ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ పునరుజ్జీవం సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టటంతో కాంగ్రెస్‌లో కొత్త శకం ప్రారంభమైంది. రాహుల్ గాంధీ హయాంలో కాంగ్రెస్ గత వైభవాన్ని తిరిగి సాధించుకుంటుందా? ఈ ప్రశ్నకు ఇప్పుడిప్పుడే సమాధానం చెప్పటం కష్టం. 19 సంవత్సరాల క్రితం సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు దేశంలో, పార్టీలో ఉన్న పరిస్థితులు వేరు. రాజకీయాలంటే ఏమిటో తెలియని సోనియాగాంధీ సీనియర్ నాయకుల సలహాలు, మార్గదర్శనంలో కాంగ్రెస్‌ను ముందుకు నడిపించారు. సోనియాగాంధీ 19 సంవత్సరాల హయాంలో కాంగ్రెస్ పది సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నది. రాహుల్‌గాంధీ కూడా కాంగ్రెస్‌ను మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురాగలుగుతారా? అనేది ప్రశ్న. ఎన్.ఎస్.యు.ఐ, యువజన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించటంతోపాటు 2004 నుండి లోకసభ సభ్యుడుగా కొనసాగుతున్నారు. రాజకీయాలంటే ఎంతమాత్రం గిట్టని రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే నిజమైన రాజకీయ నాయకుడుగా ఎదుగుతున్నాడు. వారసత్వ రాజకీయాలు మంచివి కాదని మొదట్లో బహిరంగంగా ప్రకటించిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఆ వారసత్వ రాజకీయాల్లో భాగంగానే పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టటం గమనార్హం. ‘పప్పు’ ముద్ర నుండి ఇప్పుడిప్పుడే బైటపడుతున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్‌కు గత వైభవాన్ని సాధించేందుకు రాజకీయ పరిణతిని, ఔన్నత్యాన్ని ప్రదర్శించవలసి ఉంటుంది. రాజకీయం గా ఉన్నత స్థానానికి ఎదిగితేనే ప్రజల దృష్టిని ఆకర్షించగలుగుతారు. కేవలం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, బి.జె.పి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయటం, అసత్య ప్రచారం చేయటం వలన పత్రికల్లో ప్రచారం లభించవచ్చు కానీ ప్రజల దృష్టిలో నాయకుడుగా ఎదగలేడు. బహిరంగ సభల్లో ఇతరులు రాసి ఇచ్చింది చదివి చప్పట్లు కొట్టించుకోవటం, ట్విట్టర్‌లో వ్యాఖ్యలు చేయటం వలన మంచి రాజకీయ నాయకుడుగా ఎదగలేడు. రాహుల్ గాంధీ 2004 సంవత్సరాల నుండి లోకసభ సభ్యుడుగా కొనసాగుతున్నా ఇంతవరకు ఆయన పార్లమెంటులో జరుగుతున్న చర్చపై తనంత తాను స్పందించి ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తిచూపిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఆయన లోకసభలో మాట్లాడిన సందర్భాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. సోనియాగాంధీ కూడా లోకసభలో జరుగుతున్న చర్చపై తనంత తాను స్పందించి ప్రభుత్వాన్ని నిలదీసిన సంఘటనలు చాలా అరుదు. లోకసభలో ఆమె రెండుమూడు సార్లు ప్రభుత్వ వ్యవహారంపై మండిపడింది తప్ప చర్చల్లో క్రియాశీలంగా పాల్గొన్న సంఘటనలు లేవనే చెప్పాలి. సోనియాగాంధీ మాదిరిగానే రాహుల్ గాంధీ కూడా లోకసభ చర్చల్లో ఇంత వరకు పెద్దగా పాల్గొనలేదు. లోకసభలో కాంగ్రెస్ పక్షం నాయకత్వం బాధ్యతలు తీసుకునేందుకు కూడా తిరస్కరించిన రాహుల్ గాంధీ ఇంతవరకు వెనక సీటు నుండే పని చేశారు. ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టినందువల్ల ఇక మీదట లోకసభలో ముందు వరుసలో కూర్చోవలసి ఉంటుంది. ఎన్.డి.ఎ ప్రభుత్వంపై ముందు నుండి దాడి చేయవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ పార్లమెంటులో సమర్థంగా పని చేయగలిగితేనే దాని ప్రభావం కాంగ్రెస్‌తో పాటు ప్రజలపై కూడా పడుతుంది. ఇకమీదనైనా లోకసభలో ఆయన ముందు వరుసలో కూర్చోవటంతోపాటు ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనటం నేర్చుకోవాలి.
కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపజేయాలంటే వినూత్నమైన పద్ధతిలో పార్టీ వ్యవహారాలను నిర్వహించవలసి ఉంటుంది. పార్టీ పట్ల ప్రజలతోపాటు నాయకులు, కార్యకర్తలకు కూడా విశ్వాసం కల్పించవలసి ఉంటుంది. సీనియర్ నాయకులతోపాటు జూనియర్ నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా విశ్వాసం కల్పించవలసి ఉంటుంది. రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే సీనియర్ నాయకులందరికి ఉద్వాసన పలుకుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు యువతతోపాటు సీనియారిటీకి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. సీనియర్ నాయకులకు ఉద్వాసన పలికితే పార్టీని నిలబెట్టుకోవటం కష్టమైపోతుందనే వాస్తవాన్ని రాహుల్ గాంధీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. రాహుల్ గాంధీకి సీనియర్ నాయకులంటే ఎంతమాత్రం గిట్టదనేది అందరికి తెలిసిందే. సీనియర్ నాయకుల స్థానంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా పార్టీని ముందుకు నడిపించాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన. కాంగ్రెస్‌లో యువతకు ప్రాధాన్యత ఇవ్వవలసిందే. అయితే సీనియర్ నాయకుల అనుభవాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. సీనియర్, జూనియర్ నాయకులతోపాటు కార్యకర్తల మధ్య సమతూకాన్ని సాధించగలిగితేనే కాంగ్రెస్ బతికి బట్టకడుతుంది. కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలన్నది బి.జె.పి లక్ష్యం. బి.జె.పి ఈ లక్ష్యాన్ని సాధించేందుకు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు రాహుల్ గాంధీ మరింత జాగ్రత్తగా పనిచేయవలసి ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో కనుమరుగైపోయే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటోంది. తమిళనాడులో కాంగ్రెస్ అనేదే లేదు. తమిళనాడు పరిస్థితులే ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణాలో నెలకొంటున్నాయి. ఒడిశ్శాలో కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా? అనే అభిప్రాయం కలుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ చాలాకాలం క్రితమే కనుమరుగైపోయింది. దేశంలోని అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ నాలుగో స్థానానికి నెట్టివేయబడింది. గుజరాత్‌లో గత ఇరవై రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ అధికారంలో లేదు. మహారాష్టల్రో కూడా కాంగ్రెస్ ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోం ది. కాంగ్రెస్ ప్రస్తుతం పంజాబ్, మిజోరం, మేఘాలయ, కర్నాటక, పాండిచ్చేరి రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. పంజాబ్, కర్నాటక రాష్ట్రాలను పక్కన పెడితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న మిగతా రాష్ట్రాలన్నీ అత్యంత చిన్నవి. ఈ చిన్న రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా లేకున్నా ఓకటే. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ జాతీయ పార్టీ స్థాయి నుండి ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయి చాలా కాలమైంది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, సోనియాగాంధీ ప్రాతినిద్యం వహిస్తున్న రాయబరేలీ లోక్‌సభ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ తన పట్టును కోల్పోతోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 2019లో జరిగే లోకసభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విజయం సాధించటం అనుమానమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోనియాగాంధీ 2019 లో రాయబరేలీ నుండి లోక్‌సభకు పోటీ చేయటం అనుమానమే. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కాంగ్రెస్ ఏపీలో కనుమరుగైపోగా తెలంగాణాలో తుది శ్వాసతో బతుకుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన రాహుల్ గాంధీ పార్టీలో జవసత్వాలు నింపగలుగుతారా? అనేది అసలు ప్రశ్న. దేశం మొత్తం కాంగ్రెస్‌తో పాటు జాతీయ ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఎంత మాత్రం బాగా లేదు. జాతీయ స్థాయి ప్రతిపక్షమనేదే లేకుండాపోయింది. కాంగ్రెస్ సైతం పేరుకే జాతీయ పార్టీగా మిగులుతోంది. ఒకప్పుడు జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన వామపక్షాలు ఇప్పటికే ప్రాంతీయ పార్టీల స్థాయికి కుదించుకుపోయాయి. దేశంలో ఎక్కడ చూసినా బి.జె.పి లేదా ప్రాంతీ య పార్టీల ప్రాబల్యం కనిపిస్తోంది. బి.జె.పి లేని చోట ప్రాంతీ య పార్టీల అధికారంలో ఉన్నాయి. కొన్ని చోట్ల బి.జె.పి మిత్ర పక్షాలు అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం రాహుల్‌గాంధీ నుండి ఎంతో ఆశిస్తోంది. ‘మేము కలుపుకుంటూ పోతుంటే బి.జె.పి విభజిస్తోంది, మేము ప్రేమను పంచుతుంటే బి.జె.పి విద్వేషాన్ని నింపుతోందం’టూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వటం వలన కాంగ్రెస్ లేదా ప్రతిపక్షం బలపడవు. కాంగ్రెస్‌తోపాటు ఇతర భావసారూప్యత గల ప్రతిపక్షాలు బలపడాలంటే రాహుల్ గాంధీ మరింత రాజకీయ పరిణితితో పని చేయవలసి ఉంటుంది. బి.జె.పిని విమర్శించే పేరుతో దుమ్మెత్తిపోయటం మానివేసి ఆచరణయోగ్యమైన రాజకీయం చేయటం నేర్చుకోవాలి. కాంగ్రెస్ పరిస్థితి ఎంత మాత్రం బాగా లేదనేది వాస్తవం. దీనితోపాటు నరేంద్ర మోదీ నాయకత్వంలో బి.జె.పి పటిష్టంగా ముందుకు సాగుతోందనేది మరో వాస్తవం. బి.జె.పికి అండగా సంఘ్ పరివార్, ఇతర సంస్థలు ఉన్నాయి. వీరందరి సమైక్య బలాన్ని ఎదుర్కొంటూ కాంగ్రెస్‌కు గత వైభవం సాధించటం మామూలు విషయం కాదు. రాహుల్‌గాంధీ రాజకీయంగా రాటుదేలుతున్నారనేది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అద్దం పట్టింది. దీనికి మరింత సాన పట్టాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార, ప్రతిపక్షాలనేది ఒక నాణెనికి రెండు ముఖాలు. ప్రతిపక్షం బలహీనమైపోతే అధికార పక్షం విర్రవీగుతుంది. రాహుల్ గాంధీ పరిపక్వ రాజకీయ నాయకుడుగా ఎదగటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నించాలి. ఈ లక్ష్య సాధనలో అతడు విఫలమైతే కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోతుంది.

కె కైలాష్