ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఎన్నికల జాతరలో తాయిలాల ఎర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలంటే- ప్రజలను తప్పుడు హామీలతో తప్పుదోవ పట్టించడం, డబ్బులు పంచూతూ ప్రజాస్వామ్య వ్యవస్థను భష్టు పట్టించడంగా మా రింది. నీతి, నిజాయితీ, పారదర్శకత గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలను మాయమాటలతో మోసగించేందుకు యత్నిస్తున్నాయి. ఇందుకు కర్నాటక శాసనసభ ఎన్నికల ప్రచారమే ప్రబల నిదర్శనం. కర్నాటక ఎన్నికల బరిలో ఉన్న రెండు ప్రధాన జాతీయ పార్టీలు- ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్, అధికారంలోకి వచ్చేందుకు యత్నిస్తున్న భాజపా పరస్పరం దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. ఈ రెండు పార్టీలూ ప్రజలను మభ్యపెట్టేందుకు ఇస్తున్న హామీలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అపహాస్యం చేస్తున్నాయి. వీరు ప్రకటిస్తున్న హామీలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రకటించిన ‘మంగళ భాగ్య’ పథకం ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో పెళ్లీడుకొచ్చిన యువతులకు మూడు గ్రాముల బంగారు తాళిబొట్టు ఇ స్తారు. దీనికి దీటుగా భాజపా ‘వివాహ మంగళ యోజన’ను ప్రకటించింది. ఈ పథకం ప్రకారం మూడు గ్రాముల బంగారు తాళితోపాటు పెళ్లి ఖర్చులకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు కూడా ఇస్తారు. ఈ రెండు పథకాలు కూడా ఓట్లు రాబట్టుకునేందుకు ఉద్దేశించినవే తప్ప పేదింటి యువతుల ఆర్థిక సాధికారతకు సహకరించేవి కావు. బీదవర్గాల యువతులకు చేయూత అవసరం లేదని ఈ పార్టీలు భావిస్తున్నాయా? యువతులకు విద్య, ఉపాధి కల్పన అవసరం అని ఈ పార్టీలు ఎందుకు ప్రకటించలేకపోతున్నాయి? తాళిబొట్లు, నగదు ఇవ్వటం అంటే ఓటర్లను మభ్యపెట్టటం కాదా? ఎన్నికల సంఘం ఇలాంటి హామీలపై ఎందుకు స్పందించటం లేదు?
ప్రభుత్వాలు యువతకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వలా? తమకు ఓటు వేస్తే 18-23 ఏళ్ల వయస్సు ఉన్న కాలేజీ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు పం పిణీ చేస్తామని భాజపా ప్రకటించటం సిగ్గు చేటు. యువత, మహిళల ఓట్లు సంపాదించేందుకు స్మార్ట్ఫోన్ రూపంలో తాయిలాలు ఇవ్వటం చట్ట విరుద్దం కాదా? రెండు ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో స్మార్ట్ ఫోన్లు పంచిపెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందజేయటం అనేది ఎన్నికల హామీ కాకూడదు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి తప్ప తమ పార్టీకి ఓటు వేస్తే వీటిని పంపిణీ చేస్తామనటం అవమానకరం. తమ పార్టీకి ఓటు వేస్తే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని కాంగ్రెస్, భాజపాలు యువతీ, యువకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైస్కూల్, కాలేజీ విద్యార్థులందరికీ ల్యాప్‌టాప్‌లు ఉచితంగా పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించగా, కాలేజీలోకి ప్రవేశం సంపాదించే విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తామని భాజపా ఆశ చూపిస్తోంది. పాఠశాలలు, కళాశాలల్లో కనీస వసతులను కల్పించడానికి బదులు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లు ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించటం ఓటర్లను మోసగించటం కాదా?
ఎన్నికల వేళ కన్నడ ప్రజలకు ఇస్తున్న ఇతర హామీలు కూడా ఇలాగే ఉన్నాయి. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత హామీలను ఏమేరకు అమలు చేసిందనే ప్రశ్నకు సమాధానం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు భాజపా ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నది నగ్నసత్యం. ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను అధికారంలోకి వచ్చాక మరిచిపోవటం రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య. అధికారంలో ఉన్న నేతలను ఎన్నికల హామీల గురించి ప్రశ్నిస్తే పోలీసుల చేత కొట్టించిన సంఘటనలు కోకొల్లలు. తప్పుడు హామీలు ఇవ్వటం, ప్రత్యర్థులపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేయటం ఎన్నికల తంతులో భాగంగా మారింది. రెండు ప్రధాన పార్టీల నాయకులు చేసుకుంటున్న ఆరోపణలు చూ స్తుంటే- ఇవి ఎంతగా దిగజారిపోయాయో అవగతమవుతుంది. హామీలు అమలుకు నోచుకోవనేది తెలిసి కూడా ప్రజలు ఓట్లు వేస్తున్నారు? తప్పుడు హామీలు ఇచ్చే వారికి ఓటు వేసేది లేదని స్పష్టమైన సందేశాన్ని ఓటర్లు ఇవ్వనంత కాలం రాజకీయ పార్టీలు ఇలాగే వ్యవహరిస్తుంటాయి.
ఎన్నికల ప్రచారంలో పలువురు నాయకులు ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు పరిశీలిస్తే మతిపోతుంది. తమ ప్రత్యర్థులు అవినీతిపరులు, దుర్మార్గులు, ఎందుకు పనికిరానివారు.. అంటూ గొంతు చించుకుని చెబుతున్నారు. వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర నాయకులు కర్నాటకలో ఎన్నికల ప్రచారంలో దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఓట్ల కోసం కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని దుర్వినియోగం చేయటం రాజకీయ సాంప్రదాయంగా మారింది. ప్రధాన పార్టీల ప్రముఖ నేతలంతా కీలక కులాలకు చెందిన మఠాలను చుట్టి వచ్చారు. లింగాయత్, కురుబ కులాలకు చెందిన మఠాలను సందర్శించి, తాము అధికారంలోకి వస్తే ఈ మఠాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. మఠాలనే కాదు కనిపించిన ప్రతి దేవాలయం, మసీదు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలకు చుట్టివస్తున్నారు. లింగాయత్‌లను ‘్భన్న మతస్తులు’గా గుర్తించేందుకు కూడా ఈ నాయకులు వెనకాడటం లేదు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు సామ,దాన,్భద,దండోపాయాలను రాజకీయ పార్టీలు ప్రయోగిస్తున్నాయి, ఓటర్లను మభ్యపెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు తప్ప ఓటర్లను మెప్పించి, ఒప్పించేందుకు ప్రయత్నించటం లేదు. ప్రధాన కులాలైన లింగాయత్, వక్కలిగలు, కురుబలు, ఎస్.సి, ముస్లింల వర్గాల ఓట్లు సంపాదించేందుకు కాంగ్రెస్, భాజపా, జెడీ (ఎస్) వేయని ఎత్తులేదు. ఓటర్లను కులాల వారీగా విభజించి తమ పబ్బం గడుపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల మూలంగా సమాజానికి కలిగే భారీ నష్టాన్ని పట్టించుకోకపోవటం సిగ్గుచేటు.

- కె.కైలాష్ సెల్: 98115 73262