ఉత్తరాయణం

మూల్యం చెల్లించాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించే అవకాశం శూన్యం కావడంతో ప్రధాని మోదీ తన ప్రతిష్టను పెంచుకునేందుకు, కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పెద్దనోట్లను రద్దు చేసినట్టు కనిపిస్తోంది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం కీలక నిర్ణయం అయినప్పటికీ- సాధ్యాసాధ్యాలను, భవిష్యత్ పరిణామాలను ఆలోచించకుండా పెద్దనోట్లను రద్దు చేశారు. పెద్దనోట్లను రద్దు చేశామంటూనే 2వేల రూపాయల నోటును విడుదల చేయడం మరో పొరపాటు. నోట్ల రద్దుతో జనం నానాపాట్లు పడుతున్నారు. 2వేల రూపాయల నోట్ల వల్ల బడాబాబులు నగదును మరింత భారీగా, సులువుగా దాచుకునేందుకు అవకాశం కలిగింది. నల్లధనం నివారణకు 500, 1000 నోట్లను రద్దు చేయాల్సిందే. మరి.. 2వేల నోటు ఎందుకు? ఇకపై వందనోటునే అతి పెద్దనోటుగా ఉంచితే నల్లధనం సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. వెయ్యి రూపాయల నోట్లను మళ్లీ ముద్రించక పోవడం మంచిది. చిన్ననోట్లను ముద్రిస్తే అధిక వ్యయం అవుతుందని అనుకుంటే పొరపాటే. మోదీ చేసిన తప్పిదానికి నేడు యావత్ భారత ప్రజలు బాధ పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బిజెపి తప్పక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. బిజెపికి పడే ఓట్లకు మోదీయే మోకాలు అడ్డుపెట్టినట్టు ఉంది.
- సివిఆర్ కృష్ణ, హైదరాబాద్
ఇదొక్కటే మార్గం..
మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేయడంతో అవినీతి పరులైన అధికారులు, రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నల్లధనం, అవినీతి, ఉగ్రవాదం నిర్మూలనకు మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలంతా మద్దతునివ్వాలి. నల్లధనాన్ని రూపుమాపేందుకు పెద్దనోట్ల రద్దు ఒక్కటే ఏకైక పరిష్కార మార్గం. అవినీతిరహిత సమాజం ఆవిష్కరణకు ప్రజలంతా సంఘీభావం ప్రకటించాలి. నోట్ల మార్పిడికి జరుగుతున్న ప్రలోభాలకు పేదలు ఆకర్షితులు కారాదు. నల్లకుబేరులు పేదల అకౌంట్లలో నగదు జమ చేయకుండా నిఘా పెంచాలి. డిసెంబర్ 30 తర్వాత నోట్ల మార్పిడికి గడువును పెంచరాదు.
- కప్పగంతు వెంకట రమణమూర్తి, సికిందరాబాద్
హిజ్రాల సంరక్షణ ఎక్కడ?
యాచక వృత్తితో షాపుల వెంబడి తిరుగుతూ వికృత చేష్టలతో కాలక్షేపం చేస్తూ సంచారం చేస్తున్న హిజ్రాల పరిస్థితి హీనంగా వుంది. ఒరిస్సా ప్రభుత్వం ఇటీవల వీరిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వర్గంగా గుర్తించింది. దీనివల్ల హిజ్రాలకు సామాజిక సంక్షేమ పథకాలు ప్రయోజనం చేకూరుస్తాయి. గుంపులు గుంపులుగా బజారులో వీరు తిరుగుతుంటే ఎబ్బెట్టుగా వున్నది. ఇకనైనా ఎపి ప్రభుత్వం వీరికి ఉపాధి అవకాశాలు కల్పించి, రోడ్లపై తిరగనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని, వీరికి ఆసరాగా నిలవాలి.
- కోవూరు వెంకటేశ్వర ప్రసాదరావు, కందుకూరు
చిల్లర సమస్య!
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి ఏకంగా రెండువేల రూపాయల నోట్లను విడుదల చేయడంతో ప్రజలకు చిల్లర సమస్య నరకాన్ని చూపిస్తోంది. కొత్తగా 500 నోట్లను విడుదల చేసినా అవి అన్ని ప్రాంతాలకూ ఇంకా రావడం లేదు. వెయ్యి రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశారు. రెండువేల రూపాయల నోటును తీసుకువెళితే ఏ దుకాణంలోనూ చిల్లర లేదంటున్నారు. బ్యాంకుల్లో, ఎటిఎంలలో వందనోట్లు తగినంతగా లేవు. నగదు లేనందున బ్యాంకులు, ఎటిఎంలు బోసిపోతున్నాయి. నగదు కోసం వృద్ధులు, మహిళలు ఎండలో పడిగాపులు పడుతున్నారు. క్యూలో నిలబడిన వారికి మంచినీళ్లయినా ఇవ్వడం లేదు. బ్యాంకుల వద్ద తోపులాటలు, గొడవలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చిల్లర సమస్యతో చిరువ్యాపారులు ఉపాధిని కోల్పోతున్నారు. ఈ పరిస్థితులను వీలైనంత త్వరగా చక్కదిద్దేందుకు కేంద్రం, ఆర్‌బిఐ అధికారులు రంగంలోకి దిగాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్