ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘జమిలి’కి ఎందుకు జంకారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ శాసనసభల ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించటంతో రానున్న ఆరునెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగనుంది. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో రాజుకున్న ఈ రాజకీయ వేడి 2019 ఏప్రిల్, మేలో జరిగే లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో చల్లారుతుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికల పరిణామాలకు అద్దం పడతాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, దాని మిత్రపక్షాలు విజయం సాధిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగుపడతాయి. రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే లోక్‌సభ ఎన్నికల్లో యూపీఏ కూటమికి అవకాశాలు మెరుగుపడతాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శాయశక్తులా కృషి చేయవలసి ఉంటుంది. రాజకీయ వ్యూహం ఏ మాత్రం దెబ్బతిన్నా వీరు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ కారణంగానే ఐదు రాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిపించేందుకు భాజపా నాయకత్వం తెరవెనక కొంత ప్రయత్నించినా ఆ తరువాత తమ మనసు మార్చుకున్నది. దాదాపుమూడు సంవత్సరాల నుండి జమిలి ఎన్నికల పాట పాడుతున్న మోదీ ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిపించేందుకు ఎందుకు గట్టిగా ప్రయత్నించలేదు? దీనికి కారణాలేమిటనేది బైటికి రావటం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరుగుతాయని పలువురు భాజపా నాయకులు అధికారికంగా, అనధికారికంగా పలుమార్లు చెప్పారు. కానీ ఇప్పుడు వారు చెప్పినట్లు జరగటం లేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా ఓడిపోవటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పదిహేను సంవత్సరాల నుండి భాజపా అధికారంలో కొనసాగుతోంది. రాజస్థాన్‌లో ఒక సారి కాంగ్రెస్ గెలిస్తే, మరోసారి భాజపా గెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా ప్రభుత్వాలు కొంతవరకు సమర్థవంతంగానే పనిచేశాయి. గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌తో పోలిస్తే భాజపా ముఖ్యమంత్రులు బాగా నే పని చేశారని చెప్పుకోవచ్చు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె ఇష్టానుసారం వ్యవహరించటం వల్లనే భాజపా ఈసారి అక్కడ విజయం సాధించటం కష్టం. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ సునాయసంగా విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే, తెలివిగా ఎన్నికల ప్రచారం చేసుకుంటే ఛత్తీస్‌గఢ్‌లో భాజపా నాలుగోసారి అధికారంలోకి రావచ్చు. రాహుల్ గాంధీ రాజకీయ పరిణతిని ప్రదర్శించి మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌తోపాటు ఛత్తీస్‌గఢ్‌లోనూ అధికారంలోకి రావచ్చు.
మాయావతి నాయకత్వంలోని బి.ఎస్.పి, అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకుంటే భాజపాకు ఛత్తీస్‌గఢ్‌లో గడ్డు పరిస్థితి ఉండేది. మరోవైపు బిఎస్‌పితో పొత్తుల విషయంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను దారికి తీసుకురావటంలో రాహుల్ విఫలమయ్యారు. సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యవహరించిన తీరు మూలంగా బిఎస్‌పి, కాంగ్రెస్‌ల మధ్య సీట్లసర్దుబాటు కుదరలేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ తనంత తానుగా బిజెపిని ఓడించగలదు. కానీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఆ పరిస్థితి లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో బిఎస్‌పితోపాటు సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఓటర్లు ఉన్నారు. రాజస్థాన్‌లో ఈ రెండు పార్టీలకు పెద్దగా ఓటర్లు లేరు. ఈ నేపథ్యంలో రాహుల్ చాకచక్యంతో వ్యవహరించి ఉండాల్సింది. కాంగ్రెస్, బిఎస్‌పి, సమాజ్‌వాదీ పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భాజపా బలహీనపడేది. మాయావతి, అఖిలేష్ యాదవ్‌లు కాంగ్రెస్‌కు దూరం కావటంతో భాజపా విజయావకాశాలు మెరుగయ్యాయి.
కాంగ్రెస్ నాయకత్వంలోని మహాకూటమి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధిస్తే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను ఓడించటం సునాయసమవుతుంది. మహాకూటమి ఏర్పడకపోవటం వెనక భాజపా అధ్యక్షుడు అమిత్ షా హస్తం ఉందనే మాట అక్కడక్కడా వినిపిస్తోంది. ఈ ఏడాది ఐ దు అసెంబ్లీ ఎన్నికల్లో, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో భాజపా విజయం సాధించగలుగుతుం దా? అనే అనుమానం చాలామందికి ఎప్పటి నుండో కలుగుతోంది. ఈ అనుమానం ఆధారంగా తన రాజకీయ వ్యూహాన్ని రచించుకున్న మొదటి నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే ఆయన లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాలని పావులు కదిపి విజయం సాధించారు. దాదాపుఎనిమిది నెలల ముందే శాసనసభను రద్దు చేసుకుని, ముందస్తు ఎన్నికలకు సిద్ధమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో విజయం వరించపోయినా కేసీఆర్‌కు జరిగే నష్టం ఏదీ ఉండదు. తెలంగాణలో అధికారంలో ఉండటం ఆయనకు అత్యంత ముఖ్యం. లోక్‌సభ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సాధిస్తే ఆయన రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం గనుక లభిస్తే- రాష్ట్రంలో తన కుమారుడు కేటీఆర్‌ను సీఎంగా నియమించి, ఆయన కేంద్రంలో కీలక పాత్ర నిర్వహించగలుగుతాడు. లోక్‌సభ ఎన్నికలతో టు జరగవలసిన తెలంగాణ శాసనసభ ఎన్నికలను విడిగా జరిపించుకునేలా ఆయన మోదీని ఒప్పించగలిగారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో భాజపా ఓడిపోయిన పక్షంలో ఆ ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై పడుతుందని తెలిసినా, జమిలి ఎన్నికలకు మోదీ ఎందుకు ప్రయత్నించలేదు? శాసనసభల ఎన్నికలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిపేందుకు తాము సిద్ధమేనని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ఓ.పి.రావత్ పలుమార్లు మీడియా ముందు చెప్పినా, మోదీ మాత్రం జమిలి ఎన్నికల కోసం పట్టుపట్టలేదు. జమిలి ఎన్నికలపై భాజపా నేతలు ఎందుకు వెనక్గి తగ్గారన్నది అంతుబట్టని వ్యవహారం. రాజస్థాన్‌లో వసుంధర రాజె ప్రభుత్వం పట్ల ప్రజలు ముఖ్యంగా రైతులు మండిపడుతున్నారనేది భాజపా నేతలకు తెలుసు. మధ్యప్రదేశ్‌లో ‘వ్యాపం కుంభకోణం’ తమ పరువు తీసిందని భాజపా నేతలు వాపోతున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు పదిహేను సంవత్సరాలుగా అధికారంలో ఉన్నందున ప్రజల్లో ప్రభుత్వం పట్ల సహజంగానే వ్యతిరేకత చోటుచేసుకుంటుంది. ఈ సమస్యలన్నింటికీ జమిలి ఎన్నికలే పరిష్కారమని భావించిన మోదీ ఎందుకు వెనుకుంజ వేశారు? ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా పట్ల తమకున్న ఆగ్రహాన్ని వెళ్లగక్కే ప్రజలు తిరిగి లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి అనుకూలంగా ఓటు వేస్తారని అధినాయకత్వం అంచనా వేస్తోందా?
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్థానిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు, ఆ అంశాల ఆధారంగానే ఓటు వేస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలు, జాతీయ నాయకత్వం ప్రతిష్ట ఆధారంగా ప్రజలు తీర్పు ఇస్తారు. ఈ లెక్కన స్థానిక ప్రభుత్వాల పట్ల ఆగ్రహంతో ఉన్న ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పికి వ్యతిరేకంగా ఓటు వేసినా వచ్చే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి అనుకూలంగా ఓటు వేస్తారని భాజపా నాయకత్వం అంచనా వేసిందా? ఈ కారణం వల్లనే శాసనసభల ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలను విడివిడిగా జరపాలనే నిర్ణయానికి వచ్చిందా?
*

- కె. కైలాష్, 9811573262