ఉత్తరాయణం

తోటపల్లిని అభివృద్ధి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌లోని తోటపల్లి రిజర్వాయర్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడి నాగావళి నదీ తీరంలో వేంకటేశ్వర ఆలయం చిన్న తిరుపతిగా పేరుపొందింది. ఈ ఆలయానికి చేరువలోనే కోదండరామస్వామి వారి ఉత్తరాంధ్ర భద్రాద్రి రామునిగా భావిస్తారు. తోటపల్లి ప్రాంతాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పరచాలని కోట్లాది ప్రజలు చిరకాలంగా కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి, తోటపల్లిని అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇక్కడి ఆలయాల వద్ద ప్రభుత్వం కాటేజీలు, గెస్ట్ హవుస్‌లు నిర్మిస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఉత్తరాంధ్ర, ఒరిస్సా ప్రాంత భక్తులు కోరుతున్నారు.
- మూల శ్రీనివాసరావు, మల్లయ్యపేట
హోదా కన్నా ఎక్కువే..
నేడు తెనుగునాట అందరినీ కుదుపుతున్న అంశం ప్రత్యేక హోదా. లోక్‌సభలో యుపిఎ సర్కారు హయాంలో ఆమోదించిన విభజన బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేనే లేదు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో హోదా అంశం ప్రస్తావించేవరకు యూపిఏ వారిలో ఆ వూసే లేదు. నీతీ ఆయోగ్ ఏర్పడిన దరిమిలా పరిణామాలను నేడు మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన జాతీయ విద్యాసంస్థలు, నిధులు సాధారణ స్థితితో పోలిస్తే ఇంత సులువుగా వచ్చి వుండేటివా? ప్రత్యేక హోదా రాలేదని గోల చేయడం కన్నా ప్యాకేజీ వల్ల వచ్చిన ప్రయోజనాల గురించి కూడా ఆలోచించాలి. ప్రత్యేక హోదాతో సమంగా అభివృద్ధి సాధించగలిగితే అంతకు మించి ఏమి కావాలి?
- వి.ఆర్.ఆర్.ఎ.రాజు, హైదరాబాద్
బస్సుల సంఖ్య పెంచండి
జంట నగరాలలో సిటీ బస్సులో ప్రయాణం నరకాన్ని తలపింపజేస్తోంది. రద్దీకి తగినన్ని బస్సులు లేకపోవడంతో నిత్యం ఫుట్‌బోర్డులపై వేలాడుతూ ఎంతోమంది ప్రయాణిస్తున్నారు. ఇలా ప్రయాణిస్తున్న విద్యార్థులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ఎదురుగావస్తున్న మరో వాహనం తగిలితే ప్రాణాలే పోవచ్చు. ఆర్టీసీ అధికారులకు ఇంత నిర్లక్ష్యమేల? బాగా రద్దీఉన్న రూట్లలో బస్సుల సంఖ్య పెంచాలి. ఫుట్‌బోర్డుపై ప్రయాణాన్ని నిషేధించాలి. ఆ నిషేధం ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలి. డ్రైవర్, కండక్టర్లనూ బాధ్యులను చేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
గ్రామసింహాల స్వైరవిహారం
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధికుక్కలు వీరవిహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైరా రోడ్డులోని చేపల మార్కెట్‌వద్ద రాత్రివేళల్లో గుంపులుగుంపులుగా వచ్చి ఇవి జనాలపై ఎగబడుతున్నాయి. రేవతి సెంటర్, కవింజినగర్, కోర్టు పరిసర ప్రాంతాల్లో, ఇల్లందు క్రాస్‌రోడ్, సర్దార్ పటేల్ రోడ్, రోటరీనగర్‌లో వీటి బెడద తీవ్రంగా ఉంది. వీటివల్ల స్కూల్‌కువెళ్ళే విద్యార్థులకు ఆటంకం ఏర్పడుతోంది. ఉదయం జాగింగ్‌కు వచ్చేవారికి శునకాలు ఆటంకం కల్పిస్తున్నాయి. రాత్రివేళల్లో వీటి బారిన ఎంతోమంది పడుతున్నారు. సంబంధిత అధికారులు దృష్టిసారించి సత్వరమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
- అయినం రఘురామారావు, ఖమ్మం
కాపు ఉద్యమం ఓ రాజకీయం
తెలుగుదేశం ప్రభుత్వంలో కాపు శాసనసభ్యులు, కాపు మంత్రులు తగినంత బలంలో వున్నారు. వారిలో భేదాభిప్రాయాలు కల్పించేందుకు ఓ కాపు నాయకుడిని ముందుకుత్రోసి వెనుకనుండి నాటకాలాడిస్తున్నది మరో రాజకీయ పార్టీ. ఎపిలో చాలామంది కాపులు ఆర్థిక స్థోమతకలవారే! రిజర్వేషన్లకే కాపు ఉద్యమమైతే, ఓసి కులస్తులందరినీ కలుపుకొని ఉద్యమానికి పోయి వుండవలసింది. కాపుల కంటే వెనుకబడ్డ కులాలు ఓ.సి. కులాల్లో వున్నారు. రిజర్వేషన్లంటూ ఇస్తే ఓ.సి కులస్తులందరికీ ఇవ్వవలసిందే. ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు రిజర్వేషన్లు కల్పించరా? రాజకీయ ప్రయోజనాలకేనా ఈ పోరాటం? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా వాస్తవాలను గ్రహించాలి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
ఆర్టీసీని కాపాడాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ప్రస్తుతం ఆర్థిక నష్టాల్లో మునిగిపోయి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించటంలో వెనుకడుగు వేస్తోంది. ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ నష్టాల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల ప్రజారవాణా వ్యవస్థ ఆశించిన మేరకు అభివృద్ధి చెందడం లేదు. ఆక్యుపెన్సీరేషియో భారీగా తగ్గిపోవటంవల్ల ఇటీవల చాలా బస్సు సర్వీసులను రద్దుచేశారు. మరోవైపు కండక్టర్ పోస్టుల నియామకాలు నిలిపివేయాలనే ఆలోచనలో ఆర్టీసీ వున్నది.ప్రయాణికులకు అనేక రాయితీలు ఇచ్చి మెరుగైన సేవలు అందించటానికి ఆర్టీసీలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నా ప్రైవేటు వాహనాలు, ఆటోల పోటీకి ఆర్టీసీ నిలిచే స్థితిలో లేదు. ఆర్టీసీ నష్టాలు పూడ్చుకొనేందుకు సంస్థ ఆస్తులను అమ్మాలనే ఆలోచన మంచిదికాదు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి నూతన రాజధాని కోసం వేల కోట్లు ఖర్చుపెట్టాలనే ఆలోచన నుండి ప్రయాణికుల భద్రతకు, ఆర్టీసీ భవిష్యత్‌పై దృష్టిపెట్టి ఆర్టీసీ పూర్వవైభవాన్ని తీసుకురావటానికి దృష్టిపెట్టాలి.
- ఉప్పు సత్యనారాయణ, తెనాలి