ఉత్తరాయణం

మొక్కుబడి వారోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఏటా నవంబర్ 14 నుండి గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రంథాలయంలో వారం రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. విద్యార్థులకు, మహిళలకు వ్యాస రచన, చిత్రలేఖనం, రంగోళి, ఉపన్యాసం, క్విజ్, పాటలు, నృత్యాలు తదితర పోటీలు నిర్వహించి చివరిరోజున బహుమతులు ప్రదానం చేయాల్సి ఉంటుంది. వీటి నిర్వహణకు శాఖా గ్రంథాలయాలకు కొద్ది మొత్తంలో నిధులు విడుదల చేస్తున్నారు. గ్రంథాలయ అధికారుల నిర్లక్ష్యంతో అనేక చోట్ల ఈ వారోత్సవాలు నిర్వహించడం లేదు. యువతలోని ప్రతిభను వెలికితీయడానికి ఈ వారోత్సవాలు ఎంతగానో ఉపకరిస్తాయని ప్రభుత్వాలకు, అధికారులకు తెలిసినా మొక్కుబడిగా నిర్వహిస్తూ ఉన్నత లక్ష్యాలను నీరుగారుస్తున్నారు. కొన్ని గ్రంథాలయాలలో మాత్రం దాతల సహకారంతో వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా గ్రంథాలయ వారోత్సవాల జాడ ఎక్కడా కనిపించలేదు. లైబ్రరీల నిర్వహణకు, కొత్త పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వం తగినన్ని నిధులను విడుదల చేయాలి. గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకురావాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
ప్రాణాలు తీస్తున్న సరదాలు
జాతీయ రహదారులపై యువత చేస్తున్న సరదాలు ప్రాణ సంకటమవుతున్నాయి. బైక్‌పై ఇద్దరు లేదా ముగ్గురు ఎక్కి గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో వెళ్ళడం, బైక్ రైడింగ్ చేస్తూ సెల్ఫీ దిగాలని ప్రయత్నించడం వంటి పనులు చేస్తున్నారు. ఈ వెర్రి ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రమాదాలు జరిగి బైక్‌లు నడిపేవారు మరణించడమో లేదా వారి మూలంగా ఇతరులు ప్రమాదాల పాలు కావడమో జరుగుతోంది. రహదారులపై పోలీసుల తనిఖీలు లేనందున కొందరు యువకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇకనైనా బైక్ రేస్‌లపై పోలీసులు తనిఖీలను ముమ్మరం చేసి, ప్రమాదాలకు కారకులైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలి. వారి డ్రైవింగ్ లైసెన్సులను శాశ్వతంగా రద్దుచేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
ధరలు తగ్గించండి
ప్రజాజీవనం ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగాలంటే నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ అవసరం. ధరలను అదుపులో వుంచితే కొన్నాళ్లకైనా ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి మార్గాన్ని వీడి సక్రమపద్ధతిలో జీవనం గడుపుతారు. నిత్యావసర వస్తువుల బ్లాక్‌మార్కెట్టు వల్ల అవినీతి పెరుగుతోంది. వస్తు మార్పిడి పద్ధతి వలన ద్రవ్య సంక్షోభం కుదుటపడుతుంది. కరెన్సీ నోట్లకు దాసోహం కాకుండా నైతిక విలువలు అభివృద్ధి చెందాలంటే మద్యపానం, జూదం వంటి వ్యసనాలను అరికట్టాలి. కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసినంత మాత్రాన ప్రజల స్థితిగతులు మారవు. అధిక ధరలు, అవినీతిని ముందగా అరికట్టాలి.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
అందరికీ ఒకే చట్టం
లౌకిక రాజ్యమైన మనదేశంలో రాజ్యాంగం అన్నింటి కంటే ఉన్నతమైనది. లింగవివక్ష, మతాల వివక్ష లేకుండా అందరికీ సమాన న్యాయం జరిగేందుకు ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఎంతో వుంది. అంతర్జాతీయ చట్టాలు కూడా ఇందుకు అనుకూలంగా వున్నాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానంగా ప్రాథమిక హక్కులను కల్పించింది. హిందూ సమాజంలో బాల్య వివాహాలు, సతీ సహగమనం, కట్నం వంటి దురాచారాలను రూపుమాపేందుకు మార్పులు తెచ్చారు. హిందూ మహిళలకు వంశపారంపర్య ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టారు. నేటి సమాజంలో ముస్లిం మహిళలు పలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ముస్లిం భర్త ‘తలాక్’ అని మూడుసార్లు చెప్పి భార్యకు విడాకులు ఇవ్వొచ్చు. దీన్ని ముస్లిం మహిళలు పెద్దఎత్తున వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం పురుషులకు ఇచ్చిన హక్కును రద్దుచేస్తూ ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాల్సిన అవసరం వుంది. కేంద్ర ప్రభుత్వం ముస్లిం మత పెద్దలతో సంప్రదింపులు జరిపి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలి. ముస్లిం మహిళల హక్కులకు చట్టబద్ధత కల్పించాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి