ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

చైనా ‘ఆకస్మిక ప్రేమ’లో ఆంతర్యం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా పాలకులు ఏం చేసినా వారి లాభం కోసమేననేది జగమెరిగిన సత్యం. ఈ వాస్తవాన్ని మన పాలకులు కలలో కూడా మరిచిపోరానిది. ఝీ జింగ్‌పింగ్ చైనా శాశ్వత అధ్యక్షుడైన నేపథ్యంలో ఆయనతో చర్చలు జరిపే వేళ భారత్ ఆచితూచి అడుగేయడం ఉత్తమం. డోక్లామ్ ఉదంతం అనంతరం మన ప్రధాని మోదీ, పింగ్ మధ్య చైనాలోని వుహాన్ నగరంలో తాజాగా జరిగిన అసాధారణ, అనధికార శిఖరాగ్ర చర్చల వల్ల రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు సమసిపోతాయని ఆశించకూడదు. జింగ్‌పింగ్ ఆహ్వానం మేరకు మోదీ రెండు రోజుల పాటు చైనాలో పర్యటించి వివిధ అంశాలపై లోతుగా చర్చలు జరిపి వచ్చారు. చైనా ఏ లక్ష్యంతో మోదీని చర్చలకు ఆహ్వానించిందనేది క్షుణ్ణంగా ఆలోచించవలసిన అంశం.
చైనా తన ఆర్థిక, సైనిక ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌ను ఎప్పటికప్పుడు మనపై ఉసిగొల్పుతోంది. శ్రీలంక, ఇరాన్, మాల్దీవులలో ఓడరేవులను అభివృద్ధి చేసుకొని, సైనికులను మోహరిస్తూ భారత్‌ను అష్టదిగ్బంధానికి గురిచేస్తోంది. బంగ్లాదేశ్‌కు పెద్దఎత్తున ఆర్థిక సహాయం అందజేస్తూ మనకు పక్కలో బల్లెంలా చేస్తోంది. మరోవైపు మయన్మార్ ఉగ్రవాదులను రెచ్చగొడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి లేకుండా చేస్తోంది. భారత్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని చైనా సమర్ధవంతంగా ఉపయోగించుకుంటోంది. చైనా-పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌ను ఆక్రమిత కాశ్మీర్ గుండా నిర్మించటం ద్వారా భారత్ సార్వభౌమాధికారాన్ని చైనా ప్రశ్నించింది. ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ పథకంలో చేరాలంటూ పెద్దఎత్తున వత్తిడి తెస్తోంది. ఈ కుట్రల నేపథ్యంలోనే మోదీని అసాధారణ, అనధికార శిఖరాగ్ర చర్చలకు చైనా ఆహ్వానించింది. ‘హిందీ-చీనీ భారుూ భారుూ’ అంటూనే 1962లో మనపై దాడి చేసి లక్షలాది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న చైనా ఇలాంటి దురాలోచనతోనే డోక్లామ్ సంఘటనకు పాల్పడింది. మోదీ ప్రభుత్వం గట్టిగా నిలబడటంతో చైనా వెనక్కి తగ్గినా అవకాశం లభిస్తే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలను తనలోకలుపుకునేందుకు తెగించే అవకాశాలు లేకపోలేదు. డోక్లామ్ ఉదంతం సమయంలో చైనా పత్రికలు వ్యవహరించిన తీరు, రాసిన రాతలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో చైనాతో ఎలాంటి చర్చలు జరిపినా మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. చైనాలోని సుందర వుహాన్ నగరంలో జింగ్‌పింగ్ , మోదీ ఇరవై నాలుగు గంటల్లో ఆరు సమావేశాలు జరిపి వాణిజ్యం, కీలక సైనిక సంబంధాలు, పర్యాటకం, ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు, ఎలాంటి ప్రకటనలు జారీ చేయలేదు. కానీ ఇరువురు నాయకుల మధ్య జరిగిన చర్చలు రెండు దేశాల సంబంధాలలో ఒక మైలు రాయి వంటివని చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాంగ్ షౌన్‌యు చెప్పటంతో పాటు ‘వన్ బెల్ట్ వన్ రోడ్’లో చేరేందుకు భారత్‌పై ఎలాంటి వత్తిడి తీసుకురావటం జరగదనే ప్రకటన చేశారు. గతంలో జింగ్‌పింగ్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనను సబర్మతీ నదీ తీరంలో మోదీ అహ్లాదపరిచారు. అయితే, పింగ్ ఆ తరువాత డోక్లామ్ రుచి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు చైనా అధినేత మన ప్రధాని మోదీని ఆ దేశంలోని తూర్పు సరస్సు వద్ద ఆహ్లాదపరిచారు,
అఫ్ఘానిస్తాన్‌లో భారత-చైనా ఆర్థిక ప్రాజెక్టును చేపట్టేందుకు కూడా రెండు దేశాల అధినేతలు అంగీకరించారు. కానీ ఈ ఒప్పందం పాకిస్తాన్‌కు రుచించకపోవచ్చు. వుహాన్ నగరంలో జరిగిన అనధికార, అసాదారణ శిఖరాగ్ర సమావేశం లాంటిది భారత్‌లోనూ జరిపేందుకు రావాలని, ఉభయ దేశాలూ కలసి పని చేస్తే ప్రపంచ సమస్యలను సునాయసంగా పరిష్కరించవచ్చునని మోదీ అభిప్రాయపడ్డారు. జింగ్‌పింగ్ రెండు సార్లు బీజింగ్ నుండి వేరే నగరానికి వచ్చి తనకు స్వాగతం చెప్పారని, భారత దేశానికి చైనా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది అద్దం పడుతోందంటూ మోదీ చైనా అధ్యక్షుడిపై ప్రశంసలు కురిపించారు. మోదీ జీవితంలో ‘చాయ్’ అత్యంత ముఖ్యమైన పాత్ర నిర్వహించింది. ఆయన ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత కూడా ‘చాయ్’ ఒక రాజకీయాంశంగా మారింది. మోదీ ‘చాయ్’ను చైనా తీసుకుపోయి జింగ్‌పింగ్‌తో చాయ్ తాగుతూ చర్చల ప్రక్రియ కొనసాగించారు. చైనా, భారత్‌లు మంచి పొరుగుదేశాలుగా ఉండాలనే ఆశాభావాన్ని పింగ్ వ్యక్తం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఉభయ దేశాలు ముఖ్యమైన యంత్రాలని చెప్పటంతోపాటు ప్రపంచ స్థిరత్వం కోసం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలుండాలన్నారు. కాగా, రెండు దేశాల నేతల మధ్య ఇలాంటి అనధికార సమావేశాలు ఇక మీదట కూడా జరుగుతాయని భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ్ ఘోక్లే ప్రకటించారు. వుహాన్‌లో జరిగిన చర్చల ప్రక్రియను పరిశీలిస్తే రెండు దేశాల మధ్య కొంత కాలం నుండి కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు అకస్మాత్తుగా తొలగిపోయినట్లు కనిపిస్తున్నాయి. నిజంగానే ఉద్రిక్తతలు తొలగిపోయాయా? జింగ్‌పింగ్, మోదీలు వుహాన్‌లో చిరకాల స్నేహితుల మాదిరిగా వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చైనా సైన్యం డోక్లామ్ సమీప ప్రాంతంలో ఇప్పటికీ పెద్దఎత్తున సైనికులను మోహరిస్తోంది, విస్తృతంగా రోడ్లను నిర్మించటంతోపాటు క్షిపణులను దింపి శాశ్వత ప్రాతిపదికపై సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది. మామూలుగా అయితే చైనా సైనికులు వేసవిలో డోక్లామ్ వరకు వచ్చి రెండు,మూడు రోజుల పాటు అక్కడ మకాం వేసిన అనంతరం వళ్లిపోయే వారు. అయితే ఈసారి వారు కొంత దూరంలో తిష్టవేశారు. ఎముకలు కొరికే చలికాలంలో సైతం సైనికుల మోహరింపుకొనసాగించేందుకు చైనా సైన్యం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టింది. అందుకే సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ భారత ఆర్మీ అధిపతి బిపిన్ రావత్ పలు మార్లు ప్రకటించవలసి వచ్చింది. చైనా మన ప్రధాన శత్రువని చెప్పటంతోపాటు, పాకిస్తాన్, చైనాలను ఎదుర్కొనేందుకు మన సైన్యానికి సత్తా ఉందని బిపిన్ రావత్ ఈమధ్య ప్రకటించారు. ఇప్పుడు వుహాన్‌లో రెండు దేశాల అధినాయకులు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగటం చూస్తుంటే భారత్, చైనాల మధ్య ఇంత కాలం కనిపించిన ఉద్రిక్తత ఏమైందనే అనుమానం కలుగక మానదు. 1962 నాటి గుణపాఠాన్ని మరిచిపోవద్దంటూ చైనా సైన్యాధికారులు డోక్లామ్ నేపథ్యంలో చేసిన అవమానకర ప్రకటనలు అప్పుడే మరుగున పడిపోయాయా? భారత్ పట్ల పింగ్ వైఖరి అకస్మాత్తుగా ఎందుకు మారిపోయింది? ఈ మార్పుకు కారణణ ఏమిటి? అనే అనుమానాలు కలుగక మానదు. చైనా అధ్యక్షుడు దూరాలోచనతోనే వుహాన్ సమావేశం ఏర్పాటు చేశారనేది నిర్వివాదాంశం. అయితే ఈ దూరాలోచన ఏమిటి? దానివల్ల భారత్‌పై ప్రభావం ఏమిటనేది మన పాలకులు ఆలోచించవలసి ఉన్నది. చైనా దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించటం ద్వారా కట్టడి చేయటంతో జింగ్‌పింగ్ వుహాన్‌లో మోదీతో చర్చలు జరిపారు. భారత్‌తో నిజంగానే స్నేహం చేయాలనుకుంటే మొదట సరిహద్దు సమస్యలకు చరమ గీతం పాడాలి. పాకిస్తాన్‌ను కట్టడి చేయవలసిన బాధ్యత కూడా చైనా పాలకులపై ఉంది.

- కె.కైలాష్ సెల్: 98115 73262