ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ సమర్థతపై సవాలక్ష సందేహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శతాధిక కాంగ్రెస్ పార్టీలో నేడు సమర్థ నాయకత్వం లేనందునే ఇపుడు తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనలు తెరమీదికి వస్తున్నాయి. ప్రధాని మో దీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఏర్పడే ఈ ‘ఫ్రంట్’లు బతికి బట్టకట్టగలవా? ఒకప్పుడు రాజీవ్ గాంధీ హ యాంలో కాంగ్రెస్ బలహీనమైనప్పుడు ప్రాంతీయ పార్టీల కూటములు ఏర్పడినా కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోలేకపోయాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ బలహీనపడటంతో ప్రాంతీయ పార్టీలు మరోసారి జతకట్టి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆరాటపడుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన రాహుల్‌తో కలసి పనిచేసేందుకు మిత్రపక్షాలు ముందుకు రావడం లేదు. బీజేపీ యేతర పార్టీల కూటమికి నాయకత్వం వహించే స్థాయి రాహుల్‌కు లేదని యూపీఏ మిత్రపక్షాలు, ఇతర విపక్షాలు భావస్తున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, మరి కొందరు నేతలు రాహుల్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధంగా లేరు. సోనియాతో కలసి పనిచేస్తాము తప్ప రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని వారంటున్నారు. సమర్థుడైన నాయకుడుగా రాహుల్ ఎదగకపోవటంతో భాజపాను ఎదుర్కొనేందుకు తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనలు ఊపిరి పోసుకుంటున్నాయి. పదిహేనేళ్లుగా ఎంపీగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజకీయాల్లో ఉన్న రాహుల్ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా సర్వం తానై వ్యవహరిస్తున్నాడు. అయితే- ఎంపీగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన నేర్చుకున్నది ఏమిటి? ఇప్పటికీ ఆయన రాజకీయంగా ఎదగలేదనే అభిప్రాయం సర్వత్రా ఉన్నది. కాబట్టే మమతా బెనర్జీ, శరద్ యాదవ్ లాంటి సీనియర్ నాయకులు ఆయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. ఆయనతో కలసి పని చేసేందుకు సైతం వారు ముందుకు రావటం లేదు. ఇటీవల ఢిల్లీకి వచ్చిన మమతా బెనర్జీ తృతీయ ఫ్రంట్ ఏర్పాటుపై పవార్ వంటి నేతలతో సమాలోచనలు జరిపారు. తెదేపా, తెరాస ఎంపీలు ఆమెను పార్లమెంటు ఆవరణలోని తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో కలుసుకుని చర్చలు జరిపారు. తాను తృతీయ ఫ్రంట్ నాయకురాలి హోదాలో పని చేస్తున్నట్లు ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి మమత వాకబు చేశారు. వీరిద్దరి మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని సమాచారం. రాహుల్‌ను కలిసేందుకు మమత ఆసక్తి చూపలేదు. అవసరమైనపుడు ఆయనతో మాట్లాడతానని ఆమె చెప్పడం గమనార్హం. తృతీయ ఫ్రంట్ గురించి మాట మాత్రంగా రాహుల్‌తో చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో ఆమె రాహుల్‌ను విస్మరించారని చెప్పకతప్పదు. తృతీయ ఫ్రంట్‌లో కాంగ్రెస్‌కు భాగం లేకుండా చేయడమంటే- జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి ప్రాధాన్యత లేదని ప్రకటించటమే. కాంగ్రెస్ నాయకత్వంలో ఏకం కావలసిన ప్రతిపక్షాలు- కొత్త నాయకత్వం కోసం ప్రయత్నించటం చూస్తుంటే కాంగ్రెస్‌కు ప్రాధాన్యం తగ్గుతోందని భావించాలి.
కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఉన్నప్పుడు విపక్షాల రాజకీయమంతా ఆమె నాయకత్వంలో జరిగేది. ఇప్పుడు రాహుల్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మమతా బెనర్జీ, శరద్ పవార్, కేసీఆర్, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర కోసం ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తన కుమారుడు కేటీఆర్‌ను చూడాలనుకుంటున్న కేసీఆర్ దృష్టి ఇప్పుడు జాతీయ రాజకీయాలపై మళ్లింది. ఆయన ఇప్పటికే కోల్‌కత వెళ్లి మమతా బెనర్జీతో మాట్లాడి వచ్చారు. ‘ఫ్రంట్’ ఏర్పాటు విషయమై ఆయన త్వరలోనే ఢిల్లీకి వచ్చి విపక్ష నేతలతో మంతనాలు జరుపనున్నారు. దీంతో చంద్రబాబు కూడా హస్తిన యాత్రకు సమాయత్తమవుతున్నారు. మోదీని ఢీకొట్టేందుకు తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కాంగ్రెస్‌కు ఎలాంటి పాత్ర లేకోవటం గమనార్హం. భాజపాను ఓడించేందుకు ‘ఫ్రంట్’ అవసరమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నా, వారి మాటలను వినిపించుకునే వారే లేరు. రాహుల్ నాయకత్వాన్ని మిత్రపక్షాలే కాదు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సైతం ఆమోదించలేకపోతున్నారు. ఆయన రాజకీయ వ్యవహారాల శైలి మూ లంగా సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ లాంటి వారు కూడా అయోమయంలో పడిపోయారు. కాంగ్రెస్‌లో తమ స్థానం, పాత్ర ఏమిటని ప్రశ్నించుకోవలసిన పరిస్థితుల్లో సీనియర్ నాయకులు పడిపోవటం ఆ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి నిదర్శనం. అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ వంటి సీనియర్ నాయకులను పెక్కన పెట్టి తన లక్ష్యాన్ని సాధించుకోవటం రాహుల్‌కు సాధ్యమవుతుందా? అనుభవ శూన్యులైన యువ నాయకులతో జాతీయ రాజకీయాలు నడిపించటం రాహుల్‌కు అసాధ్యమే. సీనియర్, జూనియర్ నాయకుల భాగస్వామ్యంతో పార్టీ రాజకీయాలు కొనసాగించటం మంచిది. ఇందుకు విరుద్ధంగా రాహుల్ వ్యవహరించిన పక్షంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది.
జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ సమీకరణల కోసం జరుగుతున్న ప్రయత్నమే తృతీయ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్. కాంగ్రెస్ మినహా ఏర్పడే ఈ ఫ్రంట్‌లు ఏ మేరకు నిలదొక్కుకుంటాయి? గతంలో కూడా కాంగ్రెసేతర పార్టీలు ఫ్రంట్‌గా ఏర్పడి కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా అవి అనతికాలంలోనే అదృశ్యమయ్యాయి. చంద్రశేఖర్, చరణ్‌సింగ్, నాయకత్వంలో కాంగ్రెసేతర పార్టీలు కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా నిలబడలేకపోయాయి. కేవలం పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కొనసాగింది. దేవెగౌడ, ఐకె గుజ్రాల్ నాయకత్వంలో కాంగ్రేసేతర ప్రభుత్వాలు స్వల్ప కాలంలోనే అదృశ్యమయ్యాయి. జాతీయ పార్టీల నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాలు పూర్తి కాలం అధికారంలో ఉండగలిగాయి. రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు అధికారం చెలాయించినా, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి లేదా ఫ్రంట్ ప్రభుత్వాలు నిలబడలేక పోయాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ, శరద్ పవార్, కేసీఆర్, చంద్రబాబు కాంగ్రేసేతర, బీజేపీ యేతర ఫ్రంట్‌లను ఏర్పాటు చేసినా- కేంద్రంలో అధికారం ప్రశ్నార్థకమే. రాష్ట్ర స్థాయి రాజకీయ దృక్కోణం వేరు, జాతీయ స్థాయి రాజకీయ దృష్టి కోణం వేరుగా ఉంటాయి. రాష్ట్ర స్థాయి రాజకీయం కేంద్రంలో పని చేయదు, కేంద్ర స్థాయి రాజకీయం రాష్ట్రాల్లో సత్ఫలితాలను ఇవ్వదు. ప్రాంతీయ స్థాయిలో జాతీయ రాజకీయాలు నడపాలని ప్రయత్నించడం సరికాదు.

- కె.కైలాష్ సెల్: 98115 73262