ఉత్తరాయణం

భద్రతా చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ నగరానికి దీటుగా గాజువాక పారిశ్రామిక ప్రాం తం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో అంతే స్థాయిలో భద్రతా పరంగా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడి పరిశ్రమల్లో తరచుగా ప్రమాదాలు సంభవిస్తుండడడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల దువ్వాడ సమీపంలో బయోమాక్స్ బయోడిజిల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించి కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. తదనంతరం జరిగిన తనిఖీల్లో అన్ని భద్రతా నిబంధనలకు నీళ్లొదిలేసారని, ఫైర్ సర్వీస్ చట్టం, జాతీయ బిల్డింగ్ కోడ్, నేషనల్ పొల్యూషన్ చట్టం, ఏపి ఫ్యాక్టరీస్ చట్టాలను పూర్తిగా విస్మరించారన్న విషయం క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యవైఖరిని స్పష్టం చేస్తున్నది. బయోమాక్స్ కంపెనీయే కాక అన్ని కంపెనీలలో ఇదే తంతు నడుస్తోందని, యాజమాన్యాలు దొంగదారిన అనుమతులు తెచ్చుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఇక్కడి కంపెనీలలో భద్ర తా ఆడిట్‌లు నిర్వహించి, తదనుగుణంగా నివారణ చర్య లు చేపట్టకపోతే భవిష్యత్తులో బూడిదే మిగులుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఇదీ న్యాయవ్యవస్థ తీరు
ఇటీవల హెబ్బార్ నాగేశ్వరరావుగారు న్యాయవిలంబనం-బ్రిటిష్ వారి వారసత్వం శీర్షికన రాసిన వ్యాసం ఆలోచింపజేసింది. గరిమెళ్లవారి పద్యంలోని ‘ద్రవ్య దాహము కల్పించినాడు’ అన్నది న్యాయవ్యవస్థ తీరును తేటతెల్లం చేస్తోంది. ‘చెడ్డ ఊహలు కడుపెంచినాడు’ అన్నది దేవాలయాల విషయంలో తీర్పులకు అసలు కారణం చెప్పకనే చెబుతున్నది. అలాగే మంత్రివర్గం న్యాయవ్యవస్థలకు మధ్య జరుగుతున్న అధికార పరిధుల అతిక్రమణ ప్రహసనం అసలు సమస్య అన్న హెబ్బార్ గారి అభిప్రాయం నూటికి నూరుపాళ్లు నిజం.
- రాజనాల లక్ష్మీనారాయణ, దమ్మాయిగూడ, హైదరాబాద్
బిఎస్‌ఎన్‌ఎల్ సేవల్లో జాప్యం
గుంటూరు జిల్లాలో బిఎస్‌ఎన్‌ఎల్ వారి సేవలు నానాటికీ తీసికట్టుగా మారుతున్నాయి. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బాండ్ సేవలకు తరచుగా అంతరాయం కలుగుతోంది. ఫిర్యాదు చేసిన నాలుగు రోజులకు గాని సర్వీసులు పునరుద్ధరింపబడటం లేదు. సర్వీస్ సెంటర్లలో సిబ్బంది కొర త కారణంగా కొత్త సిమ్‌లు, ల్యాండ్‌లైన్ కనెక్షన్లు, టెలిఫోన్ షిఫ్టింగ్ తదితర సేవలను అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. బిఎస్‌ఎన్‌ఎల్ సేవలలో నాణ్యత కోల్పోయిన కారణంగా ప్రజలు ఇతర ప్రైవేటు ఆపరేటర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వమే కారణభూతమవుతుండటం బా ధాకరం.
-ఎం. కనకదుర్గ, తెనాలి
టీచర్లందరికీ ఇళ్లు అవసరంలేదు
ప్రభుత్వ టీచర్లలో కనీసం తొంబయిశాతం మందికి ఇళ్లు ఉన్నాయి. అర్హతలను బట్టి జీతాలను తీసుకుంటూ, పిల్లలను మంచి విద్యాసంస్థల్లో చదివించుకుంటూ, విలాసవంతమైన జీవితం గడిపేవారే ఎక్కువ. అయితే స్వంత ఇళ్లు లేనివారు పదిశాతం మంది అద్దె ఇళ్ళలో మగ్గుతున్నారు. ఇటువంటి వారికి ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వడం ధర్మం. అంతకంటె నిరుద్యోగులై, కూడు,గుడ్డ లేక పగలంతా కూలీనాలీ చేసి పొట్టపోసుకుని, రాత్రిళ్లు రైల్వే స్టేషన్లలో కాలం గడుపుతున్న వారికి ఇళ్లు కట్టించి ఇవ్వడం న్యాయం. అంతేకాని అన్నీ ఉన్నవాళ్లకు ఇళ్లు నిర్మించడం అనవసరం. దీన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తిస్తారని మా విజ్ఞప్తి.
- మునె్నల్లి హిమజ, కావలి
అనుచిత స్థాయికి ‘ఉచితం’
రాష్ట్రాలకు జరుగుతున్న ఎన్నికల పుణ్యమాని వివిధ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో గ్రైండర్లు, మిక్సర్లు ఉచితంగా ఇస్తామని ఒక పార్టీ వారు అంటే, టివిసెట్లు ఉచితంగా ఇస్తామని మరో పార్టీవారు హామీలు గుప్పిస్తున్నారు. ఇలా అంటున్నవారు వారి పార్టీ నిధులనుంచి కాని వ్యక్తిగత ఆస్తుల నుంచి గాని ఈ ఉచితబహుమతులు ఇవ్వాలి. అంతేకాని ప్రజాధనం నుంచి కాదు అని ఎన్నికల కమిషర్ చెప్పాలి.
- ప్రొఫెసర్ కె.ఎన్.రావు, హైదరాబాద్
ఎందుకింత నిర్లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలల్లో సిసి కెమేరాలు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంతవరకు బయోమెట్రిక్ మెషిన్లను ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేయలేదు. నవ్యాంధ్రలో ఎందుకింత నిర్లక్ష్యం జరుగుతోంది? విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ విషయం ఎంతకూ అంతుపట్టడం లేదు.
- గడ్డివార కేధర్, తరుకపల్లి, అనంతపురం