ఉత్తరాయణం

మాయమైపోతున్న మాతృభాష?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిందటి తరంవారు మాతృభాష తెలుగులోనే ఉన్నత విలువలను సాధించిన తర్వాత హిందీ, ఉర్దూ, ఆంగ్లం తదితర భాషల్లో పరిణతి పొందగలిగారు. అటువంటిది ఈనాడు తెలుగు వెలుగు లేక రాను రాను భ్రష్టుపట్టటానికి కారకులు ఎవరన్నది ఆలోచించాల్సిన విషమ పరిస్థితి ఏర్పడింది. విద్యార్థుల ఆలోచనలోనే కాదు తల్లిదండ్రులలో కూడా మాతృభాషను నేర్పించాలన్న ఆసక్తి ఉంటేనే తెలుగు చక్కగా పదికాలాలపాటు మనుగడ సాగిస్తుంది. అయితే ఇంటి దగ్గర మనం తెలుగులో ఎంత మాట్లాడగలిగినా, పాఠశాలలోని తరగతి గదిలో ఒక పద్ధతి ప్రకారం అభ్యసిస్తేనే పరిణతి సాధ్యమవుతుంది. ఉపాధ్యాయుడు చెప్పింది శ్రద్ధగా వినటం, తర్వాత ఆ పదాలను తప్పులు లేకుండా చక్కగా మాట్లాడటం, తర్వాత సవ్యంగా వాక్యాలు రాయడం- ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం జరగాలి. కానీ ఈనాడు తెలుగు, ఇంగ్లీషు భాషలమధ్య సంఘర్షణ పరిస్థితి ఏర్పడుతోంది. పిల్లలు కూడా తెలుగు మాట్లాడటం చిన్నతనంగా భావించి ఆంగ్లంలోనే ఎవరికైనా సమాధానం చెప్పడం, ఆంగ్లంలోనే ఇతరులతో మాట్లాడటం జరుగుతోంది. రాను రాను తెలుగును సంకర భాషగా మారుస్తున్నారు. ఇతర రాష్ట్రాలవారు వారి మాతృభాషలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటే, తెలుగువారు మాత్రం తెలుగును చిన్నచూపు చూస్తూ ఆంగ్ల భాషకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గురువులే పిల్లవానికి మాతృభాషలో బోధించవలసిన గురుబ్రహ్మ. కానీ తెలుగుకు ఎంతవరకు పట్టం కడుతున్నామో ఆలోచించాలి.
-వులాపు బాలకేశవులు
గిద్దలూరు, ప్రకాశం జిల్లా
కుటుంబ విలువలను పెంపొందిద్దాం
ప్రస్తుత ఆధునిక కాలంలో జీవితాలు యాంత్రికమయం అయ్యాయి. మానవ సంబంధాలు, ఆత్మీయతా అనుబంధాలు కరవవుతున్నాయి. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నం తర్వాత కుటుంబాలలో విలువలు నానాటికీ తగ్గిపోతున్నాయి. మర్యాదపూర్వక ప్రవర్తన, ప్రేమానురాగాలు, అతిథి సత్కారం, కనీస మానవ సంబంధాలు కొరవడుతున్నాయి. కుటుంబంలో పిల్లలకు తల్లిదండ్రులే మంచి అలవాట్లను పెంపొందించాలి. వ్యక్తుల పట్ల, సమాజంపట్ల మెలగాల్సిన పద్ధతులను నేర్పించాలి. దేశం, ధర్మం, సంస్కృతికి సంబంధించిన విషయాలు తెలియజేయాలి. పిల్లల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడు ప్రాచీన గ్రంథాలలోని సంఘటనలు వివరించాలి. పిల్లల నైతిక, మానసిక, ఆధ్యాత్మిక వృద్ధికి తల్లిదండ్రులు చేయూతనివ్వాలి. అప్పుడు కుటుంబ నిర్మాణం సాధ్యపడుతుంది. సామాజిక నేరాలకు అడ్డుకట్ట వేయబడుతుంది.
-సామల కిరణ్, జూలపల్లి, కరీంనగర్ జిల్లా
ఈ కష్టాలకు అంతమెన్నడు?
చిన్నవర్షాలకే లోతట్టు ప్రాంతాలు జలమయమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురై జాముల తరబడి ట్రాఫిక్‌జామ్ అయ్యే హైదరాబాద్ ప్రాంతం ఇప్పుడు అతి భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది. దీనితో వాహనదారులకే కాదు లోతట్టు ప్రాంతాలలో ఉన్న ఇండ్లలో నివాసం ఉంటున్నవారికీ కష్టాలు తప్పడంలేదు. మునుముందు ఇలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా శాశ్వత పరిష్కారం చూడాలి.
రోడ్లంతా జలమయమై మ్యాన్‌హోల్స్ తెరచుకొని అందులో పడి మరణిస్తున్నారు కొందరు. ఆ నీటి ప్రవాహంలో దెబ్బతిన్న రోడ్లపై ఎక్కడ్కెడ గుంటలు ఉన్నాయో అర్థంకాక కొంతమంది వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. నగరమంతా అన్ని రహదారులను రిపేర్ చేయాలి. ఏళ్ళ తరబడి పటిష్టంగా ఉండేలా, నాణ్యతా ప్రమాణాలతో రోడ్లను నిర్మించాలి. ట్రాఫిక్ కష్టాలు ఎదురుకాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
వృద్ధాప్యం శాపంగా మారుతోంది
కష్టనష్టాలకు ఓర్చి కని పెంచి ప్రయోజకులను చేస్తే కన్నబిడ్డలే తమ తల్లిదండ్రులను వీధులపాలు చేస్తున్నారు కొంద రు. వృద్ధాప్య దశలో భార్య, భర్తలలో ఏ ఒక్కరు మరణించినా వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. కొడుకులు కూతుళ్ళు ఆస్తులు పంచుకొని, ఒకరిపై ఒకరు వంతులు వేసుకొని వారిని నడి రోడ్డులో వదిలేస్తున్నారు. ఎంతో దర్జాగా బ్రతికినవారి జీవితం అవసాన దశలో భిక్షాటనతో కాలం గడపాల్సి వస్తోంది. ఆలనా పాలనా లేక కన్నతండ్రి ఆత్మహత్య చేసుకుంటే కొడుకులు పట్టునట్టుగా మొక్కుబడిగా వస్తే గ్రామస్థులు వంతులు వేసుకొని అతని అంతిమయాత్రకు సిద్ధమయ్యారు. కొడుకులపై కూతుళ్ళపై, కోడళ్ళపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. గ్రామస్థులకు వున్న కనికరం కన్నవారికి లేదు. ఆస్తికోసం కొడుకు, కూతురు పోటీపడి మూడు రోజులు ఇంటిముందే ఉంటే గ్రామస్తులు ముందుకొచ్చారు. బంధాలు అనుబంధాలకు విలువ లేకుండా, డబ్బే ప్రధానంగా వృద్ధులను అవసరాలను తీర్చుకొని వదలివేస్తున్నారు. కొసమెరుగునా వీరిని కొన్ని వృద్ధ శరణాలయాలు అక్కున చేర్చుకొంటున్నాయి. వృద్ధాప్య దశలో తల్లిదండ్రులను చూడనివారిని కఠినంగా శిక్షించాలి.
-అయినం రఘురామారావు,
ఖమ్మం