ఉత్తరాయణం

ప్రాభవం కోల్పోతున్న వర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎన్‌యూ, హెచ్‌సియూలలో తరుచుగా ఆందోళనలు జరుగుతూ ఉండడం వల్ల అవి ప్రాముఖ్యం కోల్పోతున్నాయా? జెఎన్‌యూలోని 2700సీట్ల కోసం గత ఏడాది 79 వేల దరఖాస్తులు వస్తే, ఈ ఏడాది 76 వేలు వచ్చాయి. వచ్చే సంవత్సరాల్లో ఇంకా తగ్గిపోవచ్చు. గతంలో హెచ్‌సియూలో ప్రాంగణ నియామకాల కోసం 45 కంపెనీలు వస్తే ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య కేవలం 15 కంపెనీలొచ్చి నియామకాలు జరపకుండా వెళ్లిపోయాయి. గతంలో వరంగల్లు రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులపై వామపక్ష తీవ్రవాదులన్న ముద్ర ఉండేది. ఉద్యోగాలిచ్చేవారు కాదు. ఆ పరిస్థితి జెఎన్‌యు, హెచ్‌సియులకు వచ్చేట్టుంది.
-లక్ష్మీ ప్రసన్న, పేర్రాజుపేట, తూ.గో.జిల్లా
ఏమిటీ గందరగోళం?
ప్రజల విశ్వాసం వుంచే ఒకే ఒక వ్యవస్థ న్యాయవ్యవస్థ. కాని ఇప్పుడా వ్యవస్థ ప్రజల్ని గందరగోళ పరుస్తున్నది. కొంతకాలం క్రితం మత విశ్వాసాల్లో న్యాయవ్యవస్థ తలదూర్చదని చెప్పిన సుప్రీంకోర్టు ఇప్పుడు ‘‘రాజ్యాంగం ముఖ్యం, మత విశ్వాసాలు కాదు’’ అంటున్నది. వైద్య కళాశాలల్లో ప్రవేశానికి జాతీయ స్థాయి ఉమ్మడి పరీక్ష ప్రవేశపెడితే ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఇప్పుడు ఆ కేసుని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ విచారిస్తుందని సుప్రీకోర్టు ప్రకటించింది. ఏమిటీ గందరగోళమని ప్రజలు విస్తుపోతున్నారు.
-చంపక్, మాధవనగర్
బెంబేలెత్తిస్తున్న ఎండలు
మండుతున్న ఎండలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా భాగ్యనగరవాసులు. ఉదయం పదిగంటలకే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్‌లో సగం జీవితం గడచిపోతోంది. దీనికి తోడు ఎండలు ప్రత్యక్ష నరకాన్ని చూపుతున్నాయి. ఇక బస్సులకోసం వేచి ఉండేవారి పరిస్థితి దయనీయం. టైముకు బస్సులు రావు. నిలుచోవడానికి షెల్టర్ ఉండదు. నడి ఎండలో నిలబడాల్సి వస్తోంది. ఒకవేళ బస్సు వచ్చినా అందులో నిలబడడానికి కూడ చోటుండదు. భాగ్యనగర వాసుల ఇక్కట్లకు పరిష్కారం లేదా? ఇప్పటికైనా అధికార్లు స్పందించి, షెల్టర్లు ఏర్పాటు చేయాలి.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
కెజిహెచ్‌లో మత ప్రచారం
ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంజీవనిగా వినుతికెక్కిన కెజిహెచ్‌లో మతప్రచారకుల తాకిడి ఎక్కువైంది. రోగుల మతవిశ్వాసాలతో సంబంధం లేకుండా కరపత్రాలు పంచి, దేవుని శక్తిగల పానీయం అంటూ, నీళ్లు చల్లుతున్నారు. వార్డుల్లో కూర్చొని ప్రార్థనలు జరుపుతున్నారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ సిబ్బంది వారిని ఎట్లా లోపలకు అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు. గేటు బయట టెంట్లు వేసి వచ్చేవారిని ఆపి బలవంతంగా ప్రార్థనలు చేయిస్తున్నారు.
- సి. ప్రతాప్, శ్రీకాకుళం
నల్లధనం మతలబు
పనామా సునామీ, నల్లకోట బీటలు, నల్లగుట్టురట్టు- అంటూ మీడియా ఊగిపోయింది. మెజారిటీ జనాభా కూడా. కాని కొందరైనా ఆలోచించి ఉంటారు నిజమెంత? నిరూపణ అవుతుందా అని. ఎంత గుట్టు రట్టు అయింది? నల్లకోట ఎంత బీటలు వారింది? అని అడిగితే సమాధానం ఉండదు. భారతీయులు 500 మంది ఉన్నారట. వాళ్ల నేరం ఏమిటి? తెలియదు. ఎంత నల్లధనం పోగేశారు? తెలియదు. దిక్కుమాలిన విదేశీ చట్టాలను ఛేదించి వారిని, ఆ డబ్బుని వెనక్కి తేవడం సాధ్యమా? తెలియదు! రెండేళ్లనుంచి కొందరి గురించి కొన్ని సంస్థల గురించి ఆరాతియ్యమని భారత ప్రభుత్వం ఆ సంస్థను కోరితే ఇంతవరకు వివరాలు రాబట్టలేక పోయింది. అదీ అంతర్జాతీయ చట్టాల రహస్యం!!
- సోనాలి, సూర్యారావుపేట
ఆర్ష సంస్కృతిపై దాడులు
బ్రాహ్మణులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా, ఎన్ని ప్రముఖ పదవులనలంకరించినా, ఇతర కులాల, మతాలవారు ఎంత చిన్నచూపు చూసినా, వారి పాపాన వారే పోతారులే అని తమలో తాము సముదాయించుకుంటూ, ఏ ప్రతిఘటనకు పాల్పడకుండా మిన్నకుండిపోయారు- పోతున్నారు. హిందూ దేవతలను వెండితెరమీద వక్రీకరించి చూపడంవల్ల కూడా హిందూ మతం చులకనైపోయింది. ఇతర మతాలవారిని ఇలా చూపగలరా? గమనించాలి. అత్యధిక జనాభా కలిగిన హిందువులలోనే నెలకొన్న అనైక్యత, దేవతామూర్తులకు కళంకం కలిగించే వ్యాఖ్యానాలు చేయడంవల్ల మన ప్రాచీన అత్యుత్తమ హిందూ సంస్కృతికి విఘాతం కలుగుతున్నది. హిందువులారా ఏకం కండి, ఐక్యతగా మెలగండి, ఆర్ష ధర్మాన్ని రక్షించండి అని ప్రవచన కర్తల సందేశాలు చెవికెక్కకపోవడం దుఃఖ హేతువవుతున్నది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్