ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

తిలా పాపం తలా పిడికెడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు పూర్తిగా కొట్టుకుపోవటానికి విపక్షంతో పాటు అధికార పక్షం కూడా బాధ్యత వహించాలి. జా తీయ, ప్రాంతీయ పార్టీల పోటాపోటీ రాజకీయాల వల్లే- నెలరోజుల మలి విడత బడ్జెట్ సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా చర్చ జరగలేదు. ఒకటి, రెండు బిల్లులను గందరగోళం మధ్య ప్రభుత్వం పాస్ చేయించుకున్నది. ఎలాంటి చర్చ లేకుండానే అన్ని పద్దులను గిలెటిన్ పద్దతిలో ఆమోదించి బడ్జెట్‌కు పార్లమెంటులో ఆమోదముద్ర వేసుకున్నారు. మార్చి 5న ప్రారంభమైన మలి విడత బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు నుండే గందరగోళం మూలంగా స్తంభించిపోయి ఏప్రిల్ ఆరో తేదీన నిరవధికంగా వాయిదా పడి చరిత్ర సృష్టించాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కుంభకోణాలపై జాతీయ పార్టీలు గొడవ చేస్తే, తెదేపా, వైకాపాలు ప్రత్యేక హోదాపైన, ముస్లింల, ఎస్.టి రిజర్వేషన్లపై తెరాస, కావేరి వాటర్ బోర్డుపై అన్నా డీఎంకె సభను స్తంభింపజేశాయి. వైకాపా అవిశ్వాస తీర్మానం ఆయుధాన్ని ప్రయోగిస్తే తెదేపా సైతం అదే బాటలో ముందుకు సాగింది. అవిశ్వాస తీర్మానాలను అడ్డుకునేందుకు అన్నా డీఎంకె, తెరాస పార్టీలను అధికార భాజపా రంగంలోకి దింపడంతో ఉభయ సభలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు కూడా అవిశ్వాస తీర్మానాలకు వంత పాడాయి.
అధికార,ప్రతిపక్షాలు ఒకరినొకరు దెబ్బ తీసుకునేందుకు పార్లమెంటును పణంగా పెట్టటం క్షమించరాని నేరం. ఇరుపక్షాల నిస్సిగ్గు రాజకీయాలతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అప్రతిష్టకు గురైంది. అతిథుల గ్యాలరీల్లో కూర్చున్న వీక్షకులు ప్రజాప్రతినిధుల తీరుపట్ల తలలు దించుకున్నారు. వీరినా మనం ఎన్నుకున్నదంటూ తమను తాము నిందించుకున్నారు. అధికార, ప్రతిపక్షాలు తమ తప్పులను ప్రత్యర్థులపైకి నెట్టివేసేందుకు పరస్పరారోపణలు చేసుకున్నాయి. విలువైన సమావేశాలు వృథా అయినప్పటికీ ఉభయ పక్షాలూ ఎలాంటి ఆత్మవిమర్శకు పూనుకోలేదు. దాదాపు అన్ని పార్టీలూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం పార్లమెంటును దుర్వినియోగం చేశాయి. తెదేపా ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషధారణతో వచ్చి పార్లమెంటును నాటక రంగంగా మార్చివేశారు. తె దేపా రాజ్యసభ సభ్యులు ప్రత్యేక హోదా పేరుతో గొడవ చేసి, సభ వాయిదా పడిన అనంతరం అక్కడే ధర్నా చేసి పార్లమెంటు ప్రతిష్టను మరింత దిగజార్చారు. తెదేపాకు చెందిన లోక్‌సభ సభ్యులు సభ వాయిదా పడ్డాక సెంట్రల్ హాల్‌లో ధర్నా చేయగా, వారిని మార్షల్స్ బలవంతంగా బైటికి పంపించవలసి వచ్చింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చాంబర్‌లో వీరు ఆరు గంటల పాటు ధర్నా చేయటం పార్లమెంటు చరిత్రలో అరుదైన ఘటన. ఇదంతా ఏపీకి ప్రత్యేక హోదా పేరుతో జరిగిన రాజకీయం మాత్రమే. ప్రజల ప్రయోజనాల కోసం కాదనేది పచ్చి నిజం. ధర్నాలు చేసినా, అవిశ్వాస తీర్మానాలు పెట్టినా ‘హోదా’ రాదని వీరికి తెలుసు. ఈ నాటకమంతా వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జరిపినదే.
ప్రధాని మోదీకి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల పెద్దగా ప్రేమ లేదనేది ఈ సమావేశాలు రుజువు చేశాయి. 2014లో తొలిసారిగా పార్లమెంటులోకి ప్రవేశించినపుడు అక్కడి మెట్లకు నమస్కరించి మోదీ అందరి దృష్టినీ ఆకర్షించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకునేందుకే మోదీ అలా చేశారని అప్పట్లో భాజపా ప్రచారం చేసింది. ఇందులో ఎంత మాత్రం నిజం లేదనేది మలి విడత బడ్జెట్ సమావేశాలు రుజువు చేశాయి. ప్రజాస్వామ్యం పట్ల నిజంగానే మోదీకి నిబద్ధత, చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానాలపై చర్చకు అంగీకరించి ఉండవలసింది. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా తెరవెనక ఆదేశాల మేరకే అన్నా డీఎంకే సభ్యులు పోడియం వద్ద కావేరీ బోర్డు ముసుగులో గొడవ చేశారనేది జగమెరిగిన సత్యం. మొ దటి రెండు, మూడు రోజుల పా టు అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ పనె్నండు రోజుల పాటు అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరగకుండా అడ్డుకోవటాన్ని ఎంత మాత్రం సమర్థించలేం. సభలో తామే గొడవ సృష్టించి, ఆపై సభ ఆర్డర్‌లో లేదంటూ అవిశ్వాస తీర్మానాలు చర్చ కు రాకుండా చేయటం మోదీ మొండి పట్టుదలకు నిదర్శనం. ఆయన వల్ల స్పీకర్ వ్యవస్థకు కూడా చెడ్డపేరు వచ్చింది. మోదీ ఒత్తిడి వల్లనే స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. సాధారణంగా స్పీకర్ అధికార పక్షానికి చెందినా కొంతవరకూ నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తారు. ప్రతిపక్షం మాట చెల్లేందుకు కొంతైనా తోడ్పడవలసి ఉంటుంది. కానీ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఏకపక్షంగా వ్యవహరించక తప్పలేదు. ప్రతిపక్షానికి చెందిన ఎనభై మంది సభ్యులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించినా స్పీకర్ మాత్రం- అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే వారిని లెక్కించలేకపోతున్నానని ప్రకటించటం హాస్యాస్పదం కాదా?
లోక్‌సభలో మోదీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది. ఎన్.డి.ఏ నుండి తెదేపా తప్పుకున్నా, శివసేన ఎదురు తిరిగినా అవిశ్వాస తీర్మానం నెగ్గే పరిస్థితి లేదు. కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు ఆరోపించినట్లు మోదీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొనలేక పారిపోయారన్నది నిజం. అధికార, ప్రతిపక్షాలు చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయాల ఫలితంగా మలి విడత బడ్జెట్ సమావేశాలు గంగలో కలిసిపోయాయి. ముందస్తు ఎన్నికల కోసం ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని, బీసీ కులానికి చెందిన తనపై ద్వేషం కారణంగా విపక్షాలు కత్తికట్టి సమావేశాలను అడ్డుకున్నాయని, హింసను రెచ్చగొడుతున్నాయని మోదీ ఆరోపించటం దిగజారుడు రాజకీయాలకు ప్రత్యక్ష నిదర్శనం.

- కె.కైలాష్ సెల్: 98115 73262