ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

‘కర్నాటకం’లో విలువలకు పాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో చోటు చేసుకున్న రాజకీయాలు మన రాజకీయ వ్యవస్థలో పేరుకుపోయిన అవకాశవాదం, అవినీతికి అద్దం పడుతున్నాయి. బి.జె.పి, కాంగ్రెస్, జె.డి.ఎస్ అధికారం కోసం నీతి, నిజాయితీ, విలువలకు శిలువ వేశాయి. మెజారిటీ లేకున్నా బి.జె.పి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించింది. శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించటం ద్వారా బి.జె.పి. తన అవినీతి, అరాచక రాజకీయాలను ప్రదర్శించుకున్నది. ఓటమిలో విజయం చూసుకునేందుకు అవకాశవాద రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పీట వేసింది తప్ప ఓటమిని ఓటమిగా స్వీకరించలేదు. ప్రచారం సమయంలో జె.డి.ఎస్.ను ఛీకొట్టిన కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్లేటు ఫిరాయించి జె.డి.ఎస్. నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. బి.జె.పి అధికారంలోకి రాకుండా చూసేందుకు జె.డి.ఎస్. లాంటి ప్రాంతీయ పార్టీ నాయకత్వంలో పని చేసేందుకు వందేళ్ల చరిత్ర ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ అంగీకరించింది. దీనికి ప్రధాన కారణం బి.జె.పి. అధికారంలోకి రాకుండా చూడటమే తప్ప ప్రజలు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాదనేది పచ్చి నిజం. సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని బలపరీక్షకు గవర్నర్ వాజుభాయ్ వాలా ఇచ్చిన సమయాన్ని పదిహేను రోజుల నుండి ఇరవై నాలుగు గంటలకు తగ్గించకపోతే కాంగ్రెస్, జె.డి.ఎస్. శాసన సభ్యుల కొనుగోలులో విజయం సాధించి యెడ్యూరప్ప తన అధికారాన్ని నిలబెట్టుకునేవాడే.
అడుసు తొక్కనేల కాలు కడగనేల? మూడు రోజుల ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోలేక రాజీనామా చేయవలసి వచ్చింది. కాలుకు తగిలిన అడుసును సులభంగానే కడిగేసుకోవచ్చు కానీ ఇప్పుడు బి.జె.పి.కి తగిలిన అడుసును తొలగించుకోవటం ఎంత మాత్రం సులభం కాదు. విలువలతో కూడిన రాజకీయం చేస్తామని సగర్వంగా ప్రకటించుకునే బి.జె.పి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించటం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించటం సిగ్గుచేటు కాదా? కర్నాటక పరిణామాల మూలంగా బి.జె.పి. పరువు, ప్రతిష్ట మంట కలిసింది. బి.జె.పి.తో పాటు ఆర్.ఎస్.ఎస్. ప్రతిష్ట కూడా దిగజారిందని చెప్పకతప్పదు. మెజారిటీ లేదనే పచ్చి నిజం కళ్లముందు కదలాడుతున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం బి.జె.పి. మొదటి తప్పు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, జె.డి.ఎస్. శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నించటం బి.జె.పి. రెండవ పెద్ద తప్పు. బి.జె.పి. 104 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ 78, జె.డి.ఎస్. 36, స్వతంత్రులు ఇద్దరు. రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగవలసి ఉండగా జె.డి.ఎస్. అధ్యక్షుడు కుమారస్వామి రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించారు. ఈ లెక్కన మెజారిటీ నిరూపించుకునేందుకు బి.జె.పి.కి మరో ఎనిమిది మంది శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇద్దరు ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకున్నా మరో అరుగురు శాసన సభ్యులను కాంగ్రెస్ లేదా జె.డి.ఎస్. ను తీసుకోవలసి ఉంటుంది. అంటే ఆరుగురు శాసన సభ్యులను కొనుగోలు చేసుకోవాలి లేదా ఫిరాయింపచేయాలి. ఇది సాధ్యం కాని పక్షంలో కాంగ్రెస్ లేదా జె.డి. ఎస్.కు చెందిన కొందరి చేత శాసన సభ్యత్వానికి రాజీనామా చేయించటం ద్వారా మెజారిటీ నిరూపించుకునేందుకు అవసరమైన సభ్యుల సంఖ్యను తగ్గించుకోవలసి ఉంటుంది. శాసన సభ్యుల కొనుగోలు, ఫిరాయింపు లేదా రాజీనామా చేయించటం, ఈ మూడు కూడా నీతి, నియమాలకు విరుద్దం. ఈ విషయం తెలిసి కూడా బి.జె.పి. అధినాయకత్వం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దపడటం ద్వారా తన అధికార దాహాన్ని ప్రదర్శించుకున్నది. బి.జె.పి. అధికార దాహానికి కళ్లెం వేయవలసిన బాధ్యత ఆర్.ఎస్.ఎస్.పై ఉండింది కానీ ఆ సంస్థ తన బాధ్యతను నిర్వహించలేకపోయింది. శాసన సభ్యులను కొనుగోలు చేసైనా అధికారంలో కొనసాగేందుకు బి.జె.పి. చేసిన ప్రయత్నం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. కర్నాటకలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన తరువాత బి.జె.పి. అధినాయకత్వం ప్రభుత్వం ఏర్పాటుకు దూరంగా ఉండాల్సింది. తాము ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా పూర్తి మెజారిటీ లభించలేదు, ఫిరాయింపులను ప్రోత్సహించటం తమ పార్టీ విధానం కాదు కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని బి.జె.పి. ప్రకటించి ఉంటే గౌరవంగా ఉండేది. కర్నాటకలో బి.జె.పి.కి 104 సీట్లు రావటం వెనక ఆర్.ఎస్.ఎస్. కృషి ఎంతో ఉంది. ఆర్.ఎస్.ఎస్.కు చెందిన పలువురు ప్రచారకులు, స్వయంసేవకులు బి.జె.పి. విజయం కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేశారు. అయితే బి.జె.పి. అధికార దాహంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మెజారిటీ నిరూపించుకోలేక బొక్కబోర్లా పడింది. గోవా, మణిపూర్ ప్రభుత్వాల ఏర్పాటులో మూర్ఖంగా వ్యవహరించిన కాంగ్రెస్ కర్నాటక విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తుందని బి.జె.పి. ఆశించింది. కాంగ్రెస్ అధినాయకత్వం మెరుపు వేగంతో జె.డి.ఎస్.కు మద్దతు ప్రకటించి తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించుకోవటంతో నివ్వెరపోవటం బి.జె.పి. వంతైంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయంగా ఎంతో పరిణతి చెందాడనేందుకు కర్నాటక పరిణామాలే ప్రబల నిదర్శనం. జె.డి.ఎస్. అధ్యక్షుడు కుమారస్వామి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంగీకరించటం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని విజయంగా మలుచుకోవటంలో విజయం సాధించింది. జె.డి.ఎస్.కు మద్దతు ప్రకటించటంలో కాంగ్రెస్ ఏమాత్రం జాప్యం చేసినా బి.జె.పి. బలపడేది. బి.జె.పి.కి అధికారం దక్కకుండా చేయటంలో విజయం సాధించిన కాంగ్రెస్ ఈ లక్ష్య సాధన కోసం తనకు తానుగా నష్టపోయంది. ఎన్నికల ప్రచారంలో జె.డి.ఎస్.ను ముఖ్యంగా దేవెగౌడను రాహుల్ విమర్శలతో ముంచెత్తారు. జె.డి.ఎస్., బి.జె.పి.కి బి-టీంగా వ్యవహరిస్తోందనీ, రహస్య ఒప్పందం చేసుకున్నదంటూ దుమ్మెత్తిపోశారు. 37 సీట్లు వచ్చిన పార్టీ నాయకత్వంలో జాతీయ పార్టీ పనిచేయటం రాజకీయ అవకాశవాదం కాదా? కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే జె.డి.ఎస్‌తో కలిసి పని చేస్తున్నామని చెప్పుకోవటం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయానికి అద్దం పడుతోంది. ఎన్నికలకు ముందు ఒకరినొకరు దూషించుకున్న కాంగ్రెస్, జె.డి.ఎస్.లు ఇప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరగటం అవకాశవాదానికి పరాకాష్ట.

-- కె.కైలాష్ సెల్: 98115 73262