ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఎన్నికల హామీలు నీటిమూటలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల వేళ ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, ఆ తర్వాత ప్రజలను వంచించడం రాజకీయ పార్టీలకు అలవాటైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా, కాంగ్రెస్‌లతో పాటు ఇతర విపక్షాలు, తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించి, ఓటర్లకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలను అమలు చేయని ఈ పార్టీలు ఇప్పుడు గుప్పిస్తున్న వాగ్దానాలను అమలు చేస్తాయనే గ్యారంటీ లేదు. ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడం తప్ప మేనిఫెస్టోను పట్టించుకోవాలన్న ధ్యాస లేకపోవడం- మన ప్రజాస్వామ్యానికి పట్టిన దుర్గతికి నిదర్శనం. ఎన్నికల వేళ నేతలు చేసే హామీలు అమలు కావన్న సంగతి ప్రజలకు సైతం తెలుసు.
ఎన్నికల వాగ్దానాలను అమలు చేయనందుకు ఏ ఒక్క పార్టీ కూడా సిగ్గు పడడం లేదు, ఆత్మవిమర్శ చేసుకోవటం లేదు. హామీలు అమలు కాకపోవడానికి విపక్షాల సహాయ నిరాకరణే కారణమని అధికార పార్టీలు చెబుతుంటాయి. అధికారం దక్కనందునే మేనిఫెస్టోను ఆచరణలో పెట్టలేకపోయామని విపక్షాలు పెదవి విరుస్తుంటాయి. అభివృద్ధి పథకాలను ప్రతిపక్షం అడ్డుకుంటున్నందునే తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లవలసి వచ్చిందని అధికార పార్టీలు అబద్ధాలు చెబుతున్నాయి. కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పౌరుడి ఖాతాలో కొన్ని లక్షల రూపాయలు జమ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల సమయంలో ఘనమైన వాగ్దానం చేశారు. అధికార పగ్గాలు చేపట్టాక ఆయన ఆ హామీ గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. ఈ హామీని అమలు చేస్తారా? చేయరా? విదేశీ బ్యాంకుల్లో మన బడాబాబులు దాచుకున్న నల్లధనాన్ని స్వదేశానికి తీసుకురావటం ఎందుకు సాధ్యం కాలేదు?.. అనే ప్రశ్నలకు మోదీ కానీ, భాజపా నాయకత్వం కానీ జవాబు చెప్ప డం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఎస్సీ కులస్థుడిని సీఎం పదవిలో కూర్చోపెడతానని, తాను మాత్రం కావలి కుక్కలా కాపలా కాస్తానని మరో నాయకుడు చెబుతాడు. అధికారం చేపట్టాక- తాను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ అభివృద్ధి చేయలేరు కాబట్టి తానే సీఎం పదవిని చేపడుతున్నట్టు ఆ నేత ప్రకటించుకుంటాడు. మహిళా సాధికారత గురించి నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా ఎందుకు స్థానం కల్పించలేదనే ప్రశ్నను అడగనివ్వడు. అడిగినా సమాధానం ఉండదు.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలు మళ్లీ యథేచ్ఛగా వాగ్దానాలిస్తున్నారు. పేద ప్రజలకు ల్యాప్‌టాప్‌లు, టీవీలు ఇస్తారట! విరివిగా గోశాలలు కడతారట! గోమూత్రం సేకరించి ఔషధాలు తయారు చేయిస్తారట! పెట్రోలు, డిజిల్ ధరలను సగానికి తగ్గిస్తారట. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ పెట్రోలు, డిజిల్‌పై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను మాత్రం తగ్గించవు. లీటరు పెట్రోలుపై రెండు రూపాయలు తగ్గించి ప్రజలకు తామెంతో మేలు చేశామని కొందరు నేతలు చంకలు గుద్దుకుంటారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న 33 శాతం పన్నును మాత్రం తొలగించరు. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు కానీ మద్యం విక్రయాలపై అధిక పన్నులను తొలగించరు, మద్యం దుకాణాలను నియంత్రించరు. మన దేశంలో పాఠశాలల సంఖ్య కన్నా మద్యం దుకాణాల సంఖ్య ఎక్కువ. మద్యంపై పన్ను ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. వీధివీధినా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు ఇందు కు నిదర్శనం. సంక్షేమ పథకాలకు నిధులు అవసరం గనుక మద్యం దుకాణాలకు, బార్లకు అనుమతులిస్తున్నామని చెబుతున్న నేతలు ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు.
అన్ని రాజకీయ పార్టీలూ బడుగు వర్గాలకు గృహనిర్మాణ పథకాలను ప్రకటిస్తాయి. తమ పదవీ కాలం పూర్తయ్యే సమయంలోనూ ఈ పథకాలు ఏ మేరకు అమలయ్యాయనేది నేతలు పట్టించుకోరు. దేశానికి స్వా తంత్య్రం వచ్చాక- గృహనిర్మాణ పథకాల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా బడుగు జీవులకు గృహ సదుపాయం కలుగలేదు. తాము అధికారంలోకి వస్తే రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామన్న టిఆర్‌ఎస్ హామీ తెలంగాణలో ఏ మేరకు అమలు జరిగిందో ప్రజలకు తెలుసు. మచ్చుకు కొన్ని ఇళ్లు నిర్మించి వాటి ప్రారంభోత్సవం కోసం పెద్ద ఎత్తున ఆర్భాటం చేస్తారు తప్ప ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణం ఎందుకు జరగలేదనే ఆత్మ విమర్శ ఉండదు. వివిధ పేర్లతో చేపట్టిన గృహ నిర్మాణ పథకాలన్నీ ఓట్ల కోసం ఉద్దేశించినవే. జనరంజక పథకాలతో ఓటర్లను అన్ని పార్టీలూ మోసం చేస్తున్నాయి.
తాయిలాల ప్రకటనలో రాజకీయ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయే తప్ప ప్రజలకు మేలుచేసే పథకాల గురించి మాట్లాడటం లేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళల కోసం కళ్లు చెదిరిపోయే పథకాలను ప్రకటిస్తారు కానీ అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయరు. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలకు టికెట్లు ఇవ్వడం ఉత్తమాటే. గెలిచే వారికే టికెట్లు అంటూ తమ వర్గం వారిని అందలం ఎక్కిస్తారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా, ఇప్పటికీ మన నేతలు బియ్యం, గోధుమలు, ఉచిత ఇళ్లు వంటివి ఇస్తామని మాట్లాడుతున్నారు. ప్రజలను అభివృద్ధికి దూరంగా పెట్టటం ద్వారా తమ పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో ఇచ్చే హామీలు, కరెన్సీ నోట్లతో జనం సరిపెట్టుకుంటున్నారు. తమ సాధికారిత కోసం పోరాటం లేదు. అయితే- అక్కడక్కడా కొందరు చైతన్యవంతంగా నేతలను నిలదీస్తున్నారు. దీనివల్ల ఆశించిన ఫలితం కనిపించటం లేదు. హామీలను అమలు చేయని నాయకులను అడుగడుగునా అడ్డుకుంటేనే పరిస్థితి బాగుపడుతుందనే వాస్తవాన్ని ప్రజలకు ఇప్పటికైనా గ్రహించాలి.
ప్రజలకు సేవ చేయవలసిన నాయకులు సంపాదన యావలో పడుతున్నారు. హామీలను వారు మరచిపోవడం వల్లనే దేశం అశించిన స్థాయిలో అభివృద్ధి చెందటం లేదు. తమ వాగ్దానాల గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోరనే ధీమాతో నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. మేనిఫెస్టోల్లో హామీలను విస్మరించిన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రజలు సామాజికంగా వెలి వేస్తేనే మార్పు వస్తుంది. *

-కె.కైలాష్ 98115 73262