ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

విపక్షం వ్యూహం ఫలించేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఓడించేందుకు విపక్షాలు చేస్తున్న కసరత్తు ఫలిస్తుందా? ఎన్డీఏను ఎదుర్కొనేందుకు దీటైన కూటమిని ఏర్పాటు చేయాలన్న విపక్ష నేతల ప్రయత్నాలు నెలలు గడుస్తున్నా కొ లిక్కి రాలేదు. తాజాగా తెదేపా అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షాలను సమైక్య పరిచే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ‘కూటమి’ ఏర్పాటుకు చేసిన గత కొంతకాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్నందున జాతీయ పార్టీలను సంఘటితం చేయడంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఆవిర్భావం సాధ్యమేనా? అన్న అనుమానాలను శరద్ పవార్ ఇదివరకే వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రాల వారీగా ప్రతిపక్షాలు సయోధ్య కుదుర్చుకొని ఎన్డీఏను ఎదుర్కొనాల్సి ఉంటుందని ఆయన ప్రతిపాదించారు. ఆయన సూచన మేరకు మహారాష్టల్రో ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీలు లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల సర్దుబాటు విషయమై చర్చించి ఒక అవగాహనకు వచ్చాయి.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు మాయావతి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఇటీవల గోరఖ్‌పూర్, ఖైరానా లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ఉమ్మడి అభ్యర్థులను నిలిపి ఘన విజయం సాధించారు. కర్నాటకలో భాజపా అధికారంలోకి రాకుండా కాంగ్రెస్ పార్టీ జెడీయూకు మద్దతునిచ్చి కుమారస్వామిని సీఎం పదవిలో కూర్చోపెట్టింది. ఇలా కొన్ని రాష్ట్రాల్లో సాధ్యమైన ‘విపక్షాల ఐక్యత’ జాతీయ స్థాయిలో ఫలిస్తుందా?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఓడించి తీరాలన్న పట్టుదలతో చంద్రబాబు మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. ఆయన నిజంగానే జాతీయ ప్రయోజనాలను ఆశించి కృషిచేస్తే కొంతమేరకు ఫలితాలు రావచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న నినాదంతో సొంత ప్రయోజనాలకు ఆయన ప్రాధాన్యత ఇస్తే విపక్షాల ఐక్యత ప్రశ్నార్థకమే! ప్రజాస్వామ్య పరిరక్షణకే తాను కాంగ్రెస్‌తో చేతులు కలిపానని ఆయన చెబుతుంటే- ప్రజలు మాత్రం విశ్వసించే పరిస్థితిలో లేరు. తన పార్టీని బలోపేతం చేసుకునేందుకే ఆయన సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారని విపక్ష నేతలందరికీ తెలుసు. మోదీపై పగ సాధించేందుకే చంద్రబాబు ‘విపక్షాల ఐక్యత’ అనే పల్లవిని అందుకున్నట్లు శరద్ పవార్, మమతా బెనర్జీ వంటి నేతలకు బాగా తెలుసు. గతంలో కాంగ్రెస్‌ను వ్యతిరేకించినా, వాజపేయితో కలిసి పని చేసినా, గోద్రా అల్లర్ల నేపథ్యంలో అప్పటి గుజరాత్ సీఎం మోదీ గద్దె దిగాలని డిమాండ్ చేసినా, ఆ తర్వాత అదే మోదీతో చేతులు కలిపినా, ఇటీవల ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసినా.. ఏది చేసినా రాజకీయ కోణంలోనే చంద్రబాబు పాచికలు వేస్తారన్నది నిజం. అందుకే- మోదీ గద్దె దించాలని ఇపుడు చంద్రబాబు శపథం చేసింది దేశం కోసమా? తెలుగుదేశం కోసమా? అన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఒక్క చంద్రబాబే కాదు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర విపక్ష నేతలు శరద్ పవార్, ఫరూఖ్ అబ్దులా, మమత, మాయావతి, అఖిలేశ్ యాదవ్, వామపక్ష నాయకులు.. ఇలా అందరూ తమ తమ పార్టీల కోసమే తప్ప దేశ ప్రయోజనాల కోసం ‘జట్టు’ కట్టడం లేదు. తమ వ్యూహాల్లో జాతీయ ప్రయోజనాలున్నాయని వీరు జనాన్ని నమ్మిస్తుంటారు. తాము అధికారంలోని వస్తేనే ప్రజాస్వామ్యం భేషుగ్గా ఉంటుందని, వ్యవస్థలన్నీ సజావుగా పనిచేస్తాయని వీరు చెబుతుంటారు. అధికార పక్ష నాయకుల ఆలోచన కూడా ఇందుకు భిన్నంగా ఉండదు. తాము తప్ప ఈ దేశాన్ని ఎవరూ రక్షించలేరని అధికార, విపక్షాలు ఒకే పాట పాడుతుంటాయి.
గతంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా విపక్షాలను సమైక్య పరచి, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు కృషి చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పడానికి కారణం- ఉమ్మడి ఏపీలో 42 లోక్‌సభ సీట్లు ఉండడం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీలో హవా తగ్గిందని చెప్పాలి. ఎంపీల సంఖ్య తక్కువైనప్పటికీ, గతంలో వలే జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చంద్రబాబు భావించడం అత్యాశే అన్న వాదనలు లేకపోలేదు.
కర్నాటకలో 32 మంది శాసనసభ్యులున్న జెడియు కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా అది ఎంతకాలం అధికారంలో ఉంటుందన్నది ప్రశ్నార్థకమే. కేంద్రంలోనూ గతంలో తక్కువ మంది ఎంపీలున్న పార్టీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేసినా అవి ఎంత కాలం అధికారంలో కొనసాగాయన్నది తెలిసిందే. చంద్రశేఖర్, వి.పి.సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాలు ఏ కారణాలతో పతనమయ్యాయో జగద్విదితమే.
చంద్రబాబు తాజాగా విపక్షాల ఐక్యతకు ప్రారంభించిన ప్రయత్నాలు ఇతర విపక్ష నేతల రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యంగానే సాగుతాయి. తమ ప్రయోజనాలు నెరవేరని పక్షంలో మాయావతి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్ లాంటి నాయకులు ప్రతిపక్ష కూటమికి గండికొడతారు. చంద్రబాబు మాదిరే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తన రాజకీయ ప్రయోజనాల కోసమే తెదేపాతో చేతులు కలిపారు. ప్రధాని పదవిని చేపట్టాలనే కోరిక రాహుల్‌ను ఆవహించింది. కాంగ్రెస్ తనంత తానుగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే సూచనలు లేవు. మాయావతి, మమత వంటి నేతలు రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిన మరుక్షణం ఈ నాయకులు ప్రతిపక్ష కూటమికి గండికొడతారు. ఈ నేపథ్యంలోనే తాము రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించటం లేదంటూ కాంగ్రెస్ నేత పి.చిదంబరం స్పష్టం చేశారు.
మరోవైపు మాయావతి, మమత కూడా ప్రధాని పదవిని ఆశిస్తున్నారు. దేశవ్యాప్తంగా దళితులంతా తనకే మద్దతు ఇస్తారని భావిస్తున్న మాయావతి ప్రధాని పదవి తనకే దక్కాలని ఆరాటపడుతున్నారు. ఇలా విభిన్న ఆలోచనలు, ఆకాంక్షలున్న విపక్షనేతలందరినీ కూటమిలోకి తీసుకురావటం సామాన్య విషయం కాదు. కేవలం మోదీని ఓడించాలనే లక్ష్యంతో కూటమి ఏర్పాటుకు ప్రయత్నించడం సరికాదు. ప్రతిపక్ష కూటమి నిజంగానే మోదీని ఓడిస్తే, పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలే తప్ప తుమ్మితే ఊడిపోయే సర్కారు కొలువుదీరితే దేశ ప్రయోజనాలు నెరవేరవు. ఇలాంటి ప్రయత్నాల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు.

కె.కైలాష్ 98115 73262