ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పథకాలు జాస్తి.. అమలు నాస్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ గత నాలుగేళ్లుగా దేశం కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నారనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం ఉండనక్కర లేదు. ఆయన రోజూ పద్దెనిమిది గంటల చొప్పున పని చేస్తున్నారు. దేశ ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నట్టు ఆయన చెబుతుంటారు. అయితే, ఆ పథకాల వల్ల సగటు మనిషికి మంచి రోజులు వచ్చాయా? అన్నదే ప్రశ్న. ‘అచ్చేదిన్’ (మంచిరోజు) అనే నినాదాన్ని మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఊదరగొట్టింది. ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ (అందరి వెంట, అందరి అభివృద్ధి) అన్న మాటలను ఆయన చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారా? ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, స్టాండ్ అప్ ఇండియా,స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, జనధన్ యోజన, సుకన్య యోజన.ముద్ర యోజన, పంటల బీమా పథకం, వయో వృద్ధుల సంక్షేమం, ఆదర్శ గ్రామ పథకం, ప్రధాన మంత్రి జన ఔషధీ యోజన, డిజిటల్ ఇండియా, ఇంద్రధనుష్, స్మార్ట్ సిటీ, వారసత్వ నగరాల అభివృద్ది, ఉడాన్ యోజన, డిజీ లాకర్ యోజన, సాగర్‌మాలా, ఉజ్వల్ యోజన.. ఇలా ఎనె్నన్ని పథకాలో..!
ఆకర్షణీయ పథకాలకు లోటు లేదు, అయితే- వాటి అమలులో మోదీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చిత్తశుద్ధిని చూపడం లేదన్న భావన కలుగుతోంది. పథకాలపై మంత్రుల కంటే అధికారుల పర్యవేక్షణ అధికం కావటంతో అవి సమక్రంగా అమలు కావడం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. స్వచ్ఛ భారత్ అత్యంత అద్భుతమైన కార్యక్రమమైనప్పటికీ చివరకు అది ఓ ప్రహసనంలా మారింది. ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రత్యేకంగా చెత్తను పోయించి, దానిని తొలగిస్తున్నట్లు కేంద్రమంత్రులు గొప్పగా ఫొ టోలు దిగారు. పార్లమెంటు సభ్యుల ఆదర్శ గ్రామ పథకం కూడా ఈ కోవకు చెందిందే. లోక్‌సభ, రాజ్యసభల్లో మొత్తం ఎంపీల సంఖ్య 790. ఆదర్శ గ్రామం పథకం ప్రకారం దేశంలో కనీసం 790 గ్రామాలు ఈ పాటికి వెలిగిపోతూ ఉండాలి. ఆదర్శ గ్రామాలకు మిగతా నిధులతో పాటు ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఈ పథకం తీరు ఇలా ఉంటే ఇక మిగతా గ్రామాలు ఎప్పుడు అభివృద్ధి చెందుతాయి? స్వచ్ఛ భారత్ పథకానికి కేటాయించిన నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ‘ఇంటింటికీ మరుగుదొడ్డి’ ఎంతో మంచి పథకం. గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఉద్దేశించిన ఈ పథకం ఆశించిన స్థాయిలో అమలు కావటం లేదు.
జనధన్ పథకం కింద కోట్లాది మంది పేదలు బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించారు. వంటగ్యాస్‌పై సబ్సిడీ వంటివి నేరుగా ఈ ఖాతాల్లోకి వెళుతున్నాయి. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకానికి చిల్లులు పడుతున్నాయి. బ్యాంకు అధికారుల అవినీతి వల్లే పెద్దనోట్ల రద్దు వ్యవహారం హాస్యాస్పదంగా తయారైంది. పెద్దనోట్ల రద్దుతో నల్లధనాన్ని వెలికి తెచ్చేందుకు జరిగిన మోదీ ప్రయత్నం బ్యాంకు అధికారుల అవినీతికి బలై పోయింది. రిజర్వు బ్యాంకు అధికారులు సైతం రద్దైన నోట్లను మార్చుకునేవారి నుంచి కమీషన్లు తీసుకోవడం అవినీతికి అద్దం పట్టింది. దాదాపు రెండు లక్షల బోగస్ కంపెనీల వ్యవహారం వెలుగులోకి వచ్చినా నల్లధనం మాత్రం వెలుగులోకి రాలేదు. నల్లధనం తెల్లధనంగా మారడంలో కీలకపాత్ర వహించిన బ్యాంకు అధికారులను శిక్షించటంలో మోదీ విఫలమయ్యారు. పెద్దనోట్లను రద్దు చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.
పంటల బీమా పథకం నీరు కారిపోవటానికి కూడా బ్యాంకు అధికారులే కారణమనే మాట వినిపిస్తోంది. రాజస్తాన్‌లో నిఘా సంస్థలు ఐదుగురు సీనియర్ బ్యాంకు అధికారులను అరెస్టు చేశారంటే- ఈ పథకంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. పంటల బీమా పథకానికి కేంద్ర ప్రభుద్వం దాదాపు పనె్నండు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే రైతులకు చేరింది కేవలం వెయ్యి కోట్లు మాత్రమే. మిగతా పదకొండు వేల కోట్ల రూపాయలు ఎటుపోయాయి? పంటల బీమా పథకం కొన్ని బీమా కంపెనీలకు వర ప్రసాదంగా మారింది. మరోవైపు స్కిల్ ఇండియా పథకం కూడా అవినీతికి నిలయమైంది. యువతకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చే బాధ్యతను కొన్ని స్వచ్ఛంద సంస్థలకు, ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. శిక్షణ ఇచ్చేందుకు వెలసిన స్వచ్ఛంద సంస్థలు డబ్బు చేసుకుంటున్నాయి.
ప్రత్యక్ష బదిలీ పథకం (డైరక్ట్ బెనిఫిట్ స్కీం) ద్వారా 3,87,596 కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. 13,45,46,471 మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారట! దేశంలో దాదాపు ప్రతి గ్రామానికి విద్యుత్ సరఫరా అందజేశామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద కోటి ఇళ్లు నిర్మించటంతో పాటు 3,67,259 గ్రామాల ప్రజలిప్పుడు స్వంత మరుగుదొడ్లను ఉపయోగిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఉజ్వల పథకం కింద 3.98 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తున్న ‘ఆయుష్మాన్ భారత్’లో ఐదు కోట్ల బీద కుటుంబాలకు వైద్య సౌకర్యాలను అందజేయాలన్నది మోదీ సంకల్పం. ప్రధాని చేపట్టిన ప్రతి పథకం ఎంతో మంచిది. ఇలాంటి కార్యక్రమాలు దేశానికి ఎంతో అవసరం. కానీ, పథకాలను ప్రకటించటంలో చూపిస్తున్న ఉత్సాహం వాటిని అమలు చేయటంలో చూపించటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోందనేది మోదీ ఆలోచించాలి. పథకాలను పర్యవేక్షించే బాధ్యతను అధికారులకు బదులు ప్రజాప్రతినిధులకు కల్పించాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా పనిచేస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు తగిన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయోజనాల కోసం తాపత్రయ పడాల్సిన అవసరం మోదీకి లేదు. రాజకీయ అవసరాల కోసం తన పథకాల గురించి ప్రచారం చేసుకోవటంలో తప్పులేదు కానీ వాటి గురించి ఊదరగొట్టటం సమర్థనీయం కాదు. పథకాల ప్రచారంతోపాటు వాటి అమలుకు కూడా సముచిత ప్రాధాన్యత ఇచ్చినపుడే- ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’ సాధ్యమవుతుంది.
*

- కె.కైలాష్ సెల్: 98115 73262