ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీజీ.. ఎందుకీ వౌనం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించాల్సిందే. ఇంతకీ అవిశ్వాస
తీర్మానంపై చర్చకు మోదీ ఎందుకు అంగీకరించటం లేదు? లోక్‌సభలో
భాజపాకు పూర్తి మెజారిటీ ఉంది. తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస
తీర్మానంపై చర్చ జరిగినా ఎన్‌డీఏ ప్రభుత్వానికి వచ్చే నష్టమేదీ లేదు. అవిశ్వాస
తీర్మానంపై ఓటింగ్ జరిగినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం లేదు.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వృథా అవుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పడం లేదు. ఎన్నో సమకాలీన అంశాలపై ‘ట్వీట్లు’ చేసే ఆయన పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభనపై ఏ మాత్రం స్పందించడం లేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా చూడవలసిన బాధ్యత ప్రతిపక్షం కంటే అధికార పక్షంపైనే ఎక్కువగా ఉంటుంది. అధికార పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తేనే ప్రతిపక్షంతో సమస్యలు సద్దుమణగుతాయి. పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీసే విద్యుక్త ధర్మంలో భాగంగా ప్రతిపక్షం అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, ప్రతిపక్షాన్ని ఒప్పించుకుని సమావేశాలను సజావుగా నడిపించుకోవాలి. ప్రతిపక్షం కొన్ని సందర్భాల్లో రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చినా, అధికార పక్షానికి అలాంటి అవకాశం ఉండదు, ఉండకూడదు. అయితే, ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షం సైతం రాజకీయానికే పెద్దపీట వేసింది. అందుకే గత మూడు వారాలుగా రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ ధోరణి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఈనెల అయిదో తేదీన ప్రారంభమైనప్పటి నుండి వాయిదాల పర్వం కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు తీసుకురావటం, మొన్నటి దాకా ఎన్‌డీఏ శిబిరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శత్రుపక్షంగా మారి మిగతా విపక్షాలతో చేతులు కలపటంతో పార్లమెంటులో ప్రతిష్టంభనకు తెర లేచించి. వైకాపా, తెదేపాలు రచించిన ‘అవిశ్వాస తీర్మానం’ వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు అధికార భాజపా అన్నా డీఎంకే, తెరాస పార్టీలను రంగంలోకి దించటంతో పార్లమెంటు ప్రతిష్టంభన తారస్థాయికి చేరుకున్నది. వివిధ రాజకీయ పార్టీలు తమ తమ ప్రయోజనాల కోసం పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయనేది జగమెరిగిన సత్యం. తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా మోదీ ప్రభుత్వంపై, భాజపా అధినాయకత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో తెదేపాను రాజకీయంగా దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెరాసను, తమిళనాడుకు చెందిన అన్నా డీఎంకేను మోదీ విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాజకీయ ఎత్తుగడల్లో పార్లమెంటు ప్రతిష్ట దారుణంగా దిగజారుతోందనే వాస్తవాన్ని అధికార, ప్రతిపక్షం నాయకులు గుర్తించినా, వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం సిగ్గుచేటు. ఈ నాయకులకెవ్వరికీ కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పరువు, ప్రతిష్టల గురించి కించిత్ పట్టింపు లేకపోవటం దురదృష్టకరం. తమ రాజకీయ ప్రయోజనాల కో సం వీరు పార్లమెంటరీ వ్యవస్థను ధ్వంసం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలను సజావుగా జరిపించేందుకు ప్రధాని మోదీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం సరికాదు.
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రతిపక్ష నాయకులతో సమావేశమై వారి సహాయ, సహకారాలను అర్థించినా మోదీ మాత్రం ఇలాంటి ప్రయత్నమేదీ చేయలేదు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా కొనసాగాలంటే ప్రభుత్వం వెంటనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు అంగీకరించాల్సిందే. ఇంతకీ అవిశ్వాస తీర్మానంపై చర్చకు మోదీ ఎందుకు అంగీకరించటం లేదు? లోక్‌సభలో భాజపాకు పూర్తి మెజారిటీ ఉంది. తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగినా ఎన్‌డీఏ ప్రభుత్వానికి వచ్చే నష్టమేదీ లేదు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగినా ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఎంత మాత్రం లేదు. తెదేపా, వైకాపాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా చూసేందుకే మోదీ తెరాస, అన్నా డీఎంకేలను రంగంలోకి దించారనేది అందరూ చెప్పుకునే విషయం. అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపాలని మోదీ నిర్ణయిస్తే, ఆ మరుక్షణమే తెరాస, అన్నా డిఎంకేలు గొడవ చేయటం మానివేస్తాయి. లోక్‌సభలో ఈ రెండు పార్టీల సభ్యులు గొడవ చేస్తూ అవిశ్వాస తీర్మానాలను అడ్డుకుంటున్నాయి కాబట్టే రాజ్యసభలో కాం గ్రెస్ సభ్యులు గొడవ చేస్తున్నారు. మోదీ గనుక చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ప్రతిష్టంభన వెంటనే తొలగిపోతుంది. మోదీ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావలసి ఉన్నది. దీన్ని కూడా ఆయన అడ్డుకుంటారా? వైకాపా,తెదేపా అవిశ్వాసాలను అడ్డుకోవటం ఒక ఎత్తయితే, కాంగ్రెస్ ప్రతిపాదించిన తీర్మానం చర్చకు రాకుండా చూడటం మరో ఎత్తు అవుతుంది. కాంగ్రెస్‌కు చెందిన 48 మంది ఎంపీలతో పాటు మొత్తం ప్రతిపక్షమంతా లోక్‌సభలో స్పీకర్ పోడియం వద్దకు వచ్చి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని పట్టుపడుతుంది. మోదీ ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కొంటుంది? అవిశ్వాస తీర్మానాలు చర్చకు రాకుండా అడ్డుకుంటున్న మోదీ ప్రభుత్వం- పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రతిపక్షాలే కారణమని ఎలా ఆరోపిస్తుంది. బడ్జెట్ సమావేశాలు మరో రెండు వారాల పాటు జరుగవలసి ఉన్నది. ఈ రెండు వారాల్లో ఐదు రోజులు సెలవుదినాలే. పార్లమెంటు ఉభయ సభలు ఈ వారం రెండు రోజులు సమావేశమైతే వచ్చే వారం ఐదు రోజుల పాటు సమావేశం కావలసి ఉన్నది. అయితే, ఈ ఏడు రోజులు కూడా ప్రతిష్టంభనలో కొట్టుకుపోయే ప్రమాదమే అధికంగా ఉన్నది.
ఎన్‌డిఏ ప్రభుత్వం ఏ మాత్రం జవాబుదారితనాన్ని కనబరచినా ఈ పాటికి రెండుమూడు సార్లైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించేందుకు ప్రయత్నించి ఉండాల్సింది. అవిశ్వాస తీర్మానంతోపాటు అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రులు అనంతకుమార్, విజయ్ గోయల్‌లు ప్రకటించినంత మాత్రాన సరిపోతుందా? ఈ ప్రకటనల వెనక చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే ప్రతిపక్ష నాయకులతో చర్చలు జరిపి ఉండాల్సింది. అవిశ్వాస తీర్మానాలపై చర్చకు తగిన రాజకీయ వాతావరణాన్ని కల్పించి ఉండాల్సింది. మొన్నటి దాకా కేంద్రంలో పదవులు అనుభవించి, ఆ తరువాత ఎన్‌డిఏకు గుడ్‌బై చెప్పిన మరుక్షణమే ప్రభుత్వంపై తెదేపా అవిశ్వాస తీర్మానం పెట్టటం ఎంతవరకు నైతికం. ఆంధ్రప్రదేశ్‌ను అశాస్ర్తియంగా విభజించారంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తమ అవిశ్వాస తీర్మానం విషయమై అదే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపటం ఎంతవరకు సమంజసం. ప్రతిపక్షం ఏం చేసినా అధికార పక్షం మాత్రం బాధ్యతతో వ్యవహరించవలసి ఉంటుంది. ప్రధాన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మరింత బాధ్యతతో వ్యవహరిస్తూ పార్లమెంటు సజావుగా కొనసాగేందుకు కృషి చేయవలసి ఉంటుంది. అయితే, ఈ గురుతర బాధ్యతను మోదీ నిర్వహించిన దాఖలాలు కనిపించటం లేదు.

- కె.కైలాష్ సెల్: 98115 73262