ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

కాంగ్రెస్ తప్పు చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేషనల్ హెరాల్డ్ ఆస్తుల వివాదంపై పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేయటం ద్వారా కాంగ్రెస్ అధినాయకత్వం తప్పు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ కక్ష సాధింపు చర్యల మూలంగానే నేషనల్ హెరాల్డ్ కేసులో తమను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించటం గర్హనీయం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదటి వారంలో ప్రశాంతంగా జరగటంతో ప్రతిపక్షం, అధికార పక్షం ఇంత కాలం కొనసాగించిన ప్రతిష్టంభన రాజకీయానికి తెర పడిందని అందరు భావించారు. మొదటి వారం పార్లమెంటు సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన పలు అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగింది. ఇది ఇక మీదట కూడా కొనసాగుతుందని అందరు ఆశించారు. అయితే పానకంలో పుడక మాదిరిగగా నేషనల్ హెరాల్డ్ కేసు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు గుదిబండగా మారింది. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన ఆస్తులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ డాక్టర్ సుబ్రమణ్యం స్వామి దాఖలు చేసిన కేసు విచారణ వ్యవహారం పార్లమెంటు శీతాకాల సమావేశాలను స్తంభింపజేస్తోంది. నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించిన కేసుపై ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టుకు హాజరు కాకుండా తమకు మినహాయింపు ఇవ్వాలంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించటంతోపాటు ఈనెల 19న ట్రయల్ కోర్టు ముందు హాజరు కావలసిందేనని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశం వెనక ప్రధాన మంత్రి హస్తం ఉన్నదన్నది కాంగ్రెస్ ఆరోపణ. ప్రధాన మంత్రి కార్యాలయం తెచ్చిన వత్తిడి మూలంగానే హైకోర్టు తమ పిటిషన్‌ను తిరస్కరిస్తూ పలు వ్యాఖ్యలు చేయటంతోపాటు డిసెంబర్ 19 నాడు ట్రయల్ కోర్టు ముందు హాజరు కావాలసిందేననే ఆదేశం జారీ చేసిందన్నది రాహుల్ గాంధీ ఆరోపణ. నేషనల్ హెరాల్డ్ కేసు నూటికి నూరు శాతం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని రాహుల్ గాంధీ ఆరోపించారు. సోనియా గాందీ, రాహుల్ గాంధీ ఆదేశం మేరకు కాంగ్రెస్ ఎం.పిలు గత వారం నుండి పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటంతోపాటు బి.జె.పి ప్రభుత్వంపై ఆరోపణలు కురిపిస్తున్నారు. ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ఈ వివాదంలోకి లాగటం ద్వారా నరేంద్ర మోదీని రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం అన్ని రకాలుగా ప్రయత్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసు కోసం పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేయటం ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసింది. పార్లమెంటును స్తంభింపజేయటం ద్వారా ఎన్.డి.ఏ ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి తద్వారా హైకోర్టు విచారణ నుండి బైట పడేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నించటం విచారకరం. నేషనల్ హెరాల్డ్ కేసు కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఫణంగా పెట్టటం కాంగ్రెస్ అధినాయకత్వం రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. కోర్టు కేసులను కోర్టులో తేల్చుకోవాలి తప్ప ఇలా పార్లమెంటును స్తంభింపజేయటం సమర్థనీయం కాదు. పార్లమెంటును స్తంభింపజేయటం ద్వారా ఢిల్లీ హైకోర్టును బ్లాక్‌మేయిల్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చేసిన ఆరోపణలో నిజం లేకపోలేదు. పార్లమెంటులో నెలకొన్న ప్రతిష్టంభన మూలంగా జి.ఎస్.టి బిల్లు మరోసారి అటకెక్కే ప్రమాదం నెలకొన్నది. జి.ఎస్.టి బిల్లును పాస్ చేసుకోవాలంటే బి.జె.పి మొదట కాంగ్రెస్‌ను మచ్చిక చేసుకోవాలి. కాంగ్రెస్‌ను మచ్చిక చేసుకోవాలంటే మొదట నేషనల్ హెరాల్డ్ కేసును నీరుకార్చాలి. అయితే బి.జె.పి అధినాయకత్వం జి.ఎస్.టి బిల్లును వదులుకునేందుకు సిద్దపడింది తప్ప కాంగ్రెస్ వత్తిడికి లొంగి జి.ఎస్.టి బిల్లు కోసం కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు సుముకత చూపించకపోవటం గమనార్హం. నేషనల్ హెరాల్డ్ కేసు కోసం పార్లమెంటును స్తంభింపజేయటాన్ని ప్రజలు హర్షించటం లేదు. ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ కూడా గ్రహించినట్లుంది. నేషనల్ హెరాల్డ్ కేసు కోసం పార్లమెంటును స్తంభింపజేయటం తప్పు అనేది గ్రహించిన కాంగ్రెస్ తన వ్యూహాన్ని మార్చుకున్నది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో గొడవ చేసి జీరో అవర్‌లో సభ నుండి వాకౌట్ చేసే వ్యూహాన్ని అమలు చేస్తూ తమకు మెజారిటీ ఉన్న రాజ్యసభను స్తంభింపజేయటం కొనసాగిస్తోంది. పార్లమెంటును స్తంభింపజేయటం కొందరు సీనియర్ నాయకులకు ఇష్టం లేకపోయినా అధినాయకత్వం ఆదేశాన్ని ఎదురించలేకపోతున్నారు. కాంగ్రెస్ అధినాయకత్వం నేషనల్ హెరాల్డ్ కేసు కోసమే శీతాకాల సమావేశాలను స్తంభింపజేస్తోందనే సందేశం ప్రజలకు వెళ్లిపోయింది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు జరగాల్సిన నష్టం జరిగిపోయిన తరువాత తాము నేషనల్ హెరాల్డ్ కేసు కోసం ఉభయ సభలను స్తంభింపజేయటం లేదని కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పుకుంటోంది. కాంగ్రెస్‌కు ఏ మాత్రం రాజకీయ చిత్తశుద్ధి ఉన్నా నేషనల్ హెరాల్డ్ కేసును కోర్టులో తేల్చుకోవాలి తప్ప పార్లమెంటును స్తంభింపజేయకూడదు. సుబ్రమణ్యం స్వామి ఈ కేసు అంతు తేలేంత వరకు పోపారాడుతాడు తప్ప పార్లమెంటును స్తంభంపజేసినంత మాత్రాన వెనకడుకు వేయడదనేది కాంగ్రెస్ అధినాయకత్వం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.