ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

దేశ సమగ్రతకే ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర ప్రదేశ్ శ్యాలీ జిల్లాలోని ఖైరానా పట్టణం నుండి హిందువులంతా వలస పోతున్నారు. ముస్లింలు మెజారిటీలో ఉన్న ఖైరానా పట్టణంలో తాము జీవించటం కష్టసాధ్యమైపోతోందన్నది వారి ఫిర్యాదు. మెజారిటీ ప్రజలుండే ప్రాంతాల్లో మైనారిటీలకు నిలవ నీడ లేకుండా చేయటంనేది అత్యంత తీవ్రమైన సమస్య. హిందువులు మెజారిటీలో ఉన్న ప్రాంతాల్లో ముస్లింలు ఉండ కూడదు, ముస్లింలు మెజారిటీలో ఉండే ప్రాంతాల్లో హిందువులు ఉండకూడదనేది అత్యంత ప్రమాదకరమైన అంశం. ఖైరానా గొడవ ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలకు పాకితే దేశ సమగ్రతను దెబ్బ తింటుంది.
ఖైరానా నుండి హిందువులు వలస పోవటం అకస్మాత్తుగా ప్రారంభం కాలేదు. గత కొన్ని సంవత్సరాల నుండి స్లో మోషన్‌లో కొనసాగుతున్న ప్రక్రియ. ఖైరానా లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బి.జె.పి ఎం.పి ఈ సమస్యపై ప్రజా ఉద్యమం చేపడతానని బెదిరిస్తున్నారు. వచ్చే సంవత్సరం జరుగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం హిందు, ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకే బి.జె.పి గోరంత ఖైరానా సమస్యను కొండంతలు చేస్తోందని సమాజ్‌వాదీ, బి.ఎస్.పి ఆరోపిస్తున్నాయ. ముస్లింలు మెజారిటీలో ఉన్న ఖైరానా నుండి హిందువులు వలస పోవలసిన అవసరం ఏమిటనేది తెలుసుకోవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ఉత్తర ప్రదేశ్‌లోని శ్యాలీ జిల్లాలోని చిన్న పట్టణం ఖైరానా. ఖైరానాలోని మొత్తం జనాభాలో ముస్లింలు దాదాపు ఎనభై శాతం ఉంటే హిందువులు మిగతా ఇరవై శాతం ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల నుండి జరుగుతున్న దాడులు, బెదిరింపుల మూలంగా పట్టణంలోని మైనారిటీ ప్రజలు వలస పోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఉత్తర ప్రదేశ్ శాసన సభకు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఖైరానా వలసలు పెద్ద సమస్యగా మారుతోంది. ఖైరానా పట్టణంలోని హిందువులందరు ఇళ్లు ఖాళీ చేసి పోతున్నారని స్థానిక బి.జె.పి ఎం.పి హుకుం సింగ్ ఆరోపిస్తున్నారు. ముస్లింల దాడులు పెరగటం వల్లనే హిందువులు తమ ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారన్నది ఆయన ఆరోపణ. హుకుం సింగ్ కేవలం ఆరోపణలు చేయటమే కాకుండా ఖైరానా పట్టణం నుండి వలస పోయినా వారి జాబితాను విడుదల చేశారు. ఖైరానా నుండి హిందువులు వలస పోతున్నారనటం నిజం కాదు. ఉపాధి కోసం చాలా మంది హిందువులు తమ ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఖైరానా ఎం.పి హుకుం సింగ్‌తోపాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పలువురు బి.జె.పి ఎం.పిలు,శాసన సభ్యులు ఖైరానా వలసలపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు జరిగే సమయానికి ఖైరానా సమస్య మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉన్నది.
భారత దేశంలోని అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రంలోని ఒక పట్టణం నుండి హిందువులు వలస పోవలసిన పరిస్థితులు నిజంగానే నెలకొంటే అంతకంటే తీవ్రమైన సమస్య మరొకటి ఉండదు. ఇప్పుటికే జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ లోయ ప్రాంతంలో హిందువులకు నిలవ నీడ లేకుండా పోయింది. ముస్లిం ఉగ్రవాదం మూలంగా శ్రీనగర్ లోయ ప్రాంతంతో పాటు జమ్ములోని పలు ప్రాంతాలకు చెందిన హిందువులు ఇతర రాష్ట్రాలకు పారిపోవలసి వచ్చింది. శ్రీనగర్ లోయకు చెందిన వేలాది మంది హిందువులు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. వారు స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోయారు. ఇలాంటి దురవస్థ దేశంలోని ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న మైనారిటీలకు ఎదురు కాకూడదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతోపాటు ఉత్తర ప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ ప్రభుత్వం కూడా ఖైరానా సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణించాలి.
ఖైరానా నుండి హిందువులు వలస పోవటంపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా సరైన సమాచారాన్ని వెల్లడించటం లేదు. ఖైరానా నుండి హిందువులు వలస పోవటం నిజమేకానీ మెజారిటీ ముస్లింల దాడుల మూలంగా కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఖైరానా హిందువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవటం అనేది ఇప్పుడు అకస్మాత్తుగా చోటు చేసుకుంటున్న పరిణామం కాదని అధికారులు అంటున్నారు. గత ఇరవై, ముప్పై సంవత్సరాల నుండి ఖైరానాకు చెందిన హిందువులు ఇతర ప్రాంతాలకు వివిధ కారణాల మూలంగా వలసపోతున్నారని ముఖ్యమంత్రి అఖిలేష్ ప్రభుత్వం చెబుతోంది. ఎవరు ఏ కారణం చెప్పినా ఖైరానా నుండి హిందువులు వలస పోవటం మాత్రం పచ్చి నిజం. హిందువులు ఎప్పటి నుండో వలస పోతున్నారని చెప్పినంత మాత్రాన సమస్య సమస్య కాకుండా పోదు.
మెజారిటీలో ఉన్న ప్రజల దాడుల మూలంగా మైనారిటీలో ఉన్న ప్రజలు ఇల్లు,ముంగిలి వదులుకుని పోవలసిన పరిస్థితులు ఏ మతం వారికి కూడా ఎదురు కాకూడదు. కేవలం ఖైరానాలో మాత్రమే ఇలా జరుగుతోందా? దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా మెజారిటీలో ఉన్న ప్రజల దాడులు, వేధింపుల మూలంగా మైనారిటీలో ఉన్న ప్రజలు వలస పోవలసి వస్తోందా? అనేది అధ్యయనం చేయవసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నది. ప్రజలు తమ అభీష్టం మేరకు ఇతర ప్రాంతాలకు తరలి పోవచ్చు కానీ దాడులు, వేధింపులు, భయాందోళన మూలంగా వలస వెళ్లవలసి రావటం ప్రమాదకరమైన అంశం. ఇలాంటి సంఘటనలు దీర్ఘ కాలంలో అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారి తీయటంతో పాటు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బ తీస్తాయి.