ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘అభిశంసన’ పేరిట కుటిల రాజకీయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలిసారిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొన్ని విపక్షాలు అభిశంసన తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించటం అత్యంత కీలక అంశం. బలమైన ఆరోపణలు, వాటికి తగ్గ సాక్ష్యాలు ఉంటేనే చీఫ్ జస్టిస్‌ను అభిశంసించేందుకు ప్రయత్నించాలి. దేశంలో న్యాయవ్యవస్థకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తలవంటి వాడు. ‘తలను తొలగించేందుకు’ ప్రయత్నించటం అంటే న్యాయ వ్యవస్థను దెబ్బతీయటమే. దీపక్ మిశ్రాను తొలగించాలంటూ అభిశంసన నోటీసు ఇవ్వటం కాంగ్రెస్‌కు తగదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థను రాజకీయం చేసేందుకు సాహసించడం విచారకరం. న్యాయ వ్యవస్థను పరిరక్షించే పేరుతో ఈ ప్రయత్నం జరగడం ఎంతవరకూ సమర్థనీయం?
కోర్టులు తనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నందుకు ఆగ్రహించిన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థను తన చెప్పుచేతుల్లోకి తీసుకునేందుకు అలనాడు ఏం చేశారనేది అందరికీ తెలిసిందే. ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం పట్ల దీపక్ మిశ్రా సానుభూతితో వ్యవహరిస్తూ, వివిధ కేసుల్లో భాజపా సర్కారుకు అనుకూలించేలా తీర్పులు ఇస్తున్నారన్నది కాంగ్రెస్ ఆరోపణ. గుజరాత్‌లో సొహరాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసును విచారించిన జస్టిస్ లోయా మరణంపై మళ్లీ దర్యాప్తు జరిపించాల్సిన అవసరం లేదంటూ దీపక్ మిశ్రాతోపాట మరో ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు తీర్పు ఇచ్చిన మరుసటి రోజే ఏడు ప్రతిపక్షాలు ఆయనపై అభిశంసన తీర్మానం ప్రతిపాదించటం గమనార్హం. లోయా ఆకస్మిక మరణం వెనక సోహరాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో నిందితుడైన భాజపా అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉన్నదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. జస్టిస్ లోయాది సహజ మరణం కాబట్టి దర్యాప్తు అవసరం లేదంటూ దీపక్ మిశ్రాతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాంగ్రెస్‌కు రుచించలేదు. అందుకే కాంగ్రెస్ నాయకత్వంలో రెండు వామపక్షాలు, ఎన్‌సిపి, ఎస్‌పి, బిఎస్‌పిలు దీపక్ మిశ్రాను తొలగించాలంటూ అభిశంసన నోటీసును ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడికి అందజేశాయి. అభిశంసన నోటీసులో పేర్కొన్న ఐదు ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు సరిపోవు. ఈ వాస్తవాన్ని స్వయంగా కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, సల్మాన్ ఖుర్షీద్‌లు బాహాటంగా ప్రకటించారు. మిశ్రాపై అభిశంసన తీర్మానం అవసరం లేదని తాము చెబుతున్నా పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు చెబుతున్నారు. స్వల్ప అంశాల ఆధారంగా అభిశంసన తీర్మానం పెట్టటం ఎంత మాత్రం సమర్థనీయం కాదంటూ సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ అధినాయకత్వంపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. అభిశంసన నోటీసును కాంగ్రెస్‌కు సన్నిహితంగా ఉండే కొన్ని మిత్రపక్షాలు సైతం సమర్థించటం లేదు. డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలు అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసేందుకు నిరాకరించాయి. అభిశంసించేందుకు కాంగ్రెస్ చేసిన ఐదు ఆరోపణల్లో ఎంత మాత్రం బలం లేదని, వాటి ఆధారంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ను తొలగించాలని డిమాండ్ చేయటం సమర్థనీయం కాదని డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, దీపక్ మిశ్రాపై ఏడు ప్రతిపక్షాలు చేసిన ఐదు ఆరోపణలు అభిశంసనకు ఎంత మాత్రం సరిపోవని సుప్రీం మాజీ న్యాయమూర్తి కె.టి.్థమస్ చెబుతున్నారు. ఐదు ఆరోపణల్లో ఒకటి మాత్రమే దీపక్ మిశ్రా పనితీరుకు సంబంధించింది, మిగతావి పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని పలువురు న్యాయకోవిదులు అంటున్నారు. కేసుల కేటాయింపు ఆరోపణ ఒక్కటే చీఫ్ జస్టిస్ పనితీరుకు సంబంధించిన ఆరోపణ. అయితే కేసుల కేటాయింపు విషయంలో ప్రతి ప్రధాన న్యాయమూర్తి తమదైన పద్ధతిలో వ్యవహరిస్తుంటారు. మిశ్రా దీనికి మినహాయింపు కాదు కాబట్టి ఆయన పనితీరును తప్పుపట్టవలసిన అవసరం లేదని మాజీ న్యాయమూర్తులు చెబుతున్నారు. మిశ్రా కొన్ని కేసులను తనకు అనుకూలంగా ఉండే వారికే కేటాయిస్తున్నారంటూ కొందరు న్యాయమూర్తులు చేసిన ఆరోపణలను కూడా మాజీ న్యాయమూర్తులు కొట్టివేస్తున్నారు. తమకు కేసులు కేటాయించటం లేదంటూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఆరోపించటం ఉచితం కాదు, అది చిన్నపిల్లల చేష్టగా ఉందని వారంటున్నారు. సుప్రీం న్యాయమూర్తులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా హుందాగా వ్యవహరించాలే తప్ప ఇలా చిన్నపిల్లల మాదిరిగా తమకు మంచి కేసులు కేటాయించటం లేదంటూ విమర్శలు గుప్పించటం మంచిది కాదని జస్టిస్ కె.టి.్థమస్ అంటున్నారు. కాగా, గతంలో కొందరు న్యాయమూర్తులను అభిశంసించేందుకు జరిగిన ఏ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. సుప్రీం, హైకోర్టుల న్యాయమూర్తులను అభిశంసించేందుకు సంబంధించిన నోటీసులను ఒకటి,రెండు కేసుల్లో ఆదిలోనే తిరస్కరించగా, మరి కొన్ని కేసుల్లో దర్యాప్తు కోసం త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేసేవరకు వెళ్లాయి. త్రిసభ్య కమిటీల నివేదికల తరువాత అవి లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ద్వారా తిరస్కారానికి గురి అయ్యాయి. తాజాగా ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు కూడా అదే పద్ధతిలో దీపక్ మిశ్రాపై అభిశంసన తీర్మానాన్ని తిరస్కరించారు.
గతంలో జస్టిస్ రామస్వామిపై బిజెపి తదితర పార్టీలు పెట్టిన అభిశంసన తీర్మానంపై లోకసభలో ఓటింగ్ జరిగినా కాంగ్రెస్ బాయ్‌కాట్ చేయగా, మూడింట రెండు వంతుల మెజారిటీ లభించక అది వీగిపోయింది. జస్టిస్ రామస్వామిపై వచ్చిన ఆరోపణలతో పోలిస్తే దీపక్ మిశ్రాపై కాంగ్రెస్, ఇతర విపక్షాలు చేసిన ఐదు ఆరోపణలు అసలు ఆరోపణలే కావని చెప్పాలి. గతంలో అభిశంసన తీర్మానాలేవీ ఆశించిన లక్ష్యాలను తెచ్చిపెట్టలేదనేది రాహుల్ గాంధీ, శరద్ పవార్, సీతారాం ఏచూరి, డి.రాజాలకు తెలియక కాదు. 2019 లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలన్నదే వీరి ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యసాధన కోసం వీరు న్యాయవ్యవస్థను సైతం భ్రష్టుపట్టించేందుకు వెనకాడటం లేదు. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన భాణం ఎక్కుపెట్టటం వెనక అయోధ్య-బాబ్రీ మసీదు కేసు దాగి ఉంది. దీపక్ మిశ్రా విచారిస్తున్న ఈ కేసుకు సంబంధించిన తీర్పు త్వరలోనే వస్తుందని భావిస్తున్నారు. ఆయన ఇచ్చే తీర్పు బిజెపికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఆ తీర్పుతో వచ్చే ఎన్నికల్లో ఎన్‌డిఏకు భారీగా ఓట్లు తెచ్చిపెట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. అయోధ్య వివాదంపై తీర్పు ఇవ్వకముందే మిశ్రా ప్రతిష్టను దెబ్బ తీయటం ద్వారా తీర్పు ప్రభావాన్ని తగ్గించాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఈ వ్యూహం వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశాలే అధికంగా ఉంటాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు వస్తే, దాన్ని దెబ్బ తీయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తే మెజారిటీ ప్రజల ఆగ్రహానికి ఆ పార్టీ గురి కాక తప్పదు.

- కె.కైలాష్ సెల్: 98115 73262