ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

అందరూ అభినందనీయులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగుతున్నందుకు అధికార, ప్రతిపక్షాలను రెం డింటిని అభినందించవలసిందే. పార్లమెంటు సమావేశాలు పార్టీ రాజకీయాలకు బలి కాకపోతే దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై అర్థవంతమైన చర్చ జరుగుతుంది, సభ్యులు తమ ప్రాంతంతోపాటు దేశానికి సంబంధించిన పలు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారనేందుకు శీతాకాల సమావేశాలు ప్రబల నిదర్శనం. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించటంతోపాటు గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించిన ప్రతిపక్షం విజయగర్వంతో విర్రవీగి ఎన్.డి.ఏ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడవేసేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాలను బలి చేయకుండా సజావుగా నడిచేందుకు అంగీకరించటం అభినందనీయం.
బిహార్ ఓటమి అధికార పక్షాన్ని దారికి తెచ్చిన సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ప్రతిపక్షంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం ముందుకు రావటంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు దేశ ప్రజల సమస్యలపై దృష్టి కేంద్రీరించాయి. గత శుక్రవారం పార్లమెంటు సమావేశాల్లో వివిధ అంశాలపై జరిగిన చర్చను పరిశీలిస్తే రాజకీయ గొడవ లేకోతే ప్రజలకు సంబంధించిన ఎన్ని అంశాలు చర్చకు వస్తాయనేది స్పష్టమవుతుంది. లోక్‌సభలో గత శుక్రవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మొదటి ప్రశ్న కరువు నెలకొన్న ప్రాంతాల్లోని రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు సంబంధించింది. ఈ అంశంపై ఇరు పక్షాల సభ్యులు పాల్గొన్నారు. కర్నూలు లోక్ సభ సభ్యురాలు బుట్టా రేణుక లాంటి కొత్త సభ్యులకు సైతం రైతులకు వివిధ బ్యాంకుల నుండి మంజూరయ్యే రుణాల గురించి ప్రశ్నించేందుకు అవకాశం లభించటం గమనార్హం. కరువు నెలకొన్న ప్రాంతాల్లోని రైతులకు వడ్డీరహిత రుణాలు మంజూరు చేయటంపై ఎంతో అర్థవంతమైన చర్చ జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సభ్యులు అడిగిన అన్ని అనుబంధ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానలు ఇచ్చారు. ఈ చర్చ మూలంగా కరువు నెలకొన్న ప్రాంతాల్లోని రైతులు బ్యాంకుల నుండి వడ్డీ రహిత రుణాలు తీసుకునేందుకు సంబంధించిన అన్ని అంశాలు వెలుగులోకి రావటంతోపాటు ఒక స్పష్టత ఏర్పడింది. సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు వడ్డీ రేటును ఏడు నుండి నలుగు శాతానికి తగ్గిస్తున్నారని మంత్రి వివరించారు.
వ్యాధి నిరోధక టికాల అంశంపై కూడా అర్థవంతమైన చర్చ జరిగింది. ఒక గంట ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో నాలుగు ప్రశ్నలపై చర్చ జరిగింది. కరువు ప్రాంతాలలోని రైతులకు రుణాలు మంజూరు చేయటం, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణా ల మంజూరీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధంచిన ఈ నాలుగు ప్రశ్నలపై అర్థవంతమైన చర్చ జరగటం ముదావహం. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సజావుగా నడిపించుకోవాలని చాలా సంవత్సరాల క్రితమే అన్ని పక్షాలు అంగీకరించినా సభలో మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చాయి. ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో చాలా కాలం తరువాత ప్రశ్నోత్తరాల కార్యక్రమం సవ్యంగా జరిగింది.
స్పెషల్ మెన్షన్స్ కార్యక్రమంలో ఒక ర్యాంకు ఒక పింఛన్, గ్రామీణాభివృద్ది శాఖ పరిధిలోని జిల్లాల అభివృద్దికి కేటాయించిన నిధుల ఖర్చును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీల పని తీరు, స్మార్ట్ సిటీలు, రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ, ఆకాశవాణి కేంద్రాల ఏర్పాటు, పర్యటనాభివృద్ధి, క్యాన్సర్ కేంద్రాల ఏర్పాటు,జమ్ముకాశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలకు రైల్వే సౌకర్యం ఏర్పాటు చేయటం, జాతీయ రహదారుల నిర్మాణం తదితర పలు ముఖ్యమైన అంశాలను సభ్యులు ఆయా శాఖల మంత్రుల దృష్టికి తీసుకురాగలిగారు. దాదాపు నలభై మంది సభ్యులు దేశంలోని అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.
సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరిగింది. ఆఖరున తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ టి.ఆర్.ఎస్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ ప్రతిపాదించిన దానితోపాటు మొత్తం ఇరవై ఐదు మంది సభ్యులు ఆయా అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించారు. నిర్బంధ ఓటింగ్ విధానాన్ని అమలు చేయాలనే అంశానికి సంబంధించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ జరిగింది. గత వారం ఉభయ సభల్లో మొదటి రెండు రోజులు రాజ్యాంగ నిర్మాత అంబేధ్కర్ జయంతి సంధర్భంగా రాజ్యాంగం పట్ల మనం ఏ మేరకు కట్టుబడి ఉన్నామనే అంశంపై సుధీర్ఘ చర్చ జరిగింది. దేశంలో పరమత అసహనం పెరిగిపోతోందంటూ ప్రతిపక్షం పెద్ద ఎత్తున గొడవ చేసిన నేపథ్యంలో రాజ్యాంగంపై రెండు రోజుల పాటు జరిగిన ఈ చర్చ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతోపాటు అధికార, ప్రతిపక్షానికి చెందిన వారంతా తాము రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నామనే స్పష్టమైన ప్రకటన చేయటం గమనార్హం. రాజ్యాసభ సైతం ఒకటి,రెండు గొడవలు మినహా ప్రశాంతంగా జరిగింది. అధికార పక్షాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షం ఒకటి, రెండు సార్లు సభను స్తంభింపజేసినా మొత్తం మీద రాజ్యసభ సైతం పార్టీ గొడవలను దూరంగా పెట్టి ప్రజలకు సంబంధించిన సమస్యలపై చర్చకే ప్రాధాన్యత ఇవ్వటం ముదావహం. శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షం రాజ్యసభలో తమకున్న మెజారిటీని దుర్వినియోగం చేయకపోవటం హర్షణీయం.