వీర్యం చేసేందుకు హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తయ్యబా, తాలిబాన్ తదితర పాక్ ఆక్రమిత ఉగ్రవాద సంస్థలతో పాటు సిరియాలో మారణ హోమం సృష్టిస్తున్న ఐ.ఎస్.ఐ.ఎస్, బోకోహరాం తదితర ఉగ్రవాద సంస్థలను కూడా పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది. అందుకే పాకిస్తాన్‌ను మన శత్రు దేశంగా పరిగణించడమే కాదు ఆవిధంగా ప్రకటించాల్సిందే.