ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

సజావుగా ‘సభాపర్వం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడం, తమ వ్యవహార శైలిపై దేశ ప్రజలు ముఖ్యంగా గ్రామీణులు ఆగ్రహంతో ఉన్నారనే వాస్తవాన్ని గ్రహించిన అధికార, ప్రతిపక్షాలు పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ఎలాంటి గొడవ లేకుండా ముగించాయి. పార్లమెంటు ఉభయ సభలు గత పది పదిహేనుళ్లుగా గందరగోళం మధ్య కొనసాగడం తెలిసిందే. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికీ పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శించడం, నినాదాలతో హోరెత్తించడం ఆనవాయితీగా మారింది. ఉభయ పక్షాలూ తమ ఆధిపత్యాన్ని చూపాలని పార్లమెంటులో యుద్ధ వాతావరణాన్ని సృష్టించేవి.
దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేయాల్సిన బడ్జెట్ సమావేశాలు గందరగోళంలో కొట్టుకుపోయేవి. చాలా కాలంగా వివిధ ప్రభుత్వ శాఖల పద్దులపై చర్చ జరగడం గగన కుసుమంగా మారింది. బడ్జెట్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైన అంశాలపై సైతం చర్చ జరిగేది కాదు. రక్షణ, హోం తదితర అత్యంత ముఖ్యమైన శాఖల పద్దులను సైతం అరుపులు, కేకల మధ్య ఆమోదించటం రివాజుగా మారింది. గతంలో బడ్జెట్ సమావేశాలు ముక్కుతూ మూలుగుతూ మొక్కుబడిగా సాగినా, వర్షాకాల, శీతాకాల సమావేశాలు పూర్తిగా రభసతోనే ముగిసిపోయేవి. ఉభయ సభలు రోజుల తరబడి వాయిదా పడేవి. పలుశాఖల పద్దులను చర్చ జరపకుండానే గెలిటిన్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి కొద్దికొద్దిగా మారుతోంది.
గతనెల 18 నుండి ఈనెల 10 వరకు జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగానే ముగిశాయి. ప్రజలు ఆగ్రహిస్తున్నారనే వాస్తవాన్ని గ్రహించిన అధికార, ప్రతిపక్షాలు వర్షాకాల సమావేశాల్లో బాధ్యతతో వ్యవహరించాయి. రాజకీయాల కోసం పార్లమెంటు సమావేశాలను వాడుకోవాలన్న విషయాన్ని ఈసారి పక్కన పెట్టడం సంతోషించదగ్గ విషయమే. వాకౌట్లు, బాయ్‌కాట్లు జరిగినా అవి తాత్కాలికంగానే జరిగాయి తప్ప, రోజుల తరబడి ఉభయ సభలను స్తంభింపజేయాలనే ఆలోచనతో జరగలేదు. ఇరవై రెండు రోజుల పాటు కొనసాగిన వర్షాకాల సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగింది. పలు బిల్లులపై చర్చతోపాటు వాటిని ఆమోదించే ప్రక్రియ కూడా ఎంతో సజావుగా జరిగింది. దా దాపు 18 సంవత్సరాల తరువా త ఇప్పుడు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఫలప్రదంగా జరిగాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపేందుకు భాజపా వెంటనే అంగీకరించటంతో సమావేశాలు సజావుగా జరిగేందుకు తగిన వాతావరణం ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చకు, ఓటింగ్‌కు అధికార పక్షం అడ్డు చెప్పి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. తెదేపా ఎంపీ కేశినేని నాని ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరగడంతో లోక్‌సభలో గొడవకు ఆస్కారం లేకుండాపోయింది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం తమ అక్కసును ఆరోపణలు, ప్రత్యారోపణల ద్వారా తీర్చుకున్న తరువాత ఇరు పక్షాలు ప్రజల సమస్యలపై చర్చ జరిపేందుకు సిద్ధమయ్యాయి.
పార్లమెంటు సమావేశాలను స్తంభింపజేయటం ద్వారా ప్రజల దృష్టిలో పలచనైపోతున్నామని, తమ వైఖరిపై వారికి కోపం వస్తోందనే వాస్తవాన్ని ఇరుపక్షాలు గ్రహించాయి. పార్లమెంటును తాము స్తంభింపజేయడాన్ని అధికార పక్షం ప్రజల వద్ద ఒక ఆయుధంగా వాడుకుంటోందనే వాస్తవాన్ని ప్రతిపక్షాలు గ్రహించాయి. పార్లమెంటు సమావేశాలు గందరగోళంలో కొట్టుకుపోవటానికి ప్రతిపక్షం ప్రధాన కారణమంటూ మోదీ ప్రభుత్వం ప్రజాకోర్టులో చేసిన వాదన భాజపాకు మంచి మార్కులు తెచ్చిపెట్టింది. ఈ వాస్తవాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ గ్రహించింది. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ వాస్తవాన్ని బాహాటంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు తాము ఉభయ సభల్లో గొడవ చేస్తుంటే, ప్రభుత్వం దా నిని రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవటంలో సఫలమైందని, విపక్షాల ధోరణి వల్లనే ఉభయ సభలు ముందుకు సాగటం లేదంటూ మోదీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆజాద్, ఖర్గే అన్నారు. ఇలా ప్రచారం చేసే అవకాశం అధికార పక్షానికి ఇవ్వకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు ఆజాద్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలోనే స్పష్టం చేశారు. అందుకే కాంగ్రెస్, తెలుగుదేశం, టిఎంసి పార్టీల సభ్యులు పలుమార్లు ఉభయ సభల పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ గొడవ చేసినా అది పరిమితంగానే జరిగింది. గతంలో మాదిరి రోజుల తరబడి గందరగోళం నెలకొనలేదు.
వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో ప్రభుత్వం ఇరవై బిల్లులను ప్రతిపాదిస్తే పద్దెనిమిది బిల్లులపై చర్చ జరిపి ఆమోదించటం ఒక రికార్డు. లోక్‌సభ ఈ సారి 110 శాతం పని చేస్తే, రాజ్యసభ 66 శాతం పని చేసింది. లోక్‌సభ పని చేసిన మొత్తం గంటల్లో యాభై శాతం సమయాన్ని బిల్లులు తదితర లెజిస్లేటివ్ కార్యక్రమాల కోసం వెచ్చించింది. రాజ్యసభ దాదాపు నలబై ఎనిమిది శాతం సమయాన్ని లెజిస్లేటివ్ పనికి ఖర్చు చేసింది. గత పదిహేను సంవత్సరాల్లో ఇంత సమయాన్ని లెజిస్లేటివ్ పనుల కోసం ఎప్పుడూ ఉపయోగించలేదు. లోక్‌సభలో వాగ్వివాదాల మూలంగా ఎనిమిది గంటల సమయం వృథా కాగా, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు సభ్యులు ముందు నిర్దారించిన సమయం కంటే దాదాపు ఇరవై గంటల పాటు వివిధ ఆంశాలపై చర్చ జరిపారు. నష్టపోయిన ఎనిమిది గంటల సమయాన్ని పూడ్చుకోవటంతో పాటు అదనంగా మరో పనె్నండు గంటలు అధికంగా పని చేసినందుకు లోక్‌సభ సభ్యులు అభినందనీయులు.
జాతీయ బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుపై అర్థవంతమైన చర్చ జరిగింది. వెనుకబడిన కులాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై ఇరుపక్షాల సభ్యులు మంచి సూచనలు చేశారు. ఇరుపక్షాల సభ్యుల సలహా మేరకు వెనుకబడిన కులాల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. రాజ్యాంగ హోదాతో కూడిన బీసీ కమిషన్ ఈ కులాల ప్రయోజనాలను కాపాడగలుగుతుంది. అయితే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తే బీసీల ప్రయోజనాలను మరింతగా పరిరక్షించినట్టు అవుతుంది. పార్లమెంటు అత్యంత కీలకమైన ఎస్.సి, ఎస్.టి అత్యాచారాల నిరోధక సవరణ చట్టాన్ని ఆమోదించింది. సుప్రీం కోర్టు ఈ చట్టంలో కీలక మార్పులు చేస్తూ ఇచ్చిన తీర్పు దేశంలోని కోట్లాది మంది ఎస్.సి, ఎస్.టి ప్రజలను ఆందోళనకు గురి చేయటం విదితమే. మోదీ ప్రభుత్వం పరిణతిని ప్రదర్శిస్తూ ఎస్.సి, ఎస్.టి అత్యాచార నిరోధక చట్టంలో అవసరమైన మార్పులు, చేర్పులు చేసి ఒక పెద్ద సమస్యను సకాలంలో పరిష్కరించగలిగింది.
ముస్లిం మహిళల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో ప్రతిపాదించేందుకు ప్రభుత్వం ఆఖరి రోజున చేసిన ప్రయత్నం ప్రతిపక్షం మొండి వైఖరి వల్ల ఫలించలేదు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరిపి ఉభయ సభల్లో ఆమోదించేందుకు సమావేశాలను మరో మూడు రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించినా ప్రతిపక్షం అందుకు అంగీకరించలేదు. సవరించిన ట్రిపుల్ తలాక్ బిల్లును చివరి రోజున రాజ్యసభలో ప్రతిపాదించి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం పొందేందుకు పాకులాడిందన్నది ప్రతిపక్షం ఆరోపణ. ట్రిపుల్ తలాక్ బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించి ఉన్నట్లయితే పార్లమెంటు సమావేశాల పట్ల ప్రజల్లో ప్రతిష్ఠ మరింతగా పెరిగేది.
*

--కె.కైలాష్ 98115 73262