ఉత్తరాయణం

రైతు కష్టాలను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి ఆధునిక కాలంలో కూడ ఒక పంటను వేసుకొని ఏ రైతు అయినా నిబ్బరంగా బ్రతుకును వెళ్ళదీసింది లేదు. వాణిజ్య పంటలైన పొగాకు, ప్రత్తి పంటలను వేయరాదని ప్రభుత్వమే అంటున్నది. కాని ఇతర పంటలు పండించాలని రైతులకు అవగాహన కల్పించింది మాత్రం తక్కువే. పండిన పంటలను కోసి మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర పలకదాయే. ఉన్న ఊళ్ళోనే పంటను నిలువచేసుకునే సదుపాయం లేదు. రైతులకు ఎక్కడా అప్పుపుట్టదు. ఏ పంటలకు ఎంత బీమానో ఇన్సూరెన్స్ కంపెనీలకే సరైన అవగాహన లేదు. ప్రభుత్వ సబ్సిడీలలో కనీసం సగం కూడా రైతులకు చేరటం లేదు. భారీ యంత్రాలు పొందిన మోతుబరి రైతులు చిన్న సన్నకారు రైతులకు కనీస రేటుకు సకాలంలో ఇవ్వరు, దొరకదు. వ్యవసాయంలో యాంత్రీకరణ జరిగినది ఎక్కడ? ప్రభుత్వ రాయితీలు బూడిదలో పోనిన పన్నీరు. ఋతువులు గతి తిప్పినాయి, భూగర్భ జలాలు అడుగంటినాయి, అయితే అతివృష్టి లేదా అనావృష్టి చెప్పలేని గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి నేడు. పంటలకు వచ్చే రోగాలు అంతుచిక్కడం లేదాయె, రాష్ట్రంలో వ్యవసాయ భూములకుసాగునీరు అందుబాటులో లేదు. అంతోఇంతో కరెంటు మోటార్లు పెట్టుకొని పండించినా లోవోల్టేజ్ సమస్యతో మోటార్లు కాలిపోతున్నాయి. పంటలు కోసే సమయానికే కల్లంలో ఉన్నప్పుడే కురిసే వానలు రైతు పరిస్థితి చూస్తే ఈనకాచి నక్కలపాలైన చందంగా ఉంది. వ్యవసాయం చేస్తే నష్టం, చేయకపోతే కష్టం, రెంటికీ చెడ్డ రేవడిలా ఉన్నది.
- ఓడపెల్లి చంద్రశేఖరు, హన్మకొండ
అపహాస్యం చేయవద్దు
సినిమాల్లో పురాణ పాత్రలను అపహాస్యం చేస్తున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పురాణ గాథలు ప్రజల మనసుల్లో నాటుకొని దేవతల పట్ల, ఉత్తమ మార్గంలో పయనించిన వారి పట్ల ఆరాధ్యభావం పెంచుకుంటున్నారు. అయితే సినిమాలలో అనేక పురాణ పాత్రలను కామెడీ ఆర్టిస్టులచే వేయించి వెకిలి కామెడీ సన్నివేశాల్ని సృష్టించి జనులు ఆరాధించే దైవాలను అపహాస్యం చేయడం భావ్యమేనా? ఎక్కువగా ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి సన్నివేశాలను వెకిలిగా తీస్తున్నారు. సెన్సార్ అనేది ఎందుకు ఉంది? ఏం చేస్తుందో తెలియడం లేదు. ఇలాంటివి నిజమైన భక్తులైనవారు నిరసించాలి. సెన్సార్‌వారు బాధ్యతాయుతంగా పనిచేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
పిల్లలకు పుస్తకాల భారం
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలు దృష్టి సారించాల్సిన విషయం ఒకటుంది. బండెడు పుస్తకాలతో బడి పిల్లలపై భారం తగ్గించడానికి విద్యాశాఖాధికారులు ముందుకు రావడం లేదు. పాఠశాలలకు వెళ్ళే వారిలో ముఖ్యంగా ఐదేళ్ళలోపు పిల్లల పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. బియ్యం బస్తాలను మోసే కూలీలను తలపించే విధంగా నిండుగా పుస్తకాలు ఉన్న బ్యాగులను భుజానమోసే పిల్లలు, గాలీ వెలుతురు లేక జైళ్లను తలపించే పాఠశాల గదులు.. ఆటలాడుకోవలసిన వయసులో సిలబస్ భారం.. ఇలా ఎన్నాళ్ళు? ఇప్పటికైనా చిన్న పిల్లలపై నుంచి అనవసరపు బరువును దించి, వాస్తవిక అవగాహన కలిగించే విద్యాబోధన చేయడానికి ప్రణాళికలు రచించాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్
అందుబాటులో మార్కెట్లు
ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని మున్సిపాలిటీల్లో ఊరికి అంతటికీ ఒకే ఒక మార్కెట్ ఉన్నది. ఈ మార్కెట్‌కు కొంతమందికి దగ్గరగాను, మరికొందరికి 2లేక 3 మైళ్ల దూరంగా వున్నది. దీనివల్ల దూరంగా ఉన్న ప్రజలు మార్కెట్‌కు పోవాలంటే ఆటో చార్జీలు భరించాల్సిందే. మీరు సమీపం అంగడిలోని ధరలు ఎక్కువగా పెట్టి కూరగాయలు కొంటున్నారు. కాబట్టి దూరం ఉన్న వారికి అందుబాటు లో కూరగాయల మార్కెట్‌లు ఏర్పాటుచేయాలి
- ఎం.బి.నిర్మల, తాడిపత్రి
ఒంటిమిట్ట ప్రాశస్త్యం
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ రామాలయం ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం తదితరాల దృష్ట్యా ఎంతో ప్రాముఖ్యత పొందింది. శ్రీ వావిలకొలను సుబ్బారావు భక్తచరిత్ర ఇమాంబేగ్ భావి చరిత్ర, సంజీవరాముని దేవాలయం తదితర విశేషాలతో ఆంధ్రదేశ ప్రభుత్వం ఒక పుస్తకాన్ని (తెలుగు, ఆంగ్ల భాషలలో) ప్రచురించి భక్తులకు అందజేయాలి.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి