ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పార్లమెంటు పరువు తీస్తున్న నాయకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికార, ప్రతిపక్ష పక్షాల నాయకులు తమ పార్టీల రాజకీయ లబ్ది కోసం పార్లమెంటు పరువుప్రతిష్ఠలను మంటగలుపుతున్నారు. శీతాకాల సమావేశాలు కూడా రాజకీయాలకు బలై సమయం వృధా అయిపోతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమై ఆరు రోజులు కావస్తున్నా ఏ ఒక్క రోజు కూడా లోక్‌సభ, రాజ్యసభ సక్రమంగా పనిచేయలేదు. లోక్‌సభ మధ్యాహ్నం సమయంలో కొంత మేరకు జరుగుతున్నప్పటికీ రాజ్యసభలో మాత్రం ఎలాంటి పని జరగటం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారం సమయంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలన్నది కాంగ్రెస్ డిమాండ్. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సమయంలో, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి కసూరీకి తన నివాసంలో ఒక విందు ఇచ్చారు. ఈ విందుకు మన్మోహన్ సింగ్ మాజీ సైన్యాధ్యక్షుడు కపూర్, భారతదేశంలో పాకిస్తాన్ రాయబారి, తదితర ప్రముఖులు హాజరయ్యారు. నరేంద్ర మోదీ గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం చేసే సమయంలో ఈ విందు గురించి ప్రస్తావిస్తూ పాకిస్తాన్ నాయకులకు మణిశంకర్ అయ్యర్ ఇచ్చిన విందులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల గురించి చర్చించారు, కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ నాయకులతో కలిసి కుట్రలు చేస్తున్నారని మోదీ ఆరోపణలు కురిపించటం తెలిసిందే. ఈ ఆరోపణలను అడ్డం పెట్టుకుని పార్లమెంటును కాంగ్రెస్ స్తంభింపజేస్తోంది. నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పని పక్షంలో కనీసం వివరణ అయినా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసే ఆరోపణలకు పార్లమెంటులో క్షమాపణలు చెప్పటం ఏమిటి? వివరణ ఇవ్వవలసిన అవసరం ఏమిటని? బి.జె.పి ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ డిమాండ్ మేరకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పటం లేదా వివరణ ఇవ్వటం అనే ప్రసక్తే లేదని బి.జె.పి పలుమార్లు స్పష్టం చేసింది. ఇరుపక్షాల మధ్య నెలకొన్న ఈ ప్రతిష్టంభనకు పార్లమెంటు బలైపోతోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసే అరోపణలకు ఎలాంటి విలువ ఉండదనేది ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. తమ ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు ఎన్నికల ప్రచారం సమయంలో ఆయా రాజకీయ పార్టీలు, నాయకులు తమ ఇష్టానుసారం ఆరోపణలు చేస్తారు, చేసుకుంటారు. ఎన్నికలు ముగియగానే వీటన్నింటిన మరిచిపోవటం ఒక ఆనవాయితీ. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఈ ఆనవాయితీని పక్కకుతోసి నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలంటూ ఉభయ సభలను స్తంభింపజేస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గతంలో ఒకసారి నరేంద్ర మోదీని మృత్యు వ్యాపారి అని ఎన్నికల సమయంలో విమర్శించటం అందరికి తెలిసిందే.
సోనియాగాంధీ చేసిన ఆరోపణను నరేంద్ర మోదీ మరిచిపోలేదు. అయినప్పటికీ బి.జె.పి దీనిని అడ్డం పెట్టుకుని పార్లమెంటును స్తంభింపజేయలేదు. నరేంద్ర మోదీ అప్పుడప్పుడు సోనియాగాంధీ తనపై చేసిన ఆరోపణను ఉటంకిస్తూ ఆమెపై విమర్శలు గుప్పించటం ఇప్పటికి జరుగుతోంది. ఎన్నికల సమయంలో చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలను ఆ వెంటనే మరిచిపోవాలి తప్ప వాటిని పట్టుకుని వేలాడకూడదు. లోక్‌సభ, శాసనసభల ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు చేసే ఆరోపణలను తీవ్రంగా తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసుకునే ఆరోపణల్లో ఇసుమంతకూడా నిజం ఉండదనేది ఇరుపక్షాలకు తెలుసు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు చేసుకునే ఆరోపణలను ప్రజలు విశ్వసించరనేది మరో పచ్చి నిజం. వాస్తవానికి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు చేసే హామీలను కూడా ప్రజలు నమ్మరనేది అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటు శీతాకాల సమావేశాలు స్తంభింపజేయటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు.
ప్రజలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో చర్చించవలసి ఉన్నది. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరగవలసి ఉన్నది. రైతుల సమస్యలు, తుపానుల మూలంగా రైతులు, జాలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతుగా చర్చ జరిపి పరిష్కారాలను సూచించవలసిన అవసరం ఉన్నది. 2జి కుంభకోణం, ఆదర్శ్ కుంభకోణం, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధించిన పశు గ్రాసం కుంభకోణంపై సి.బి.ఐ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన తీర్పుల గురించి చర్చించవలసిన అవసరం ఎంతో ఉన్నది. త్రిపుల్ తలాక్ అంశం గురించి అత్యంత లోతుగా చర్చ జరిపి అత్యంత ముఖ్యమైన నిర్ణయం తీసుకోవలసి ఉన్నది. వెనుకబడిన కులాల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు సంబంధించిన బిల్లు చర్చకు రావలసి ఉన్నది. ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరగవలసి ఉండగా కాంగ్రెస్ ప్రతి రోజు గొడవ చేయటం ఏ విధంగా సమర్థనీయం. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన్మోహన్ సింగ్ తదితరులపై చేసిన వ్యాఖ్యలకు నరేంద్ర మోదీ క్షమాపణలు చెబుతారని కాంగ్రెస్ ఆశించటం హాస్యాస్పదం. నరేంద్ర మోదీ క్షమాపణలు గానీ, వివరణ ఇవ్వటం కానీ చేయడనేది తెలిసి కూడా కాంగ్రెస్ పార్లమెంటును స్తంభింపజేయటం క్షమించరాని విషయం. నరేంద్ర మోదీని రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఇతర మార్గాలను వెతుక్కోవటం మంచిది. సమావేశాలను అడ్డుకోవడం ద్వారా నరేంద్రమోదీ లేదా బి.జె.పిని కాంగ్రెస్ దెబ్బతీయాలనుకోవటం అవివేకం అవుతుంది. పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం ద్వారా కాంగ్రెస్ ప్రజల దృష్టిలో చులకన అవుతోంది తప్ప వారి మద్దతు సంపాదించటం లేదు. నరేంద్రమోదీ, బి.జె.పిని రాజకీయంగా దెబ్బ తీయాలంటే పార్లమెంటును సజావుగా కొనసాగిస్తూ ప్రభుత్వం తప్పులను సవివరంగా ప్రజలు ముందుకు తెచ్చేందుకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఉభయ సభల్లో పెద్దఎత్తున చర్చలు జరపటం ద్వారా బి.జె.పి ద్వంద్వ నీతిని, మాటల గారడీని దేశ ప్రజలకు వివరించాలి. పార్లమెంటులో ఆరోగ్యకరమైన చర్చల ద్వారా ఎన్.డి.ఏ ప్రభుత్వం అసమర్థతను ఎండగట్టగలిగినప్పుడే కాంగ్రెస్ రాజకీయంగా లాభపడుతుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశే్లషిస్తే కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు పెరుగుతోందనేది స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇంకా కొద్దిగా కష్టపడితే గుజరాత్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదనేది పచ్చి నిజం. నరేంద్రమోదీ, బి.జె.పి అధ్యక్షుడు అమిత్ షా స్వంత రాష్ట్రం కావటంతో వారు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారు మరింత జాగ్రత్తగా వ్యవహరించారు కాబట్టి అతి స్వల్ప మెజారిటీతో ఆరోసారి అధికారంలోకి రాగలిగారు. రాహుల్ గాంధీ తన గుజరాత్ రాజకీయాన్ని మరింత సమర్థంగా నడిపి ఉంటే అధికారం కాంగ్రెస్ తలుపు తట్టేది. కాంగ్రెస్ అధినాయకత్వం గుజరాత్ గుణపాఠాలను దృష్టిలో పెట్టుకుని దేశవ్యాపితంగా తమ రాజకీయానికి పదును పెట్టాలి. కర్నాటక, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ప్రజల విశ్వాసాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నించాలి. పార్లమెంటు వేదిక ద్వారా ప్రజలలోకి వెళ్లేందుకు కాంగ్రెస్ కృషి చేయాలి. పార్లమెంటులో ప్రజల సమస్యల గురించి చర్చించేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా వారి పక్షాన పోరాడుతున్నామనే విశ్వాసాన్ని కలిగించాలి. అయితే కాంగ్రెస్ పార్లమెంటులో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
పార్లమెంటును సజావుగా నడిపించే విషయంలో అధికార పక్షం కూడా తన వంతు గురుతర బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం లేదు. మన్మోహన్ సింగ్‌పై చేసిన ఆరోపణలను అడ్డం పెట్టుకుని పార్లమెంటును స్తంభింపజేసేందుకు కాంగ్రెస్ సిద్ధవుతోందనేది తెలిసి కూడా బి.జె.పి వౌనం వహించటం పెద్ద తప్పు. బి.జె.పి ప్రభుత్వాధినేతలు ముందే కాంగ్రెస్‌తో తెరవెనుక చర్చలు జరిపి ఈసమస్యను పరిష్కరించుకుంటే బాగుండేది. నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయటం లేదు, ఈ వివాదంపై ఒక వివరణ ఇస్తే సరిపోతుందంటూ రాజ్యసభలో కాంగ్రెస్ ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన సూచనను బి.జె.పి సద్వినియోగం చేసుకోలేకపోయింది. మన్మోహన్ సింగ్‌పై చేసిన విమర్శలకు నరేంద్రమోదీ పార్లమెంటులో వివరణ ఇవ్వకుండా పార్లమెంటు వెలుపల ఒక వివరణ ఇచ్చినా ఈ సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. మాజీ ప్రధాన మంత్రిని అవమానించాలనే ఆలోచన మోదీకి ఎంతమాత్రం లేదంటూ బి.జె.పి ఒక చిన్న ప్రకటన జారీచేసినా కాంగ్రెస్ శాంతించేది. బి.జె.పి ఈ వ్యూహరచనలో రాజకీయ చాతుర్యం, లౌక్యాన్ని ప్రదర్శించలేకపోయింది. పార్లమెంటు సమావేశాలు గత పది, పదిహేను సంవత్సరాల నుండి సక్రమంగా జరగడం లేదు. ఈ దురవస్థకు బాధ్యులైన రాజకీయ పార్టీలను శిక్షించే స్థాయికి ప్రజలు ఎదగాలి. రాజకీయ నాయకులు దారికి రావాలన్నా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య బతికి బట్టకట్టాలన్నా ప్రజలు నడుము బిగించక తప్పదు.

కె కైలాష్