ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

మోదీ అంటే ఎందుకింత కోపం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాన మంత్రి నఠేంద్ర మోదీ పట్ల ఇపుడు ఇంటా బైటా ఆగ్రహం వ్యక్తమవుతోంది. భాజపాలో ఆయన తర్వాత ఎవరు? అనే ప్రశ్న కూడా కొంతమంది లేవదీస్తున్నారు. మోదీ మరోసారి ప్రధాని అవుతారా? అనే అనుమానాలను సైతం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు అధికార పగ్గాలు దక్కకుండా చూడటమే తమ విద్యుక్త్ధర్మమనే పద్ధతిలో విపక్ష పార్టీల సమీకరణలు జరుగుతున్నాయి. భాజపాను ఓడించాలన్న లక్ష్యం కన్నా మోదీని ఇంటిదారి పట్టించాలన్న తపనతో విపక్షాలు ఐక్యతారాగం ఆలపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఇలా ఒక పార్టీని కాకుండా ఒక వ్యక్తిని ఈ స్థాయిలో వ్యతిరేకించటం ఇదే తొలిసారి కావచ్చు. విపక్షాలతో పాటు భాజపాలో కొద్దిమంది నేతలు కూడా మోదీ మళ్లీ ప్రధాని కారాదని కోరుకుంటున్నా ఆ ప్రయత్నాలు పెద్దగా ఊపందుకోవటం లేదు.
కాంగ్రెస్ సహా మిగతా విపక్ష పార్టీలు అవకాశం ఉన్న ప్రతి చోట సమైక్యతను ప్రదర్శిస్తూ భాజపాను ఓటమిపాలు చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్, బిహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో భాజపా ఓటమిని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు సమైక్యతను ప్రదర్శించాయి. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఏకైక పెద్ద పార్టీగా అవతరించినా అధికారం దక్కనీయకుండా విపక్షాలు విజయం సాధించాయి. కాంగ్రెస్ రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ, 36 సీట్లు గెలిచిన జేడీఎస్ నేత కుమార స్వామిని ముఖ్యమంత్రిగా నియమించేందుకు వెనకాడలేదు. ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ స్థానం ఉపఎన్నికలో బిఎస్పీ,ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్‌ఎల్‌డి అభ్యర్థిని గెలిపించి భాజపాకు షాక్ ఇచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీని విమర్శించేందుకు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలను తరచూ వినియోగిస్తున్నారు. మోదీ చేసే ప్రతి పనిని తప్పుపడుతూ, ఆయనను ఒక భూతంగా చిత్రీకరిస్తున్నారు. మోదీని దెబ్బతీసేందుకు బిఎస్‌పి, ఎస్‌పి, తృణమూల్ కాం గ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో పనిచేసేందుకు రాహుల్ వెనకాడటం లేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆర్‌జెడి యువనేత తేజస్వీ యాదవ్ తదితరులు అదేపనిగా మోదీపై మాటల దాడి చేస్తున్నారు. ఆయనను అబద్ధాలకోరుగా, అధికార దాహంతో పనిచేసే నేతగా చిత్రీకరిస్తున్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నెలకొందన్న ప్రచారం చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
కాగా, కొంతమంది కేంద్ర మంత్రులు సైతం మోదీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు. తమ పార్టీ అభ్యర్థులు ఉపఎన్నికల్లో ఓడిపోయిన ప్రతిసారి వీరు సంతోష పడతారు. మోదీ గర్వం అణగాలంటే ఇలాంటి ఓటములు తరచూ ఎదురవుతుండాలని వీరంతా కోరుకుంటారు. జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు లాంటి నిర్ణయాల వల్ల భాజపాకు ప్రతికూల ఫలితాలు ఎదురైన ప్రతిసారి వీరంతా పండుగ చేసుకుంటారు. గోరఖ్‌పూర్, ఫూల్‌పూర్, కైరానా ఉపఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓడిపోయినపుడు కొందరు భాజపా నేతలు మోదీ విధానాలను తప్పుపట్టారు.
2019 ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి అధికారంలోకి వచ్చినా బిజెపికి సొంతంగా సీట్లు తగ్గితే ప్రధాని పదవిని మోదీ చేపట్టటం అసాధ్యమని వారు వాదిస్తున్నారు. భాజపా 250 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తేనే మోదీ రెండోసారి ప్రధాని పదవి చేపడతారని లేకుంటే కొత్త వ్యక్తిని ఎన్నుకోక తప్పదంటున్నారు. కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్ ప్రధాని పదవికి గట్టిగా పోటీ పడతారని కొందరు నేతలు ఇప్పటి నుండే ప్రచారం చేస్తున్నారు. స్వపక్షంలోని కొందరు నేతలే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? మోదీ పట్ల ఎందుకింత వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు? వీరికి మోదీ చేసిన ద్రోహం ఏమిటి? ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నినాదం ఇచ్చినందుకు మోదీని కాంగ్రెస్ ద్వేషిస్తోంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న తమ పార్టీని మోదీ భూస్థాపితం చేస్తాననడం పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహించడం సహజం. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ‘పప్పు’ అనే ముద్ర వేయటం రెండో కారణం. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో మతపరమైన విభజన వచ్చింది. ఇది తమ ప్రభుత్వం కాదని మైనారిటీలు భావిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మొదటి నుండి ముస్లిం మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పార్టీ అధికారంలో ఉన్నపుడు క్రైస్తవ మైనారిటీలకు ప్రాధాన్యత లభించేది. మోదీ హయాంలో మైనారిటీల ప్రయోజనాలకు దెబ్బ తగులుతోందని కాంగ్రెస్, ఇతర విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో మోదీకి ఓటు వేయకూడదని ముస్లిం, క్రైస్తవ మైనారిటీ మతపెద్దలు ఇటీవల బహిరంగ ప్రకటనలు చేశారు. మోదీ అధికారంలోకి వచ్చాక మతమార్పిడులకు అడ్డుకట్టపడిందని ఒక మైనారిటీ మతం భావిస్తోంది. మోదీని ప్రతిపక్షాలు ద్వేషించేందుకు పెద్దనోట్ల రద్దు ఒక ముఖ్య కారణం. రాజకీయ పార్టీల వద్ద నల్లధనం ఉంటుందనేది అందరికీ తెలిసిందే. ఎన్నికల ప్రచారం, పార్టీ కార్యక్రమాలకు నల్లధనం ఉపయోగిస్తారనేది జగద్విదితం. పెద్దనోట్లను ఆకస్మికంగా రద్దు చేయటంతో కొన్ని రాజకీయ పార్టీలు దివాలా తీశాయి. తమను ఆర్థికంగా దెబ్బతీసిన మోదీ మరోసారి అధికారంలోకి రాకుండా చూడాలనే పట్టుదలతో ఈ పార్టీలు పనిచేస్తున్నాయి. మోదీకి ఇప్పుడు అడ్డుకట్ట వేయకపోతే తమ పార్టీల మనుగడకే ముప్పు అని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి.
మోదీకి దేశాభివృద్ది తప్ప మరో ధ్యాస లేదనేది కాదనలేని నిజం. చిత్తశుద్ధితో పని చేయటం, ఇతరుల చేత చేయించటం అతని లక్ష్యం. అవినీతి, బంధుప్రీతి వంటి ఆరోపణలు ఆయనపై లేవు. అయితే కీర్తిప్రతిష్టలు తనకే చెందాలని మోదీ పని చేస్తారు. ఎవరు తన వెంట వచ్చినా, రాకపోయినా తన పని తాను చేసుకుపోతుంటారు. మంత్రులు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అని ఆయన క్షుణ్ణంగా ఆరా తీస్తారు. ఏకపక్షంగా పని చేసుకుపోవటం మోదీ ప్రత్యేకత. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి ప్రధాని కార్యాలయం అత్యంత శక్తివంతమైన కేంద్రంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పనిపై ఆ కార్యాలయం నిఘా ఉంటుంది. అన్ని కీలక నిర్ణయాలకూ అక్కడ ఆమోద ముద్ర ఉండవలసిందే. దేశమే తన కుటుంబం అని భావించే నేతను కుటుంబ రాజకీయాలు చేసే నాయకులు ఓడించాలని భావించటంలో ఆశ్చర్యం ఏమున్నది.

-కె.కైలాష్ 98115 73262