ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ప్రమాదంలో కాంగ్రెస్ మనుగడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బాధ్యతారహిత వ్యవహారం, వ్యాఖ్యల మూలంగా తన ప్రతిష్టను తాను దిగజార్చుకోవటంతోపాటు కాంగ్రెస్ మనుగడను ప్రమాదంలో పడవేస్తున్నారు. రాహుల్ గాంధీ వ్యవహారం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ బతికి బట్టకట్టటం దాదాపుగా అసాధ్యమని పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు రాహుల్ గాంధీ బాధ్యతారహిత వ్యవహారం, రెండో వైపు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోతోంది. రాహుల్ గాంధీ ఇటీవల ఢిల్లీ శాసన సభ ఎన్నికల సంధర్భంగా ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని దేశంలోని యువకులు ఐదారు నెలల్లో కర్రలతో కొట్టి ఇంటి నుండి బైటికి రాకుండా చేస్తారు’ అన్ని హెచ్చరించటం తెలిసిందే. నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు నవ్వుకుంటుంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలలు బాదుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది తమకు ఏ మాత్రం అర్థం కావటం లేదని సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఆయన ఏ రాజకీయ లక్ష్యాన్ని ఆశించి ఇలాంటి బాధ్యతారహిత హెచ్చరికలు చేస్తున్నారు? ఆర్థిక మాంద్యం మూలంగా దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతోందనేది పచ్చి నిజం. ఈ సమస్యను సరైన దృక్పథంతో ప్రస్తావించటం ద్వారా నరేంద్ర మోదీని బోనులో నిలబెట్టటం ప్రతిపక్షానికి చెందిన ప్రతి రాజకీయ నాయకుడి బాధ్యత. నిరుద్యోగ సమస్య మూలంగా ఎదురవుతున్న సమస్యలను ఎత్తి చూపించటంతోపాటు దాని పరిష్కారానికి సరైన మార్గాన్ని కూడా సూచించవలసిన బాధ్యత ప్రతిపక్షంపై ఉన్నది. ప్రతిపక్షానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ దేశంలోని యువకులు ఎదుర్కొంటున్న ఉపాధి కొరతను ఎత్తిచూపించటంలో ఎలాంటి తప్పు లేదు. అయితే నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌కు ఒక విధానం, ఒక ఆలోచన ఉండాలనేది రాహుల్ గాంధీకి తెలుసా? కాంగ్రెస్ నాయకత్వంలోని యు.పి.ఏ అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ సమస్య దేశంలో ఉండింది. అప్పుడు కూడా యువకులు ఉపాధి లభించక పలు ఇక్కట్లకు గురయ్యారు. దేశంలోని యువకులు ఇప్పుడు మాత్రమే నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవటం లేదు కదా? కాంగ్రెస్ దశాబ్దాల తరబడి కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోయింది. అదే సమస్య ఇప్పుడు కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ నిజంగా బాద్యతగల రాజకీయ నాయకుడైతే నిరుద్యోగ సమస్యా పరిష్కారానికి ఆమోదయోగ్యం, ఆచరణయోగ్యమైన మార్గాలను సూచించాలి తప్ప ఇలా నరేంద్ర మోదీని కర్రలతో కొట్టి ఇంటి నుండి బైటికి రాకుండా చేస్తారని హెచ్చరించటం పద్ధతి కాదు. స్వాతంత్ర పోరాటంతో పాటు దేశం బ్రిటీష్ పాలకుల దాస్య శృంఖలాల నుండి విముక్తి పొందిన తరువాత దశాబ్దాల తరబడి అధికారాన్ని అనుభవించిన గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గు చేటు. ఉపాధి సమస్యను ఎదుర్కొంటున్న యవకులు ఆరేడు నెలల్లో నరేంద్ర మోదీని కర్రలతో కొట్టి ఇంటి నుండి బైటికి రాకుండా చేస్తారనటం ద్వారా రాహుల్ గాంధీ తనను తాను అవమానించుకున్నారు, తనొక వీధి రౌడీ మాదిరిగా వ్యవహరించాడు తప్ప దేశానికి నాయకత్వం వహిస్తున్న గాంధీ కుటుంబ సభ్యుడుగా గానీ, అవకాశం వస్తే ప్రధాన మంత్రి పదవి చేపట్టగల నాయకుడిగా గానీ వ్యవహరించలేదు. నరేంద్ర మోదీని కర్రలతో కొడతారని చెప్పటం ద్వారా ఆయన దేశంలోని యువకులను హింసాత్మక చర్యలకు పాల్పడేందుకు ప్రోత్సహించారు, విధ్వంసం సృష్టించాలంటూ యువకులను రెచ్చగొట్టారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరించిన వ్యక్తి దేశంలోని యువకులు ముఖ్యంగా నిరుద్యోగులైన యువకులను రెచ్చగొట్టటం రాహుల్ గాంధీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. నరేంద్ర మోదీని కర్రలతో కొట్టాలని రాహుల్ గాంధీ దేశంలోని యువకులను రెచ్చగొట్టవచ్చు కానీ నరేంద్ర మోదీ మాత్రం రాహుల్ గాంధీని ఏమీ అనకూడదా? తనను కర్రలతో కొట్టాలని యువకులను రెచ్చగొట్టిన రాహుల్ గాందీని ప్రధాన మంత్రి ట్యూబ్‌లైట్‌తో పోల్చారు. తనను ట్యూబ్‌లైట్ అన్నందుకు రాహుల్ గాంధీ ఎంతగానో ఉడికిపోయారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి స్థాయిలో మాట్లాడటం లేదంటూ విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రికి ఒక స్థాయి, ఒక హోదా ఉంటుంది కానీ నరేంద్ర మోదీకి ఈ రెండు లేవంటూ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. తాను ఇతరులను ఏమైనా అనవచ్చు కానీ ఇతరులు మాత్రం తనను ఏమీ అనకూడదన్న రాహుల్ గాంధీ రాజకీయ అపరిపక్వతకు అద్దం పడుతోంది.
కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆమె ఈ ఆనారోగ్య పరిస్థితుల నుండి బైట పడటం దాదాపుగా అసాధ్యమనేది ప్రతి సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి తెలుసు. అందుకే వీలున్నంత త్వరగా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవలసిన అవసరం ఉన్నది. సోనియా గాంధీ సైతం పలుమార్లు ఈ అవసరాన్ని సూచించారు. వీలున్నంత త్వరగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటే తాను విశ్రాంతి తీసుకుంటానని ఆమె పలుమార్ల పార్టీ సీనియర్ నాయకులతో చెప్పినట్లు సమాచారం. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా రాజీనామా చేసిన పరిస్థితుల్లో కాంగ్రెస్ సంక్షోభంలోపడిపోకుండా చూసేందుకు సోనియా గాంధీ తాత్కాలికంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. ఆమె కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పుడు ఐదారు నెలల్లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సోనియా గాంధీ పార్టీ సీనియర్ నాయకులకు సూచించారు. ఆమె ఇచ్చిన గడువు పూర్తి కావస్తున్నా కొత్త అధ్యక్షుడి ఎంపిక ఒక కొలిక్కి రావటం లేదు. రాహుల్ గాంధీనే మరోసారి పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకోవటం మంచిదని పార్టీలోని ఒక వర్గం పట్టుపడుతోంది. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఇందుకు ససేమిరా అంగీకరించటం లేదు. రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు అంగీకరించటం లేదు కానీ అనునిత్యం ఏదోఒక ప్రకటన, ట్వీట్ చేయటం ద్వారా పార్టీని ఇరకాటంలో పడవేస్తున్నారు. సోనియా గాంధీ ఇంకా ఎక్కువ కాలం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేదు. ఆమె ఇప్పటికే అనారోగ్యం మూలంగా పార్టీకి ఎక్కువ సమయం కేటాయించటం లేదు. పార్టీ సీనియర్ నాయకులతో అప్పుడు చర్చించటం ద్వారా పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది కూడా ఎక్కువ కాలం కొనసాగే సూచనలు కనిపించటం లేదు. రాహుల్ గాంధీ మరోసారి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు నిరాకరించటంతోపాటు తన బాధ్యతారహిత ప్రకటనలు, వ్యాఖ్యలు, ట్వీట్లను ఆపేందుకు కూడా అంగీకరించటం లేదు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ ట్వీట్ చేసి కాంగ్రెస్‌ను నవ్వుల పాలు చేస్తాడా? అనే భయం పార్టీ సీనియర్ నాయకులను పట్టి పీడిస్తోంది. ఆయన కేరళకు చెందిన ఏ.ఐ.సి.సి ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌తో మాత్రమే మాట్లాడుతారు. సీనియర్ నాయకులు అహమద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏ.కె. ఆంటోని తదిరతులతో కాంగ్రెస్ రాజకీయాల గురించి చర్చించటం దాదాపుగా మానివేశారని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ వ్యవహారం మూలంగా కాంగ్రెస్ సీనియర్ నాయకత్వమంతా చేతులు ముడుచుకుని కూర్చుంటున్నది. కేరళ, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన కొందరు నాయకుల ద్వారా రాహుల్ గాంధీ తన రాజకీయం నడిపిస్తున్నారు. సోనియా గాంధీ అంటుబాటులో లేకపోవటం, రాహుల్ గాంధీ కొందరికి మాత్రమే అందుబాటులో ఉండటం మూలంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మనుగడ ప్రమాదంలో పడిపోయింది. అధిష్టానవర్గం ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్‌లు పని చేయటం మానివేసి చాలా కాలమైంది. కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పి.సి.సి. అధ్యక్షులు తమ ఇష్టానుసారం రాజకీయం నడిపించుకుంటున్నారు తప్ప అధినాయకత్వం ఆదేశాల మేరకు పనులను నడిపించటం లేదు. కాంగ్రెస్ పరిస్థితి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు తయారైంది. సోనియా గాంధీ అనారోగ్యం మూలంగా రాజకీయాలకు దూరమైన మరుక్షణం కాంగ్రెస్ కుప్పకూలినా ఆశ్చర్యపోకూడదు.

కె.కైలాష్ 98115 73262