ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్
ఆలోచన తక్కువ.. ఆవేశం ఎక్కువ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ అని మరోసారి రుజువైంది. మా జీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడేంత వరకు వేచి ఉండకుండానే- నోటికొచ్చింది మాట్లాడి తమ పరువు తామే తీసుకున్నారు. అందరికీ సహసం గురించి పాఠాలు చెప్పేవారు తమకు అసహనం ఎక్కువ నిరూపించుకున్నారు. స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రణబ్ వెళుతున్నట్లు తెలియగానే కాంగ్రెస్ నాయకులంతా ఆయనపై మూకుమ్మడిగా విమర్శలు చేశారు. జీవితాంతం కాంగ్రెస్ వాదిగా ఉంటూ, లౌకిక వాదానికి కట్టుబడిన ప్రణబ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లటం అక్రమం అంటూ కాంగ్రెస్ శ్రేణులు విమర్శలు గుప్పించాయి. రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేశ్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రణబ్‌కు లేఖలు రాశారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా కాంగ్రెస్‌కు ప్రణబ్ వెన్నుపోటు పొడుస్తున్నారంటూ ఇంకొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.
కాంగ్రెస్‌లో ఉంటూ అన్ని పదవులూ అనుభవించిన ప్రణబ్ చివరకు తన నిజ స్వరూపాన్ని బైట పెట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర మంత్రులు పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే లాంటి వారు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు గుణపాఠం నేర్పించేలా ప్రణబ్ ముఖర్జీ ఏం మాట్లాడాలనేది సూచించారు. కాంగ్రెస్ నాయకత్వం ఇంతటితో ఆగకుండా ప్రణబ్ కుమార్తె శర్మిష్టను రంగంలోకి దించి తండ్రిపై విమర్శలు చేయించారు. తాను భాజపాలో చేరుతున్నట్టు జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండిస్తూ, తండ్రి వైఖరిని తప్పుపట్టారు. తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఏకంగా తండ్రికే హితవు చెప్పేందుకు ప్రయత్నించి ఆమె నవ్వుల పాలయ్యారు. ప్రణబ్‌పై కాంగ్రెస్‌కు విశ్వాసం లేకపోవటం సిగ్గు చేటు. కాంగ్రెస్‌కు వివిధ స్థాయిల్లో ఆయన ఎనలేని సేవలు చేశారు. ఈ సేవలకు గుర్తింపుగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహించారు. చివరికి రాష్టప్రతి పదవిని కూడా చేపట్టారు.
2004లో కాంగ్రెస్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను ప్రధాని పదవికి ఎంపిక చేస్తారని ప్రణబ్ ఆశించినా ఫలితం దక్కలేదు. మన్మోహన్ సింగ్‌ను సోనియా ప్రధాన మంత్రి చేశారు. దీంతో ఏమీ చేయలేని పరిస్థితిలో మన్మోహన్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ప్రణబ్ పనిచేయవలసి వచ్చింది. ఒకప్పుడు ప్రణబ్ ఆర్థికమంత్రిగా పని చేసినప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉన్నారు. సోనియా రాజకీయం వల్ల ప్రణబ్ తనకింద పని చేసిన జూనియర్ అధికారి మన్మోహన్ ప్రధాని పదవి చేపట్టినప్పుడు ఆయన కింద పని చేయవలసి వచ్చింది. తనను ప్రధాన మంత్రిగా నియమించనందుకు బాధపడిన ప్రణబ్ ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి హాజరై పగ తీర్చుకుంటున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ప్రణబ్ రాష్టప్రతి పదవిని చేపట్టటం సోనియా సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఎంత మాత్రం ఇష్టపడలేదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒత్తిడితో ప్రణబ్‌ను రాష్టప్రతిగా సోనియా బలపరచక తప్పలేదు.
కాగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ హాజరు కాకుండా చేసేందుకు కాంగ్రెస్ నాయకులు చేయని ప్రయత్నం లేదు, వేయని ఎత్తు లేదు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఆర్‌ఎస్‌స్‌ను అంటరాని సంస్థగా చిత్రీకరిస్తోంది. ముస్లిం, ఇతర మైనారిటీల ఓట్ల కోసమే కాంగ్రెస్ ఒక వ్యూహం ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌పై మతోన్మాద ముద్ర వేసింది. కాంగ్రెస్ చేసిన ఈ రాజకీయానికి వామపక్షాలతోపాటు ఇతర పార్టీలు కూడా వంత పాడాయి. ప్రజాస్వామ్యం గురించి అనునిత్యం కోడై కూసే కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆర్‌ఎస్‌ఎస్‌ను అంటరాని సంస్థగా ముద్ర వేయటం ఎంత వరకు సమంజసం. దేశం కోసం అహర్నిశలు పనిచేసే ఒక దేశీయ సంస్థపై అంటరానిదనే ముద్ర వేయటం అప్రజాస్వామికం కాదా? దేశాన్ని మరోసారి ముక్కలు చేసేందుకు కుట్ర చేస్తున్న ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇస్తున్న పార్టీలు, సంస్థలతో కలిసి పని చేసేందుకు లేని అభ్యంతరం ఆర్‌ఎస్‌ఎస్‌తో పని చేసేందుకు ఎందుకు ఉండాలి? ప్రణబ్ ముఖర్జీ నాగపూర్‌లో చేసిన ప్రసంగం ఆర్‌ఎస్‌ఎస్‌కే కాదు- కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర ప్రతిపక్షాలకు కనువిప్పు కా వాలి. బహుళత్వం, సహనశీలత భారత దేశం ఆత్మ అంటూ ప్రణబ్ తన సహజ ధోరణిలో ప్రసంగించారు. ద్వేషం, అసహనం మన దేశం గుర్తింపును దెబ్బ తీస్తుందంటూ ఆయన కాంగ్రెస్ వాదుల మనసులోని మాటను స్వయం సేవకులకు వినిపించారు. ప్రణబ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమంలో ఒక కాంగ్రెస్ వాదిగానే మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను తప్పుపట్టటం లేదా సమర్థించటం అనేది చేయలేదు. తాను చెప్పదలచుకున్నది కుండ బద్దలు కొట్టినట్లు చెప్పివచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కేశవ్ బలీరాం హెడ్గేవార్ నివాసానికి వెళ్లి ‘్భరతమాత ముద్దుబిడ్డ’ అని కితాబు ఇచ్చారు.
ప్రణబ్ ప్రసంగాన్ని అందరూ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకులు సైతం ఆయన వ్యవహరించిన తీరును సమర్థించక తప్పలేదు. ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి వెళుతున్నందుకు మొదట ప్రణబ్‌ను తిట్టిపోసిన కాంగ్రెస్ నాయకులే ఆయన ప్రసంగం విన్నాక ప్రశంసలతో ముంచెత్తారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అద్దం చూపించి వచ్చారంటూ కితాబు ఇచ్చారు. ప్రణబ్‌ను విమర్శించిన వారే ఆ తరువాత ప్లేటు ఫిరాయించి ప్రశంసలు కురిపించటం కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణికి అద్దం పట్టింది. ‘అడుసు తొక్కనేల? కాలు కడగనేల?’ అన్నట్టు తొందరపడి అనాలోచితంగా, అసహనంతో ప్రణబ్‌ను ఎందుకు విమర్శించాలి? ఆయన ప్రసంగం విన్న తరువాత నిస్సిగ్గుగా ఎందుకు మెచ్చుకోవాలి? కాంగ్రెస్‌కు ఒక పద్దతి లేదా? తెలియదా? ప్రణబ్‌పై కాంగ్రెస్ నేతలు ఎన్ని విమర్శలు గుప్పించినా ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వారి హుందాతనానికి నిదర్శనం. ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రణబ్ గౌరవ మర్యాదలను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. ఆర్‌ఎస్‌ఎస్ సమావేశానికి ప్రణబ్ వెళ్లడాన్ని వివాదాస్పదం చేయవలసిన అవసరం లేదంటూ, హుందాగా ఎలా వ్యవహరించాలనేది కాంగ్రెస్ నాయకులకు ఆయన చూపించారు. ఏటా ఒక ముఖ్యమైన నాయకుడిని ఆహ్వానించడం తమ ఆనవాయితీ అని, ఆ ప్రకారమే ప్రణబ్‌ను పిలిచామని, ఆయన రాకపై కాంగ్రెస్ ఎంత అవివేకంగా వ్యవహరించిందో చెప్పకనే చెప్పారు. నాగపూర్ సమావేశం తరువాత- ప్రణబ్‌లో గానీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో గానీ ఎలాంటి మార్పు ఉండదన్నారు. భిన్నత్వాన్ని ఆమోదించటం మన సాంసృతిక వారసత్వమంటూ మోహన్ భగవత్ ఆర్‌ఎస్‌ఎస్‌ను అంటరాని సంస్థగా చూస్తున్న కాంగ్రెస్, ఇతర పార్టీలకు గుణపాఠం నేర్పించారు.