ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

గుజరాత్‌పై యూపీ ఫలితాల ప్రభావం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిపక్షాలు పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలుపై బి.జె.పిని చీల్చిచెండాడుతుంటే ఉత్తర ప్రదేశ్ పట్టణ ప్రాంత ప్రజలు స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బి.జె.పికి పట్టం కట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెద్దనోట్ల రద్దు, జి.ఎస్.టిని అమలు చేస్తున్నందుకు పట్టణ ప్రాంత ప్రజలు బి.జె.పిని ఓడిస్తారని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు ఆశించాయి. అయితే యు.పి. ప్రజలు ఇందుకు భిన్నంగా బి.జె.పిని గెలిపించటం గమనించవలసిన విషయం. దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ ఎన్నిక ఫలితాలు పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలుపై దేశ ప్రజల అభిప్రాయాలు, మనోగతానికి అద్దం పడుతున్నాయా?
గుజరాత్‌లో తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పకడ్బందీగా ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు నిరాశను మిగిల్చాయి. యు.పి. మున్సిపల్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం గుజరాత్‌లో బి.జె.పికి బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ లోకసభ నియోజకవర్గంలోని గౌరిగంజ్, జైయిస్ మున్సిపల్ బోర్డు సీట్లలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి గురైంది. ఈ లోకసభ నియోజకవర్గంలోని ఉన్న రెండు సీట్లను కోల్పోవటం రాహుల్ గాంధీ వైఫల్యానికి నిదర్శనంగా మారింది. ఉత్తర ప్రదేశ్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బి.జె.పి సాధించిన ఘన విజయం ప్రభావం డిసెంబర్ తొమ్మిది, పద్నాలుగవ తేదీల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై తప్పకుండా ఉంటుందని భావించకతప్పదు. 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయావకాశాలను జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు వ్యవహారాలు బాగా దెబ్బతీస్తాయని ప్రతిపక్షం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అలా జరగలేదు. ఉత్తర ప్రదేశ్‌లోని కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో బి.జె.పి పద్నాలుగు కార్పొరేషన్లను కైవసం చేసుకుంటే మాయావతి నాయకత్వంలోని బి.ఎస్.పి రెండింటిలో విజయ సాధించింది. ఇటీవలి కాలం వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీకి ఒక్క కార్పొరేషన్ కూడా దక్కలేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలోని రెండు మున్సిపల్ సీట్లలో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. గౌరీగంజ్‌లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి గీత తన డిపాజిట్‌ను కూడా దక్కించుకోలేకపోవటం చూస్తుంటే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో పార్టీ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదనేది స్పష్టమవుతోంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ లోకసభ నియోజకవర్గలోకూడా పార్టీ పరిస్థితి అంతంత మాత్రమే. రాయబరేలీ నగర పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయానికి గురైంది. తమ లోకసభ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీ సీట్లు గెలుచుకోలేని కాంగ్రెస్ అధినాయకులు గుజరాత్‌లో పార్టీని గెలిపించగలుగుతారా? అనే అనుమానం కలుగక మానదు. యు.పి మున్సిపల్ ఎన్నికల్లో బి.జె.పి ఓటమిపాలై ఉంటే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పంట పండేది.
ఉత్తర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో బి.జె.పి గెలుపు గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బాగా దెబ్బ తీయవచ్చు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి ఓటమి ఖాయమంటూ రాహుల్ గాంధీ ఇంతకాలం చేసిన ప్రచారానికి యు.పి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెరదించుతున్నాయి. గుజరాత్‌లో బి.జె.పి ‘జావేచే’ (పోతోంది) అంటూ రాహుల్ గాందీ ఇచ్చిన నినాదాన్ని కాంగ్రెస్ నాయులు పెద్దఎత్తున ప్రచారం చేశారు. బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా యు.పి. మున్సిపల్ ఎన్నికల విజయం నేపథ్యంలో ఇదే నినాదాన్ని కొంత మార్చి ‘గుజరాత్‌లో బి.జె.పి జావేచే (పోతోంది) అంటూ రాహుల్ గాంధీ ప్రచారం చేస్తుంటే అమేథీ, రాయబరేలీ లోకసభ నియోజకవర్గాల్లో ప్రజలు కాంగ్రెస్ జావేచే (పోతోంది) అనేది నిరూపించారు అని ఎద్దేవ చేస్తున్నారు. నరేంద్ర మోదీ అమలు చేసిన పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పిని బాగా దెబ్బతీయడంతోపాటు కాంగ్రెస్ విజయానికి సోపానాలు అవుతాయని రాహుల్‌గాంధీ అంచనా వేశారు. అయితే ఇది ఏ మేరకు నిజమవుతుందనేది ఇప్పుడు చెప్పటం కష్టం, ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి నేపథ్యంలో జరిగిన యు.పి. మున్సిపల్ ఎన్నికలు పట్టణ ఓటర్లు బి.జె.పికి మద్దతు ఇచ్చారనేది నిరూపించాయి. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టిని అమలు చేయటం వలన పట్టణ ప్రాంతాల ప్రజలు బాగా కష్టాల పాలయ్యారన్నది కాంగ్రెస్‌తోపాటు ఇతర ప్రతిపక్షాలు భావించాయి. బిజెపికి ప్రజలు వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించాయి. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో కూడా పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలు ఆశించినంత ప్రతికూల ప్రభావం చూపించకపోతే బి.జె.పి సునాయాసంగా మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పకతప్పదు. గుజరాత్ ప్రజలు డబ్బు విషయంలో చాలా ఘటికులు, డబ్బు విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా వారు సహించరు. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టిని అమలు చేయటం వలన గుజరాతీల వ్యాపారం ముఖ్యంగా షేర్ల కొనుగోలు, విక్రయం వ్యాపారం బాగా దెబ్బతిన్నదన్నది ప్రతిపక్షాల అంచనా. అందుకే వారు అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ప్రతిపక్షాలు అంచనా వేయటం తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన యు.పి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ అంచనాలు నిజం కాకపోవచ్చుననే అభిప్రాయం కలిగిస్తున్నాయి. యు.పి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ఎంత మాత్రం ఉండదని ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ వాదిస్తోంది. యు.పి.లో బి.జె.పి ఇటీవలే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో బి.జె.పి హనీమూన్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిందన్నది వారి వాదన. ఇదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఘోరక్‌పూర్‌లోని ఆయన వార్డులో బి.జె.పి ఎలా ఓడిపోయింది. ఘోరక్‌పూర్ మేయర్ పదవిని దక్కించుకున్న బి.జె.పి యోగి ఆదిత్యనాథ్ ఓటు ఉన్న 68 నంబర్ వార్డులో బి.జె.పి అభ్యర్థి ఓడిపోయారు. ఘోరక్‌నాథ్ దేవాలయం కూడా ఇదే వార్డులో ఉండటం గమనార్హం.
యు.పి. మున్సిపల్ ఎన్నికల ప్రభావం 2019లో జరిగే లోకసభ ఎన్నికలపై ఉండకపోయినా పట్టణ ఓటర్లపై పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి చూపించే ప్రభావం ఏమిటనే దానికి అద్దం పడుతోంది. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి అమలు దేశ వ్యాపితంగా ప్రభావం చూపిస్తున్న అత్యంత ముఖ్యమైన అంశాలు. నరేంద్ర మోదీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాల మూలంగా దేశంలోని మెజారిటీ ప్రజలు ప్రభావితులయ్యారు. సమాజంలోని ఒక్కొక్క వర్గం ప్రజలపై ఈ రెండింటి ప్రభావం ఒక్కోరకంగా ఉన్నది. దేశ ప్రజలు పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే జి.ఎస్.టి ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. పెద్ద నోట్ల రద్దు వలన సగటు మనిషికి ఎంతో ప్రయోజనం ఉంటుందని వాదిస్తున్న బి.జె.పి జి.ఎస్.టికి మరింత సాన పెట్టటం ద్వారా దీని మంచి ఫలితాలను దేశ ప్రజలకు అందజేసేందుకు కృషి చేస్తోంది. 2019 లోకసభ ఎన్నికల నాటికి ఈ రెండు అంశాల వల్ల తమకు రాజకీయంగా లాభం కలుగుతుంది తప్ప నష్టం ఉండదన్నది బి.జె.పి అధినాయకుల వాదన. యు.పి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శమని వారంటున్నారు. పెద్ద నోట్ల రద్దు వలన మొదట సగటు మనిషికి కొంత ఇబ్బంది కలిగినా వాటిని సకాలంలో తొలగించటం ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్నామని బి.జె.పి వాదిస్తోంది. దాదాపు మూడు కోట్ల నల్లధనం బ్యాంకుల్లోకి వచ్చి పడటం తాము సాధించిన ఘన విజయమని, దీనిని ఉత్తర ప్రదేశ్ ప్రజలు గుర్తించారని, లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ ప్రజలు కూడా దీనిని గుర్తించి తమకు ఓటు వేస్తారని బి.జె.పి భావిస్తోంది. జి.ఎస్.టి మూలంగా పలు వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని వారు అంచనా వేస్తున్నారు. యు.పి. మున్సిపల్ ఎన్నికల విజయానికి గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో తాము సాధించే ఘన విజయం తోడవుతుందన్నది బి.జె.పి నాయకుల ధీమా. పెద్ద నోట్ల రద్దు, జి.ఎస్.టి వలన సగటు మనిషికి తీరని నష్టం కలుగుతుందని ప్రతిపక్షాలు పెద్దఎత్తున ప్రచారం చేశాయి. రాహుల్‌గాంధీ గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా జి.ఎస్.టిని ఏకంగా గబ్బర్ సింగ్ టాక్స్‌గా అభివర్ణిస్తూ నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించినా పట్టణ ప్రాంత ప్రజలు వీరి వాదనతో ఏకీభవించటం లేదనేది యు.పి మున్సిపల్ ఎన్నికలు స్పష్టం చేయటం గమనార్హం.

కె కైలాష్