ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

వరాలు లేకున్నా విలువైన బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ సహా ఐదారు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ముందు పెట్టుకుని ‘జనాకర్షక’ స్కీమ్‌లకు బదులు ప్రజలకు మేలు చేసే బడ్జెట్‌ను ప్రతిపాదించటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివేకంతో వ్యవహరించారని చెప్పకతప్పదు. ఈనెల ఒకటో తేదీన లోక్‌సభలో జైట్లీ సమర్పించిన 2018-19 వార్షిక బడ్టెట్‌లో వాస్తవ పరిస్థితులకు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం. సాధారణంగా ఎన్నికల ముందు వచ్చే బడ్జెట్‌లన్నీ జనాకర్షక పథకాలతో నిండి ఉంటాయి. ఆచరణ సాధ్యం కాని హామీలతో నేతలు ప్రజలకు అరజేతిలో వైకుంఠం చూపిస్తారు. మోదీ ఈ విధానానికి స్వస్తి పలకటం హర్షణీయం. బడ్జెట్‌లో రైతులు, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలకు పెద్ద పీట వేయటం, పది కోట్ల మంది బీద కుటుంబాలకు సాలీనా ఐదు లక్షల రూపాయల ఖర్చుతో వైద్య సహాయం అందజేసే ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్ని ప్రకటించటం మామూలు విషయం కాదు. ఈ పథకాలు రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లను కురిపిస్తామని ఇప్పుడే మనం చెప్పలేము. ఈ రెండు పథకాలూ ఎంతో మంచివి, అయితే ఇవి అమలుకు నోచుకున్నప్పుడే ప్రజలు మెచ్చుకుని ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు. సాలీనా ప నె్నండు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించడం సాహసోపేతమైన నిర్ణయం.
పేదవర్గాల ప్రజలు ఇలాంటి పథకం కోసం ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివంగత ము ఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఇలాంటి పథకాన్ని అ మలు చేసి మంచిపేరు సంపాదించకున్నారన్నది అందరికీ తెలిసిందే. ఆ పథకంతో పేదప్రజలు వైఎస్‌ఆర్‌ను దేవుడిగా కొలిచే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాంటి పథకానే్న అమలు చేస్తున్నారు. సగటు మనిషి మామూలు వైద్యం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడనేది అందరికీ తెలిసిందే. ప్రైవేట్ రంగంలో విస్తరిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు మెరుగైన వైద్యం పేరిట రోగులను నిలువునా దోచేస్తున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు అటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లలేక, ఇటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ తరుణంలోప్రధాని మోదీ ప్రకటించిన ‘ఆయుష్మాన్ భవ’ పథకం బీద ప్రజలకు వరం లాంటిదే. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఈ సంవత్సరం ఆగస్టు నుండి అమలు చేయాలనుకుంటోంది. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఈ పథకాన్ని అమలు చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ‘ఆధార్’తో అనుసంధానం చేయటం ద్వారా నిజమైన లబ్దిదారులకే ఈ పథకం వల్ల ప్రయోజనం అందేలా చూడాలి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నాయకులు హెచ్చరించినట్లు కేవలం పథకాన్ని ప్రకటించగానే పనైపోదు. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు పథకాన్ని ప్రకటించగానే బీద ప్రజలకు వైద్య సదుపాయం అందుతుందని అనుకోకూడదు. అరుణ్ జైట్లీ ప్రకటించినట్లు దేశంలోని యాభై కోట్ల మందికి ఈ పథకాన్ని విజయవంతంగా చేర్చ గలిగితే అంతకంటే మించిన ఘన విజయం మరొకటి ఉండదు. మోదీ ప్రభుత్వం ఈ ఆరోగ్య పథకాన్ని సమర్థంగా అమలు చేయగలిగితే ఆయనతోపాటు ఎన్డీఏ ప్రభుత్వ ఖ్యాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. లేనిపక్షంలో మోదీకి, ఎన్డీఏ సర్కారుకు జనం నుంచి శాపనార్థాలు తప్ప ఏమీ మిగలవు.
ఇక, ఐదు కోట్ల మంది మహిళలకు ఉచిత వంటగ్యాస్ (ఎల్పీజీ) కనెక్షన్ పథకం కూడా ఎంతో మంచిది. మోదీ ప్రభుత్వం ఇది వరకు రెండు కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకాన్ని అమలు చేసింది. పాత పథకం విజయవంతమైంది కాబట్టే మరో ఐదు కోట్ల మంది మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం ద్వారా మహిళా సాధికారతతో పాటు పర్యావరణాన్ని పరిరక్షిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మోదీ ప్రభుత్వం ఐదు లక్షల మంది మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ముందు- గతంలో అమలు చేసిన పథకం ఏ మేరకు విజయం సాధిచిందనేది అధ్యయనం చేయటం మంచిది. రెండుకోట్ల నుండి ఒకటిన్నర కోట్ల కనెక్షన్లు నిజమైన మహిళా లబ్దిదారులకు చెరితే ఆ పథకం విజయవతమైనట్లే. పాత పథకాన్ని అధ్యయనం చేయటం ద్వారా లొసుగులు, లోపాలను సరిదిద్దుకుని ‘ఐదు కోట్ల ఉచిత కనెక్షన్ల’ కార్యక్రమాన్ని ప్రారంభించటం మంచిది.
మోదీ సర్కారు రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌లో ఎంతో తెలివితో వ్యవహరించింది. పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించి, కర్షకులను గాలికి వదిలివేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం కొత్త నిర్ణయాలను అమలు చేసేందుకు ప్రయత్నించటం సమర్థనీయం. రైతులకు రుణమాఫీ, ఇతర రాయితీలు ప్రకటించటం వల్లనే ఆశించిన ఫలితాలు లభించవనేది పచ్చి నిజం. అందుకే రైతులకు రాయితీలు, తాయిలాలు ఇవ్వకుండా వారు తమ కాళ్లపై తాము నిలబడే విధానాలను అమలు చేయటం ఉత్తమం. మోదీ, జైట్లీ 2018-19 బడ్జెట్‌లో ఇలాంటి ప్రయత్నమే చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించటం, వ్యవసాయ సంబంధిత సాంకేతికతకు పెద్దపీట వేయటం, గిడ్డంగుల సౌకర్యాన్ని ఏర్పాటు చేయటం,లాజిస్టిక్ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం. ఈ చర్యలతో రైతులు ఆర్థికంగా బలం పుంజుకుంటారు. వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించేలా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా ప్రాసెస్డ్ ఆహారాన్ని ఎగుమతి చేసేందుకు వీల కల్పిస్తున్నారు. నాణ్యమైన ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను ఎగుమతి చేయగలిగితే రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అనునిత్యం జనం ఉపయోగించే టమాటా, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ పంటలు అధికంగా పండినా, తక్కువగా పండినా రైతుల ఆర్థిక వ్యవస్థతోపాటు సగటు మనిషి ఆర్థిక వ్యవస్థపై కూడా తీరని ప్రభావం పడుతోంది. టమాటాలు, ఉల్లిపాయల ధరల కారణంగా గతంలో ప్రభుత్వాలు కుప్పకూలిన సంఘటనలున్నాయి. టమాటాకు గిట్టుబాటు ధరలు లభించకపోవటంతో రైతులు వాటిని రోడ్లపై పారేవేసి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. టమాటాలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలకు సంబంధించి ధరల వ్యత్యాసాలు ఎప్పటికప్పుడు పునావృత్తం అవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు మోదీ ప్రభుత్వం ‘ఆపరేషన్ గ్రీన్’ను ప్రకటించటం రైతుల పాలిట ఆశాకిరణం. గతంలో సగటు మనిషి పాల కోసం పలు కష్టాలు పడవలసి వచ్చేది. ‘ఆపరేషన్ ఫ్లడ్’ తరువాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ‘ఆపరేషన్ గ్రీన్’ ద్వారా టమాటాలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలకు సంబంధించి గిట్టుబాటు ధర సమస్యకు శాశ్వత పరిష్కరం లభించే అవకాశం ఉంది.
బడ్జెట్‌ను వాస్తవ పరిస్థితుల ఆధారంగా పరిశీలించాలే తప్ప రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనల ఆధారంగా కాదు. అధికారంలో ఉండే పార్టీ ప్రతిపాదించే బడ్జెట్‌ను ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ ఆమోదించవు, సమర్థించవు. అందుకే మోదీ బడ్జెట్ పట్ల ‘సెనె్సక్స్’ అవిశ్వాసం ప్రకటించిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. విమర్శలు గుప్పించటం ప్రతిపక్షం లక్షణం. అందుకే పది కోట్ల కుటుంబాలకు ప్రకటించిన ఆరోగ్య పథకాన్ని కూడా రాహుల్ గాంధీతోపాటు ఇతర నాయకులు కూడా విమర్శించారు. గొప్ప పథకాలు ప్రకటించినంత మాత్రాన సరిపోదు, వాటి అమలుకు సరిపడే నిధుల కేటాయింపు కూడా జరగాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నా ఇదే పని చేసేది. ప్రతిపక్షాలు తమ రాజకీయ అవసరాల మేరకు బడ్జెట్‌ను తప్పుపట్టటం మానివేయాలి. బడ్జెట్‌లోని మంచిచెడ్డలను తెలుసుకునే స్థాయికి ప్రజలు ఎదుగుతున్నారు. అందుకే రాజకీయ నాయకులు కూడా బడ్జెట్‌లను విమర్శించే సమయంలో నిదానంగా ఆలోచించి మాట్లాడటం మంచిది. విమర్శ కోసం విమర్శించటం మానుకుని బడ్జెట్‌లోని నిజమైన లోపాలు, లొసుగులను ఎత్తి చూపించటం ద్వారా ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రయత్నించాలి. తమ రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రజల పేరుతో విమర్శలు గుప్పించటం అవివేకం అవుతుంది. బడ్జెట్ నిర్ణయాలు, కేటాయింపుల వల్ల సగటు మనిషి ప్రయోజనాలకు నిజంగా హాని జరిగితే సాక్ష్యాలతో చెప్పగలిగిన వాడే నిజమైన ప్రజా నాయకుడవుతాడు. ప్రతి బడ్జెట్‌లోనూ కొంత రాజకీయ ప్రయోజనం దాగి ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నా ఈ పని చేస్తారు. రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేసే బడ్జెట్ కేటాయింపులను సమర్థించగలిగే స్థాయికి రాజకీయ నాయకులు ఎదగాలి. *

కె కైలాష్