ఉత్తరాయణం

కఠినంగా శిక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్యం మత్తుతో జరిపిన ప్రమాదాల సంఖ్యలో తెలు గు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలకన్నా ముందంజలో ఉండటం శోచనీయం. దీనికి గర్వపడాలా? సిగ్గుపడాలా? నిత్యం మద్యం మత్తులో వాహనాలు నడపడంవల్ల ప్రమాదాలు పెరిగిపోయి, ఎందరో అమాయకుల ప్రాణాలు అనంత వాయువులలో కలసిపోతున్నాయి. దోషం ఒకరిదైతే శిక్ష ఎంతమంది అమాయకులకు? పట్టణాలు, గ్రామాలు అని లేకుండా అన్ని ప్రాంతాలలోనూ తనిఖీలు ముమ్మరం చేయాలి. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారికి శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్సులు రద్దుచేయాలి.ఇకముందు కూడా వారికి లైసెన్సులు రాకుండా చూడాలి. అత్యంత కఠినంగా శిక్షించాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
బస్టాండ్‌లో వసతుల కరవు
నల్గొండ జిల్లా దేవరకొండ బస్టాండ్‌లో కనీస వసతులు లేని కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నైజాం కాలంలో ప్రారంభమైన ఈ బస్టాండ్ జిల్లాలో ఆదాయంలో నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ కనీస సదుపాయాలు కల్పించడంలో ఆర్టీసి ఘోరంగా విఫలమైంది. బస్టాండ్‌లో మంచినీటి సౌకర్యం లేక వాటర్ బాటిల్స్‌పై ఆధారపడాల్సిందే. మరుగుదొడ్లు, మూత్రశాలలు తీవ్రమైన దుర్గంధం వెదజల్లుతుండడమేకాక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫ్యానులు, లైట్లు పనిచెయ్యవు. ప్రయాణికులు కూర్చునేందుకు ఏర్పాటుచేసిన బెంచీలు సగం విరిగిపోయాయి. బస్టాండ్ ప్రాంగణంలో చెత్తాచెదారం ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నా శుభ్రం చెయ్యరు. రోడ్లు శిథిలమైపోవడంవలన బస్సులు రాకపోకలు సాగిస్తున్నప్పుడు పెద్దఎత్తున దుమ్ముధూళి రేగుతున్నది. ఇప్పటికైనా ఆర్టీసి అధికారులు స్పందించి బస్టాండ్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
- సిహెచ్.సాయిఋత్త్విక్, నల్గొండ
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే
శాంతి కాముక దేశమైన భారత్ అనేక సమస్యలనెదుర్కొంటూ కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే దాయాది దేశంగా భావించే పాక్ సదా కుట్రలు పన్నుతూ ఉగ్రవాదులను దొంగచాటుగా సరిహద్దు దాటిస్తూ దేశంలో అంతర్భాగమైన జమ్ముకాశ్మీర్‌లో విధ్వంసాలకు పాల్పడుతుండటం జగమెరిగిన సత్యం. ఆ దేశంతో సత్సంబంధాలు కొనసాగించాలని భారత్ ఎంత కృషిచేస్తున్నా దేశంలో నిత్యం అలజడులు సృష్టించి విషం కక్కుతున్నది. ఈ దేశంలోని కొంతమంది యువతను పెడదారి పట్టించి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటట్లు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతోపాటు సరిహద్దు వెంబడి భారత సైనికులపై కాల్పులు జరుపుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం దేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిన సమయం ఆసన్నమైంది.
- జి.వి.రత్నాకర్‌రావు, సికిందరాబాద్
అడుగడుగునా అడ్డంకులు
ఆంధ్ర రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన పోలవరం ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా కల్పించినా నిర్మాణంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతున్నాయి. సముద్రంలో వృధాగా కలిసిపోయే 3000 టియంసిల నీటిని నిల్వ చేసుకొని 6 జిల్లాలకు సాగు, త్రాగు నీటి అవసరాలు, వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేదిగా వుండే ఈ ప్రాజెక్టును సత్వరం పూర్తిచెయ్యాలన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష. అయితే నూతన రాజధాని నిర్మాణంలో బిజీగా వున్న రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయంగా పనికి వస్తేనే నిధులిచ్చే కుత్సిత, అవకాశవాద రాజకీయాలకు పాల్పడే కేంద్రం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యవైఖరి ప్రదర్శిస్తున్నాయి. ప్రాజెక్టుకు 40వేల కోట్లు కావాల్సి వస్తే 100 కోట్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్న కేంద్రం, ఆ ప్రాజెక్టును మాకు అప్పగిస్తే 2019 కల్లా పూర్తిచేస్తామని ప్రకటించడం తెలుగు ప్రజలను మభ్యపెట్టడమే! ఇదే ప్రాజెక్టును కట్టే అవకాశం వుంటే దేశంలో ఏ రాష్టమ్రైనా తల తాకట్టు పెట్టయినా సరే నిర్మా ణం పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకొని వుం డేది. కల్లబొల్లి కబుర్లతో కాలం గడిపేస్తూ ప్రజల చెవుల్లో పూవులు పెట్టే ప్రభుత్వాలు వున్నంతవరకు ఇటువంటి బృహత్తర ప్రాజెక్టులకు మోక్షం కలుగదు!
- ఎం.కనకదుర్గ, తెనాలి
సమన్వయలోపం
నగరంలో విద్యుత్ తీగలకు అడ్డం అని చెట్టుకొమ్మలు యిష్టం వచ్చనట్లు నరికి రోడ్డుమీద పడేస్తున్నారు. రోజుల తరబడి అట్లాగే పడి వుంటున్నాయ్. పాదచారులకు యిబ్బందిగా వుంది. ప్రభుత్వ శాఖల్లో సమన్వయం లేదు. విద్యుత్ సరఫరాని అర్థాంతరంగా గంటలతరబడి ఆపేస్తున్నారు. ఒక చుక్క నీరు కూడా యింట్లో లేని పరిస్థితుల్లో గంటల తరబడి కరెంట్ నిలిపివేస్తే ఎలా?
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ